కొవిడ్ ప్రపంచ దేశాలకు ఎన్నో ఆరోగ్యపాఠాలు నేర్పింది. కరోనా వైరస్ 'మహమ్మారి'గా మారినట్లు 2020 మార్చి 11న అధికారికంగా ప్రకటించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ, దీన్నుంచి మానవాళిని కాపాడేందుకు అనేక ప్రజారోగ్య మార్గదర్శకాలు జారీ చేసి అంతర్జాతీయ సమాజాన్ని అప్రమత్తం చేసింది. ఈ వైరస్ ప్రపంచవ్యాప్తంగా వైద్యసేవల తీరు మార్చేసింది. ఒక్క మాటలో చెప్పాలంటే- ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ ఒక అగ్నిపరీక్షను ఎదుర్కొంది. కొవిడ్ సంక్షోభం నుంచి దేశాన్ని కాపాడేందుకు భారత ప్రభుత్వం వేగంగా చర్యలు చేపట్టింది. 2020 మార్చి 23న 'లాక్‌డౌన్' ప్రకటించింది. భౌతికదూరం, ఏకాంతవాసం తదితర ముందు జాగ్రత్త చర్యలను సూచించి, అమలుకు అధికార యంత్రాంగాలకు ఆదేశాలిచ్చింది.
మహమ్మారి బారిన పడిన రోగుల రక్షణకు రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నతాధికార బృందాలను ఏర్పాటు చేశాయి. దేశంలో ప్రజారోగ్య సేవల పరిస్థితి అంతంత మాత్రమే అయినప్పటికీ- అత్యున్నత సాంకేతికతలు, పటిష్ఠమైన ప్రజారోగ్య వ్యవస్థలు ఉన్న పశ్చిమ దేశాల కంటే భారత్ ఎంతో మెరుగ్గా మహమ్మారిపై పోరు సాగించింది.
తప్పిన అంచనా
అమెరికా నేతృత్వంలోని పశ్చిమ దేశాలు- వర్ధమాన దేశాలకు కనీసం 50 ఏళ్లుగా ఆదర్శప్రాయంగా ఉంటూ వచ్చాయి. అభివృద్ధి చెందుతున్న దేశాలు వాటిపై ఎన్నో ఆశలు పెట్టుకున్నాయి. ప్రస్తుత ప్రపంచ ఆరోగ్య సంక్షోభం లాంటిది 1918 తరవాత ఎన్నడూ లేదు. ఈ ఉపద్రవం పశ్చిమదేశాల సామర్థ్యం ఏపాటిదో కళ్లకు కట్టింది. ధనిక దేశాల మీద మన అంచనాలు ఎంత తప్పో రుజువయింది. సొంత ప్రజలను కాపాడుకోవడంలోనే విఫలమవుతూ.. అవి అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఎలా చేయూత అందిస్తాయి? ఈ వైఫల్యంతో వాటి సాధికారత, ప్రమాణాలు దెబ్బతిన్నాయి. ప్రజారోగ్య సంక్షోభం వస్తే ఎలా ఎదుర్కోవాలో పశ్చిమ దేశాల ప్రభుత్వాలకు ఎలాంటి ముందస్తు వ్యూహం లేదు. అలాంటప్పుడు, అవి విఫలమయ్యాయంటే మనం ఆశ్యర్యపడాల్సిన అవసరం లేదు.
బలహీనతలు ఉన్నప్పటికీ
అసలే భారీ జనాభా.. అవసరమైనన్ని ఆసుపత్రులు లేవు. ఈ బలహీనతలు ఉన్నప్పటికీ, భారత్ ఇతర దేశాల కంటే ఎంతో మెరుగ్గా మహమ్మారిపై పోరాడింది. తట్టుకుని సగర్వంగా నిలబడింది. ప్రజారోగ్య రంగంలో దశాబ్దాల తరబడి నిర్లక్ష్యం కొనసాగినందువల్ల అంటు వ్యాధులపై పోరుకు, వాటి నిర్మూలనకు అవసరమైన సత్తా మనకు కొరవడింది. వైద్యరంగంలో అత్యాధునిక సాంకేతికతలు వెలుగు చూస్తున్నప్పటికీ, సమర్థ ప్రజారోగ్య వ్యవస్థల నిర్మాణంలో భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలు వెనకబడ్డాయి.
