ETV Bharat / opinion

సాగు చట్టాలపై రైతుల బతుకు పోరాటం - రైతుల పోరాటం

సాగు చట్టాలు రద్దు చేయాలంటూ నెలరోజులుగా దిల్లీలో రైతులు నిరసన చేపడుతున్నా ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకోవట్లేదు. వదంతుల కారణంగానే అన్నదాతలు నిరసన చేపడుతున్నారని కేంద్రం వ్యాఖ్యానిస్తోంది. చట్టాల్లో సవరణలు చేస్తామంటున్న కేంద్రం.. మద్దతు ధరల అంశానికి మాత్రం చర్చల్లో స్థానం కల్పించట్లేదు. సేద్యరంగం కుదుపులకు లోనవుతున్న దశలో- సరైన మద్దతు ధర, దానికి చట్టబద్ధత లేకుంటే బడుగు రైతాంగం ఎలా నెగ్గుకు రాగలుగుతుంది?

opinion- on -govt- stand- for- farm laws
రైతుల పోరాటం - దిగిరానంటున్న కేంద్రం
author img

By

Published : Dec 26, 2020, 7:20 AM IST

అదేం ఖర్మమో- రామాయణంలో భూజాత సీతలానే, నేటి భారతంలో నేలతల్లితో బతుకు బంధాన్ని ముడివేసుకొన్న అన్నదాతకూ అగ్నిపరీక్ష తప్పడం లేదు. భారత సేద్య రంగ సముద్ధరణ కోసమంటూ కేంద్ర ప్రభుత్వం ఆదరాబాదరా తెచ్చిన మూడు వ్యవసాయ చట్టాలు- బడుగు రైతు ప్రయోజనాల్ని బలిపెట్టేవేనంటూ అన్నదాతలు చేస్తున్న దిల్లీ ముట్టడి నెలరోజులకు చేరిందిప్పుడు! రైతుల ఆందోళనను ఉపశమింపజేసే ప్రతిపాదన ఏదైనా క్రిస్మస్‌ వేళ ప్రధాని ముఖతా వెలువడగలదన్న ఆశా నీరుకారిపోగా- కొత్త సాగు చట్టాల విషయంలో వదంతులు సృష్టిస్తున్నారని మోదీ వ్యాఖ్యానించారు. వివాదాస్పద చట్టాల రద్దు, మద్దతు ధరకు చట్టబద్ధత వంటివి రైతులు కోరుతుంటే, చేసిన శాసనాల్లో కొన్ని సవరణలకు సుముఖమంటున్న కేంద్రం- మద్దతు ధరల అంశాన్ని చర్చల్లోకి జొప్పించడం సరికాదంటోంది.

సమాలోచనలు లేకుండానే...

నిజానికి కొవిడ్‌ మహమ్మారి పంజా విసరుతున్న వేళ ఆత్మనిర్భర్‌ భారత్‌ ప్యాకేజీలో భాగంగా చట్ట ప్రతిపాదనల్ని బయటపెట్టిన కేంద్రం- రాష్ట్రాలతోగాని, రైతు సంఘాలతోగాని ఎలాంటి సంప్రతింపులు జరపకుండానే తొలుత ఆర్డినెన్సుల్ని, దరిమిలా పార్లమెంటులో విస్తృత సమాలోచనలు లేకుండానే బిల్లుల్ని ఆమోదించింది. కొవిడ్‌ కోరసాచిన తరుణంలో పంటల గిట్టుబాటు ధరకోసం మార్కెట్‌ జోక్యం పథకాన్ని ప్రవేశపెట్టాలని, పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధి కింద ఇస్తున్న మొత్తాన్ని రూ.15వేలకు పెంచి అందులో సగాన్ని రైతుల ఖాతాలో జమ చేయాలని, పంట కోతలు నూర్పిళ్లకు గ్రామీణ ఉపాధి హామీని అనుసంధానించాలని డాక్టర్‌ స్వామినాథన్‌ ఏప్రిల్‌ నెలలో సూచించారు. వాటిని ఏమాత్రం పట్టించుకోని కేంద్రం తెచ్చిన చట్టాలు- రైతు బతుకును, భవితను కార్పొరేట్లకు కుదువ పెడతాయని అన్నదాతలు ఆక్రోశిస్తున్నారు. ప్రమాదకర ప్రతిష్టంభనను పొడిగించకుండా, చట్టాల రద్దు విషయంలో ప్రతిష్ఠకు పోకుండా ఎన్‌డీఏ ప్రభుత్వం ప్రాప్తకాలజ్ఞత ప్రదర్శించాలి!

