ETV Bharat / opinion

వన్యమృగ సంరక్షణ బాధ్యత మనిషిదే - దేశంలో పులుల రక్షణ

భారత్​లో పులుల సంఖ్య గణనీయంగా పెరిగింది. అయితే ఇది ఒకప్పుడు భారత్‌లో ఉన్న పులుల సంఖ్యతో పోలిస్తే పది శాతం కూడా కాదంటున్నారు నిపుణులు. అడవుల నరికివేత, వన్య మృగాల వేట యథేచ్ఛగా కొనసాగడం వల్ల పులులకు మరింత ముప్పు ఏర్పడిందని తెలిపారు. వేటను కఠినంగా నిషేధించడం వల్ల పులుల సంఖ్య పెరుగుతున్న క్రమంలో.. అవి స్వేచ్ఛగా తిరిగే వాతావరణ పరిస్థితులు కల్పించడం ఇప్పుడు ప్రభుత్వాల ముందున్న కర్తవ్యం అని పేర్కొన్నారు.

tiger conservation day
వన్యమృగ సంరక్షణ బాధ్యత మనిషిదే
author img

By

Published : Jul 29, 2021, 5:28 AM IST

గత దశాబ్ద కాలంగా భారత్‌లో పెద్ద పులుల సంఖ్య పెరుగుతుండటం శుభపరిణామం. ప్రపంచవ్యాప్తంగా పులుల జనాభా ప్రాతిపదికన నేటికీ మన దేశమే అగ్రస్థానంలో ఉంది. దేశవ్యాప్తంగా 51 పులుల అభయారణ్యా (టైగర్‌ రిజర్వ్‌)ల్లో సుమారు మూడు వేల పెద్ద పులులు ఉన్నట్టు 'జాతీయ పులుల సంరక్షణ ప్రాధికార సంస్థ' (ఎన్‌టీసీఏ) గణాంకాలు చెబుతున్నాయి. భారత్‌ తరవాతి స్థానాల్లో రష్యా, ఇండొనేసియా, మలేసియా, నేపాల్‌, థాయ్‌లాండ్‌, బంగ్లాదేశ్‌లు ఉండగా- వాటిలో ఏ ఒక్క దేశంలోనూ పెద్ద పులుల జనాభా అయిదువందలకు మించి లేదు. ప్రపంచ పులుల జనాభాలో సుమారు 70 శాతం మన దేశంలోనే ఉంది. 2014లో భారత్‌లో 2226 పులులు మాత్రమే ఉండగా, ప్రభుత్వాల సంరక్షణ చర్యల వల్ల వాటి సంఖ్య గణనీయంగా పెరిగింది. 'ఎన్‌టీసీఏ' ప్రతి నాలుగేళ్లకోసారి పులుల జనాభాను గణిస్తోంది. అడవుల్లో కెమెరాలు ఏర్పాటు చేసి, పాద ముద్రలు, విసర్జకాలు వంటి వాటి ఆధారంగా పులుల జనాభాను శాస్త్రీయంగా గణిస్తున్నారు.

ఘర్షణ తగ్గించాలి

ఒకప్పుడు భారత్‌లో ఉన్న పులుల సంఖ్యతో పోలిస్తే ఇప్పుడు పదిశాతం కూడా లేవు! 1875-1925 మధ్య కాలంలో దేశంలో ఏకంగా 80 వేల పులులు మనిషి వేటకు బలయ్యాయి. పోనుపోను అడవుల నరికివేత, వన్య మృగాల వేట యథేచ్ఛగా కొనసాగడం వల్ల పులులకు మరింత ముప్పు ఏర్పడింది. ఆలస్యంగా కళ్లు తెరచిన కేంద్రం 1972లో అటవీ జంతువుల సంరక్షణ చట్టం తీసుకొచ్చి, కఠిన నిబంధనలు రూపొందించింది. అయినా పులుల సంఖ్య తగ్గుతూనే వచ్చింది. దేశంలో ఎక్కువగా కనిపించే రాయల్‌ బెంగాల్‌ పులి జాతి అంతరించిపోయే దశకు చేరుకోవడం వల్ల తేరుకున్న కేంద్రం 2005లో 'ఎన్‌టీసీఏ'ను ఏర్పాటు చేసి దాన్ని పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ కిందకు తీసుకొచ్చింది. అందులో భాగంగానే 'ప్రాజెక్టు టైగర్‌'కు శ్రీకారం చుట్టిన దరిమిలా ఇప్పుడు అడవుల్లో పులుల గాండ్రింపులు మళ్ళీ వినిపిస్తున్నాయి.

