కొవిడ్ కారణంగా మృత్యువాత పడుతున్నవారిలో యువత ఎక్కువగా ఉండటం కలవర పరుస్తోంది. జవసత్వాలుడిగిన వృద్ధులు, దీర్ఘకాలిక రోగుల పాలిట కరోనా మృత్యుపాశమవుతుందని తొలుత అనుకున్నా, అందుకు భిన్నంగా నలభై ఏళ్లలోపు యువకుల మరణాలు నమోదవుతుండటం ఆశ్చర్యం కలిగిస్తోంది. కొవిడ్ కారణంగా ఆస్పత్రి పాలవుతున్నవారిలో మధ్యవయస్కులూ ఉంటున్నారు. ఈ పరిణామాలు వైరస్ చూపుతున్న ప్రభావంపై అంచనాలను, అధ్యయన ముఖచిత్రాన్ని సమూలంగా మార్చేసింది.
కరోనా వ్యాధి లక్షణాలు, తీరుతెన్నులు పోనుపోను స్పష్టంగా మారిపోతున్నాయి. అనేక కొత్త అంశాలు తెరపైకి వస్తున్నాయి. యువకులు సైతం ఐసీయూలో చేరి చికిత్స పొందుతున్నట్లు సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) నివేదిక స్పష్టీకరించింది. మనదేశంలోనే కాదు, ఐరోపాలోని అనేక ఆస్పత్రుల్లో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఫ్రాన్స్, నెదర్లాండ్స్‌లో నమోదైన కేసుల్లో సగం 50 ఏళ్లలోపువారివేనని నివేదికలు చాటుతున్నాయి. అమెరికాలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. మార్చి 16నాటికే అమెరికాలో 508మంది ఆస్పత్రిపాలయ్యారు. వీరిలో 200మందికి పైగా 20-54 వయోపరిమితిలోనివారే. వృద్ధులు, రోగులపాలిటే కరోనా ప్రమాదకారి అనే భావనను ఈ అధ్యయన ఫలితాలు నీరుగార్చాయి. భారత వైద్యపరిశోధన మండలి (ఐసీఎమ్‌ఆర్) ఏప్రిల్‌నాటి పరిశీలనల ప్రకారం పాజిటివ్ రోగుల్లో 60 ఏళ్లు పైబడినవారు 17 శాతమే ఉన్నారు. 21-40 ఏళ్ల మధ్యవయస్కులు 42శాతం ఉన్నారు. జులైలో జరిగిన మరో అధ్యయనం ప్రకారం పాజిటివ్‌గా నిర్ధారణ అయినవారిలో 60 ఏళ్లలోపువారు 50శాతం ఉన్నారు. దేశంలో మరణాల శాతం తగ్గుతున్నా, మృతుల్లో 60శాతం 50-60 మధ్య వయసుగల వారు ఉంటున్నారు.
