ప్రపంచవ్యాప్తంగా ఎన్నిరకాల క్రీడలున్నా మర్యాదస్తుల ఆటగా మంచిపేరు తెచ్చుకొంది క్రికెట్ ఒక్కటే. క్రికెట్‌ను మతంగా, క్రికెటర్లను దేవుళ్లుగా ఆరాధించే ఇండియాలో మ్యాచ్ ఫిక్సింగ్‌ల మరక బయటపడగానే ఎంత గగ్గోలు రేగిందో అందరికీ తెలిసిందే! సుప్రీంకోర్టులో వ్యాజ్యాల కోలాటం, జస్టిస్ లోథా కమిటీ నియామకం, బీసీసీఐ ప్రక్షాళన పర్వం వడివడిగా సాగిపోయి- క్రికెట్ మర్యాద పునరుద్ధరణ జరిగేదేకా క్రికెట్ అభిమానుల్లో ఒకటే అశాంతి, అలజడి.
నేర రాజకీయంపై మాట్లాడరేం?
నేరగ్రస్త నేతాగణాలతో రాజకీయ క్రీడాంగణమంతా లుకలుకలాడుతున్నా దేశవ్యాప్తంగా ఎక్కడా ఏ కొద్దిపాటి ఆందోళన కూడా ఎందుకు వ్యక్తం కావడం లేదన్న సహేతుక సందేహం ఆలోచనాపరుల్ని కలచి వేస్తోంది. క్రీడలకున్న పాటి మర్యాద సైతం భారత ప్రజాస్వామ్య మహాక్రతువుకు అవసరం లేదని పార్టీలు తమకుతామే తీర్మానించేస్తే, జనస్వామ్య రాజకీయాలను నేరగాళ్ల అభయారణ్యంగా మార్చేస్తే- తమకేం పట్టనట్లుగా ఓటర్లు కిక్కురుమంటే ఒట్టు. బోళాశంకరుడు భస్మాసురుడికి వరమిచ్చినట్లుగా సాగుతున్న ఎన్నికల తంతులో- నేరచరితుల ఉక్కు పిడికిలి నుంచి దేశం ఎప్పుడు విముక్తం అవుతుందో చెప్పేదెవరు?
'నేర'గుణవంతులే!
నాలుగు రాష్ట్రాలతో పాటు పుదుచ్చేరి శాసనసభకూ జరిగిన ఎన్నికల ఫలితాలు ఈ వారంలోనే వెలుగుచూశాయి. చట్టసభలకు నెగ్గుకొచ్చినవారి జాతకాల్ని అధ్యయనం చేస్తే కేరళలో 71 శాతం, తమిళనాట 60, పశ్చిమ్ బంగలో 49, పుదుచ్చేరిలో 43, అసోమ్‌లో 27 శాతం దాకా క్రిమినల్ నేరాభియోగాలు ఎదుర్కొంటున్న గుణవంతులేనన్న వాస్తవం బయటపడింది. రాజ్యం నేరభోజ్యం అన్న నానుడిని నిజం చేస్తూ 2016 నాటి అసెంబ్లీ ఎన్నికల్లో నెగ్గుకొచ్చిన వారితో పోలిస్తే తాజాగా పశ్చిమ్ బంగలో 11 శాతం, అసోమ్‌లో 16.2 శాతం, తమిళనాట 27 శాతం, కేరళలో 5.4 శాతందాకా అధికంగా నేరచరితులు ఎన్నికల రంగాన్ని దున్నేసినట్లు గణాంకాలు చాటుతున్నాయి.
ఎంపీలూ తక్కువ కాదు!
