ETV Bharat / opinion

అధిక జనాభా వరమా.. భారమా? భవిష్యత్ కోసం ఎలా సన్నద్ధమవ్వాలి? - చైనా ఇండియా జనాభా

ప్రపంచంలోనే అధిక జనాభా ఉన్న చైనాలో జననాలు తగ్గిపోతున్నాయి. డ్రాగన్‌ దేశంలో 60 ఏళ్లలో మొదటిసారి జనాభా వృద్ధిరేటు తగ్గినట్లు గణాంకాలు చెబుతున్నాయి. భారత్​లో మాత్రం 2050 వరకు జనాభా పెరుగుతూనే ఉంటుందని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో అధిక జనాభా వల్ల ఎదురయ్యే సవాళ్లేంటి? అందుకు ఎలా సన్నద్ధమవ్వాలి అన్న విషయాలను పరిశీలిస్తే..

population-growth-good-or-bad
population-growth-good-or-bad
author img

By

Published : Feb 14, 2023, 10:02 AM IST

ప్రపంచ జనాభాలో నాలుగో వంతు భారత్‌, చైనాల్లోనే నివసిస్తోంది. డ్రాగన్‌ దేశంలో 60 ఏళ్లలో మొదటిసారి జనాభా వృద్ధిరేటు తగ్గినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ప్రస్తుతం చైనా జనాభా 141.7 కోట్లు, ఇండియా జనాభా 141.2 కోట్లు. ఈ ఏడాదిలోనే భారత్‌ ప్రపంచంలోనే అత్యధిక జనాభా గల దేశంగా అవతరిస్తుందన్నది ఐక్యరాజ్యసమితి అంచనా. పలు ధనిక దేశాల్లోనూ జనాభా తగ్గిపోతోంది కాబట్టి- అవకాశాలను అందిపుచ్చుకొనేలా మన యువతను సిద్ధం చేయాల్సిన అవసరముంది.

చైనా జనాభా 1990 నుంచి క్రమంగా తగ్గుతోంది. భారత్‌ జనసంఖ్య మాత్రం 2050 వరకు పెరుగుతూ 166.8 కోట్లకు చేరుతుందని అంచనా. 2022-2050 మధ్య 46 పేద దేశాల్లో జనాభా పెరుగుతూ ఉంటే 61 దేశాల్లో ఏటా ఒకశాతం చొప్పున తగ్గుతుందని ఐక్యరాజ్యసమితి వెల్లడించింది. అనేక ఐరోపా దేశాల్లో జనాభా పెరుగుదల రేటు ఇప్పటికే బాగా క్షీణించింది. మున్ముందు మరింత క్షీణిస్తుంది. అమెరికాను అధిగమించి అగ్రరాజ్యంగా ఎదగాలనుకొంటున్న చైనాకు జనాభాలో వృద్ధుల సంఖ్య పెరిగిపోతుండటం పెద్ద అవరోధం కానుంది. 2030 నాటికి ఆ దేశంలో నాలుగోవంతు జనాభా 60 ఏళ్లు పైబడినవారే ఉంటారు. వృద్ధుల సంఖ్య పెరిగేకొద్దీ దేశ ఉత్పాదకశక్తి క్షీణిస్తుంది. అధిక జనాభా ఆర్థికాభివృద్ధిని దెబ్బతీస్తుందన్న అంచనాతో చైనా 1980 నుంచి ఒకే బిడ్డ ముద్దు విధానాన్ని తీసుకొచ్చింది. దీనివల్ల ప్రతికూల ఫలితాలు వస్తున్నాయని గ్రహించి 2016లో ఇద్దరు సంతానాన్ని అనుమతించింది. 2016లో 1.79 కోట్లుగా ఉన్న జననాలు 2022 నాటికి 96 లక్షలకు పడిపోయాయి. కొవిడ్‌ కారణంగా జననాలు మరింత తగ్గవచ్చు. యువజనులు తగ్గిపోతున్నకొద్దీ కార్మికుల కొరత ఏర్పడుతుంది కాబట్టి- దాన్ని కృత్రిమమేధ, రోబోటిక్స్‌ వంటి అత్యాధునిక సాంకేతికతలతో అధిగమించేందుకు డ్రాగన్‌ నడుం కట్టింది.

