ETV Bharat / opinion

పాటకు పట్టం కట్టిన పద్మవిభూషణుడు.. బాలసుబ్రహ్మణ్యం - sp balasubrahmanyam padma

అసమాన ప్రతిభా పాటవాలతో వేలాది పాటలకు ప్రాణం పోసిన గాన గంధర్వుడు. తెలుగు పాట ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన సంగీత విద్వాంసుడు. ఆయనే ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం. నెల్లూరులో పుట్టి.. సంగీత ప్రపంచంలో ఎవరికీ అందనంత ఎత్తుకు ఎదిగిన సంగీత సామ్రాట్‌ మననుంచి దూరమైనా.. పాట రూపంలో చిరంజీవిగా నిలిచే ఉంటారు. దేశంలోనే రెండో అత్యున్నత పౌర పురస్కారమైన 'పద్మవిభూషణ్‌' అవార్డు ఆయనకు మరణాంతరం వరించింది. రాష్ట్రపతి చేతుల మీదుగా ఈ పురస్కారాన్ని బాలూ తనయుడు ఎస్పీ చరణ్​ అక్టోబర్ ​9న అందుకున్నారు. ఈ నేపథ్యంలో ఓసారి ఎస్పీబీని స్మరించుకుందాం.

sp
ఎస్పీ
author img

By

Published : Nov 11, 2021, 6:53 AM IST

పాట కోసమే పుట్టాడు. పాటే శ్వాసగా బతికాడు. చిత్ర పరిశ్రమలోకి మలయ సమీరంలా ప్రవేశించాడు. అంతవరకు పెద్దరికంతో ఒద్దికగా గంభీరమైన పద్ధతిలో సాగిపోతున్న సినీగీతానికి చిలిపిదనాన్ని అంటుకట్టాడు. అల్లరిని అలవరచాడు. పడుచు అందాలను అద్దాడు. పాటను మలుపు తిప్పాడు. పాడిన ప్రతిసారీ పాటకు ప్రాణప్రతిష్ఠ చేయాలని పరితపించాడు. 'ఆ ప్రయత్నంలో ప్రతి పాటకు ఒక్కోసారి పునర్జన్మ ఎత్తాడు' అంటూ మరో గంధర్వుడు జేసుదాస్‌ నోట ప్రశంసలకు నోచుకున్నాడు. మనసంతటా విశ్వజనీనతను పొదువుకున్నాడు. 'బాలును వేరెవరితోనూ పోల్చలేం... ఆయన లేని లోటును మరెవరితోనూ పూడ్చలేం' అనిపించుకున్నాడు. దేశంలోనే రెండో అత్యున్నత పౌర పురస్కారమైన 'పద్మవిభూషణ్‌' అందుకుని శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం చరిత్రలో నిలిచిపోయాడు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

కవుల మనిషి

'బాలు అద్భుత గాయకుడు' అనేస్తే చాలదు. ఆయన ఒకానొక 'గాన సంస్కృతి'కి ప్రాణం పోశాడు. సినీ సంగీత సామ్రాజ్యాన్ని స్థాపించాడు. ఈటీవీ 'పాడుతా తీయగా'తో అద్భుతమైన గాయనీ గాయకులను రూపొందించి, పాటకు తాను అద్దిన సొగసులన్నీ వారికీ నేర్పించాడు. ముందుతరం గాయకులను- వారి ప్రత్యేకతను, గేయకర్తలను- వారి సాహితీ సౌరభాలను, సంగీత దర్శకులను- వారి విభిన్న ప్రతిభా పాటవాలను... ఎలా అర్థం చేసుకోవాలో, ఎందుకు వారిని అనుసరించాలో యువతరానికి బోధించాడు. శాస్త్రీయ సాహిత్య సంగీత పోకడల ప్రౌఢిని, లలిత గీతాలలోంచి తొంగిచూసే సుకుమార సోయగాలను, భావ మాధుర్యాన్ని, ముఖ్యంగా జానపద గీతాల బాణీల్లోని మట్టి వాసనను పట్టి చూపించాడు. 'షోమాన్‌' అనే ఆంగ్ల పదానికి బాలు నిలువెత్తు ఉదాహరణ. వినయాన్ని ఆధార షడ్జమంగా నిలుపుకొని ఆకాశాన్నంటే ప్రతిభా శిఖరంగా పెరిగాడు... కాదుకాదు ఎదిగాడు బాలు. తనను ఘంటసాలతో పోలుస్తుంటే ‘ఆయనతో పోలికేమిటండీ... ఆయన గంధర్వుడు’ అన్నాడు. రఫీని ఆరాధించాడు. బాలమురళిని గౌరవించాడు. జేసుదాసును ప్రేమించాడు. జానకమ్మను అనుసరించాడు. తోటి గాయనీ గాయకులను సమాదరించాడు.

