ETV Bharat / opinion

ఆసుపత్రుల అమానుషత్వం.. కొవిడ్​పై పోరులో గెలుపెలా?

ఆత్మీయుల ప్రాణం కాపాడుకోవాలనే ఆలోచనతో నిరుపేదలు కూడా అప్పులపాలై వైద్య ఖర్చులను భరిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో దేశంలో కరోనా విజృంభిస్తూ తీవ్ర భయాందోళనలు సృష్టిస్తోంది. కరోనా రోగి ఆసుపత్రికెళ్తే లెక్కకు మించి వసూళ్లు విసురుతున్నాయి ఆస్పత్రులు. కొవిడ్‌ సంక్షోభ సమయంలో ఈ తరహా దోపిడీ ఆసుపత్రుల అమానుషత్వానికి పరాకాష్ఠ అవుతుంది. స్వస్థ సేవల కోవెల కావాల్సిన వైద్యశాలలే.. దగాఖానాగా దిగజారితే కరోనాపై పోరులో గెలుపు ఎలా సాధ్యం?

SPECIAL STORY ON HOSPITALS
ఆసుపత్రుల అమానుషత్వం
author img

By

Published : Aug 7, 2020, 9:50 AM IST

ఆర్థిక స్థోమత చాలకున్నా ఆత్మీయుల్ని బతికించుకోవాలన్న తాపత్రయంతో అప్పో సొప్పో చేసి తలకు మించిన వైద్యవ్యయాల్ని భరించి ఏటా ఆరు కోట్లమంది దుర్భర దారిద్య్రంలోకి జారిపోతున్న దేశం మనది. దేశవ్యాప్తంగా ఇప్పటికే 19 లక్షలమందికి పైగా సోకి, 40వేలమంది అభాగ్యుల ఉసురు తీసేసిన కరోనా మహమ్మారి మృత్యుఘాతాల నుంచి స్వీయ రక్షణ పొందడం ప్రజలకు, సత్వర సమర్థ వైద్యసేవలతో ఆశ్రితుల్ని ఆదుకోవడం ప్రభుత్వాలకూ పెను సవాలుగా మారింది. మొదట్లో కొవిడ్‌ వైద్యాన్ని సర్కారీ దవాఖానాలకే పరిమితం చేసిన ప్రభుత్వాలు కేసుల ఉద్ధృతి పెరుగుతున్న నేపథ్యంలో ప్రైవేటు సేవలకూ అనుమతించాయి. ఆరోగ్యం పౌరుల ప్రాథమిక హక్కు అని, నచ్చినచోట చికిత్స చేయించుకొనే స్వేచ్ఛ వారికి ఉందనీ మే నెల మూడోవారంలో స్పష్టీకరించిన తెలంగాణ హైకోర్టు- తాజాగా ప్రైవేటు ఆసుపత్రుల ఇష్టారాజ్యంపై కన్నెర్ర చేయడానికి బలీయ కారణాలే ఉన్నాయి.

'క్యాష్​' ఆసుపత్రులుగా..

ప్రభుత్వాసుపత్రుల్లో పడకలు ఖాళీగా ఉన్నాయని, వైద్యమూ ఉచితమేనని ప్రభుత్వం చెబుతున్నా- ప్రైవేటు ఆసుపత్రుల్లో ప్రామాణిక వైద్యం ప్రాణ రక్షణకు భరోసా ఇస్తుందన్న ఆశతో వ్యయప్రయాసలకోర్చి వెళుతున్న వేలాది కుటుంబాలకు దారుణ అనుభవాలు ఎదురవుతున్నాయి. లక్షల్లో బిల్లులు, ఆరోగ్య బీమా సదుపాయాన్నీ తోసిపుచ్చుతున్న తీరు, నల్లధనం చెల్లింపు డిమాండ్లు, బిల్లు మొత్తం చెల్లించకుంటే మృతదేహాల్నీ అప్పగించని అమానుషాలు దిగ్భ్రాంతపరుస్తున్నాయి. పలు ప్రైవేటు ఆసుపత్రులు 'క్యాషు'పత్రులుగా మారి జనాన్ని పిండేస్తున్న వైనంపై దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాల విచారణ సందర్భంగా హైకోర్టు ధర్మాగ్రహం వెలిగక్కింది. ప్రభుత్వం నుంచి భూములు రాయితీలు పొంది పేదలకు నిర్దిష్ట శాతం ఉచిత వైద్యానికి కట్టుబడతామన్న ఆసుపత్రులు మాట తప్పడమేమిటని హైకోర్టు, అమానవీయంగా వ్యవహరిస్తున్న ఆసుపత్రులపై చర్యలు తప్పవని ప్రభుత్వం గద్దిస్తున్నాయి. కరోనాపై పోరులో ముందువరస యోధులుగా జాతి నీరాజనాలందుకొన్న వైద్యనారాయణులు ఆత్మావలోకనం చేసుకోవాల్సిన సమయమిది!