ఉత్పాదక కార్యకలాపాల్లో యువశక్తి
పలు అభివృద్ధి చెందిన దేశాల్లోనూ యువ జనాభా తగ్గుతోంది. ఐరోపా దేశాల్లో 20 ఏళ్లలోపు జనాభా 22శాతమే. పేద ఆఫ్రికన్‌ దేశాల్లో అది 50శాతానికి పైగా, భారత్‌లో 34.8శాతంగా ఉంది. 2063కల్లా మన జనాభా పెరుగుదల ఆగిపోయి, క్రమంగా క్షీణించడం ఆరంభిస్తుంది. విస్తీర్ణంలో భారత్‌కన్నా చైనా మూడింతలు పెద్దదైనా ఇక్కడి జనసాంద్రత మాత్రం చైనా కన్నా మూడింతలు ఎక్కువ! మరికొన్ని దశాబ్దాల వరకు భారత్‌లో యువ జనాభా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఉత్పాదక కార్యకలాపాల్లో యువశక్తిని వినియోగించడంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి కేంద్రీకరించాలి. జనాభాలో 116 కోట్ల మంది అల్పాదాయ వర్గానికి, 6.6 కోట్ల మంది మధ్యతరగతికి, 1.6 కోట్ల మంది ఎగువ మధ్యతరగతికి చెందినవారు. సంపన్నులు కేవలం 20 లక్షల మందే! మరో 13.4 కోట్ల మందిని నిరుపేదలుగా ప్యూ పరిశోధనా సంస్థ అంచనా వేసింది. కొద్దోగొప్పో స్తోమత కలిగినవారు చదువు, ఉపాధి కోసం విదేశాలకు వలసపోతున్నారు. భారత్‌లో మహిళా కార్మిక భాగస్వామ్యం శ్రీలంక, పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌ల కన్నా తక్కువే. మన యువతలో నిరుద్యోగిత రేటు 28శాతం. చైనాలో అది 20శాతంగా, అభివృద్ధి చెందిన ఓఈసీడీ దేశాల్లో10శాతంగా ఉంది.

జాతీయ, అంతర్జాతీయ ఆర్థిక, రాజకీయ పరిణామాల్లో; జనాభా స్వరూప స్వభావాల్లో వస్తున్న మార్పులకు అనుగుణంగా భారత్‌ తన విధానాలను మార్చుకోవాలి. ఉజ్జ్వల భవిత కోసం పెట్టుబడులు పెంచాలి. ప్రజలు, వారి ఆదాయాలు పెరుగుతున్నకొద్దీ వస్తుసేవల వినియోగమూ పెరుగుతుంది. పల్లెల నుంచి పట్టణాలకు వలసలు పెరుగుతాయి కాబట్టి, మౌలిక వసతులను కల్పిస్తూ పట్టణాలను విస్తరించాలి. విద్య, వైద్య సేవలను మెరుగుపరచాలి. పింఛన్లతో సామాజిక భద్రతా వ్యవస్థను పరిపుష్టం చేయాలి. గత మూడు దశాబ్దాల్లో సేవా రంగం విస్తరించి యువతకు పెద్దసంఖ్యలో ఉపాధి కల్పించింది. కానీ, వాటిలో తక్కువ జీతభత్యాలిచ్చే ఉద్యోగాలే ఎక్కువ! కొవిడ్‌ మహమ్మారి వల్ల సరఫరా గొలుసులు విచ్ఛిన్నం కావడం, సాంకేతిక పరిజ్ఞానాల్లో మార్పులు చోటుచేసుకోవడం వంటి పరిణామాలు పాత ధోరణులకు చెల్లుచీటీ రాస్తున్నాయి. యువత కొత్త సాంకేతికతల్లో నైపుణ్యాన్ని సంపాదించాల్సిన అవసరాన్ని అవి నొక్కిచెబుతున్నాయి. చైనా మాదిరిగా భారీ పారిశ్రామికీకరణ చేపట్టడానికి ఇది సమయం కాదు. ప్రపంచం ఇప్పుడు హైటెక్‌ పారిశ్రామిక ఉత్పత్తి వైపు మళ్లుతోంది. ఉపాధి కోసం బ్యాంకింగ్‌, ఫైనాన్స్‌, టెక్నాలజీ, మీడియా, టెలీకమ్యూనికేషన్‌ రంగాలపై మాత్రమే ఆధారపడితే సరిపోదు.

