కరోనా వైరస్.. కంటికి కనిపించకుండా వ్యాపిస్తూ మానవాళిని ఎంత భయపెడుతోందో, అంతకంటే ఎక్కువగా అపోహల ద్వారా ఆందోళన పరుస్తోంది.కరోనా వచ్చిన దగ్గరనుంచి సామాజిక మాధ్యమాల్లో కనిపిస్తున్న హడావుడి అంతా ఇంతా కాదు. ఉన్నవీ లేనివీ గుప్పించేసరికి సగటు మానవుడు ఉక్కిరిబిక్కిరైపోతున్నాడు. కొందరు కావాలనే ఇలాంటి పనులు చేస్తుంటారు. మరి కొందరు తెలియక చేస్తుంటారు. ఇంకొందరు సరదాకో కాలక్షేపం కోసమో చేస్తుంటారు. ఆలోచిస్తే ఈ అసత్యప్రచారంద్వారా సత్యాన్ని మరుగుపరచి అసత్యాన్నే సత్యంగా చూపించడంలో కొందరు దురుద్దేశపరులు సఫలీకృతులవుతున్నారు. అందుకోసం ఆధునిక సాంకేతికత వాళ్లకు బాగా పనికొస్తోంది.
వ్యక్తుల్ని ముఖాల్ని, చుట్టూ ఉన్న వాతావరణాన్ని అన్నీ తమకు అనుకూలంగా మార్చేసి నమ్మకం కలిగేవిధంగా ఛాయాచిత్రాలను వీడియోలను సృష్టించి లోకం మీదకు వదిలేస్తున్నారు. ఇలాంటి వీడియోలకు లేనిపోని శీర్షికలు పెడతారు. చూడగానే ఆకర్షించేలా తయారుచేస్తారు. దానివల్ల అందులోని సమాచారం నిజమేననుకొని అమాయకులు నమ్మేస్తున్నారు. మోసపోతున్నారు. మానవమేధ ఇలా వక్రమార్గం పట్టడం బాధాకరం.
పరిశీలించకుండా పంపొద్దు..
సమాచారాన్ని పరిశీలించకుండా దానిగురించి తెలియకుండా మరి కొంతమందికి పంపకూడదు. అలా పంపామంటే అది మనం పూర్తిగా నమ్మినట్లే లెక్క. ఆ అసత్యప్రచారానికి మనం వాహకులం అవుతున్నట్లే. 'లేదండీ... మాకు అందులోని నిజానిజాలు తెలియవు... ఏదో వచ్చింది. బావుంది కదా అని అందరికీ పంపేశాం..., అంటే కుదరదు. అసత్యం వ్యాప్తిచేయడం అనైతికం. అసత్యమాడటం కంటే కూడా ఘోరమైన నేరం. దానివల్ల కలిగే ప్రమాదాలను, నష్టాలను కనీసం ఊహించలేం. మానవీయతను మంటగలిపి పైశాచికానందం పొందేవారే ఇలాంటివి ఎక్కువగా చేస్తుంటారు. నిజానికి ఇలాంటి పనులు చేయడానికి- చదువుకున్నవాళ్లు చదువులేనివాళ్లనే వ్యత్యాసం లేదు. అదో మానసిక రుగ్మత. ఎదుటివారిని భయాందోళనలల్లోకి నెట్టి వేడుక చూడటం. ఇది ఒక మతిభ్రంశమే (Psychological Disorder) అంటారు మనస్తత్వ శాస్త్రవేత్తలు. మామూలు విషయాల గురించైతే పెద్దగా పట్టించుకోవలసిన అవసరం లేదు గానీ ప్రాణాంతకమైన కరోనా లాంటి వ్యాధుల విషయంలో ఇలాంటి సందేశాల ఉద్ధృత ప్రచారం వల్ల అందరూ భయాందోళనలకు గురికావల్సి వస్తోంది.
ఔషధంపై ప్రచారం...
