నైపుణ్య శిక్షణ, నేర్చిన నైపుణ్యాలకు నిరంతరం పదును పెట్టుకోవడం- ప్రాచీన కాలం నుంచే భారతీయుల జీవన విధానంగా ఉంది. ఆనాటి స్వయంసమృద్ధ గ్రామీణ వ్యవస్థకు నైపుణ్యాలే ఊపిరి. చేతి వృత్తులు, కులవృత్తులవారు ఒక తరం నుంచి మరో తరానికి తమ విద్యను నేర్పిస్తూ భారత ఆర్థిక వ్యవస్థకు పట్టుగొమ్మగా నిలిచారు. భారతీయ చేతి వృత్తి నిపుణులు తయారు చేసిన వస్త్రాలు, హస్తకళా వస్తువులను దక్షిణ భారత, గుజరాత్ వ్యాపారులు మధ్యాసియా, ఐరోపాలకు ఎగుమతి చేసేవారు. చిన్న అగ్గిపెట్టెలో ఇమిడే చీర, చిన్న ఉంగరంగుండా జారిపోయే మస్లిన్ వస్త్రాల తయారీతో భారతీయ నేతన్నల ఖ్యాతి దిగంతాల్లో మార్మోగిపోయింది. పోత ఇనుము, లోహ వస్తువులు, చేనేత, హస్తకళా వస్తువుల తయారీలో ఎందరో సిద్ధహస్తులుగా ఉండేవారు.
బ్రిటిష్ ఈస్టిండియా కంపెనీ భారత్‌కు వచ్చే నాటికి మన దేశ గ్రామాలు, పట్టణాలు స్వావలంబనతో విలసిల్లేవి. విదేశీ వ్యాపారంతో దేశం సుసంపన్నంగా ఉండేది. భారతీయుల సంప్రదాయ నైపుణ్యాలను, స్వయంసమృద్ధ వ్యవస్థను బ్రిటిష్ పాలకులు పథకం ప్రకారం నాశనం చేశారు. 18వ శతాబ్ది ఆరంభంలో ప్రపంచ వాణిజ్యంలో 27 శాతంగా ఉన్న భారత్ వాటా, స్వాతంత్య్రం వచ్చే నాటికి కేవలం మూడు శాతానికి పడిపోవడానికి కారణం- వలస పాలకులే. సంప్రదాయ పరిశ్రమలు, హస్తకళలు, చేతివృత్తులను కుట్ర ప్రకారం నాశనం చేసి, ఆ శిథిలాల పునాదిపై ఇంగ్లాండ్ రెండు శతాబ్దాల తరబడి ప్రపంచంలో అగ్రశక్తిగా నిలవగలిగింది. మన నేత వస్త్రాలు, ఇతర ఉత్పత్తులపై భారీగా పన్నులు వేసి నేతన్నలను దుర్భర పేదరికంలోకి నెట్టేసింది.