సముచిత మొత్తాలను కేటాయించాలి
మౌలిక వసతుల కల్పనకు ప్రైవేటు రంగంపై ఆధారపడటం కన్నా, ప్రభుత్వమే నిధులు సమకూర్చి, వాటిని విస్తరించాలి. ముఖ్యంగా వైద్య సేవల నిమిత్తం ప్రతి కేంద్ర, రాష్ట్ర బడ్జెట్‌లో సముచిత మొత్తాలను తప్పనిసరిగా కేటాయించాలి. మేలైన ఆసుపత్రులు నగరాలు, పట్టణాలకే పరిమితం కాకూడదు. గ్రామాలకూ వాటిని విస్తరించాలి. వృద్ధుల కోసం పటిష్ఠ సామాజిక భద్రతా పథకాలను అమలుచేయడం ఖరీదైన వ్యవహారం. ఉద్యోగ విరమణ వయసును పెంచడం ద్వారా ఆ భారాన్ని కొంతకాలం వాయిదా వేయవచ్చు. సొంతంగా పింఛన్‌ మొత్తాలను సమకూర్చుకోవడానికి ఉద్దేశించిన పొదుపు పథకాలకు ప్రభుత్వం భారీగా పన్ను రాయితీ ఇవ్వాలి. ఆ మొత్తాలను ప్రైవేటు రంగ పెట్టుబడుల కోసం వెచ్చించకూడదు. ఐరోపా, అమెరికా దేశాల్లో జననాల రేటు పడిపోయినందువల్ల మనదేశం నుంచి నిపుణ యువత అక్కడికి వలస వెళ్ళడానికి సులభంగా వీసాలివ్వాలంటూ ఒత్తిడి తేవాలి. మన యువత విదేశాల నుంచి పంపే మొత్తాలు భారత ఆర్థిక వ్యవస్థను పరిపుష్టం చేస్తాయి.

నాణ్యమైన విద్య, నైపుణ్యాలే కీలకం...
దేశంలో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ఉపాధి అవకాశాలే కాదు- ఆహారం, నివాసం వంటి వసతులు కల్పించడమూ పెను సవాలు కానుంది. దక్షిణ భారతంలో వృద్ధుల జనాభా పెరుగుతున్నకొద్దీ ఆర్థిక వ్యవస్థ కుంచించుకుపోతూ సామాజిక భద్రతపై వ్యయం హెచ్చనుంది. ఫలితంగా దక్షిణాది రాష్ట్రాలు ఆర్థికంగా ఒత్తిళ్లను ఎదుర్కోనున్నాయి. జనాభా పెరుగుదల అనర్థదాయకమనే భావన ఏమాత్రం సరికాదని చైనా అనుభవమే నిరూపిస్తోంది. ఒక్క బిడ్డ ముద్దు అనే విధానాన్ని భారత్‌ ఎట్టి పరిస్థితుల్లోనూ చేపట్టకూడదు. అరకొర చదువులతో సరిపెట్టకుండా నాణ్యమైన, నైపుణ్యదాయక విద్యను యువతీయువకులకు అందించాలి. తద్వారా జాతీయ, అంతర్జాతీయ వ్యాపార, ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకొనేలా వారిని తీర్చిదిద్దాలి. అధిక ఆదాయం ఆర్జించే యువత నుంచి వసూలుచేసే పన్నులు వృద్ధుల పింఛన్లను చెల్లించడానికి మూలనిధిగా ఉపకరిస్తాయి. ప్రస్తుతం మన యువతకు బాగా తక్కువగా, లేదంటే ఒక మోస్తరుగా జీతభత్యాలు లభిస్తున్నాయి. ఇవి పెరిగితేనే పింఛన్‌ నిధులకు తగు మొత్తాలు సమకూరతాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.