ETV Bharat / opinion

కొవిడ్‌పై పోరులో వైద్యుల ఆత్మ బలిదానాలు!

కరోనా వ్యాప్తి ప్రారంభమైనప్పటి నుంచి రేయింబవళ్లు అవిశ్రాంతిగా శ్రమిస్తున్నారు వైద్యులు. కొవిడ్​పై పోరులో తమ ప్రాణాలను ఫణంగా పెట్టి... వైరస్​ బాధితులను కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో వైద్య సిబ్బంది కరోనా వైరస్‌ బారిన పడి మృతి చెందుతున్నారు. ప్రస్తుతం ఉన్న వైద్య సిబ్బందిపైనే పని భారం అధికంగా పెరుగుతోంది. మరి వారిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలకు లేదా?

Special story on doctors death with covid-19 amid outbreak in the world
కొవిడ్‌పై పోరులో వైద్యుల ఆత్మ బలిదానాలు!
author img

By

Published : Sep 15, 2020, 8:11 AM IST

ఎడతెరిపి లేకుండా విస్తరిస్తున్న కరోనా వైరస్‌ మహమ్మారిని అరికట్టేందుకు వైద్యులు రేయింబవళ్లు శ్రమిస్తున్నారు. వైరస్‌ బారిన పడిన బాధితులను కంటికి రెప్పలా కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారు. అయినా దురదృష్టవశాత్తు ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు తొమ్మిది లక్షల మందికి పైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ఇంతటి సంక్షోభంలో వైద్య సిబ్బంది అందిస్తున్న సేవల వల్లనే అనేక మంది ప్రాణాలను రక్షించుకోగలిగాం. ప్రాణాలను పణంగా పెట్టి నిత్యం యుద్ధం చేస్తున్న వైద్య సిబ్బంది కరోనా వైరస్‌ బారిన పడి మృతి చెందుతున్నారు.

తీరని సిబ్బంది కొరత

ప్రభుత్వాలు కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టలేక చేతులెత్తేశాయనేది వాస్తవం. ప్రపంచ వ్యాప్తంగా వైరస్‌ బాధితులు మూడు కోట్లకు చేరువలో ఉన్నారు. భారత్‌లో వైరస్‌ బారిన పడినవారి సంఖ్య 48 లక్షలకు పైమాటే. సుమారు 80 వేల మందికి పైగా ప్రజలు చనిపోయారు. ప్రభుత్వాలు ఎక్కడికక్కడ కొవిడ్‌ ఐసొలేషన్‌ సెంటర్లను ప్రారంభించాయి. సరిపడా వైద్య సిబ్బందిని మాత్రం నియమించలేదు. దీంతో రోజుల తరబడి ఐసొలేషన్‌లో విధులు నిర్వహిస్తున్న కారణంగా ఎంతో మంది వైద్య సిబ్బంది తమ కుటుంబ సభ్యులకు దూరంగా ఉన్నారు. అద్దె ఇళ్లలో నివాసం ఉండేవారిని యజమానులు రానివ్వని సందర్భాలు, వైద్యసిబ్బంది కుటుంబ సభ్యులను ఇబ్బంది పెట్టిన ఉదంతాలు సైతం వెలుగు చూస్తున్నాయి. కొవిడ్‌ బాధితుల సేవలో నిమగ్నమైన వీరికి- సమాజంలో ఎన్నో అవాంతరాలు ఎదురవుతున్నా, వాటిని తట్టుకొంటూ విధుల్లో నిమగ్నమవుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా సుమారు ఏడు వేల మంది వైద్య సిబ్బంది కరోనా కాటుకు బలైపోయారని ఆమ్నెస్టీ అంతర్జాతీయ తాజా నివేదిక స్పష్టం చేసింది. అత్యధికంగా మెక్సికోలో 1,320 మంది, అమెరికాలో 1,077 మంది, బ్రెజిల్‌లో 634 మంది వైద్య సిబ్బంది మరణించడం దిగ్భ్రాంతి కలిగించే అంశం.