నిపుణుల తయారీలో వైఫల్యం
స్వాతంత్య్రం వచ్చిన తరవాతా సంప్రదాయ కళలు, చేతి వృత్తులు, నైపుణ్యాల వృద్ధికి ప్రాధాన్యం ఇవ్వకపోవడంతో ఇవాళ నిపుణుల కొరతను ఎదుర్కొంటున్నాం. స్వతంత్రం వచ్చాక భారీ ఎత్తున పారిశ్రామికీకరణను చేపట్టామే తప్ప, పరిశ్రమలకు కావలసిన నిపుణులను తయారు చేసుకోవడంపై దృష్టి పెట్టలేదు. సంప్రదాయ చేతివృత్తి కళాకారుల నైపుణ్యాలను ఆధునిక కాలానికి కావాల్సిన రీతిలో తీర్చిదిద్దలేకపోయాం. వారికి కొత్త సాంకేతికతలు, మెలకువలను నేర్పడంలో విఫలమయ్యాం. పైగా, గుమాస్తాలను తయారు చేయడానికి ఉద్దేశించిన బ్రిటిష్ కాలంనాటి మెకాలే విద్యావిధానాన్నే చిరకాలం పట్టుకుని వేలాడాం. ఫలితంగా మన యువతకు 21వ శతాబ్దిలో రాణించడానికి అవసరమైన నైపుణ్యాలు ఇప్పటికీ అలవడలేదు. మొత్తం కార్మికుల్లో సాంకేతిక సామర్థ్యాలు ఉన్నవారి సంఖ్య అమెరికాలో 62 శాతం, ఇంగ్లాండ్‌లో 68, జర్మనీలో 75, జపాన్‌లో 80, దక్షిణ కొరియాలో 96 శాతంగా ఉంది. మన దేశంలోని మొత్తం 4 కోట్ల 44 లక్షల మంది కార్మికుల్లో కేవలం 1.8 శాతానికే సాంకేతిక నైపుణ్యాలున్నాయి. ఈ దుస్థితిని మార్చాలని నిశ్చయించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ యువతకు, చేతివృత్తులవారికి కొత్త నైపుణ్యాలు నేర్పించి, వారిని ‘భారత్‌లో తయారీ’ కార్యక్రమానికి చోదక శక్తిగా ఉపయోగించుకోవాలని తలపెట్టారు. ఇందుకోసం నైపుణ్యాభివృద్ధికి ప్రత్యేక మంత్రిత్వ శాఖనే ఏర్పాటు చేశారు. దేశ యువతరం భవిష్యత్ సవాళ్లను సమర్థంగా ఎదుర్కొనేలా సిద్ధం చేయడానికి తాజాగా జాతీయ విద్యావిధానాన్ని ఆవిష్కరించారు.
భారత్ మున్ముందు ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించడానికి ఈ విధానం గట్టి పునాది వేస్తుంది. దేశానికి ఉన్న అతిపెద్ద బలం కార్మిక శక్తే కానీ, వారిలో అత్యధికులు ఇంకా వ్యవసాయ రంగంలోనే పని చేస్తున్నారు. ప్రాచీన కాలం నుంచి భారతీయ వ్యవసాయంలో మహిళలూ సమాన భాగస్వాములే. కానీ, రానురానూ మహిళలూ విద్యావంతులవడంతో వ్యవసాయం, అనుబంధ వృత్తుల్లో వనితల వాటా తగ్గిపోతోంది. వ్యవసాయంలో ఆధునిక సాంకేతికతలను ప్రవేశ పెట్టకపోవడంతో యువత ఈ రంగంవైపు ఆకర్షితులు కావడం లేదు. ఈ పరిస్థితిని మార్చాలని, రైతుల ఆదాయాలను రెట్టింపు చేయాలని ప్రధాని మోదీ సంకల్పించడం శుభ పరిణామం.
ఏ దేశమైనా ఆర్థికంగా పురోగమించాలంటే ఆ దేశ పౌరుల నైపుణ్యాలే కీలకం. కానీ, 2019 అంతర్జాతీయ పోటీ సామర్థ్య సూచీలో భారత్ 71వ స్థానంతో సరిపెట్టుకుంది. ఈ సూచీలో స్విట్జర్లాండ్ ప్రథమ స్థానంలో నిలిచింది. సింగపూర్, అమెరికా రెండు, మూడో స్థానాల్లో ఉన్నాయి. జనాభాలో యువతీయువకులే అత్యధిక వాటా ఆక్రమిస్తున్న భారత్- నైపుణ్యాల విషయంలో ఇంతగా వెనకబడిపోవడం ఆందోళనకరం. దేశ జనాభాలో కుటుంబ సభ్యులపై ఆధారపడే పిల్లలు, వృద్ధులు వంటి వయోవర్గంతో పోలిస్తే, 15-64 ఏళ్ల వయోవర్గం వారి సంఖ్య చాలా ఎక్కువ. ఇలాంటి యువజనం అధికంగా ఉండే ప్రయోజనాన్ని భారత్ సద్వినియోగం చేసుకోవాలంటే, వారికి అత్యవసరంగా అధునాతన నైపుణ్యాలు నేర్పాలి. 2020లో దేశ జనాభా సగటు వయసు కేవలం 28 ఏళ్లు; చైనాలో 37, అమెరికాలో 45, పశ్చిమ ఐరోపాలో 49 ఏళ్లుగా ఉంది. మన దేశంలో అందరికీ నాణ్యమైన విద్యను, ప్రపంచశ్రేణి నైపుణ్యాలను అలవరిస్తే తప్ప యువజనాధిక్యత నుంచి ప్రయోజనం పొందలేం.
