మనుషులు, పశుపక్ష్యాదులపై విషపూరిత ప్రభావం చూపే 27 రకాల పురుగుల మందులపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధిస్తూ మే 14న ప్రకటన విడుదల చేసింది. థిరామ్, కాప్టన్, డెల్టామెత్రిన్, కార్బెండిజం, మలాథియాన్, క్లోర్పిరిఫోస్ వంటి రసాయనాల విషయంలో ఈ ఆంక్షలు అమలు చేసింది. వీటిపై అభ్యంతరాలు ఏమైనా ఉండే తెలియజేయడానికి 45 రోజుల గడువు ఇచ్చింది. డిసెంబర్ 31 తర్వాత డీడీవీపీ(డిక్లోర్వోస్) అనే రసాయనం పైనా పూర్తిగా నిషేధం విధించనుంది.
పర్యావరణ హితం కోసం
భారతదేశాన్ని పర్యావరణ హితంగా మార్చడంలో భాగంగా ప్రభుత్వం ఈ చర్యలు చేపడుతోంది. అందుకే అధిక విషపూరితమైన ఈ కీటకనాశనులపై ఉక్కుపాదం మోపింది. ఈ రసాయనాలకు ప్రత్యామ్నాయంగా ప్రపంచ మార్కెట్లో బయో పురుగుల మందులు రైతులకు అందుబాటులో ఉన్నాయి. ఈ నేపథ్యంలో తేనెపట్టు పరిశ్రమ, సేంద్రీయ రైతులు, సుగంధ ద్రవ్యాల రైతులు ప్రభుత్వ నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు.
పరిశ్రమలు వాడేవన్నీ నిషేధిత జాబితాలోనే
అయితే, మనం విత్తన పరిశ్రమ దృష్టి కోణంలోనూ ఆలోచించాల్సి ఉంటుంది. ప్రభుత్వం నిషేధం విధించిన పురుగు మందులను రైతులతో పాటు విత్తన పరిశ్రమలు పెద్ద ఎత్తున వినియోగిస్తున్నాయి. విత్తనం నుంచి వచ్చే వ్యాధులను నియంత్రించడానికి, తెగుళ్లకు వ్యతిరేకంగా ఈ పురుగుల మందులను ఉపయోగిస్తున్నాయి. ఇందులో ఎక్కువ భాగం థిరామ్, కాప్టాన్, డెల్డామెత్రిన్, కార్బెన్డిజం రసాయనాలనే వాడుతున్నాయి. ఇవన్నీ ఇప్పుడు నిషేధిత జాబితాలో ఉన్నాయి.
జొన్న, మొక్కజొన్న, బజ్రా, పొద్దుతిరుగుడు, ఆవాలు, కూరగాయలు వంటి పంటలకు పురుగు పట్టకుండా డెల్టామెత్రిన్ను ఉపయోగిస్తున్నాయి విత్తన పరిశ్రమలు. చాలా చౌకగా లభిస్తున్న కారణంగా ఈ రసాయనాన్ని దశాబ్దాలుగా వినియోగిస్తున్నాయి.
ఇక థిరామ్ విషయానికొస్తే.. విత్తనాలకు ఫంగస్ రాకుండా చేసే రసాయనాల్లో అత్యంత ప్రభావశీలిగా దీనికి పేరుంది. వరి, పప్పుదినుసులు వంటి బహిరంగ పాలినేటెడ్ పంటల కోసం వీటిని విరివిగా వాడుతున్నారు.