నేరనేతల వల్లే తమ పార్టీ బతికి బట్టకట్టగలిగిందని లోగడ రామ్‌విలాస్ పాసవాన్ అమాయకంగా లోగుట్టు బయటపెట్టేశారుగాని, నేరగాళ్లతోనే తమ మనుగడ ముడివడి ఉందని దేశవ్యాప్తంగా పార్టీలన్నీ తరతమ భేదాలతో టికెట్ల పంపిణీ ద్వారా ఎలుగెత్తి చాటుతున్నాయి. అంతెందుకు- హేయ నేరాభియోగాలు ఎదుర్కొంటున్న మాన్య ఎంపీల సంఖ్య పార్లమెంటులో 2009తో పోలిస్తే, 2019లో ఏకంగా 109 శాతం పెరిగింది. 43శాతం నేరచరితులతో పునీతమైన ప్రస్తుత పార్లమెంటు- 2009 నాటి 30 శాతం, 2014 నాటి 34 శాతం రికార్డుల్ని సగర్వంగా బద్దలు కొట్టినందుకు ప్రతి పౌరుడూ గర్వపడాలి. ప్రజాస్వామ్యాన్ని నేరస్వామ్యంగా తార్చిదిద్దడంలో తిలాపాపం తలా పిడికెడుగా పార్టీల దశాబ్దాల నిబద్ధతనూ శ్లాఘించాలి.
మొక్కై వంగనిది మానై వంగునా అన్న నానుడి నేరగ్రస్త రాజకీయాల ఉరవడికి సరిగ్గా నప్పుతుంది. నేరగ్రస్త రాజకీయాల్ని దునుమాడే ఆదేశాల్ని న్యాయపాలిక ఇచ్చిన ప్రతిసారీ నేరచరితులకు దన్నుగా పార్టీలన్నీ పార్లమెంటులో మోహరిస్తుండటంతో- సచ్ఛీల రాజకీయం ఆచరణకు రాని ఆదర్శంగానే మిగిలిపోతోంది. ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులందరి నేరచరిత్రలూ పౌరులకు తెలియవలసిందేనంటూ సుప్రీం ఇచ్చిన ఉత్తర్వుల్ని నీరుగార్చడానికి వాజ్‌పేయీ జమానాలోనే విఫలయత్నం జరిగింది. జైల్లో ఉన్న వ్యక్తికి ఓటుహక్కు ఉండదంటూ, ఓటుహక్కే లేనివారు ఎన్నికల్లో పోటీకి అనర్హులేనంటూ న్యాయపాలిక ఇచ్చిన తీర్పును సారహీనం చేసేలా చట్ట సవరణే జరిగింది. క్రిమినల్ నేరారోపణలు ఎదుర్కొంటున్న వారిని ఎన్నికల బరినుంచి బహిష్కరించాలా, శిక్షపడ్డాకే వారికి అనర్హతా దోషం వర్తింపజేయాలా అన్న అంశంపై పార్లమెంటు తర్కించి చట్టం చేయాలని 2018లో రాజ్యాంగ ధర్మాసనం సూచించింది. అలాంటి మేలిమి సూచనల్ని పట్టించుకొనే తీరిక పార్లమెంటుకేదీ?
ఏమని పొగడాలి దేశాన్ని
నిరుటి బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఏకంగా 68 శాతం నేరచరితులే ఎన్నికయ్యారు. నేరగాళ్లకు తప్ప మరెవ్వరికీ టికెట్లివ్వరాదన్న అన్ని పార్టీల కట్టుబాటు- దేశాన్ని పెనం మీద నుంచి పొయ్యిలోకి జార్చేస్తోందిప్పుడు! నేరగాళ్ల, రాజకీయ నేతల బాంధవ్యంపై వోరా కమిటీ ఇచ్చిన నివేదికాంశాల మీద లºక్‌పాల్ పర్యవేక్షణలో దర్యాప్తు జరిపించాలంటూ దాఖలైన వ్యాజ్యాన్ని ఆచరణ యోగ్యంకాని ఆదర్శంగా సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. నేరగాళ్లే శాసన నిర్మాతలై చక్రం తిప్పే సౌలభ్యం భారత భారతిని అపహాస్యం పాలుచేస్తోంది. ఏ దేశమేగినా ఎందుకాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని అన్నారు రాయప్రోలు. ఏమని పొగడాలో తెలియని నిర్వేదం గుండెల్ని పిండేస్తోందిప్పుడు!
- పర్వతం మూర్తి