ETV Bharat / opinion

నీటికి ధర నిర్ణయిస్తే!

రోజురోజుకూ నీటికి పెరుగుతున్న డిమాండ్​ చూస్తే భవిష్యత్తులో నీటి వనరుల లభ్యతపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. నీరు ఉచిత వనరు అనే అభిప్రాయం ఇప్పుడు తొలగిపోతోంది. నీరు వ్యాపార సరకుగా మారడమే ఇందుకు కారణం. నీటి కోసం భారీగా వెచ్చించే ప్రభుత్వాలు అందుకు ఒక ధర నిర్ణయిస్తే వనరును మరింత సమర్థంగా, ఉత్పాదకంగా వినియోగించుకోగలము. మరి అందుకు ప్రభుత్వాలు చేపట్టాల్సిన చర్యలు ఏమిటి?

water crisis
నీటికి ధర నిర్ణయిస్తే!
author img

By

Published : Dec 25, 2020, 9:37 AM IST

మనం పీల్చే గాలి, తాగే నీటి కోసం ఎవరి దయాదాక్షిణ్యాలపైనా ఆధారపడనక్కర్లేదు. అవి భగవంతుడు జీవులకు ఉచితంగా, అయాచితంగా ప్రసాదిస్తున్న వరాలు, ప్రాణాధారాలు. ఇది జగమెరిగిన సత్యమే కానీ, ఈ ఏడాది డిసెంబరులో సంభవించిన ఒక పరిణామం ఈ అభిప్రాయాన్ని మార్చేసింది. అమెరికాలోని క్యాలిఫోర్నియా రాష్ట్ర స్టాక్‌ మార్కెట్‌లో నీరు హెచ్‌క్యూహెచ్‌2ఓ పేరిట వ్యాపార సరకైంది. ఒక ఎకరా విస్తీర్ణంలో అడుగులోతున్న నీరు (12,33,500 లీటర్ల) ముగింపు ధర 489 డాలర్లు పలికింది. దీన్ని చూసి రేపు మనకూ నీరు కొనుక్కోవలసిన పరిస్థితి దాపురిస్తుందా అనే ఆందోళన అందరిలో మెదలవచ్చు.

నీరు.. ప్రైవేటు

కాస్త లోతుగా తరచి చూస్తే నీరు మనమంతా అనుకునేంత ఉచిత వనరేమీ కాదని తెలిసివస్తుంది. వ్యక్తులు తమ బావుల్లోని నీటిని ఇతరులకు, కంపెనీలకు అమ్ముకోవడం మొదటి నుంచీ ఉన్నదే. ఆ లెక్కన నీరు ఎప్పుడో ప్రైవేటు ఆస్తిగా మారిపోయింది. ఆ నీటి మీద ప్రభుత్వాలు పన్ను కూడా విధిస్తాయి. ఒక వ్యక్తికి చెందిన భూమిలో కురిసి నేలలోకి ఇంకే నీటిపై ఆయనకే సర్వహక్కులు ఉంటాయి. ఆ నీటిని తోడుకోవచ్చు, ఇతరులకు విక్రయించవచ్చు, ఇంకెలా అయినా వాడుకోవచ్చు. దీనివల్ల పొరుగున ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు భూముల కింద ఉండే జలాలపై పడే ప్రభావం గురించి పట్టించుకోనక్కరలేదు. భారత ప్రభుత్వం ఈ విధానమే అనుసరిస్తోంది. క్యాలిఫోర్నియా రాష్ట్రంలో వ్యక్తులు తమ భూగర్భ జలాలను నిర్ణీత కోటా ప్రకారం వినియోగించుకోవాలి. వర్షాలు బాగా కురిస్తే ఒకలా, వర్షాలు కురవని సంవత్సరాల్లో మరొకలా కోటాను నిర్ణయిస్తారు. ఈ నియమం ప్రభుత్వ, ప్రైవేటు భూములన్నింటికీ వర్తిస్తుంది.

ప్రయోజనం కంటే వ్యయమే ఎక్కువ

భారత్‌లో కానీ, మరే దేశంలో కానీ నదీజలాలు ప్రజలందరి సొత్తు. ప్రైవేటు కార్యకలాపమైన వ్యవసాయానికి ప్రజల హితం కోసం నదీ జలాలను, భూగర్భ జలాలను సరఫరా చేస్తారు. వర్షాభావ కాలంలో భూగర్భ జలాలను మితిమీరి తోడేయడం ప్రజా ప్రయోజనాలకు భంగం కలిగిస్తుంది. సమస్త ప్రజల వనరు అయిన నీటిలో 80 శాతాన్ని వ్యవసాయానికి, తొమ్మిది శాతాన్ని తాగు నీటికి గృహావసరాలకు, మిగిలిన జలాలను పారిశ్రామిక, ఇతర అవసరాలకు వినియోగిస్తున్నాం. ఉపరితల జలాలు ప్రజా ధనమే అయినా, ఆ నీటిని ప్రైవేటు వినియోగానికి, తరచూ ఆర్థిక లాభం కోసం వినియోగిస్తున్నారు. దాదాపు 100 కోట్ల ఘనపు మీటర్ల నీటిని పంటల సాగు కోసం వాడుతున్నారు.

ప్రజలకు ