పెద్దరికం ఉట్టిపడే విగ్రహం, పెను సంక్షోభాల్లోనూ సడలని నిగ్రహం, కార్యదక్షత రాజనీతిజ్ఞతలు కలగలిసిన మూర్తిమత్వం, సచ్ఛీల విలువల భారత రత్నం- ప్రణబ్ ముఖర్జీ. జగమెరిగిన బెంగాలీ ‘భద్రలోక్’ మరిలేరన్న సమాచారం ప్రజాస్వామ్య హితైషులకు శరాఘాతం లాంటిది.
కాంగ్రెస్కు పెద్ద దిక్కు..
తొలిసారి 1969లో పెద్దల సభ ద్వారా పార్లమెంటులో అడుగుపెట్టి ఇందిర ప్రాపులో వడివడిగా ఎదిగిన ప్రణబ్ దా దేశ పదమూడో రాష్ట్రపతిగా 2012లో బాధ్యతలు చేపట్టేదాకా కాంగ్రెసుకు పెద్ద దిక్కు! సంకీర్ణ క్లేశాలు చుట్టుముట్టినప్పుడల్లా ప్రణబ్ రాజకీయ కౌశలమే యూపీఏ పాలక శ్రేణికి దిక్కూమొక్కు! ఆర్థికం, వాణిజ్యం, రక్షణ, విదేశీ వ్యవహారాల్లో ఆరితేరిన అతిరథుడు, యూపీఏ జమానాలో ఎకాయెకి 95 కీలక మంత్రివర్గ బృందాలకు సారథ్యం వహించిన పాలనా విశారదుడు, నొప్పింపక తానొవ్వక పనులు చక్కబెట్టడంలో దిట్టగా రాణించిన శేముషీ విభవ సంపన్నుడు ప్రణబ్ ముఖర్జీ.
డెబ్భై ఎనభయ్యో దశకాల్లో ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, ఎగ్జిమ్ బ్యాంకు, నాబార్డ్‌ల ఏర్పాటులో కీలక భూమిక పోషించిన ప్రణబ్ దా- 1991లో కేంద్రం రాష్ట్రాల నడుమ ఆర్థిక వనరుల పంపిణీకి గాడ్గిల్‌తో కలిసి కొత్త సూత్రాన్ని ప్రతిపాదించిన ఘనాపాటి. యూపీఏ హయాములో పాలన సంస్కరణలు, సమాచార హక్కు, ఉపాధి, ఆహార భద్రతా హక్కులు, ఇంధన భద్రత, మెట్రో రైలు, ఆధార్ కార్డు వంటి విప్లవాత్మక నిర్ణయాల వెనక క్రియాశీల పాత్ర పోషించింది ప్రణబ్ ముఖర్జీయే.
చిరస్మరణీయమైన ముద్ర
జన సమూహాలకు పూనకాలు తెప్పించే వాగ్ధాటి లేకపోయినా, రాజ్యభాష హిందీ పరిజ్ఞానం కొరవడినా, ఆంగ్లభాషపై పట్టు అంతంత మాత్రమే అయినా, కఠోర పరిశ్రమతో రాజ్యాంగ బద్ధ పాలన లోతుపాతుల్ని ఆపోశన పట్టిన రాజర్షి ప్రణబ్ ముఖర్జీ. పార్టీ భేదాలకు అతీతంగా అన్ని వర్గాలవారి ఆదరణనూ అమితంగా చూరగొని నిక్కమైన కాంగ్రెస్ వాదిగా, నిరుపమాన రాజనీతిజ్ఞుడిగా దేశ ప్రగతి గమనంపై ప్రణబ్ దా వేసిన ముద్ర చిరస్మరణీయమైనది!
పార్లమెంటే పాఠశాలగా
తన వ్యక్తిత్వాన్ని పార్లమెంట్ తీర్చిదిద్దిందంటూ రాష్ట్రపతిగా పదవీ విరమణ వేళ మూడేళ్ల క్రితం ప్రణబ్ దా చేసుకొన్న ఆత్మావలోకనం వర్తమాన నేతాగణాలకు గుణపాఠం వంటిది. అయిదు దశాబ్దాల ప్రజాజీవనంలో పార్లమెంటే పాఠశాలగా పీవీ విజ్ఞతనుంచి, వాజ్‌పేయీ వాక్పటిమ నుంచి మధులిమాయే, డాక్టర్ నాథ్ పాయేల వ్యంగ్య వ్యాఖ్యలనుంచి, పీలూ మోదీ హాస్యం, హీరేన్ ముఖర్జీ కవితా స్రవంతి, ఇంద్రజిత్ గుప్తా ప్రత్యుత్తరాలనుంచీ ఎంతో నేర్చుకొన్నానన్న ప్రణబ్ మాట- ఉత్తమ పార్లమెంటేరియన్లుగా ఎదగాలనుకొనేవారికి మేలు బాట!
ఇందిరను గురువుగా .. మోదీకి గురువుగా..
ఇందిరను గురువుగా సంభావించే ప్రణబ్, ప్రధాని మోదీ చేత గురువుగా సన్నుతులందుకొన్నారంటేనే అర్థమవుతుంది- రాజ్యాంగ వనమాలిగా ఆయన చూపిన దార్శనికత! అనివార్య పరిస్థితుల్లో తప్ప అత్యవసరాదేశా(ఆర్డినెన్స్)ల జోలికి పోరాదని హితవు పలికినా, ఏకకాల ఎన్నికలపై తన భిన్నాభిప్రాయాన్ని హుందాగా తెలియజేసినా- రాష్ట్రపతి పదవీ గౌరవంతో ఏమాత్రం రాజీపడని శైలి ప్రణబ్ విలక్షణ వ్యక్తిత్వానికి అద్దం పట్టింది. ప్రథమ పౌరుడిగా అబ్దుల్ కలామ్ ప్రజా రాష్ట్రపతిగా తనదైన ముద్రవేస్తే, రాష్ట్రపతి భవన్ తలుపుల్ని ప్రజల కోసం తెరిచిన వ్యక్తి ప్రణబ్ ముఖర్జీ.
భారతదేశమంటే అన్ని మతాలు, కులాలు, భాషలు, ప్రాంతాల సమాహారం- అదే జాతీయవాదం’ అంటూ ఆరెస్సెస్ వేదిక మీదే అశేష జన వాణిని తన గళంలో పలికించిన ప్రణబ్- పార్లమెంటరీ సత్ సంప్రదాయాల ప్రణవనాదం. ఎంపీ- ఓటర్ల నిష్పత్తి ఆందోళనకరమంటూ లోక్‌సభలో వెయ్యిమంది సభ్యులుండాలన్న ఆయన ప్రతిపాదన పూర్తిగా హేతుబద్ధం. త్యాగనిరతులైన నేతల స్ఫూర్తిని విలువల్ని పుణికి పుచ్చుకొన్న ప్రణబ్ లేని లోటు- ఎప్పటికీ తీరేది కాదు!