ETV Bharat / opinion

ప్రజలకు వదులుతున్న చేతిచమురు

వంటగ్యాస్‌ ధర గడచిన పక్షంరోజుల్లోనే రెండుసార్లు పెంచింది కేంద్రం. ప్రస్తుతం లీటరు పెట్రోలు ధర రూ.110 దిశగా దూసుకుపోతోంది. లీటరు డీజిలు ధర కూడా రూ.100కు చేరువైంది. దాంతో సగటు మనిషి బెంబేలెత్తిపోతున్నాడు. గడచిన ఏడాది కాలంలో గ్యాస్‌ బండ ధర సుమారు 50శాతం పెరిగింది. గ్యాస్‌ బండపై నగదు బదిలీ పేరిట ఇస్తున్న రాయితీని కేంద్ర ప్రభుత్వం గణనీయంగా తగ్గించివేసింది. గత ఏడాదిగా రాయితీ పెరగలేదు. దాంతో సామాన్యుడికి గ్యాస్‌ సిలిండర్‌ పెనుభారమైంది.

Petrol, diesel and gas prices are skyrocketing in the country
పెరిగిపోతున్న పెట్రో ఉత్పత్తుల ధరలు
author img

By

Published : Sep 3, 2021, 4:23 AM IST

దేశవ్యాప్తంగా పెట్రోలు, డీజిలు, ధరలు జోరుగా పెరుగుతున్నాయి. వంటగ్యాస్‌ ధర గడచిన పక్షంరోజుల్లోనే రెండుసార్లు హెచ్చింది. ప్రస్తుతం లీటరు పెట్రోలు ధర రూ.110 దిశగా దూసుకుపోతోంది. లీటరు డీజిలు ధర రూ.100కు చేరువైంది. దాంతో సగటు మనిషి బెంబేలెత్తిపోతున్నాడు. తాజా పెంపుదలతో గ్యాస్‌ సిలిండర్‌ ధర రూ.900 దాటేసింది. గ్యాస్‌బండ ధర తెలుగురాష్ట్రాల్లో (ప్రాంతాలవారీగా దూరాన్ని బట్టి) రూ.893 నుంచి రూ.958 వరకు ఉంది. అనధికారికంగా వసూలు చేసే డెలివరీ రుసుములు కలిపితే గ్యాస్‌ బండ ధర వెయ్యి రూపాయలకు చేరువవుతోంది. గడచిన ఏడాది కాలంలో గ్యాస్‌ బండ ధర సుమారు 50శాతం పెరిగింది. గ్యాస్‌ బండపై నగదు బదిలీ పేరిట ఇస్తున్న రాయితీని కేంద్ర ప్రభుత్వం గణనీయంగా తగ్గించివేసింది. గత ఏడాదిగా రాయితీ పెరగలేదు. దాంతో సామాన్యుడికి గ్యాస్‌ సిలిండర్‌ పెనుభారమైంది.

సామాన్యుడిపై పెనుభారం

పెట్రో, గ్యాస్‌ ధరల పెంపుదలతో కేంద్ర ప్రభుత్వం- విపక్షాలతో సహా పలు వర్గాల నుంచి పెద్దయెత్తున విమర్శలు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడింది. ఇటీవల పార్లమెంటు సమావేశాల్లోనూ విపక్షాలు దీనిపై చర్చకు పట్టుపట్టాయి. బహుశా, స్వతంత్ర భారతంలో ఇంత భారీ స్థాయిలో ఇంధనం ధరలు పెరగడం ఇదే మొదటిసారి. ఈ పెరుగుదలకు ముఖ్యంగా అయిదు కారణాలు చెప్పవచ్చు. మొదటిది... మన దేశానికి చమురు ఉత్పత్తిలో స్వయం సమృద్ధి లేకపోవడం. మన వినియోగంలో సుమారు 85శాతం ఏటా ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. ప్రపంచ దేశాల్లో కేవలం 20 దేశాలు మాత్రమే తమ మిగులు ముడి చమురును ఇతర దేశాలకు ఎగుమతి చేస్తున్నాయి. ఈ దేశాలన్నీ ఏకమై ప్రపంచ మార్కెట్‌లో తమకు ఇష్టమొచ్చినప్పుడల్లా ధరలు పెంచుతుంటాయి. భారత్‌కు మరో ప్రత్యామ్నాయం అన్నది లేకపోవడంతో దిగుమతులపైనే అధికంగా ఆధారపడవలసి వస్తోంది. భారత్‌ ప్రపంచ దేశాల్లో చైనా తరవాత అతి పెద్ద రెండో చమురు దిగుమతి దేశం. తాజాగా అంతర్జాతీయ విపణిలో ముడి చమురు ధర బ్యారల్‌కు 70 డాలర్లు దాటింది. ఇక రెండో కారణం... 2010లో పెట్రోలుపైనా, 2014లో డీజిలుపైనా అంతవరకు అమలులో ఉన్న నియంత్రణను కేంద్రం ఎత్తివేయడం. అంతర్జాతీయ విపణిలో ముడి చమురు ధర తగ్గినప్పుడల్లా ఆ ప్రయోజనాన్ని వినియోగదారుడికి దక్కనివ్వకుండా ఆయిల్‌ కంపెనీలే ఆ ప్రయోజనాన్ని పొందుతున్నాయి. భారత్‌ ముడి చమురు దిగుమతులకు ధరను డాలరు రూపంలో చెల్లించాల్సి రావడం పెట్రో ధరల పెరుగుదలకు మూడో కారణం. గత ఏడాదిలో అంతర్జాతీయ మార్కెట్‌లో డాలరుతో రూపాయి మారకం విలువ 1.75 శాతానికి తగ్గింది. దీనివల్ల పెరిగే భారం కూడా వినియోగదారుడిపై పడుతోంది. కొన్నాళ్లుగా ముడి చమురు శుద్ధి, పంపిణీ ప్రక్రియల వ్యయాలు బాగా పెరగడం నాలుగో కారణం. వీటినీ కొనుగోలుదారుడే భరిస్తున్నాడు. అయిదో కారణం... ఎక్సైజ్‌ సుంకాల పెరుగుదల. ఈ సుంకాలు 2014 నుంచి 2021 జనవరి వరకూ పెట్రోలుపై 350శాతం, డీజిలుపై 896శాతం చొప్పున పెరిగాయి. 2014లో లీటరు పెట్రోలుపై రూ.9.48 గా ఉన్న కేంద్ర సుంకం తాజాగా రూ.32.90కు, డీజిలుపై ఉన్న రూ.3.56 సుంకం రూ.31.83కు పెరిగాయి.

రాష్ట్రాలకు 'సెస్‌' శరాఘాతం

రాష్ట్ర ప్రభుత్వాలు సుంకాలు అదనంగా పెంచకపోయినా- పెరిగిన కేంద్ర సుంకాల వల్ల భారీగా లబ్ధి పొందుతున్నాయి. కేంద్ర పన్నుల వాటా లీటరు పెట్రోలు ధరలో 39శాతం, డీజిలు ధరలో 42.5శాతం ఆక్రమించింది. రాష్ట్రాల పన్నులనూ పరిగణనలోకి తీసుకుంటే, లీటరుకు కొనుగోలుదారుడు చెల్లిస్తున్న ధరలో పన్నులు మూడింట రెండొంతుల మేర ఉన్నాయి. 2019-20లో కేవలం పెట్రోలు, డీజిలుపై కేంద్ర ఎక్సైజ్‌ ఆదాయం రూ.1.78 లక్షల కోట్లు. 2020-21లో ఇది రూ.3.35 లక్షల కోట్లకు పెరిగింది. కేంద్రం పన్నుల భారాన్ని తగ్గిస్తుందని మొదట్లో వినియోగదారులు ఆశించారు. కానీ ఆ భారాన్నీ వినియోగదారులపైనే మోపడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గతంలో అయిదు రాష్ట్రాలకు ఎన్నికలు జరిగినప్పుడు అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు పెరిగినా, కేంద్రం ఇంధన ధరలు పెంచలేదు. దాన్ని బట్టి కేంద్రం తలచుకుంటే వీటి ధరలను పెంచగలదు, లేదా పెంచకుండా ఉండగలదు అని అర్థమవుతోంది. ఇంధనంపై కేంద్రానికి వచ్చిన పన్నుల ఆదాయంలో 41శాతం రాష్ట్రాలకు ఇవ్వాలి. రాష్ట్రాలకు ఇవ్వకుండా ఉండటానికే కేంద్రం పన్నులతోపాటు రకరకాల సెస్‌లకు శ్రీకారం చుట్టింది. ఈ సెస్‌ల ప్రక్రియ గత యూపీఏ హయాములో మొదలైంది. ఎన్‌డీఏ ప్రభుత్వ ఆధ్వర్యంలో ఊపందుకుంది. 2021 ఏప్రిల్‌ నుంచి కేంద్రం ఎక్సైజ్‌ వాటాను తగ్గించి, మళ్ళీ దాన్నే సెస్‌ రూపంలో కొత్తగా కొనసాగిస్తోంది. దీనివల్ల కొనుగోలుదారుడిపై అదనపు భారం పడదు. కేంద్రానికి ఎటువంటి నష్టం ఉండదు. రాష్ట్రాలకు మాత్రం ఆ మేరకు రావలసిన నిధులు తగ్గుతాయి.

విమర్శలనూ పట్టించుకోని వైనం

భారత్‌లో ఉన్నంత హెచ్చుస్థాయిలో ఇంధన ధరలు ప్రపంచంలో ఏ దేశంలోనూ లేవు. పొరుగు దేశాలైన పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌, నేపాల్‌, శ్రీలంకలలోనూ పెట్రో ధరలు మనకంటే ఎంతో తక్కువ. కరోనాతో అన్ని రంగాలూ కుదేలై ప్రజల ఆదాయ స్థాయులు పడిపోయినా, కేంద్రం మాత్రం పెట్రో ధరల భారాన్ని మరింత పెంచడం దురదృష్టకరం. మరోవైపు చమురు కంపెనీలు కొన్నేళ్లుగా భారీ స్థాయిలో లాభాలను ఆర్జిస్తున్నాయి. ఈ లెక్కన పెట్రోలు, డీజిలు ధరలు సమీప భవిష్యత్తులో రూ.150 దాటినా ఆశ్చర్యపోనవసరం లేదు. ఈ పరిస్థితికి యూపీఏ సర్కారు కారణమని కొందరు- చైనా, పాకిస్థాన్లు కారణమని మరికొందరు భాజపా నేతలు పేర్కొనడం ఆశ్చర్యం కలిగించే అంశం. ప్రజల నుంచి ఎన్ని విజ్ఞప్తులు, డిమాండ్లు వచ్చినా- ఇంధన ధరలపై కేంద్రం ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. 2016లో ముడి చమురు ధరల పతనం ఎన్‌డీఏ సర్కారుకు ఉపకరించింది. ముడి చమురు ధరలు నేడు పెరుగుతున్నా కేంద్రానికి భారీ ఆదాయం సమకూరుతోంది. ఇంధన డిమాండు ఇతర ఉత్పత్తులతో పోలిస్తే భిన్నంగా ఉంటుంది. అంటే ధర పెరిగినా, తగ్గినా డిమాండ్‌ మాత్రం తగ్గదు. ఈ స్వభావమే ప్రభుత్వాలకు భారీ ఆదాయాలను తెచ్చిపెడుతోంది. కాబట్టి వినియోగదారులే పెట్రో ధరల వాత నుంచి తప్పించుకునేందుకు మార్గాలను అన్వేషించాల్సిన పరిస్థితి ఉత్పన్నమైంది. వారంలో కొన్ని రోజులు తమ సొంత వాహనాలను వినియోగించకుండా పబ్లిక్‌ రవాణా సదుపాయాన్ని వినియోగించుకోవడం ఓ దీటైన ప్రత్యామ్నాయం!

- ప్రొఫెసర్‌ బి.రామకృష్ణారావు

(విశ్రాంత ఆచార్యులు, ఆంధ్రా యూనివర్సిటీ)

ఇదీ చూడండి: Vaccination: 'దేశంలో 50శాతానికిపైగా వయోజనులకు కొవిడ్​ టీకా'

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.