మరో నాలుగు నెలల్లో శాసనసభ ఎన్నికలకు సిద్ధమవుతున్న పంజాబ్‌లో (Punjab Polls 2022) సరికొత్త రాజకీయ సమీకరణలకు తెరలేస్తోంది. కాంగ్రెస్, అకాలీదళ్, ఆప్, బాప్‌లతో పాటు ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ ఏర్పాటుచేసే కొత్త పార్టీ భాజపాతో కలిసి పోటీ చేస్తామనడం వల్ల అయిదు ప్రధాన పక్షాలు బరిలోకి దిగుతాయనేది స్పష్టమవుతోంది. ఇటీవలే సీఎం పదవి నుంచి తీవ్ర అవమాన భారంతో తప్పుకొన్న అమరీందర్ ఒకప్పటి ప్రత్యర్థి భాజపాతో చేతులు కలిపేందుకు సిద్ధమవుతున్నారు. అకాలీదళ్‌లోని ధిండ్సా, బ్రహ్మపుర లాంటి చీలికవర్గాలతోనూ పొత్తులు పెట్టుకునే దిశగా అడుగులు వేస్తున్నారు. పంజాబ్ భవిష్యత్తు కోసమే ఈ యుద్ధం చేస్తున్నానన్నది కెప్టెన్ మాట. దేశం తరఫున యుద్ధంలో పాల్గొని, తరవాత రాజకీయాల్లోకి ప్రవేశించి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించిన అమరీందర్ సింగ్‌ది విభిన్న నేపథ్యం. ఆయన భారత సైన్యంలోని సిక్కు రెజిమెంటులో కెప్టెన్‌గా ఉండి, 1965లో పాకిస్థాన్‌తో యుద్ధంలో పాల్గొన్నారు. తరవాత 15 ఏళ్లకు కాంగ్రెస్‌లో చేరి అత్యవసర పరిస్థితి తరవాతి సమయంలోనూ పటియాలా ఎంపీగా ఎన్నికయ్యారు. ఆపరేషన్ బ్లూస్టార్ నేపథ్యంలో కాంగ్రెస్‌ను వీడి, అకాలీదళ్‌లో చేరారు. మళ్ళీ కాంగ్రెస్‌లోకి వచ్చి, 2002లో పంజాబ్‌కు తొలిసారి ముఖ్యమంత్రి అయ్యారు. 2017లో మరోసారి కాషాయ కూటమిని ఓడించి రాష్ట్ర పాలనా పగ్గాలు అందుకున్నారు. దేశభక్తితో కూడిన పుస్తకాలనూ రచించారు. ఇప్పటికే ఆయనపై జాతీయవాద ముద్ర ఉండటం వల్ల భాజపాతో పొత్తుకు యత్నించడం లాంటివి తేలికవుతున్నాయి.
దళిత ఓట్లపై ఆశలు
పంజాబ్‌లో (Punjab Assembly Elections) అధికారాన్ని కాపాడుకోవడానికి కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తుగడే వేసింది. దళిత నాయకుడైన చరణ్‌జీత్‌సింగ్ చన్నీని ముఖ్యమంత్రిగా ఎంపిక చేసింది. పంజాబ్ జనాభాలో 32శాతం దళితులే. ఇప్పటి వరకూ అక్కడ ఒక్కసారీ దళిత నేత సీఎం పీఠంపై కూర్చోలేకపోయారు. రాష్ట్ర జనాభాలో 20 శాతమే ఉన్న జాట్ సిక్కుల నుంచి 13 మంది ముఖ్యమంత్రులు ఆ రాష్ట్రాన్ని ఏలారు. ఇప్పుడు తొలిసారిగా ఆ రాష్ట్రానికి చన్నీ రూపంలో ఒక దళిత ముఖ్యమంత్రి వచ్చారు. ఎన్నికలు వచ్చేలోపు తన మార్కు పాలనను అందించి, దళిత ఓట్లను సాధించగలిగితే పంజాబ్‌లో కాంగ్రెస్ పార్టీకి ఆయన ఆశాదీపంగా మారతారు. ముఖ్యమంత్రి పీఠంపై కన్నేసిన సిద్ధూకు చెక్ పెట్టడం సైతం ఈ వ్యూహం పరమార్థంగా కనిపిస్తోంది. ఒకవేళ వచ్చే ఎన్నికల్లోనూ కాంగ్రెస్ గెలిస్తే, ముఖ్యమంత్రి అభ్యర్థిని మార్చే ప్రశ్నే తలెత్తబోదు. దళిత ముఖ్యమంత్రిని కాదని అధికారం చేపడతామంటూ సిద్ధూ లాంటివాళ్లు పోటీ పడటానికి