పేరుకవి లఘు పరిశ్రమలైనా, దేశంలో సుమారు 12కోట్ల దాకా ఉపాధి అవకాశాలు కల్పించగల సామర్థ్యం వాటి సొంతం. అసలే ఆర్థిక మాంద్యంతో కుంగిపోయి ఉన్న చిన్న పరిశ్రమల పాలిట కరోనా సంక్షోభం పిడుగుపాటులా పరిణమించిందన్నది చేదు నిజం. లాక్‌డౌన్లతో లావాదేవీలు అడుగంటి అతలాకుతలమైన సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమ(ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈ)లు కేంద్రప్రభుత్వ ‘ఆత్మ నిర్భర్ ప్యాకేజీ’పై కొండంత ఆశ పెట్టుకున్నాయి. ప్రత్యేకించి సర్కారీ పూచీకత్తుపై 45లక్షల యూనిట్లకు గొప్ప మేలు చేయగలదంటూ మూడు లక్షల కోట్ల రూపాయల అదనపు రుణ వితరణ పథకం ప్రకటించిన మూడు నెలల తరవాతా, వాటి తలరాత మారనే లేదు. రుణ లభ్యత సంక్షోభం ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈలను వెన్నాడుతూనే ఉందని నిరుడు ధ్రువీకరించిన రిజర్వ్‌బ్యాంక్ తాజాగా క్రోడీకరించిన గణాంకాల్లోనూ చిన్న సంస్థల దుస్థితి ప్రస్ఫుటమవుతోంది.
లాక్‌డౌన్ల దరిమిలా, గత ఏడాదితో పోలిస్తే వాటికి రుణ వితరణ 17శాతం మేర తెగ్గోసుకుపోయింది! అధికశాతం లఘు పరిశ్రమల్ని నిర్వహణ నిధులకు కొరత, పాత అప్పులపై పేరుకుపోతున్న వడ్డీ భారం, ముడిసరకులకు నిపుణ కార్మికులకు కొరత ముప్పేట చెండుకు తింటున్నాయి. ఈ విపత్కాలంలో నామమాత్రం వడ్డీరేటుపై కనీసం పదేళ్లపాటు చెల్లింపుల బాదరబందీ లేకుండా కేంద్రం ఉదార యోజన ప్రకటించి చురుగ్గా అమలుపరచి ఉంటే, ఈసరికే వాటిలో చాలావరకు తెరిపిన పడేవి. వాస్తవంలో చిన్న సంస్థలనుంచి బ్యాంకులు 9-14శాతం వరకు వడ్డీరేటును ముక్కుపిండి వసూలు చేస్తున్నాయన్న కథనాలు వెలువడ్డాయి. వాటికి, రుణ వితరణలో కుంగుదలపై రిజర్వ్‌బ్యాంక్ నిజనిర్ధారణకు సమశ్రుతి కుదురుతోంది. దేశార్థికానికి పెద్ద ఆసరా కాగల చిన్న సంస్థల్ని గట్టెక్కించాల్సిన దశలో, భరించశక్యం కాని వడ్డీరేటును షరతుల్ని వాటినెత్తిన రుద్దడం- ప్యాకేజీ వెనక చిత్తశుద్ధినే ప్రశ్నార్థకం చేస్తోంది!
ఇతోధిక తోడ్పాటు
దేశవ్యాప్తంగా నెలకొన్న ఆరుకోట్ల ముప్ఫై లక్షల వరకు లఘు పరిశ్రమల్లో అత్యధికం నేడు ఉనికి కోసం పోరాడుతూ నిస్సహాయ స్థితిలో కూరుకుపోతున్నాయి. మహమ్మారి వైరస్ విజృంభణ నేపథ్యంలో అవి పునరుజ్జీవం పొందేలా కనీసం మూడేళ్లపాటు అన్నిరకాల నిబంధనల నుంచీ వాటికి మినహాయింపు ప్రసాదించాలన్న సీఐఐ(భారతీయ పరిశ్రమల సమాఖ్య) సిఫార్సుకు మన్నన దక్కలేదు. పార్లమెంటరీ సంఘం ఎదుట ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈ ప్రతినిధుల వాంగ్మూలానిదీ ఇంచుమించు అదే అంతర ధ్వని! చిన్న సంస్థల యథార్థ స్థితిగతులేమిటో సెప్టెంబరు నాటికి విపుల నివేదికలు సమర్పించాలని వివిధ మంత్రిత్వ శాఖల్ని ఆదేశించిన కేంద్రం- పరిస్థితి తీవ్రత దృష్ట్యా, యుద్ధప్రాతిపదికన వ్యవస్థాగతంగా ఇతోధిక తోడ్పాటు సమకూర్చాల్సి ఉంది!
లఘు పరిశ్రమలు కోరిందే తడవుగా రుణాలిచ్చేలా వెయ్యి గ్రామీణ వాణిజ్య బ్యాంకులకు చైనా నిధులు కేటాయిస్తుండగా- ‘మిటిల్ స్టాండ్’(ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈ) సంస్థలకు జర్మనీ అపరిమిత ప్రాధాన్యం కల్పిస్తోంది. న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, సింగపూర్, జపాన్ వంటివి ప్రభుత్వ సహకారం సమకూర్చడంలో, చిన్న సంస్థలనుంచి అధిక ఉత్పాదనలు సమీకరించడంలో, సృజనాత్మక డిజిటల్ సాంకేతికతను మప్పడంలో తమదైన ముద్ర వేస్తున్నాయి. కరోనా వైరస్ దాపురించడానికి ముందు- జీడీపీలో 29శాతంగా ఉన్న లఘు పరిశ్రమల వాటాను ఏడేళ్లలోగా 50శాతానికి విస్తరించాలని కేంద్రం సంకల్పించింది. అధిక వడ్డీరేట్లతోపాటు అరకొర రుణ వసతి, అహేతుక నిబంధనల పీడ కొనసాగినన్నాళ్లు- చిన్న సంస్థలు సమస్యల సుడిగుండం నుంచి బయటపడలేవు. స్థిరంగా నిలదొక్కుకునే క్రమంలో విఘ్నాలు తొలగితేనే, ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈలు కోలుకుని కోట్లాది జీవితాల్ని కుదుటపరచగలుగుతాయి!