అమెరికా, బ్రెజిల్‌, దక్షిణాఫ్రికాలలో- తాజాగా భారత్‌లో వైరస్‌ శరవేగంగా వ్యాప్తి చెందుతోంది. ప్రభుత్వాలు సత్వర నివారణ చర్యలు తీసుకోకపోవడం సమస్యను మరింత జటిలం చేస్తోంది. బాధితుల సంఖ్య గణనీయంగా పెరగడం, అందుకు సరిపడా వైద్యసిబ్బంది లేకపోవడంతో ఆస్పత్రుల్లో రద్దీ ఎక్కువవుతోంది. ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకొని వైద్య సిబ్బందిపై భారాన్ని తగ్గించాల్సిన అవసరం ఉంది. భారతదేశంలో కేంద్ర ఆరోగ్య శాఖ గణాంకాల ప్రకారం సుమారు 87 వేల మందికి పైగా వైద్యులు, సిబ్బంది వైరస్‌ బారిన పడ్డారు. సుమారు 573 మంది మరణించారు. అందులో అత్యధికంగా 292 మంది మహారాష్ట్రకు చెందినవారే. కొవిడ్‌ బాధితుల సేవలో నిమగ్నమైన ఆరోగ్య కార్యకర్తలు తమ భద్రత గురించి మొదటి నుంచి ఆందోళన వ్యక్తం చేస్తూనే ఉన్నారు. ఇటీవలే లక్షల మంది కమ్యూనిటీ హెల్త్‌ వర్కర్ల ఆధ్వర్యంలో పీపీఈ కిట్ల కోసం, మెరుగైన వేతనం, పని చేసే ప్రదేశాల్లో అనుకూలమైన పరిస్థితులు ఉండాలని కోరుతూ ఆందోళన బాట పట్టారు. ప్రభుత్వాల నుంచి ఎలాంటి హామీ లభించకపోయినప్పటికీ, ఈ క్లిష్ట పరిస్థితిలో ప్రజలను, పాలక ప్రభుత్వాలను ఇబ్బందులకు గురి చేయకూడదనే బాధ్యతతో విధులు నిర్వహిస్తున్నారు. అయినా ప్రభుత్వాలు వైద్య సిబ్బందిపై కనికరం చూపకపోవడం సరికాదు.

ప్రభుత్వాలది గురుతర బాధ్యత

అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం ప్రతి వెయ్యి మందికి ఒక వైద్యుడు ఉండాలి. ప్రస్తుతం భారత్‌లో 15 వందల మందికి ఒక వైద్యుడు చొప్పున పనిచేస్తున్నారు. కరోనా కష్ట కాలంలో క్షేత్ర స్థాయిలో పని చేయాల్సిన సిబ్బంది లేకపోవడం వల్ల తామే చిన్న చిన్న పనులూ చేయాల్సి వస్తోందని వైద్యులు ఆవేదన చెందుతున్నారు. ప్రతిరోజూ సుమారు 15 వేల మంది నుంచి రక్త నమూనాలను సేకరించే పనిలో వైద్యులు శ్రమిస్తున్నారని కేరళకు చెందిన మెడికల్‌ ఆఫీసర్స్‌ అసోసియేషన్‌ వెల్లడించింది. ప్రస్తుతం ఉన్న వైద్య సిబ్బందిపైనే పని భారం అధికంగా పెరుగుతోంది. నిజానికి వైద్య సిబ్బంది కొన్ని నెలలుగా నిరంతరంగా సేవలందిస్తున్నారు.

ప్రధానంగా వైరస్‌ బాధిత ప్రజలకు సేవలు చేయడం, నమూనాలను సేకరించడం, స్క్రీనింగ్‌ చేయడంలో వైద్యులు తీరిక లేకుండా శ్రమిస్తున్నారు. ఇప్పుడున్న పరిస్థితిలో వైద్య సిబ్బంది ప్రాణాలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది. అందుకు తగిన చర్యలు తీసుకొని వైద్య సిబ్బందికి కావాల్సిన మౌలిక వసతులతో పాటు రక్షణ పరికరాల సరఫరాను పెంచాల్సిన అవసరం ఉంది. ఏళ్ల తరబడి ఒప్పంద విధానంలో పనిచేస్తున్న వైద్య సిబ్బందిని క్రమబద్ధీకరించేలా పాలకులు చర్యలు చేపట్టాలి. అలాగే వైద్య రంగంలో ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేయాలి. అలా చేసినప్పుడే వైద్యులపై పనిభారం తగ్గుతుంది. వైద్యులపై జరిగే దాడులను అరికట్టి వారికి రక్షణ కవచంగా నిలవాల్సిన అవసరం ఉంది. అప్పుడే వారు తగిన భరోసాతో విధులను నిర్వర్తించే అవకాశం ఉంది.

రచయిత- డాక్టర్‌ సిలువేరు హరినాథ్‌, 'సెస్‌'లో రీసెర్చ్‌ అసిస్టెంట్‌

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.