ETV Bharat / opinion

న్యాయం కోసం మరో జన్మ ఎత్తాలా? - కోర్టు కేసులు

ప్రస్తుతం దేశవ్యాప్తంగా పరిష్కారం కాని వ్యాజ్యాలు 3.20కోట్ల మేర ఉన్నాయి. అందులో 83వేలకుపైగా 30 సంవత్సరాలకు పైబడినవే. దీర్ఘకాలంగా పెండింగులో పడి మూలుగుతున్న క్రిమినల్‌ వ్యాజ్యాలకు సంబంధించి కార్యాచరణపై ఆయా రాష్ట్రాల హైకోర్టులు ప్రమాణ పత్రాలు సమర్పించాలని సుప్రీంకోర్టు గతంలో ఆదేశించింది.

pending cases in india are increasing
న్యాయంకోసం మరో జన్మ ఎత్తాలా?
author img

By

Published : Dec 11, 2020, 6:38 AM IST

Updated : Dec 11, 2020, 6:52 AM IST

ఏ కారణంగానైతేనేమి, న్యాయస్థానాల్లో వ్యాజ్యాల పరిష్కరణ ప్రక్రియ ఏళ్లూపూళ్లూ దేకుతుండటం దేశంలో అసంఖ్యాక కక్షిదారుల్ని చిరకాలంగా కుంగదీస్తోంది. న్యాయం కోరి ఆఖరి ఆశగా కోర్టును ఆశ్రయించి ఆర్తిగా నిరీక్షిస్తూ జీవిత చరమాంకానికి చేరినవారి పరిస్థితి మరింత దుర్భరమవుతోంది. అటువంటి ఇద్దరు వృద్ధుల అర్జీ సరైన కారణమేమీ లేకుండా దిగువ కోర్టులో తొమ్మిదేళ్లపాటు పెండింగులో పడి ఉండటాన్ని తీవ్రంగా ఆక్షేపిస్తూ ఏపీ హైకోర్టు తాజాగా చేసిన వ్యాఖ్యలు స్వాగతించదగినవి. బస్సులు, రైళ్లు, విమానాల్లో వృద్ధులకు రాయితీలు ప్రసాదించడంతోనే సరిపుచ్చకుండా- వారి కేసుల్ని ప్రాధాన్య ప్రాతిపదికన పరిష్కరిస్తేనే సముచిత గౌరవం ఇచ్చినట్లవుతుందన్న ఉన్నత న్యాయస్థానం సూచన ఎన్నదగింది. దిగువకోర్టు ఇచ్చిన అనుకూల తీర్పు ప్రకారం ప్రయోజనాల మదింపు నిమిత్తం తగిన ఏర్పాటు కోరుతూ దాఖలు చేసిన వ్యాజ్యం తొమ్మిదేళ్లు అలా అపరిష్కృతంగా పడి ఉండటం ఎవరినైనా విస్మయపరచక మానదు. తప్పుడు ఆరోపణలతో భర్తను విధులనుంచి తప్పించిన కళాశాల యాజమాన్యంపై మూడున్నర దశాబ్దాల న్యాయపోరాటం దరిమిలా ఎట్టకేలకు నెగ్గిన ఎనభై ఆరేళ్ల విశాఖ వాసి ఉదంతం మూడేళ్లక్రితం వెలుగుచూసింది. ఏళ్ల తరబడి కోర్టు వ్యాజ్యాలు ఒక కొలిక్కి రాక విలవిల్లాడుతున్న ఎందరో సీనియర్‌ పౌరుల దురవస్థకు జమునాలాల్‌ పటేల్‌, మోతీలాల్‌ పర్మార్‌ ప్రభృతుల సుదీర్ఘ న్యాయపోరాటాలు మచ్చతునకలుగా పోగుపడుతున్నాయి. వయసు మీదపడే కొద్దీ అనారోగ్యంతో నిస్సహాయత, కుటుంబ క్లేశాలు, సంతానం దగ్గర లేరన్న బాధ, ఉన్నా నిరాదరణకు గురైన అశక్త భావన, తగిన జీవనాధారం కొరవడటం.. తదితరాలన్నీ వృద్ధాప్యంలో సాధారణంగా చుట్టుముట్టే సమస్యలు. ఆ దశలో అనివార్య వ్యాజ్యాలు తక్షణ పరిష్కరణకు నోచుకోనట్లయితే, వారికి కోర్టులూ అన్యాయం చేసినట్లే!