ఉదాహరణకు కరోనా నివారణకు ఔషధం, చికిత్స గురించిన జరిగిన అపప్రచారం అంతా ఇంతా కాదు. మొదటినుంచీ- అదుగో ఆ దేశం వాళ్ళు మందు కనిపెట్టారు, ఈ దేశంవాళ్ళు వాక్సిన్ తీసుకొస్తున్నారు అంటూ వదంతుల ప్రచారం జోరుగా సాగింది. అసలు కరోనా ఔషధాల తయారీ ప్రక్రియ చాలా క్లిష్టమైనదని, అందులో ఎన్నో దశలుంటాయని వాటన్నింటినీ దాటుకొని ఒక వ్యాధికి నివారక ఔషధం తయారు చేయడం ఆషామాషీ కాదని విజ్ఞులు చెబుతున్నారు. ఈ విషయంలో జరిగిన తప్పుడు ప్రచారం వల్ల సామాన్యప్రజలు కొంత అలసత్వం వహించి, జాగ్రత్తలు తీసుకోకుండా మానివేసే ప్రమాదం ఉంది. అందుకే తెలుగు రాష్ట్రాల్లో కొందరు పెద్దలు, వైద్యరంగంలోనూ ఔషధాలతయారీ రంగంలోనూ ప్రసిద్ధులైనవారు నడుంబిగించారు. అవన్నీ అపోహలని వివరించి నిజాలు నిగ్గుతేల్చారు. అలా చెప్పకపోతే పరిస్థితి విషమిస్తుంది. అసత్యాన్ని ప్రచారం చేయడం ఎలా అయితే దోషమో సత్యాన్ని వెలుగులోనికి రాకుండా అడ్డుకోవడం, తెలిసిన దాన్ని సమర్థులు చెప్పకుండా ఉండటమూ దోషమే. అందుకే అందరూ దీనినొక సామాజికబాధ్యతగా స్వీకరించాలి. ఇంకేముంది... కరోనాకు మాత్రలూ ఇంజక్షన్లూ వచ్చేశాయి అని ఈ మధ్య విపరీతమైన ప్రచారం జరిగింది. సామాజిక మాధ్యమాలు హోరెత్తించేశాయి. మందులు వచ్చిన మాట వాస్తవమే. కానీ వాటికి పరిమితులు ఉంటాయి కదా. కరోనా మందు ఎంతవరకూ పనిచేస్తుందో.. ఏ స్థాయిలో పనిచేస్తుందో ఎవరికి ఇవ్వాలో ఎవరికి ఇవ్వకూడదో కూడా చెప్పారు.
మరి అవేమీ తెలుసుకోకుండా ఎవరికివారే దానిని ప్రచారం చేసుకుంటూ పోతే అందరూ హమ్మయ్య అని ఊపిరిపీల్చేసుకుంటారు. మూతికి వేళ్ళాడే చిక్కాల్ని వదిలించుకొని చెంగుచెంగున దూకే లేగదూడల్లా మాస్క్‌లను తీసేసి దూసుకుపోయే ప్రమాదం ఉంది. అంతేకాదు నిరంతరం ఇలాంటి సమాచారాన్ని అతిగా తెలుసుకుంటూ భయాందోళనలకు గురికావడంవల్ల చేసే పనిమీద దృష్టి నిలవదు. కుటుంబంతో సరిగా గడపలేరు. తద్వారా శారీరక, మానసిక రుగ్మతలు వస్తాయి. వ్యాధినిరోధక శక్తి తగ్గిపోతుంది. ఒక వ్యక్తి ఇలాంటి స్థితికి గురై అతడిద్వారా కుటుంబం కరోనా బారిన పడవలసి వస్తుంది. చేతులారా కరోనాకు ఎర్రతివాచీ పరిచి ఆహ్వానించినట్లవుతుంది. ఇకనైనా అదిగో పులి అంటే ఇదిగో తోక అనే మనస్తత్వానికి స్వస్తి పలుకుదాం. అందరూ ఆనందంగా, ఆరోగ్యంగా ఉండేలా ప్రవర్తించడం అందరి బాధ్యతగా అందరం గుర్తిద్దాం. కరోనాతో మనం సుదీర్ఘపోరాటం చెయ్యాల్సి ఉంది. ఆ పోరాటంలో మానవత్వంతో పదునుపెట్టుకున్న వ్యక్తిత్వం అనే ఆయుధంతో కరోనాను సంహరిద్దాం.
- డాక్టర్ అద్దంకి శ్రీనివాస్