ETV Bharat / opinion

పాఠశాలల్లోనే విద్యార్థి వికాసం సాధ్యం! - online classes effect

ఏ సంవత్సరానికా సంవత్సరం పాఠ్య ప్రణాళికను ముగించి చేతులు దులుపుకోవడమే విద్యా సంస్థలు, విద్యార్థుల లక్ష్యమా? లేదా ప్రైవేటు విద్యా సంస్థలు తల్లిదండ్రుల నుంచి రుసుములు వసూలు చేసుకుని మొక్కుబడి చదువులు చెప్పి సరిపెట్టుకోవడమా? విద్యార్థులు జీవితంలో రాణించడానికి కావలసిన సామర్థ్యాన్ని అలవరచేదే అసలైన విద్య. విద్యార్థుల మధ్య సాంఘిక, ఆర్థిక అంతరాలు ఎన్ని ఉన్నా తరగతి గదిలో అందరికీ సమాన బోధన అందించాలి. అలా జరిగితేనే విద్యకు లక్ష్యశుద్ధి ఉన్నట్లు లెక్క.

SCHOOL VS ONLINE
విద్యార్థి
author img

By

Published : Nov 2, 2020, 6:47 AM IST

కరోనా ఉపద్రవం వల్ల అన్ని రంగాల మాదిరిగానే విద్యారంగం కూడా అతలాకుతలమైంది. విద్యా సంవత్సరాన్ని ఎలా ప్రారంభించాలో తెలియక విద్యా సంస్థలు, సంబంధిత ప్రభుత్వ విభాగాలు అనిశ్చితిని ఎదుర్కొంటున్నాయి. తాత్కాలిక పరిష్కారంగా ఆన్‌లైన్‌ తరగతులు రంగప్రవేశం చేసినా, వాటిలో సాధకబాధకాలు అనేకం. మొదట విద్యార్థులకు ఎందుకని చదువు చెబుతున్నాం, వారు ఏ లక్ష్యంతో చదువుతున్నారనే అంశాలపై అందరికీ స్పష్టత ఉండాలి.

కేవలం ఏ సంవత్సరానికా సంవత్సరం పాఠ్య ప్రణాళికను ముగించి చేతులు దులుపుకోవడమే విద్యా సంస్థలు, విద్యార్థుల లక్ష్యమా? లేదా ప్రైవేటు విద్యా సంస్థలు తల్లిదండ్రుల నుంచి రుసుములు వసూలు చేసుకుని మొక్కుబడి చదువులు చెప్పి సరిపెట్టుకోవడమా? ఇవేమీ కాదని అందరికీ తెలుసు. విద్యార్థులు జీవితంలో రాణించడానికి కావలసిన సామర్థ్యాన్ని అలవరచేదే అసలైన విద్య. విద్యార్థుల మధ్య సాంఘిక, ఆర్థిక అంతరాలు ఎన్ని ఉన్నా తరగతి గదిలో అందరికీ సమాన బోధన అందించాలి. అలా జరిగితేనే విద్యకు లక్ష్యశుద్ధి ఉన్నట్లు లెక్క.

ఆచరణాత్మక విద్య

ఆధునిక విద్య మూడు ధ్రువాల ప్రక్రియ. అవి- ఉపాధ్యాయుడు, విద్యార్థి, సామాజిక వాతావరణం. పాఠశాల సమాజానికి ఓ చిన్న దర్పణం వంటిది. అక్కడ భిన్న వయసులు, భిన్న సామాజిక, ఆర్థిక నేపథ్యాలున్నవారు ఉంటారు. గృహ వాతావరణానికి పాఠశాల వాతావరణం పూర్తి భిన్నమైనది. విద్యార్థిలో అంతర్లీనంగా ఉన్న శక్తియుక్తులు మేల్కొనేది బడి వాతావరణంలోనే. ‘చేస్తూ నేర్చుకోవడం’- అంటే ఆచరణాత్మక విద్య ఆధునిక కాల అవసరాలకు అనుగుణంగా రూపుదిద్దుకున్న విధానం. బాల్యంలో ఒకచోట కుదురుగా కూర్చునే తత్వం ఉండదు. అంతటా కలియతిరుగుతూ అన్నీ నేర్చుకోవాలనే తపన బాలల్లో సహజంగా ఉంటుంది. ఇలా చూస్తూ, చేస్తూ నేర్చుకొన్నప్పుడే విద్యా నైపుణ్యాలు వారి జీవితాల్లో అంతర్భాగాలవుతాయి. ఒక బాలుడు తాను విన్నదానిలో 15 శాతమే గుర్తుపెట్టుకుంటాడు, చూసినదాంట్లో 50 శాతం, చేసిన దాంట్లో 90 శాతం గుర్తుంచుకుంటాడు.