ఇతర రసాయనాలకు ధరల మంట
లాభాలు అంతంతమాత్రం ఉండటం వల్ల విత్తన ఉత్పత్తిదారులు అధిక ధరలు ఉండే పురుగుల మందుల జోలికి వెళ్లడం లేదు. నిజానికి గోధుమ, వరి లాంటి పంటలకు థిరామ్, కార్బెండజిం రసాయనాలను అనుమతించాల్సింది. ఈ పంటల్లో ఒక యూనిట్ విస్తీర్ణానికి అవసరమయ్యే విత్తనం చాలా ఎక్కువ(20-40కిలోలు)గా ఉంటుంది. ఈ రసాయనాల ఉపయోగానికి అనుమతిస్తే చాలా వరకు విత్తన సంస్థలు, రైతులకు ప్రయోజనం కలుగుతుంది. కొత్తగా సిఫార్సు చేసిన ప్రత్యామ్నాయ రసాయనాలతో పోలిస్తే వీటి ధర తక్కువగా ఉండటం వారికి లాభం చేకూరుస్తుంది.
ఈ రసాయనాల విషయంలో ప్రభుత్వం ప్రత్యామ్నాయాల గురించి ఆలోచించిన తర్వాతే నిషేధం ఉత్తర్వులను అమలులోకి తెచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం ఉన్న పురుగుల మందులను నిషేధించే ముందు దశలవారీగా ప్రత్యామ్నాయ రసాయనాలను అందుబాటులోకి తేవాల్సి ఉంటుంది.
ధర అందుబాటులో లేకపోతే అంతే..
కొత్త రసాయనాలు అందుబాటు ధరలో లభించేలా చేయడం చాలా ముఖ్యం. ఈ రసాయనాల వ్యయం పెరిగితే.. విత్తన ధరలపై ప్రభావం పడుతుంది. చివరకు రైతులు అధిక ధరలు పెట్టి విత్తనాలు కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.
ఒకవేళ సరైన ప్రత్యామ్నాయాలు లభించకపోతే పంట తెగుళ్ల సమస్యతో రైతులు తీవ్రంగా నష్టపోయే అవకాశముంది. ఫలితంగా ఉత్పత్తి, ఉత్పాదకతలు తగ్గి.. రైతుల లాభదాయకతపై పెను ప్రభావం చూపుతుంది. విత్తన పరిశ్రమే కాకుండా వ్యవసాయ రంగం మొత్తం ఇబ్బందులు ఎదుర్కొంటుంది.
దశలవారీగా నిషేధించాలి
విత్తనాల నిషేధాన్ని ఒకేసారి కాకుండా.. 3-4 సంవత్సరాల పాటు విడతలవారీగా అమలు చేస్తే బాగుంటుంది. అలా చేయడం వల్ల ప్రస్తుతం ఉన్న రసాయనాల నిల్వలు పూర్తిగా ఉపయోగించుకునే వీలుంటుంది. ఈ రసాయనాలను వాటి వ్యాలిడిటీ పీరియడ్ పూర్తయ్యే వరకు విక్రయించేందుకు ప్రభుత్వం అనుమతులు ఇవ్వాలి.
వీటితో పాటు దేశంలో ఐసీఏఆర్, ఐఏఆర్ఐ వంటి పరిశోధనా సంస్థలను ప్రభుత్వం అభివృద్ధి చేయాలి. రసాయన మందులే కాకుండా ఇతర మార్గాలను అవలంబించేలా ప్రోత్సహించాలి. ప్రకృతిని ప్రకృతితోనే ఎదుర్కొనేలా బయోలాజికల్, నానో-టెక్నాలజీ విధానాలు ఉపయోగానికి పెద్ద పీట వేయాలి. ప్రకృతిలో లక్షల కొద్దీ బ్యాక్టీరియా, ఫంగస్లు... తెగుళ్లు, ఇతర వ్యాధులతో పోరాడేందుకు ఉపయోగపడతాయి. దీని వల్ల పర్యావరణానికీ హాని కలగకుండా ఉంటుంది. తద్వారా వ్యవసాయ ఖర్చులు తగ్గి.. రైతులకు, పర్యావరణానికి మేలు జరుగుతుంది.
(రచయిత-ఇంద్ర శేఖర్ సింగ్, పాలసీ ఔట్రీచ్ డైరెక్టర్- నేషనల్ సీడ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా)