ETV Bharat / opinion

కార్పొరేట్లదే హవా- చితికిపోతున్న చిన్న రైతు! - దేశంలో చితికిపోతున్న చిన్నరైతు

పంట నష్టం కారణంగా అన్నదాతలు ఆత్మహత్య చేసుకోవడం కేవలం భారత్​కే పరిమితం కాదు. అమెరికాలోనూ ఇదే దుస్థితి. చిన్న రైతు చితికిపోవడం బ్రిటన్​, బ్రెజిల్​, ఐరోపా దేశాల్లోనూ మొదలైంది. రైతుల నుంచి వ్యాపారులు, బడా కార్పొరేట్లు నేరుగా పంట కొనడానికి, కాంట్రాక్టు సేద్యానికి, పంట భూములను లీజుకు ఇవ్వడానికి.. 'సంస్కరణలు' రంగ ప్రవేశం చేస్తున్నాయి! ఈ విషయంలో.. అమెరికన్‌ రైతుల చేదు అనుభవాల అద్దంలో భారతీయ రైతాంగ భవితను వీక్షించవచ్చు.

Small farmers are distressed in India
చితికిపోతున్న చిన్న రైతు!
author img

By

Published : Apr 6, 2021, 6:51 AM IST

వాతావరణ మార్పులవల్ల పదేపదే పంటలు దెబ్బతినడం, చేతికి వచ్చిన పంటకూ గిట్టుబాటు ధర రాకపోవడం, చేసిన అప్పులు తీరకపోవడం.. రైతుల ఆత్మహత్యలకు మూల కారణాలు. ఈ దురదృష్టకర పరిణామం భారత్‌కు మాత్రమే పరిమితం కాదు. అగ్రరాజ్యం అమెరికాలోనూ ఇవే కారణాలు రైతుల ఉసురు తీస్తున్నాయి. చిన్న రైతు చితికిపోవడం బ్రిటన్‌, బ్రెజిల్‌, ఐరోపా దేశాల్లోనూ మొదలైంది. అందుకే నేడు భారతీయ రైతుల ఆందోళనకు ప్రపంచం స్పందిస్తోంది. కేంద్ర, రాష్ట్ర చట్టాల మూలాన భారత్‌లో వ్యవసాయ టోకు మార్కెట్లు ప్రైవేటు హస్తాల్లోకి వెళుతున్నాయి. రైతుల నుంచి వ్యాపారులు, బడా కార్పొరేట్లు నేరుగా పంట కొనడానికి, కాంట్రాక్టు సేద్యానికి, పంట భూములను లీజుకు ఇవ్వడానికి... 'సంస్కరణలు' రంగ ప్రవేశం చేస్తున్నాయి! ఇదంతా వ్యవసాయం కార్పొరేట్లపరమై ఫ్యాక్టరీ స్థాయి సేద్యానికి దారి తీస్తుందని రైతులు ఆందోళన చేస్తున్నారు. అమెరికా, దక్షిణ అమెరికా, ఆఫ్రికాలలో- జరుగుతున్నది, జరిగింది ఇదే. ఈ సందర్భంగా అమెరికన్‌ రైతుల చేదు అనుభవాల అద్దంలో భారతీయ రైతాంగ భవితను వీక్షించవచ్చు.

కార్పొరేట్లదే హవా

ఐరోపా నుంచి అమెరికాకు వలస వచ్చిన ప్రజలకు వ్యవసాయమే ప్రధాన వృత్తి. అమెరికా మధ్యలో, ముఖ్యంగా పశ్చిమ తీరంవైపు సువిశాల భూములు సేద్యానికి అనువుగా ఉండటంతో అక్కడికి తరలి వెళ్ళే కుటుంబాలకు తలా 160 ఎకరాల వరకు భూములు కేటాయించేవారు. ఈ భూముల్లో గోధుమ, ఓట్స్‌, మొక్కజొన్న పండిస్తూ- పశువులు, పందులు, కోళ్లను పెంచుతూ అమెరికన్లు జీవనం గడిపేవారు. 1870లో అమెరికాలో దాదాపు సగం జనాభాకు వ్యవసాయమే జీవనాధారం. 2008 వచ్చేసరికి జనాభాలో రెండు శాతంకన్నా తక్కువమందికే సేద్యం పరిమితమైంది. నేడు అమెరికన్‌ రైతు సగటు వయసు 56 సంవత్సరాలు. కనీసం అయిదు తరాల నుంచి సేద్యమే వృత్తిగా కలిగిన కుటుంబాల్లో వీరిదే చివరి తరం. వారి కుటుంబాల్లోని యువత సేద్యాన్ని వదిలి పట్టణాలకు వలస వెళ్లిపోయారు. అమెరికా వ్యవసాయోత్పత్తిలో 1990లలో దాదాపు 50శాతం చిన్న, మధ్యతరహా వ్యవసాయ క్షేత్రాల నుంచి ఉత్పన్నమయ్యేది. ఇప్పుడు ఆ వాటా 25శాతానికి లోపే. ‘ఫ్యూచర్స్‌ మార్కెట్‌’లో ధరల ఉత్థాన పతనాలు రైతు జీవితాలను తలకిందులు చేశాయి. వాతావరణ మార్పులతోపాటు రాజకీయ, ఆర్థిక కారణాలవల్ల ప్రపంచ విపణిలో వ్యవసాయ సరకుల ధరలు తీవ్ర హెచ్చుతగ్గులకు లోనుకాసాగాయి. అక్కడ ధరలు పడిపోయినప్పుడల్లా అమెరికాలో చిన్న, మధ్యతరహా రైతులు దివాలా తీసి, వ్యవసాయం మానుకోవలసి వస్తోంది.

వ్యవసాయం మాని..

ఇది చాలదన్నట్లు బహుళజాతి కంపెనీలు పారిశ్రామిక స్థాయిలో భారీయెత్తున వ్యవసాయం, కోళ్లు, పందుల పెంపకం, పాడి పరిశ్రమను చేపట్టడం వల్ల ఆ కంపెనీల నుంచి పోటీని చిన్న రైతులు తట్టుకోలేక వ్యవసాయం, అనుబంధ వృత్తులను మానుకొంటున్నారు. ఫ్యాక్టరీ స్థాయి సేద్యం రాకముందు కిరాణా దుకాణాలు, విత్తనాలు, ఎరువుల దుకాణాలు, ట్రాక్టర్ల మరమ్మతు షెడ్లు, భోజన, అల్పాహార శాలలు, చిన్న చిన్న ఆస్పత్రులు, పశు వైద్యులు, పాఠశాలలతో కళకళలాడిన అమెరికన్‌ పల్లెలు నేడు చాలావరకు బోసిపోయాయి. రైతు కుటుంబాల యువత సేద్యం విడిచి, పట్టణాలకు వలసపోవడంతో ఎన్నో పల్లెలు నిర్మానుష్యంగా మారాయి. మెగా వ్యవసాయ కంపెనీల దెబ్బకు అమెరికన్‌ గ్రామాలు ఆర్థికంగానే కాదు, సామాజికంగానూ చితికిపోయాయి.
ఒకప్పుడు గోధుమ, ఓట్స్‌, మొక్కజొన్న, బీన్స్‌ వంటి రకరకాల పంటలు పండించిన రైతులు నేడు పందులు, కోళ్ల ఫారాలకు దాణా అందించడం కోసం, ఇథనాల్‌ తయారీ కోసం మొక్కజొన్న, సోయాబీన్‌లను పండించి బతుకు వెళ్లదీస్తున్నారు. బహుళ పంటల నుంచి ఏక పంట విధానానికి మారడం నేల సారాన్ని దెబ్బతీస్తోంది. 1985లో మిసోరీ రాష్ట్రంలో 23,000 మంది పందుల పెంపకందారులు ఉండగా, ఇప్పుడు వారి సంఖ్య 2000కు పడిపోయిందంటే కారణం- ఫ్యాక్టరీల పోటీని తట్టుకోలేకపోవడమే. పశువుల ఫారాలు కూడా 40 శాతం మేర తగ్గిపోయాయి.

గ్రామాల్లో విస్తరిస్తున్న అర్ధ బానిసత్వం

ఏడో దశకం తొలినాళ్లలో అప్పటి అమెరికా వ్యవసాయ మంత్రి ఎర్ల్‌ బుట్స్‌ 'భారీ స్థాయిలో సేద్యం చేయండి లేదా సేద్యమే మానుకోండి' అని పిలుపు ఇచ్చినప్పటి నుంచి కార్పొరేట్‌, కాంట్రాక్టు సేద్యాలు ఊపందుకున్నాయి. ప్రభుత్వమిచ్చిన ప్రోత్సాహకాలతో మెగా వ్యవసాయ కంపెనీలు నేడు పొలం నుంచి నేరుగా భోజన పళ్లానికి ఆహారం, మాంసం, గుడ్లు అందించే స్థాయికి ఎదిగి- రైతు జీవితాలను శాసిస్తున్నాయి. వందల కోట్ల డాలర్ల పెట్టుబడితో వ్యాపారం చేసే ఫ్యాక్టరీ సేద్య సంస్థల ధాటికి తట్టుకోలేక రైతులు ఆ కంపెనీలకోసం కాంట్రాక్టు పద్ధతిలో పంటలు, కోళ్లు, పందులు, పశువుల పెంపకాలు చేపడుతున్నారు. నేడు అమెరికాలోని కోళ్ల పెంపకందారుల్లో 92శాతం కాంట్రాక్టు కోళ్ల రైతులే. కానీ, ఈ కంపెనీలు ఎప్పటికప్పుడు కొత్త డిమాండ్లతో భారీ వ్యవసాయ యంత్రాలు కొనాల్సిందిగా రైతులపై ఒత్తిడి చేయడం వల్ల బ్యాంకుల నుంచి అప్పు చేసి మరీ వాటిని తీసుకోవలసి వస్తోంది.

గిట్టుబాటు ధరలేక..

ఇంతలో ధరలు పతనమై బాకీలు తీర్చలేకపోవడం రైతులను ఆత్మహత్యలకు పురిగొల్పుతోంది. రష్యా, చైనాలకు సోయా, గోధుమ ఎగుమతులపై అమెరికా ప్రభుత్వాలు విధించిన ఆంక్షలూ స్వదేశంలో ధరల పతనానికి కారణమవుతున్నాయి. మెగా కంపెనీలు భారీయెత్తున వ్యవసాయ ఉత్పత్తులతో మార్కెట్లను ముంచెత్తడం వల్ల ధరలు పతనమై- ఇప్పటికీ సొంత సేద్యం చేస్తున్న రైతులు దివాలా తీస్తున్నారు. వారు సైతం కాంట్రాక్టు సేద్యగాళ్లుగా మారక తప్పడంలేదు. వ్యవసాయంలో కార్పొరేట్లు ప్రవేశిస్తే పోటీ పెరిగి ధరలు తగ్గుతాయని ప్రభుత్వాలు ప్రచారం చేస్తుంటాయి. కానీ, అమెరికాలో మెగా కంపెనీలు రైతుల నుంచి పోటీయే లేకుండా చేసుకుంటున్నాయి. నష్ట భయాన్ని రైతుల మీదకు తోసేసి నిక్షేపంగా లాభాలు మూటగట్టుకుంటున్నాయి. కాంట్రాక్టు సేద్యగాళ్లుగా మారిన రైతులు మెగా కంపెనీల షరతులకు తలొగ్గి సేద్యం చేయాల్సి వస్తోంది. అల్పాదాయాలతో సరిపెట్టుకోవలసి వస్తోంది. ఇదంతా చివరకు అర్ధ బానిసత్వానికి దారితీస్తోందని, ప్రజాస్వామ్య అమెరికా అదృశ్యమవుతోందని చిన్న రైతులు ఆవేదన చెందుతున్నారు.

కార్మికులకు యంత్రాల దెబ్బ

Small farmers are distressed in India
కార్మికులకు యంత్రాల దెబ్బ

ఒకప్పుడు పదుల సంఖ్యలో ఇంటి పెరట్లో పెరిగిన కోళ్లు, పందులు, పశువులు నేడు వేల సంఖ్యలో మెగా ఫ్యాక్టరీ ఫారాల్లో పెరుగుతున్నాయి. వాటిని వీడియో కెమెరాలతో పరిశీలిస్తూ, వేళకు మేత వేసే పని- కంప్యూటర్లు చేస్తున్నాయి. ఈ నిర్జన ఫ్యాక్టరీ ఫారాలకు అప్పుడప్పుడూ కొందరు సాంకేతిక నిపుణులు వస్తుంటారు. వేల సంఖ్యలో బారులు తీరిన కోళ్లు, పందుల వరసల మధ్య బ్యాటరీ వాహనాల్లో ముందుకెళుతూ తనిఖీలు చేస్తుంటారు. నేడు అమెరికాలో రెండున్నర లక్షల ఫ్యాక్టరీ ఫారాలు ఉన్నాయని అంచనా. ఈ ఫ్యాక్టరీల నుంచి వచ్చే వ్యర్థాలు, దుర్గంధంతో పరిసరాలు కలుషితమై- పల్లెల్లో మిగిలిన కొద్ది కుటుంబాలూ ఊళ్లు ఖాళీచేసి వెళ్ళిపోతున్నాయి. ఫ్యాక్టరీ ఫారాలు బర్డ్‌ ఫ్లూ, ఆఫ్రికన్‌ స్వైన్‌ ఫ్లూ, కరోనా వైరస్‌లకు ఉత్పన్న స్థానాలుగా మారే అవకాశాలున్నాయని కొందరు శాస్త్రజ్ఞులు హెచ్చరిస్తున్నారు.

- ఏఏవీ ప్రసాద్‌, రచయిత

ఇదీ చదవండి: ఒకే పాఠశాలలో 99 మంది విద్యార్థులకు కరోనా!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.