సృజనశీలురను తీర్చిదిద్దాలి
కరోనా మహమ్మారి వల్ల మన జీవన విధానాలు, వృత్తి ఉద్యోగాలు, ఆరోగ్యం, అభివృద్ధి, భద్రత సమూలంగా మారిపోతాయని ఎవరు ఊహించారు? ఎంతటి అనిశ్చితిలోనైనా విజేతగా నిలిపే శక్తి- నైపుణ్యాలకే ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని మన నిర్మాణ కూలీలకు, నేతన్నలకు, గీత కార్మికులు, మత్స్యకారులు ఇతర చేతివృత్తులవారికి కాలానుగుణమైన నైపుణ్యాలను, పరికరాలను అందించాలి. అధునాతన ఎలక్ట్రానిక్ వస్తువులు, మందులు, సెమీ కండక్టర్లను ఎగుమతి చేసే స్థాయికి ఎదగాలి. యువతను ఈ దిశగా విద్యావిధానం సంసిద్ధం చేయాలి. బ్యాంకింగ్, ఫైనాన్స్, మార్కెటింగ్, వ్యవస్థాపకత రంగాల్లోనూ యువతకు శిక్షణ ఇవ్వాలి.
ప్రస్తుతం డిజిటల్ నైపుణ్యాలకు బాగా గిరాకీ ఉంది. సామాజిక మాధ్యమాలను సమర్థంగా వాడుకోవడం ద్వారా ఆదాయం ఆర్జించవచ్ఛు గ్రామీణులు, పట్టణవాసులు కాలానుగుణమైన నైపుణ్యాలను నేర్చుకుంటే స్వయంఉపాధి కల్పించుకోగలుగుతారు. కరోనా జీవనాధారాలను దెబ్బతీయడమే కాదు, కొత్త అవకాశాలనూ సృష్టిస్తోంది. వాటిని వేగంగా అందిపుచ్చుకోవాలి. భారీ సంఖ్యలో ఉద్యోగాలను సృష్టించే సూక్ష్మ,చిన్న, మధ్యతరహా పరిశ్రమల (ఎంఎస్‌ఎంఈ) రంగానికి అండగా నిలవాలి. పారిశ్రామిక శిక్షణ కేంద్రాలకు, వ్యాపార సంస్థలకు మధ్య అనుసంధానం ఏర్పరచాలి. ఐటీఐలలో అత్యుత్తమ ప్రతిభ కనబరచే విద్యార్థులు ఐఐటీలలో ప్రవేశం పొందడానికి తోడ్పడే విధానాన్ని చేపట్టాలి. ప్రపంచంలో అత్యుత్తమ విద్యాసంస్థలతో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుని విద్యార్థులకు నైపుణ్యాలను నేర్పించాలి. జాతీయ విద్యావిధానంలో నిర్దేశించిన విధంగా ప్రతి విశ్వవిద్యాలయం, ప్రతి ఉన్నత విద్యాసంస్థ ఇంక్యుబేషన్ కేంద్రాలను, వికాస కేంద్రాలను నెలకొల్పి సృజనశీలురను తీర్చిదిద్దాలి. అప్పుడే శ్రేష్ఠ భారత్ స్వప్నం సాకారమవుతుంది.
- బండారు దత్తాత్రేయ
(రచయిత- హిమాచల్‌ప్రదేశ్ గవర్నర్)
ఇదీ చదవండి: వ్యాక్సిన్ ట్రయల్స్‌పై సీరంకు షోకాజ్ నోటీసులు