సహేతుక రేట్లతో..

గిరాకీని బట్టి గట్టిగా లాభాలు దండుకోవాలనుకోవడానికి వైద్యం వ్యాపారం కాదు. అలాగని హేతుబద్ధ లాభాపేక్షనూ త్యజించి ప్రైవేటు ఆసుపత్రులన్నీ నష్టాల ఊబిలో కూరుకుపోవాలనీ ఎవరూ కోరుకోవడం లేదు. రోగనిరోధానికి యాంటీ బయాటిక్స్‌ వాడాలంటే, రెండు రోజులు కుటుంబం పస్తులుండాల్సిందేనని 'సుప్రీం' న్యాయపాలికే క్షేత్రస్థాయి దయనీయ స్థితిని లోగడ కళ్లకు కట్టింది. కాబట్టే, చిన్న పట్టణాల్లో చౌకగా కొవిడ్‌ చికిత్సలు జరిగేలా చూడాలని మొన్ననే కేంద్రానికి సుప్రీంకోర్టు సూచించింది. ప్రైవేటు ఆసుపత్రులు రోగులనుంచి విచక్షణారహితంగా ఫీజులు వసూలు చేయకుండా, వాటితో మాట్లాడి సహేతుక రేట్లను ప్రాధాన్య ప్రాతిపదికన నిర్ధారించాలని రాష్ట్రాలను కోరినట్లు కేంద్రం న్యాయపాలికకు నివేదించింది.

దగాఖానాలుగా..

కేంద్రం సూచనల మేరకు ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ సహా పది రాష్ట్ర ప్రభుత్వాలు ప్రైవేటు ఆసుపత్రుల్లో కొవిడ్‌ వైద్యసేవల రుసుముల్ని నిర్ధారించాయి. అది తమకు గిట్టుబాటు కాదని కార్పొరేట్‌ ఆసుపత్రుల యాజమాన్యాలు స్పష్టీకరించిన మాట నిజం. కొన్ని ఖరీదైన ఔషధాలు, ఖర్చుతో కూడిన వ్యాధి నిర్ధారణ పరీక్షలు, పీపీఈ కిట్లు, మాస్కులకు ప్రభుత్వం మినహాయింపు ఇచ్చిందన్నదీ వాస్తవం. ఈ లెక్కాడొక్కలు తమ తలకెక్కవన్న రీతిగా రోజుకు రూ.50వేల నుంచి లక్ష దాకా వసూలు చేస్తున్నారు. మూడేళ్ల క్రితం గుడ్‌గావ్‌లో డెంగీ సోకిన ఏడేళ్ల పాపకు రెండు వారాలపాటు వైద్యం చేసిన ఓ కార్పొరేట్‌ ఆసుపత్రి- వాస్తవ వ్యయానికి 17 రెట్లు బిల్లు వేసిందని నేషనల్‌ ఫార్మాస్యూటికల్‌ ప్రైసింగ్‌ అథారిటీ నిగ్గుదేల్చింది. కొవిడ్‌ సంక్షోభ సమయంలో ఆ తరహా పచ్చి దోపిడి అమానుషత్వానికి పరాకాష్ఠ అవుతుంది. స్వస్థ సేవల కోవెల కావాల్సిన ఆసుపత్రి, దగాఖానాగా దిగజారితే కొవిడ్‌పై సమరంలో గెలుపు ఎలా సాధ్యపడుతుంది?

ఇదీ చదవండి: 90 శాతం కరోనా విజేతల్లో ఊపిరితిత్తుల సమస్యలు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.