ఆరోగ్యంపై తక్కువ పెట్టుబడి
ఆరోగ్యానికి తక్కువ ప్రాధాన్యం ఇచ్చినందువల్ల మౌలిక వైద్య సదుపాయాల కల్పనకు, ఆరోగ్య గణాంకాల వ్యవస్థ అభివృద్ధికి ఆశించిన స్థాయిలో పెట్టుబడులు రాలేదు. ఆరోగ్య సంరక్షణ వ్యయంలో కేవలం ఏడు శాతమే నివారణ చర్యల మీద ఖర్చవుతోంది. 80శాతం పైగా నిధులు చికిత్సకు వెచ్చిస్తున్నారు. భారత్‌లో ప్రైవేటు రంగంలోని అతిపెద్ద వైద్య సంస్థలు.. మహానగరాలు, ప్రథమ, ద్వితీయ శ్రేణి నగరాల్లోనే కేంద్రీకృతమై ఉన్నాయి. అందరికీ మౌలిక వైద్యం సమకూర్చడంలో మనం చాలా వెనకబడి ఉన్నాం.
సుస్థిరమైన దేశ ఆర్థిక వృద్ధికి ప్రజారోగ్య రంగంలో పెట్టుబడులు పెంచడం కీలకం. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల మీద దృష్టి పెట్టాలి. వైద్యసదుపాయాల కల్పనలో దేశం ఇటీవలి కాలంలో గణనీయ ప్రగతి సాధించినప్పటికీ, ఆరోగ్య సంరక్షణ వ్యయాల బిల్లులు చెల్లించి ఆరు కోట్ల మంది ప్రజలు పేదరికంలోకి జారిపోయారు. ఆరోగ్య సదుపాయాల మీద పెట్టుబడులు తక్కువగా ఉండటం, తగినంత ఆర్థిక రక్షణ కొరవడటం, సొంత డబ్బు ఖర్చు పెట్టాల్సి రావడం ఇందుకు దారి తీశాయి.
పర్యవేక్షణ వ్యవస్థ అవసరం
పెట్టుబడులు మాత్రమే సమస్యకు పరిష్కారం కాదు. కొత్తగా పుట్టుకొచ్చే వ్యాధులను, ఆకస్మిక సంక్షోభాలను సత్వరం గుర్తించి స్పందించగలిగే రీతిలో మన ఆరోగ్య వ్యవస్థలను బలోపేతం చేయాలి. వైద్యానికి చేతి చమురు వదిలించుకుని బికారులయ్యే దుస్థితి దేశ ప్రజలకు దాపురించకూడదు. ప్రజలకు వైద్యఖర్చుల నుంచి ఆర్థిక రక్షణ కల్పించాలి. వీటన్నింటికీ ఒక పక్కా పర్యవేక్షణ వ్యవస్థ అవసరం. ఆరోగ్య సంరక్షణ సేవల రంగంలో ప్రభుత్వం కీలక పాత్ర పోషించాలి. లేనిపక్షంలో ప్రైవేటు రంగం సామాన్యుడి నడ్డి విరుస్తుంది. వైద్యసేవల రంగంలో ప్రమాణాలు పాదుగొల్పేందుకు ప్రభుత్వ, ప్రైవేటు రంగాలు సమన్వయంతో పనిచేయాలి. భవిష్యత్తులో ఎంతటి ఆరోగ్య సంబంధిత సంక్షోభాలు ముంచుకొచ్చినా వాటిని తిప్పికొట్టేలా భారత వైద్య సేవల వ్యవస్థలు రూపుదిద్దుకోవాలి. అప్పుడే 'అందరికీ ఆరోగ్యం' లక్ష్యం సాకారమవుతుంది.
-డాక్టర్ అనిల్ కృష్ణ గుండాల (హృద్రోగ నిపుణులు)
ఇదీ చదవండి : 16 లక్షలు దాటిన టీకా లబ్ధిదారుల సంఖ్య