పులుల సంఖ్యను పెంచడంలో సఫలీకృతమైన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఇప్పుడు పులి-మనిషి మధ్య చోటు చేసుకుంటున్న ఘర్షణ వాతావరణం కొత్త సమస్యగా మారింది. గతేడాది నవంబరులో తెలంగాణలోని ఆసిఫాబాద్‌ జిల్లాలో పెద్దపులి ఒక యువకుడిని, ఒక బాలికను నెల వ్యవధిలో చంపివేయడం వల్ల స్థానికుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. మహారాష్ట్రలోని యావత్‌మాల్‌ జిల్లాలో అవని అనే పులి నరమాంస భక్షకిగా మారింది. దాన్ని మరో చోటుకు తరలించాలని సర్వోన్నత న్యాయస్థానం సూచించగా- అది వీలుకాదని పేర్కొంటూ, 2018లో అక్కడి అటవీ శాఖ అధికారులు ఆ పులిని కాల్చి చంపారు. దానితో దేశవ్యాప్తంగా జంతుప్రేమికుల నుంచి నిరసన ఎదురైంది.

ఒక్కో పులి తన సహజ ఆవాసంలో కనీసం 10 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో రాజ్యం ఏర్పాటు చేసుకొని జీవిస్తుంది. అడవుల నరికివేత, దట్టమైన అరణ్యాల్లో సాగునీటి ప్రాజెక్టులు, రహదారుల నిర్మాణం వంటి చర్యలు పులుల జీవన శైలికి విఘాతం కలిగిస్తున్నాయి. దేశంలో 33 శాతం ఉండాల్సిన అటవీ విస్తీర్ణం ప్రస్తుతం 21.67 శాతానికి కుంచించుకుపోయింది. పులుల ఆవాసాలకు మనుషులు చేరువ కావడం వల్లే అవి దాడి చేస్తున్నాయన్నది పర్యావరణ ప్రేమికుల వాదన. వేటను కఠినంగా నిషేధించడం వల్ల పులుల సంఖ్య పెరుగుతున్న క్రమంలో అవి స్వేచ్ఛగా తిరిగే వాతావరణ పరిస్థితులు కల్పించడం ఇప్పుడు ప్రభుత్వాల ముందున్న కర్తవ్యం.

ఆహారం దొరకాలి

ఉభయ తెలుగు రాష్ట్రాల్లో మూడు పులుల జాతీయ పార్కులున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీశైలం అడవులను కలిపి నాగార్జునసాగర్‌ పులుల అభయారణ్యం, తెలంగాణలో అమ్రాబాద్‌, కవ్వాల్‌ అభయారణ్యాలు పులుల రక్షిత ప్రాంతాలుగా గుర్తింపు పొందాయి. ఇటీవల అమ్రాబాద్‌లో 14 పెద్దపులులు సంచరిస్తున్నట్టు అంచనా వేశారు. అంతకన్నా ఎక్కువే ఉండవచ్చని అటవీ శాఖ అధికారులు పేర్కొన్నారు. గతేడాది తెలంగాణలోని పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్‌, వరంగల్‌ ప్రాంతాల్లో పెద్దపులి సంచరించిన ఆనవాళ్లను గుర్తించారు. ఏపీలోని కడప, చిత్తూరు మధ్యనున్న శేషాచలం అడవుల్లో సైతం మూడు దశాబ్దాల తరవాత పెద్ద పులి సంచరించడం సంతోషకరమే.

ఏపీలోని తూర్పు కనుమల్లో సైతం పెద్ద పులులు సంచరించిన ఆనవాళ్లు కొన్నేళ్ల క్రితం వెలుగుచూశాయి. అభయారణ్యాల్లో వ్యాఘ్రాలు స్వేచ్ఛగా సంచరించే కారిడార్ల ఏర్పాటుఅవసరం. ప్రకృతి పరిరక్షణ ప్రపంచ నిధి, ఐరాస పర్యావరణ కార్యక్రమం నివేదిక ప్రకారం- దేశంలో 35 శాతం పులులు వాటి రక్షిత ప్రాంతాల బయట సంచరిస్తున్నాయి. ఆ ప్రాంతాల్లో విరివిగా గడ్డినేలలను ఏర్పాటుచేస్తే శాకాహార జంతువుల సంఖ్య పెరిగి పులికి ఆహారం పుష్కలంగా దొరుకుతుంది. అప్పుడు అవి మనిషి జోలికి రావు. పైగా పులుల అభయారణ్యాల మీదగా సాగే రహదారులపై రాత్రివేళలో సంచారాన్ని నిషేధిస్తే అవి స్వేచ్ఛగా తిరిగే అవకాశం ఉంటుంది. అటవీ సిబ్బందికి వీటి సంరక్షణపై శిక్షణ ఇచ్చి, పులుల అభయారణ్యాలకు దగ్గరగా నివసించే ప్రజలకు తగిన అవగాహన కల్పించాలి. అటవీ గ్రామాలను మరో చోటుకు తరలించి ప్రజలకు సత్వర పునరావాసం కల్పిస్తే పులితో మనిషికి ఎదురవుతున్న సంఘర్షణకు తెరపడుతుంది.

- గుండు పాండురంగశర్మ

ఇదీ చదవండి : గంటన్నరలోనే 50 పేజీల బుక్​ రాసి బాలిక రికార్డ్!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.