సాహసించరన్నది కాంగ్రెస్ అధిష్ఠానం యోచనగా కనిపిస్తోంది. రామ్‌దాసియా (చర్మకార) వర్గానికి చెందిన చన్నీ ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తరవాత సొంత ప్రభావం చూపించే దిశగా ప్రయత్నాలేమీ పెద్దగా చేయలేదు. ఈ క్రమంలో తొలిసారి ముఖ్యమంత్రి పదవి చేపట్టిన చరణ్‌జీత్‌సింగ్ చన్నీకి అధిష్ఠానం మార్గదర్శనం అందించాల్సి ఉంది. కానీ, ఉత్తర్‌ప్రదేశ్ రాజకీయ పరిణామాల మీదే ఎక్కువగా దృష్టిపెడుతున్న అధిష్ఠానం, తమ చేతిలో ఉన్న పంజాబ్‌పై అంతగా దృష్టి సారించడం లేదని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. పంజాబ్ వ్యవహారాలను చక్కదిద్దడంపై రాహుల్‌గాంధీ దృష్టిపెట్టాలని పార్టీ వర్గాలు ఆశిస్తున్నాయి. 2017 ఎన్నికల్లో రాష్ట్రంలోని ఎస్సీ నియోజకవర్గాలు గణనీయ సంఖ్యలో కాంగ్రెస్ ఖాతాలో పడ్డాయి. దళిత సంప్రదాయ ఓటుబ్యాంకు కాంగ్రెస్ వెంటే ఉంటుందని, దానికితోడు అకాలీదళ్, భాజపా వేరుపడినందువల్ల మరోసారి తమకే అవకాశం దక్కవచ్చని కాంగ్రెస్ నేతలు గట్టిగా విశ్వసిస్తున్నారు.
ప్రభావం ఏ మేరకు?
గతంలో భాజపాతో అధికారాన్ని పంచుకుని, తరవాత తెగతెంపులు చేసుకున్న అకాలీదళ్ ఇప్పుడు బీఎస్పీతో పొత్తు పెట్టుకుంది. ఉత్తర్‌ప్రదేశ్‌లో కొంత పట్టు ఉండి, గతంలో అధికారంలో కూడా ఉన్న బీఎస్పీకి పంజాబ్‌లో ప్రభావం చూపించేంత పరిస్థితి లేకపోయినా, దళితుల్లోని రామ్‌దాసియా వర్గం నుంచి కొంత ఆదరణ లభించే అవకాశం ఉంది. మొత్తం జనాభాలో 10శాతానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ వర్గానికి చెందిన చన్నీయే ముఖ్యమంత్రిగా ఉండటంతో అకాలీదళ్- బీఎస్పీ కూటమి ఆశలకు గండికొట్టే అవకాశాలూ లేకపోలేదు. 2017 ఎన్నికల్లో గట్టిపోటీ ఇస్తుందనుకున్న ఆమ్ ఆద్మీ పార్టీ 20 స్థానాలతోనే సరిపెట్టుకున్నా, ప్రధాన ప్రతిపక్షంగా మాత్రం నిలిచింది. అందులో 18 స్థానాలు మాల్వా ప్రాంతంలోనే రావడం గమనార్హం. ఇప్పుడు (Punjab Election 2022 News) ఆ పార్టీ సైతం దళిత ఓట్లపై దృష్టిపెట్టింది. మిగతా పక్షాలకు గట్టిపోటీ ఇస్తూ, ప్రధాన పోటీదారుగా అవతరిస్తోంది. ఇంకోవైపు రైతు సంఘాల మద్దతుతో బరిలోకి దిగుతామని చెబుతున్న భారతీయ ఆర్థిక పార్టీ (బాప్) ఇప్పటికే భారతీయ కిసాన్ యూనియన్ (బీకేయూ) అండదండలు పొందే ప్రయత్నం చేస్తోంది. తాజాగా అమరీందర్‌సింగ్ కొత్త పార్టీ ఏర్పాటు చేసి, భాజపాతో పాటు అకాలీదళ్ చీలిక వర్గాలతో కలిసి పోటీ చేస్తే ఏ మేర ప్రభావం చూపుతారనేది ఎన్నికల ఫలితాలతోనే స్పష్టమవుతుంది. ఈలోపు పంజాబ్ రాజకీయ యవనికపై మరెన్ని కొత్త పొత్తులు ఉదయిస్తాయో, ఇంకెన్ని కొత్త పార్టీలు పుట్టుకొస్తాయో వేచిచూడాలి.
- శ్రీకమల
ఇదీ చూడండి: పంజాబ్‌లో సిద్ధూ రాజకీయ కేళి- సీఎం పదవి కోసమేనా?