సుమారు రెండు దశాబ్దాల క్రితం వయోవృద్ధుల బహుముఖ సంక్షేమాన్ని లక్షించి జాతీయ విధానాన్ని కేంద్రప్రభుత్వం రూపొందించింది. 2050 సంవత్సరం నాటికి అరవై ఏళ్ల వయసుకు పైబడినవారి సంఖ్య దేశ జనాభాలో 21శాతానికి చేరుతుందన్న అంచనాతో ఆహార, ఆరోగ్య, ఆర్థిక భద్రత కల్పించదలచామని సామాజిక న్యాయం, సాధికారతల మంత్రిత్వశాఖ అప్పట్లో నినదించింది. ఆ విధాన స్ఫూర్తికి అనుగుణంగా 65ఏళ్లకు పైబడినవారి కేసుల్ని వీలైనంత త్వరగా పరిష్కరించాలని న్యాయాధికారుల్ని ఆదేశిస్తూ నాటి ఏపీ హైకోర్టు ప్రత్యేక సర్క్యులర్‌ జారీ చేసింది. సుప్రీంకోర్టు నిర్దేశాల అనుసారం- అన్ని జిల్లా న్యాయస్థానాలూ సీనియర్‌ పౌరుల వ్యాజ్యాల్ని ఆరు నెలల గడువులోగా పరిష్కరించాలని గుజరాత్‌ హైకోర్టు సైతం ఉత్తర్వులిచ్చింది. అర్జీదారుల్లో అరవైఏళ్లకు మించినవారున్న పక్షంలో ఆయా కేసుల్ని సబార్డినేట్‌ కోర్టులు, హైకోర్టు అన్ని బెంచీలు చురుగ్గా పరిశీలించాలని బాంబే ఉన్నత న్యాయస్థానం ఏడేళ్లక్రితం పిలుపిచ్చింది. ఎవరేమని నిర్దేశించినా, నేటికీ ఎక్కడికక్కడ వ్యాజ్యాలు అపరిష్కృతంగా పేరుకుపోతున్నాయి! దేశంలో సివిల్‌ కేసులు నిర్ణాయక దశకు చేరడానికి సగటున పదిహేనేళ్లు పడుతుండగా, క్రిమినల్‌ కేసుల పరిష్కారానికీ ఏడేళ్ల వరకు నిరీక్షణ తప్పడంలేదు.

దేశవ్యాప్తంగా అపరిష్కృత వ్యాజ్యాలు 3.20కోట్ల మేర ఉండగా, అందులో 83వేలకుపైగా 30 సంవత్సరాలకు పైబడినవే. అన్నేళ్లు న్యాయపోరాటంలో మగ్గిపోయినవారు జీవిత చరమాంకంలోనైనా ఎడతెగని నిరీక్షణ తాలూకు ఫలాలు ఆస్వాదించాలంటే, అన్ని అంచెల కోర్టులూ మానవీయ దృష్టితో స్పందించాలి. దీర్ఘకాలంగా పెండింగులో పడి మూలుగుతున్న క్రిమినల్‌ వ్యాజ్యాలకు సంబంధించి కార్యాచరణపై యూపీ, రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, ఒడిశా, పట్నా, బాంబే హైకోర్టులు ప్రమాణ పత్రాలు సమర్పించాలని సర్వోన్నత న్యాయస్థానం అయిదు నెలల కిందట ఆదేశించింది. వయోవృద్ధుల వ్యాజ్యాల సత్వర పరిష్కరణకూ ఇదమిత్థ ప్రణాళికను పట్టాలకు ఎక్కించడానికి నిబద్ధ సమష్టి కృషి తప్పనిసరి!

Last Updated : Dec 11, 2020, 6:52 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.