ఆరోగ్యమంటే- అనారోగ్యం, నీరసం లేకపోవడం కాదు. శారీరక, మానసిక, సామాజిక స్వస్థతలు సమకూరిన వ్యక్తినే సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా పరిగణించాలి. ఆరోగ్యం మౌలిక మానవ హక్కు. ఆల్మా ఆటాలో జరిగిన ప్రప్రథమ అంతర్జాతీయ ఆరోగ్య సదస్సు అందరికీ ప్రాథమిక వైద్యసేవలు అందాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పింది. ఆరోగ్యరంగంలో గత 75 ఏళ్లలో స్వతంత్ర భారత విజయాలను, ఇకపై సాధించాల్సిన లక్ష్యాలను సమీక్షించడం సముచితంగా ఉంటుంది. భారతదేశంలో వేద కాలంలోనే పలు చికిత్సా విధానాలను రూపొందించారు. కనిష్కుడి ఆస్థాన వైద్యుడైన చరకుడు ఆయుర్వేదాన్ని బాగా అభివృద్ధిపరచాడు. సుశ్రుతుడు శస్త్రచికిత్సా సంవిధానాలను ప్రవేశపెట్టాడు. బుద్ధుడు ఆరోగ్య సంరక్షణకు ఎనలేని ప్రాధాన్యమిచ్చాడు. ప్రాచీన, మధ్య యుగాల్లో వైద్యం రాజులకు, సంపన్నులకు మాత్రమే అందుబాటులో ఉండేది.
వలస పాలనలో..
పోర్చుగీసువారు 1500లో గోవాను ఆక్రమించిన తరవాత చర్చిలు, క్రైస్తవ మఠాలకు అనుబంధంగా ఆస్పత్రుల ఏర్పాటు మొదలైంది. 1510లో భారతదేశంలో మొట్టమొదటి ఆస్పత్రి- రాయల్ హాస్పిటల్‌ను ఏర్పరచినది పోర్చుగీసువారే. 1660 నుంచి ఫ్రెంచివారు, బ్రిటిష్ వారు కూడా ఆస్పత్రులను నెలకొల్పసాగారు. భారత్‌లో మొట్టమొదటి వైద్య విద్యాలయం కోల్‌కతాలో ఏర్పాటైంది. 1846లో మద్రాసులో రెండో వైద్య కళాశాల ప్రారంభమైంది. బ్రిటిష్ కాలంలో 1885కల్లా దేశమంతటా స్థానిక పాలనా సంస్థలు నెలకొల్పిన ఆస్పత్రులు, డిస్పెన్సరీల సంఖ్య 1250కి చేరింది. స్వాతంత్య్రం వచ్చేనాటికి వీటి సంఖ్య 7,400కు పెరిగింది. మొత్తం పడకలు 1,13,000కు చేరాయి.
ఆరోగ్య సర్వే- అభివృద్ధి అనే అంశంపై సర్ జోసెఫ్ విలియం భోర్ కమిటీ 1946లో సమర్పించిన నివేదిక అత్యంత సమగ్రమైనది. ఆర్థిక స్తోమతతో నిమిత్తం లేకుండా ప్రజలందరికీ ఆరోగ్య సేవలు అందించాలని అది సిఫార్సు చేసింది. అనారోగ్యం రాకుండా తీసుకోవలసిన ముందస్తు జాగ్రత్తలు, రోగులను విడిగా ఉంచడం వంటి అంటువ్యాధుల నివారణలకు సంబంధించి ఈ కమిటీ చేసిన సూచనలు అత్యంత విలువైనవి. భోర్ నివేదికను ఇప్పటికీ ప్రామాణికంగా పరిగణిస్తున్నారు. బ్రిటిష్ పాలనలో ఆస్పత్రులన్నీ ప్రభుత్వ యాజమాన్యంలో ఉండేవి. ప్రైవేటు రంగ పాత్ర నామమాత్రమే. అయితే, బ్రిటిష్ వలస ప్రభుత్వం ఆరోగ్యానికి కేటాయించిన నిధులు సైతం చాలా తక్కువే.
స్వాతంత్య్ర అనంతర స్థితిగతులు
వలస పాలన నుంచి విముక్తమైన స్వతంత్ర భారతం అధిక జనాభా, అరకొర ఆర్థిక ప్రగతి, నిరక్షరాస్యతలతో సతమతమైంది. దేశంలో ఆరోగ్య రంగం అభివృద్ధికి తగిన సూచనలు చేయాల్సిందిగా కోరుతూ ప్రభుత్వం 1959లో మొదలియార్ కమిటీని నియమించింది. మొదటి మూడు పంచవర్ష ప్రణాళికల్లో ఆరోగ్య రంగంలో పెద్ద పురోగతి లేదు. ఆరోగ్యం రాష్ట్రాల జాబితాలోని అంశమే అయినా, స్వాతంత్య్రం వచ్చిన తొలినాళ్లలో ఆరోగ్య సేవలకు సంబంధించిన విధానాల రూపకల్పన, అమలు ప్రధానంగా కేంద్రం చేతుల్లోనే ఉండేవి. ఆర్థిక సంస్కరణల తరవాత నుంచి రాష్ట్రాలకు ప్రాముఖ్యం పెరిగింది. ఆరోగ్య రంగానికి నిధులు, వసతుల విషయమై రాష్ట్రాలు నేరుగా ప్రపంచ బ్యాంకు వంటి అంతర్జాతీయ సంస్థలతో సంప్రదించడానికి వెసులుబాటు లభించింది. స్వతంత్ర భారతంలో తొలిసారిగా 1983లో జాతీయ ఆరోగ్య విధానాన్ని రూపొందించారు. తదుపరి పంచవర్ష ప్రణాళికలన్నింటిలో ప్రజారోగ్యానికి పెద్దపీట వేశారు.
స్వాతంత్య్రం వచ్చిన తరవాత మూడు దశాబ్దాల్లో ఆరోగ్య సేవల రంగం గణనీయంగా పురోగమించింది. మన శాస్త్రవేత్తలు మశూచి, ప్లేగు వ్యాధులను నిర్మూలించగలిగారు. కలరా మరణాలను తగ్గించి, మలేరియాను అదుపులోకి తీసుకొచ్చారు. మరణాల రేటు 27.4శాతం నుంచి 14.8శాతానికి తగ్గింది. సగటు ఆయుఃప్రమాణం 34.7 ఏళ్ల నుంచి 54 ఏళ్లకు పెరిగింది. అయితే, అధిక జనాభా వల్ల ఈ ప్రయోజనాలు ఏమంతగా ప్రస్ఫుటంకావడంలేదు.
భారతదేశంలో అలోపతికి తోడు ఆయుర్వేద, యోగ, సిద్ధ, యునాని, హోమియోపతి, ప్రకృతి చికిత్స వంటి దేశీయ ఆరోగ్య సంరక్షణ పద్ధతులున్నాయి. వీటిని ప్రజారోగ్య సంరక్షణకు చక్కగా వినియోగించుకోవాలని 1983లో వెలువడిన తొలి జాతీయ ఆరోగ్య విధానం ఉద్ఘాటించింది. 2002లో విడుదలైన తదుపరి జాతీయ విధానం దేశంలో పోలియో, కుష్ఠు, బోదకాలు వంటి వ్యాధులను నిర్మూలించాలని పిలుపిచ్చింది. క్షయ, అతిసార, మలేరియా మరణాలను తగ్గించాలని, హెచ్‌ఐవి-ఎయిడ్స్ కేసులు పెరగకుండా అరికట్టాలని లక్షించింది.
ప్రస్తుత పరిస్థితి
కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ పలు ప్రజారోగ్య పథకాలను అమలుచేస్తోంది. జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్‌హెచ్‌ఎం)లో భాగంగా కేంద్రం, రాష్టాలు జాతీయ గ్రామీణ, పట్టణారోగ్య పథకాలను అమలు చేస్తున్నాయి. ఎన్‌హెచ్‌ఎం కింద 2018లో ఆయుష్మాన్ భారత్ పథకాన్ని చేపట్టి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను, వెల్‌నెస్ సెంటర్లను విస్తరిస్తున్నారు. కుటుంబానికి అయిదు లక్షల రూపాయల ఆరోగ్య బీమా సౌకర్యాన్ని అందిస్తున్నారు. 2016లో ప్రారంభించిన ప్రధానమంత్రి జాతీయ డయాలిసిస్ విధానం కింద దేశంలో 465 జిల్లాల్లో డయాలిసిస్ కేంద్రాలను ఏర్పాటుచేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2010నాటికే ఆరోగ్యశ్రీ పథకం కింద ఉచిత డయాలిసిస్ కేంద్రాలు ఏర్పాటయ్యాయి.
స్వాతంత్య్రం వచ్చాక ప్రజారోగ్య సంరక్షణలో గణనీయ విజయాలు సిద్ధించినా ప్రభుత్వ ఆస్పత్రుల్లో సరైన వసతులు లేకపోవడంతో రోగులు పెద్ద సంఖ్యలో ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయించక తప్పడం లేదు. అక్కడి వ్యయాన్ని తట్టుకోలేక చాలా కుటుంబాలు పేదరికంలోకి జారిపోతున్నాయి. అందరికీ ఆరోగ్య బీమా కల్పించడం ద్వారా ఈ సమస్యను అధిగమించాలి. లేదా ప్రభుత్వమే అన్ని ఆధునిక సౌకర్యాలతో ఉచిత వైద్య సేవలు అందించాలి.
మన జనాభా అవసరాలను తీర్చే స్థాయిలో వైద్యులను, నర్సులను తయారు చేసుకోవాలంటే- వైద్య కళాశాలలను పెద్దయెత్తున విస్తరించాలి. కేంద్రం, రాష్ట్రాలు ఇందుకు పూనుకోవాలి. ఆస్పత్రుల విషయంలో పట్టణ, గ్రామీణ అంతరాలను అధిగమించాలి. భారతీయులు ఆరోగ్యవంతులుగా, ఉత్సాహవంతులుగా వర్ధిల్లాలంటే అందరికీ నాణ్యమైన వైద్యసేవలు అందించడం తప్పనిసరి.
ప్రాణాంతకమవుతున్న జీవనశైలి
ఆధునిక జీవితంలో ఒత్తిడి, వివిధ అలవాట్ల వల్ల హృద్రోగాలు, మధుమేహం, రక్తపోటు, దీర్ఘకాల శ్వాసకోశ వ్యాధులు, క్యాన్సర్‌లు పెరిగిపోతున్నాయి. దేశంలో అనారోగ్యం వల్ల సంభవించే మరణాల్లో 60 శాతానికి ఈ వ్యాధులే కారణం. అంధత్వ నివారణ, చికిత్స, మానసిక ఆరోగ్య సంరక్షణకూ కేంద్రం కీలక కార్యక్రమాలు చేపట్టింది. హెపటైటిస్‌పైనా పోరాటం ప్రకటించింది. జాతీయ అవయవ మార్పిడి కార్యక్రమం చేపట్టింది.
అవయవాల కోసం గిరాకీకి తగ్గ సరఫరా లేదని గ్రహించి, ఈ అసమతుల్యతను అధిగమించడానికి కృషి ప్రారంభించింది. ఈ విషయంలో కేంద్రం కన్నా ఆంధ్రప్రదేశ్ ముందున్నది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో రూపొందిన జీవన్‌దాన్ కార్యక్రమం 2010 నుంచి అమలులోకి వచ్చింది. మృతుల అవయవాలను అవసరార్థులకు వేగంగా అందించి ప్రాణాలు కాపాడే పథకమిది.
వ్యాధులపై యుద్ధం
గడచిన 75 ఏళ్లలో దేశంలో మరణాల రేటు, జననాల రేటు గణనీయంగా తగ్గాయి. తల్లులు, పిల్లల ఆరోగ్య రక్షణకు, పోషణకు ప్రభుత్వం చేపట్టిన పథకాల వల్ల మాతాశిశు మరణాలూ దిగొచ్చాయి. 2014 డిసెంబరులో ప్రారంభమైన ఇంద్రధనుష్ పథకం కింద బాలలకు పూర్తి స్థాయిలో టీకాల కార్యక్రమం చేపట్టారు. 2014లో భారత్‌ను పోలియో రహిత దేశంగా ప్రపంచ బ్యాంకు ప్రకటించింది. మలేరియా, జపనీస్ ఎన్‌కెఫలైటిస్, డెంగీ, చికున్‌గన్యా, కాలా అజార్, లింఫాటిక్ ఫైలేరియాసిస్ వ్యాధుల నియంత్రణకు జాతీయ వెక్టర్ వ్యాధుల నియంత్రణ పథకం చేపట్టారు.
2019 కల్లా మలేరియా మరణాలను పూర్తిగా నివారించిన రాష్ట్రాల సంఖ్య 25. మిగతా ప్రపంచంకన్నా అయిదేళ్లు ముందుగానే అంటే 2025 కల్లా క్షయ వ్యాధిని నిర్మూలించాలని కేంద్రం కంకణబద్ధమైంది.
- ఆచార్య రవిరాజు తాతపూడి(రచయిత- ఆంధ్రప్రదేశ్ వైద్య విద్య మాజీ సంచాలకులు, ఎన్టీఆర్ వైద్య విశ్వవిద్యాలయం పూర్వ ఉపకులపతి)