దేశం నెత్తిన రుణ సంక్షోభం ముప్పు ఉరుముతున్నదని, జాతి ప్రస్థానగతిని అది మరింత కుంగదీసే ప్రమాదం ఉందంటూ ఆర్థిక సంస్కరణల రూపశిల్పి, మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ చేసిన తాజా వ్యాఖ్యలు అర్థవంతమైనవి. ముమ్మరించనున్న సంక్షోభం ప్రధానంగా చిన్న, మధ్యతరగతి పరిశ్రమల్ని తీవ్రంగా కుంగదీయగలదన్న ఆయన హెచ్చరిక ఏమాత్రం తోసిపుచ్చలేనిది.
మహమ్మారి కన్నా ముందే..
కొవిడ్ మహమ్మారి రెక్క విప్పక ముందునుంచే వరస కడగండ్లతో ఉక్కిరిబిక్కిరవుతున్న సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమ(ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈ)లను, అనివార్యంగా విధించాల్సి వచ్చిన లాక్‌డౌన్లు చావుదెబ్బ తీశాయి. మనుగడకై పోరాటంలో అవి ఏటికి ఎదురీదుతున్నట్లు రిజర్వ్ బ్యాంక్ లోగడే ధ్రువీకరించింది. కరోనా ధాటికి విలవిల్లాడిన దశలోనూ వాటికి సముచిత తోడ్పాటు దక్కనేలేదు. కేంద్రప్రభుత్వ ప్రత్యేక ప్యాకేజీ లఘు పరిశ్రమలను కుదుట పరచలేకపోయిందన్న 'మూడీస్' సంస్థ నిష్పాక్షిక విశ్లేషణ, ఆత్మనిర్భరతకు నోచని ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈల దుస్థితికి అద్దం పట్టింది. చిన్న పరిశ్రమల రంగానికి నికరంగా రూ.45లక్షల కోట్లవరకు నిధులు అవసరమని అధ్యయనాలు విశ్లేషణలు చాటుతుండగా- బ్యాంకులు సమకూరుస్తున్నది 18 శాతం లోపేనని గణాంకాలు స్పష్టీకరిస్తున్నాయి.
పెరగాల్సిన పెట్టుబడులు..
పరిమిత పెట్టుబడులతో సుమారు 11 కోట్ల మేర ఉపాధి అవకాశాలు కల్పిస్తూ రకరకాల ఉత్పాదనలతో దేశార్థికానికి ఊపిరులూదుతున్న లఘు సంస్థలు తీవ్ర ఒడుదొడుకులతో సతమతమవుతున్నప్పుడూ అత్యావశ్యక సహాయం అందకే నిస్సహాయంగా గుడ్లు తేలేస్తున్నాయి. వాటికి సాయపడటం దేశ ప్రగతికి ఊతమివ్వడమేనన్న వాస్తవిక స్పృహతో సత్వర దిద్దుబాటు చర్యలు ఇకనైనా వడివడిగా పట్టాలకు ఎక్కాలి!
దేశవ్యాప్తంగా నెలకొన్న ఆరుకోట్ల 30 లక్షల లఘు పరిశ్రమలు 30శాతం జీడీపీ (స్థూల దేశీయోత్పత్తి)కి దోహదపడుతున్నాయని సంబంధిత మంత్రిత్వశాఖ ఘనంగా చెబుతుంటుంది. పొరుగున చైనాలో సుమారు మూడుకోట్ల 80 లక్షల చిన్న మధ్య తరహా సంస్థలు తమ దేశ జీడీపీలో 60శాతం వాటాతో ఎకాయెకి 80శాతం ఉపాధి అవకాశాలు సృష్టిస్తూ ధీమాగా రాణిస్తున్నాయి.
సంపద సృష్టి..
సంపద సృష్టిలో కీలక వనరులుగా వెలుగొందడమే లక్ష్యంగా గడచిన అయిదేళ్లలో అక్కడ సగటున రోజూ 16 వేలనుంచి 18 వేల కొత్త సంస్థలు పుట్టుకొచ్చినట్లు అంచనా. అటువంటి ప్రోత్సాహక వాతావరణం కొరవడ్డ ఇక్కడ ఉన్నవే ఉనికి కోసం పోరాడాల్సిన దురవస్థ అంతులేని కథగా కొనసాగుతోంది. ఒక్క చైనా అనేముంది- ఉత్పాదక రంగానికి పరిశ్రమలెంత ప్రాణప్రదమో ఆకళించుకున్న అమెరికా, జపాన్, సింగపూర్ వంటివీ వాటికి నవీన సాంకేతిక సొబగులు అద్దడంలో పోటీపడుతున్నాయి. కెనడా, దక్షిణాఫ్రికా, బ్రెజిల్ తదితరాలూ లఘు సంస్థలకు లబ్ధి చేకూర్చే విధివిధానాల అమలులో ఎన్నదగ్గ పురోగతి సాధిస్తున్నాయి.
రుణలభ్యత అంతంతే..
మిగతా ఐరోపా దేశాలకన్నా జర్మనీలో నిరుద్యోగం తక్కువగా ఉండటానికి ముఖ్యకారణం- అక్కడి 'మిటిల్ స్టాండ్' (ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈ) సంస్థలే. వివిధ కమిటీల నివేదికలెన్నో ఏళ్లతరబడి మొత్తుకుంటున్నా క్రమబద్ధమైన వెన్నుదన్ను కొరవడి, ఇటీవల కరోనా బారిన పడి మరింత కుంగిన లఘు పరిశ్రమలు పునరుజ్జీవం పొందగలిగే మార్గమేమిటో భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) ఇప్పటికే సూచించింది. కనీసం మూడేళ్లపాటు అన్ని రకాల నిబంధనలనుంచీ వాటికి మినహాయింపు ఇవ్వాలన్న సీఐఐ సిఫార్సు సహేతుకమైంది. '59 నిమిషాల్లో అప్పు' మంజూరైనా సొమ్ము చేతికి అందని ఉదంతాలు, పటిష్ఠ ఆసరా ప్రసాదించని ఉద్దీపన చర్యలు- చిత్తశుద్ధి లేమిని ప్రస్ఫుటీకరిస్తున్నాయి. యోగ్యతానుసారం అత్యవసర ప్రాతిపదికన రుణాల మంజూరు, కార్మికులకు నైపుణ్య శిక్షణ, విపణితో అనుసంధానం... ప్రస్తుత పరిస్థితుల్లో లఘు పరిశ్రమలకివే కొండంత ఆసరా కాగలిగేది!
ఇవీ చదవండి: పెను సంక్షోభంలో లఘు పరిశ్రమలు