కొవిడ్ వల్ల తీవ్రంగా దెబ్బతిన్న ఇతర దేశాల మాదిరిగా కాకుండా, భారత్‌లో శ్రామికులు అధికంగా మహమ్మారి బారిన పడుతున్నారు. ముంబయిలోని ఇంటర్నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పాపులేషన్ సైన్సెస్ (ఐఐపీఎస్) సంస్థ దేశంలో మరణాలు, ఆయుఃప్రమాణాలపై అధ్యయనం- ఆర్థికవ్యవస్థకు చేయూతనిచ్చే అధిక ఉత్పాదకత సామర్థ్యంగల 35-64 మధ్య వయసుగలవారిలోనే కొవిడ్ మరణాలు అధికంగా ఉన్నాయని తేల్చింది. దేశ ప్రజల సగటు ఆయుర్దాయం తగ్గుతోందని తెలిపింది. ఏదైనా ఒక వ్యాధివల్ల కోల్పోయిన ఆరోగ్యవంతమైన జీవితానికి సూచికగా భావించే 'డిజెబిలిటీ అడ్జెస్టెడ్ లైఫ్ ఇయర్స్ (డాలీ)' అధ్యయనం సైతం దీర్ఘకాలిక వ్యాధులు కలిగినవారిలో కొవిడ్ తీవ్రత అధికంగా ఉన్నట్లు స్పష్టీకరించింది. 70 ఏళ్ల పైబడినవారు 70 శాతం మృతిచెందిన అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే, భారత్‌లో మరణాల సరళి విరుద్ధంగా ఉన్నట్లు పరిశోధనలు చాటుతున్నాయి. ఇందుకు కొన్ని కారణాలున్నాయి. దేశంలో సగటు వయసు 24 ఏళ్లు. యువకులు అధికం. అందువల్లే యువకులు కొవిడ్ బారిన పడుతున్న ఉదంతాలు దేశంలో నమోదవుతున్నాయి. మధుమేహం, రక్తపోటు, ఇతర వ్యాధులు యువతలో పెరుగుతుండటమూ సమస్యాత్మకమవుతోంది. ఆరోగ్యం, ఫిట్‌నెస్ పట్ల ఉదాసీనతవల్ల వచ్చే ఆరోగ్య సమస్యలు యువతను కొవిడ్ బారిన పడేస్తున్నాయన్నదీ సుస్పష్టం. సహకరించని శరీరంతో చికిత్స కూడా క్లిష్టం కావడంవల్ల ఐసీయూలోకి వెళ్లాల్సి వస్తోంది.
ప్రస్తుతం భారత్‌లోని కొవిడ్ కేసులను విశ్లేషిస్తే 60శాతం 30-64 వయోపరిమితిలోనివే. మరణాల్లో 2.3శాతం 15 ఏళ్లలోపువారు ఉండటం బాధాకరం. 12.8శాతం 15-44 ఏళ్లలోపువారు. 48.2శాతం మరణాలు 45-64 ఏళ్ల మధ్యవారివి అయితే, 36.8 శాతం 65 ఏళ్లు పైబడినవారివి ఉన్నాయి. కొవిడ్ మరణాల్లో ఎక్కువ భాగం శ్రమించే వయసులో ఉన్నవారివే. దేశంలోనే కొవిడ్ నుంచి కోలుకుంటున్నవారు అధికంగాగల తెలంగాణలో 56 శాతం 40 ఏళ్లలోపువారే. మృతుల్లో పురుషులే ఎక్కువ. అనేకులు క్యాన్సర్, ఉబ్బసం, గుండె, కిడ్నీ వ్యాధులు, మధుమేహం, రక్తపోటు వంటి అనేక వ్యాధులతో బాధపడుతున్న వారున్నారు. మానసిక ఆందోళనా ఆస్పత్రి పాలుకావడానికి దారితీస్తోంది.
అరవై ఏళ్లు పైబడినవారిలో అనేకమందికి ఇళ్లలో కొవిడ్ లక్షణాలు లేని పిల్లల ద్వారా వైరస్ సోకుతున్నట్లు తెలుస్తోంది. వృత్తిపరంగా, ఇతర కార్యకలాపాల కోసం బయటకు వచ్చేవారు తప్పనిసరిగా అన్ని సూత్రాలూ పాటించాలి. కొవిడ్ బారినుంచి పూర్తిగా కోలుకోలేక యువత దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడుతున్నారు. తిరిగి పూర్తిస్థాయి ఆరోగ్యం పొందలేకపోతున్నారు. వారిలో ఉత్సాహం మందగించి ఉత్పాదక శక్తి క్రమేణా సన్నగిల్లిపోవచ్ఛు కొవిడ్ ఒక సామాజిక సమస్య అయినప్పటికీ- అది పూర్తిగా వ్యక్తిగత నిర్లక్ష్యంవల్ల తెచ్చుకున్నదే అవుతోంది. అందువల్లే ఎవరికివారు స్వీయసంరక్షణ చర్యలు కఠినంగా పాటించాల్సిన అవసరం ఉంది!
- డాక్టర్ శ్రీభూషణ్‌రాజు
(హైదరాబాద్ నిమ్స్‌లో నెఫ్రాలజీ విభాగాధిపతి)