ఇవన్నీ తరగతి గదిలో మాత్రమే సాధ్యం. ఉపాధ్యాయుల వంక, నల్లబల్లపై వారు రాసే సమీకరణల వంక చూస్తూ, చెప్పేది వింటూ, ప్రయోగశాలలో చెప్పేవి చేస్తూ విద్యలో రాణిస్తారు. తమకు అర్థంకాని విషయాల గురించి ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తూ తనకు తాను పదును పెట్టుకుంటారు. దీనివల్ల విద్యార్థి ఎంతవరకు నేర్చుకున్నాడో అంచనా వేయడం ఉపాధ్యాయుడికి వీలవుతుంది. తరగతి గది బోధనాభ్యాసాల అంతిమ లక్ష్యం- విద్యార్థి కొత్త విషయాలు, నైపుణ్యాలను నేర్చుకుని, వాటిని జీవితానికి అన్వయించే సత్తాను సాధించడానికి తోడ్పడటం. ఆన్‌లైన్‌ బోధనలో విద్యార్థి సమర్థంగా నేర్చుకుంటున్నాడా, ఉపాధ్యాయుడు చెప్పేది అర్థమవుతోందా అనేది నిర్ధారించడం కష్టం.

విద్యార్థుల్లో సామర్థ్యాల పరంగా హెచ్చుతగ్గులు ఉంటాయి. ఆన్‌లైన్‌ శిక్షణలో చదువులో వెనకబడినవారిని గుర్తించడమూ తేలిక కాదు. ఇళ్లలో కూర్చుని పాఠాలు వింటున్న విద్యార్థులంతా తమ సెల్‌ఫోన్లు ఆన్‌ చేశారా? విద్యార్థులందరినీ ఉపాధ్యాయులు వీక్షించగలుగుతున్నారా, పాఠం వినడం మానేసి విద్యార్థి పక్కకు ఎక్కడికైనా వెళ్లాడా అన్నది కనిపెట్టడం చాలా కష్టం. పరిస్థితిని బట్టి, విద్యార్థిని బట్టి ఒక్కొక్కప్పుడు ఉపాధ్యాయుడు తన బోధనా పద్ధతిని మార్చాల్సి ఉంటుంది. అది ఇంట్లో సాధ్యపడదు కదా? అంతర్జాల సౌకర్యం, సరైన స్మార్ట్‌ఫోన్‌ అందుబాటులో ఉండకపోవచ్చు. విద్యుత్‌ సరఫరాకు అంతరాయాలు కలగవచ్చు.

క్రమశిక్షణకు సోపానం

ఉపాధ్యాయుల బోధనా శైలి, వాక్చాతుర్యం, వ్యక్తిత్వం విద్యార్థులపై ప్రగాఢ ప్రభావం చూపుతాయి. పాఠ్యాంశాలపై గట్టి పట్టు ఉండి, బాలలకు బాగా చదువు చెప్పాలనే దీక్ష, దక్షతలు ఉన్న ఉపాధ్యాయులు చూపే ప్రభావమే వేరు. తరగతి గది మొత్తం వారి పాఠాన్ని మంత్రముగ్ధమై వింటుంది, నేర్చుకుంటుంది. అటువంటి ఉపాధ్యాయుల విజ్ఞానమే కాదు, వ్యక్తిత్వంలోని ఉన్నత లక్షణాలు కూడా విద్యార్థులకు ప్రసారమవుతాయి. వారిపట్ల విద్యార్థులు గౌరవ ప్రపత్తులతో, క్రమశిక్షణగా మెలగుతారు. ఇదంతా తరగతి గదిలోనే సాధ్యపడుతుంది. మాధ్యమిక విద్యను అభ్యసించేవారు కౌమార ప్రాయంలో ఉంటారు. ఇది చాలా కీలక దశ. దారితప్పే ప్రమాదమూ ఈ ప్రాయంలోనే ఎక్కువ.

మానసిక భావోద్వేగాల వల్ల ఏకాగ్రత దెబ్బతింటూ ఉంటుంది. కాబట్టి ఈ వయసు పిల్లలకు తరగతి బోధనే ఉత్తమం. ఉన్నత విద్యాభ్యాసానికి ఆన్‌లైన్‌ బోధన బాగా నప్పుతుంది. ఆ స్థాయి విద్యార్థుల్లో మానసిక పరిణతి ఉండటం దీనికి కారణం. కింది తరగతుల వారికి ఆన్‌లైన్‌ బోధన వల్ల ఆశించిన ఫలితాలు రాకపోవచ్చు కానీ, తరగతి గదిలో విద్యా బోధనకు సాంకేతిక పరికరాలను ఉపయోగించడం వల్ల మంచి ఫలితాలు వచ్చేమాట నిజం. ఉదాహరణకు విద్యార్థులకు ఇంద్రధనుస్సు గురించి నోటి మాటలతో వర్ణించేకన్నా వీడియోనో, స్లయిడ్లనో చూపిస్తూ చెప్పడం వల్ల పాఠం విద్యార్థులకు సూటిగా చేరుతుంది. కాబట్టి సాంకేతికతను ఎక్కడ, ఎప్పుడు ఉపయోగించాలో తెలుసుకుని, మెలకువగా జాగరూకతతో ముందుకు సాగాలి.

(రచయిత- డాక్టర్‌ జి.జగన్మోహన్‌రావు, ఎస్‌సీఈఆర్‌టీ మాజీ ఆచార్యులు)

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.