కార్పొరేట్​ సేద్యానికి రాచబాట

అయిదున్నర దశాబ్దాల నాడు ఆకలి కోరల్లో చిక్కుకొన్న దేశంలో హరిత విప్లవం పాదుకోవడానికి- కనీస మద్దతు ధర, వాటిని నిర్ధారించే యంత్రాంగం, వ్యవసాయ మండీలు, ఎఫ్‌సీఐ కొనుగోళ్లు వెన్నుదన్నుగా నిలిచాయి. కనీస మద్దతు ధర రైతులపట్ల క్రూర పరిహాసంగా మారి పాతికేళ్లలో మూడు లక్షలమందికి పైగా అన్నదాతల ఉసురు తీసినా ఆందోళన పథంలో కదం తొక్కని రైతు, నేడు- మద్దతుకు చట్టబద్ధత ఎందుకు కోరుతున్నాడో గ్రహించాలి. కార్పొరేట్‌ సేద్యానికి రాచబాటలు పరచే తాజా చట్టాలతో మండీల వ్యవస్థ సాంతం కుదేలై, సేకరణ బాధ్యతలనుంచి ఎఫ్‌సీఐ తప్పుకొంటుందని, దాంతోపాటే కనీస మద్దతు ధరా కనుమరుగైపోతుందనీ రైతాంగం భీతిల్లుతోంది! కాంట్రాక్టు సేద్యంలో గొడవలొస్తే- వివాద పరిష్కార బాధ్యతను అధికార శ్రేణులకు కట్టబెట్టి, సివిల్‌ కోర్టులను ఆశ్రయించే ప్రజాస్వామ్య హక్కునూ తొక్కిపట్టిన చట్టం అన్నదాతల భయానుమానాల్ని మరింతగా పెంచింది. కాబట్టే కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కోసం రైతులోకం గళమెత్తుతోంది.

సూచనలను పరిగణించదా?

మద్దతు ధరకే విక్రయించే హక్కును రైతుకు దఖలుపరుస్తూ చట్టం తెస్తే, అది వారిలో విశ్వాసం నింపుతుందని ధరల నిర్ణాయక సంఘమూ సూచించింది. మద్దతు ధర నిర్ధారణ ఏ ప్రాతిపదికన సాగాలో 2006లోనే డాక్టర్‌ స్వామినాథన్‌ సూచించగా 2014 ఎన్నికల్లో దాని అమలుకు కట్టుబాటు చాటిన భాజపా, దరిమిలా వెనక్కి తగ్గింది. వస్తూత్పత్తిదారులు పెట్టుబడి వ్యయాల్ని వడ్డీల్ని, ఉత్పాదన ఖర్చుల్ని, సిబ్బంది వేతనాతాల్నీ గణించి సమధిక లాభాలు చేర్చి ధరలు నిర్ణయిస్తారంటూ, వాస్తవిక వ్యయానికి అదనంగా 50శాతం కలిపి పంటల మద్దతు నిర్ణయించాలని స్వామినాథన్‌ కమిషన్‌ సూచించింది. సేద్యరంగం కుదుపులకు లోనవుతున్న దశలో- సరైన మద్దతు ధర, దానికి చట్టబద్ధత లేకుంటే బడుగు రైతాంగం ఎలా నెగ్గుకు రాగలుగుతుంది? రైతన్నల హేతుబద్ధ డిమాండ్లపై సత్వరం సరైన నిర్ణయం తీసుకోవడంలో కేంద్ర సర్కారు విజ్ఞతాయుతంగా స్పందించాలి!

ఇదీ చదవండి : 'సాగు చట్టాలపై విపక్షాల రాజకీయం'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.