ఇటీవలి కాలంలో పార్లమెంటును కుదిపేసిన అంశాల్లో విదేశీ విరాళాల నమోదు చట్టానికి చెందిన సవరణ బిల్లూ ఒకటి. ఎన్నో స్వచ్ఛంద సంస్థలు, ప్రతిపక్షాలు వ్యతిరేకిస్తున్నా ఈ బిల్లు ఆమోదం పొందింది. లాభాపేక్ష లేకుండా అవసరంలో ఉన్న వారికి సేవలు అందించేవే స్వచ్ఛంద సేవా సంస్థలు.
ఇలాంటి సంస్థల నుంచి అందరూ ఆశించేది సేవతోపాటు నిజాయతీ, నిబద్ధత, దార్శనికత, త్యాగనిరతి, సహానుభూతి. అన్నిటికన్నా ముఖ్యంగా జవాబుదారీతనం కావాలి. స్వచ్ఛంద సంస్థలు- చట్టపరంగా లబ్ధిదారులకు, ఆర్థిక సాయం చేసే దాతలకు, పన్ను మినహాయింపునిచ్చే ఆదాయ పన్ను శాఖకు, ఇతర ప్రభుత్వ సంస్థలకు జవాబుదారీగా ఉండాలి.
వ్యక్తిగత దాతలు, ప్రభుత్వ గ్రాంట్లు, ప్రాజెక్టుల రూపంలో వివిధ సంస్థల నుంచి వచ్చే గ్రాంట్లు, లబ్ధిదారులు, సంస్థ తయారు చేసిన ఉత్పత్తుల్ని అమ్మగా వచ్చే డబ్బులు, విదేశీ ప్రభుత్వాలు, సంస్థల నుంచి నిధులు వంటి అనేక రూపాల్లో నిధులు సమకూరతాయి. ఇలా అనేక మార్గాల్లో వచ్చే నిధులను లబ్ధిదారుల కోసం ఖర్చు పెడుతూ తమ సంస్థ పాలనపరమైన వ్యయాలకూ వాడుకోవాల్సి ఉంటుంది.
పుట్టగొడుగుల్లా సంస్థలు
ప్రపంచవ్యాప్తంగా దాదాపు కోటికిపైగా స్వచ్ఛంద సేవా సంస్థలు పని చేస్తున్నాయి. అమెరికాలోనే 12 లక్షల సంస్థలు పన్ను మినహాయింపు సౌకర్యాన్ని పొందుతున్నాయి. మినహాయింపు తీసుకోనివీ మరెన్నో ఉన్నాయి. అన్ని దేశాల్లోనూ స్వచ్ఛంద సేవా సంస్థలకు పన్ను మినహాయింపు లభిస్తోంది. ప్రతి సంస్థా తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సిందే. మన దేశంలో సైతం రిజిస్ట్రేషన్ తప్పనిసరి.
భారత్‌లో దాదాపు 36 లక్షల స్వచ్ఛంద సేవా సంస్థలు పని చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రతి 500 మందికి ఒక స్వచ్ఛంద సంస్థ ఉన్నట్లు అంచనా. మన దేశంలో బడులకన్నా ఎక్కువ సంఖ్యలో స్వచ్ఛంద సంస్థలుండటం విశేషం. గత రెండు దశాబ్దాల కాలంలో స్వచ్ఛంద సంస్థలకు రూ.2 లక్షల కోట్ల విదేశీ నిధులు అందాయని ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి.
ఇటీవలి చట్ట సవరణతో కొత్తగా మారిన నిబంధనల ప్రకారం... విదేశీ నిధులను పొందిన సంస్థే వాటిని వ్యయం చేయాలి. ఇతరులకు మళ్లించడానికి వీల్లేదు.
- విదేశాల నుంచి వచ్చే డబ్బుల్ని స్వచ్ఛంద సంస్థ పరిపాలన పరమైన ఖర్చులకు 20 శాతం వరకే ఖర్చు పెట్టాలి. ఇంతకు ముందు ఇది 50 శాతంగా ఉండేది.
- ఎఫ్‌సీఆర్‌ఏ బ్యాంకు ఖాతాను దిల్లీలోని భారతీయ స్టేట్ బ్యాంకు (ఎస్‌బీఐ) శాఖలోనే తెరవాలి.
- ప్రతి సంస్థా ఎఫ్‌సీఆర్‌ఏ రిజిస్ట్రేషన్ కోసం తమ బోర్డు సభ్యుల ఆధార్ కార్డులను, పాస్‌పోర్ట్‌లను తప్పనిసరిగా సమర్పించాలి.
- ప్రభుత్వం విచారణలో నిబంధనల అమలు సక్రమంగా ఉంటేనే రిజిస్ట్రేషన్‌ను నవీకరిస్తారు. ప్రభుత్వ సంబంధిత పదవుల్లో ఉండేవారు విదేశీ నిధులు పొందేందుకు అర్హులుకారు.
నిబంధనలతోనే నిధులు సద్వినియోగం
నిబంధనలన్నీ సక్రమంగా అమలు జరగాలంటే ఎఫ్‌సీఆర్‌ఏ చట్టంలో చేసిన మార్పులపై ప్రతి స్వచ్ఛంద సంస్థకూ సరైన అవగాహన కల్పించాలి. విదేశీ నిధులను సక్రమంగా ఉపయోగించడానికి ప్రతి సంస్థకూ అవకాశం కల్పించాలి. ఎఫ్‌సీఆర్‌ఏ రిజిస్ట్రేషన్లు సులభరీతిలో జరిగేలా ఏర్పాట్లు ఉండాలి. రిజిస్ట్రేషన్ ప్రక్రియను ఆన్‌లైన్ విధానం ద్వారా అందరికీ అందుబాటులోకి తేవాలి. దీనివల్ల పెద్ద పెద్ద విదేశీ, దేశీయ స్వచ్ఛంద సంస్థల ఆధిపత్యాన్ని తగ్గిస్తూ, నిజంగా సేవ చేయాలనే ఉద్దేశంతో ఉండే చిన్న సంస్థలకూ తోడ్పడవచ్చు.
స్వచ్ఛంద సంస్థలన్నీ దిల్లీలోని ఎస్‌బీఐ శాఖలోనే ఖాతా నిర్వహించాలనే నియమం అంతగా ఆచరణ సాధ్యం కాకపోవచ్చు. దేశంలోని ఏ ఎస్‌బీఐ శాఖలోనైనా ఖాతాకు అవకాశం కల్పించడం మేలు. దీనివల్ల ప్రభుత్వానికి పెద్దగా ఇబ్బందులేమీ ఉండకపోవచ్చు. ఎఫ్‌సీఆర్‌ఏ రిజిస్ట్రేషన్‌ను సులభంగా నవీకరించుకునే పద్ధతులను ప్రవేశపెట్టాలి.
మధ్యవర్తులకు ఆస్కారం లేకుండా ఈ ప్రక్రియ కొనసాగితే స్వచ్ఛంద సంస్థలకు ఇబ్బందులు తప్పుతాయి. సొసైటీ, ట్రస్ట్ రిజిస్ట్రేషన్ చట్టాల నుంచి విద్యాసంస్థలను, ఆస్పత్రులను వేరుచేసి స్వచ్ఛంద సంస్థలు మాత్రమే సొసైటీ/ట్రస్ట్ రిజిస్ట్రేషన్ కింద ఉండేలా చేయడం వల్ల కొంతమేర అవినీతిని తగ్గించవచ్చు.
స్వచ్ఛంద సంస్థలపై ఎలాంటి వాదోపవాదాలున్నా.. వాటిపై గట్టి పర్యవేక్షణ తప్పకుండా అవసరమే. జవాబుదారీతనం విషయంలో ప్రభుత్వానికే కాదు, సేవా సంస్థలకూ బాధ్యత ఉంటుంది. ఒక స్వచ్ఛంద సంస్థను ఎలాంటి ఉద్దేశంతో నెలకొల్పారో, ఎంత మేర సేవలు అందించి అవసరార్థులను ఆదుకున్నారో ప్రభుత్వాలు గమనించాల్సిన అవసరం ఉంది. అయితే, అందరినీ ఒకేగాటన కట్టకుండా బాగా పనిచేసే సంస్థలకు తగిన సహకారం అందిస్తే స్వచ్ఛంద సేవా సంస్థలు అద్భుతాలు సృష్టిస్తాయనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు.
సేవ ముసుగులో అరాచకాలు?
ఆత్యయిక పరిస్థితుల్లో రాజకీయ పక్షాలకు విదేశీ నిధులు అందకుండా చేయడానికి, విదేశీ ప్రభుత్వాలు మనదేశంలో పెత్తనం చలాయించకుండా చూడాలనే లక్ష్యంతో విదేశీ విరాళాల నమోదు చట్టం (ఎఫ్‌సీఆర్‌ఏ) ఏర్పాటైంది. రాజకీయ పార్టీలు విదేశీ నిధులు తీసుకోవడానికి వీలులేదని, జాతీయ ప్రయోజనాలకు హాని కలిగించే కార్యక్రమాలకు ఇతర దేశాల డబ్బులు వాడకూడదంటూ 2010లో ఈ చట్టానికి సవరణలు చేశారు.
ఎన్డీయే ప్రభుత్వం వచ్చాక దీనికి మరింత పదును పెట్టింది. దాదాపు 20 వేల స్వచ్ఛంద సంస్థల ఎఫ్‌సీఆర్‌ఏ రిజిస్ట్రేషన్లను నిలిపివేసింది. అయినప్పటికీ ఏడాది వ్యవధిలోనే దాదాపు రూ.18 వేల కోట్ల విదేశీ నిధులను స్వచ్ఛంద సంస్థలు అందుకున్నాయి. ఇలాంటి సంస్థలకు రాజకీయ ప్రతినిధులు, ప్రభుత్వ అధికారుల అండదండలు ఉన్నాయనే సంగతి తెలిసిన విషయమే.
కొన్ని స్వచ్ఛంద సంస్థలు తమకు అందిన విదేశీ నిధులను మత సంబంధమైన కార్యక్రమాలకు, ఉగ్రవాద కార్యకలాపాలకు, భారత్‌పైనా, ప్రభుత్వంపైనా ప్రజల్లో వ్యతిరేక భావనలు పెంచేందుకు, దేశాభివృద్ధి కార్యక్రమాలకు ఆటంకం కలిగించేందుకు ఖర్చు పెడుతున్నట్లు తేలింది. ఈ క్రమంలో స్వచ్ఛంద సేవల ముసుగులో జరుగుతున్న అక్రమాలను అరికట్టేందుకే.. ఎఫ్‌సీఆర్‌ఏ చట్టానికి మళ్లీ సవరణలు తెచ్చినట్లు ప్రభుత్వం పేర్కొంది.
- డాక్టర్ మమతా రఘువీర్ ఆచంట