రచయితలను ఎలా గౌరవించాలో బాలుకు బాగా తెలుసు. కృష్ణశాస్త్రి గురించి చెబుతూ 'తెలుగు నుడికారానికి పట్టు తలపాగాలు చుట్టినవాడు' అని వ్యాఖ్యానించాడు. సుందర్రామ్మూర్తి ‘కన్నె బంగారు’ అన్న సుకుమార పదప్రయోగాన్ని విని, కృష్ణశాస్త్రి ‘జాబిలి కూన’ను గుర్తుచేసుకుంటూ ఆనందంతో కంటతడి పెట్టాడు. ‘జాబిలి కూన’ ఎంత అందమైన ప్రయోగమో, దాన్ని గుండెల్లో దాచుకోవడం అంతే అందమైన స్వభావం! శ్రీశ్రీ రాసిన ‘మనసున మనసై’ పాట గురించి హృదయంగమంగా వర్ణిస్తూ ‘నిన్ను నిన్నుగా ప్రేమించుటకు’ అనే రెండో చరణం ఆ పాటకు ‘కేంద్రకం’ అన్నాడు. దానిపై బాలు వ్యాఖ్యానం వింటే సాహిత్యం గురించి ఆయనకు ఎంత బాగా తెలుసో అర్థమవుతుంది. ‘చదువది ఎంత గల్గిన రసజ్ఞత ఇంచుక చాలకున్న’ అనే భాస్కర శతకకారుడి పద్యంలో ‘రసజ్ఞత’ అనే పదానికి, ‘నిజమునకు భావుకుండన సృజనన్‌ పదివేలమంది నొక్కడు జనించు’ అన్న విశ్వనాథ తీర్మానంలోని భావుకుడనే పదానికి, పెద్దన చెప్పిన ‘ఊహనరయంగల లేఖక పాఠకోత్తముల్‌’లో ఉత్తమ శబ్దానికి తాత్పర్యం ఏమిటో- ‘అదే బాలు’ అనిపించాడు. బాలు కవుల మనిషి. సంగీత దర్శకులంతా కోరుకొనే గాయకుడు. పరిశ్రమ చెక్కిన శిల్పం. ‘బాలూ సింగ్స్‌ విత్‌ ఫీలింగ్‌, అదర్స్‌ ఫీల్‌ టు సింగ్‌’ అన్న ఆత్రేయ పదచిత్రం- చిత్రపరిశ్రమకు బాలు అవసరాన్ని నిరూపించిన ధ్రువపత్రం. పాటకు బాణీకట్టే వేళ వివిధ స్వరకర్తల ఆలోచనలు ఏ తీరుగా ఉండేవో- బాలు చెబుతుంటే వినడం గొప్ప అనుభవం. వాటిని ఆయన అలవోకగానే చెప్పి ఉండవచ్చు. కానీ వాటి నేపథ్యంలో ఆలోచనల బరువుంది. అనుభవాల దరువుంది. మాటల నెరవుంది. ఎవరి గురించి చెప్పినా సలక్షణంగా ఉండేది. సాధికారికంగా ఉండేది. తన గుండెల్లోని ఆరాధనా భావం మాటల్లో తోచేది.

ఆకాశమే హద్దుగా...

'ఎలాంటి పాటనైనా పాడగలడు' అనే నమ్మకాన్నిచ్చిన గొప్ప గాయకుడు కావడంతో ఎలాంటి ప్రయోగాలు చేసినా, స్వరకర్తలు ఎంతటి ప్రతిభా విన్యాసాలు ప్రదర్శించినా, అవి బాలు గళంలో గొప్పగా ఒదిగిపోయేవి. తానెంత ఎత్తుకు ఎదిగాడో, సినిమా పాటను అంతకు రెండింతలు ఎత్తుకు పెంచాడు. 1997 'పాడుతా తీయగా' తుది పోటీలకు న్యాయనిర్ణేతగా వచ్చిన బాలమురళి 'బాలు మరింతగా మనసుపెడితే నాలా పాడగలడు. కాని నేను ఎంత కృషిచేసినా బాలూలా పాడలేను' అన్నారు. అదెంత గొప్ప మాటో మనందరికన్నా బాలుకు బాగా తెలుసు. కాబట్టే కన్నీళ్ల పర్యంతమై సాష్టాంగపడ్డాడు. ఆ ఆశీస్సు ఆత్మలో నిలిచిపోయేలా మరణానంతరం తన స్మృతి ఫలకంపై ‘ఒక అవతారపురుషుడి ఆశీస్సులు అందుకొన్న గాయకుడు’ అని లిఖించమని కోరాడు. బాలు ‘పద్మవిభూషణుడు’ అయ్యాడని వినేసరికి 'గగనాంగ నాలింగ నోత్సాహియై జగమెల్ల పులకించె సుమగుచ్ఛమై' అన్న వేటూరి గీతం గుర్తొస్తోంది. గుండె చెమరిస్తోంది!

ఇదీ చూడండి: ఎస్పీబీకి మరణానంతరం పద్మవిభూషణ్‌.. అవార్డు అందుకున్న చరణ్‌

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.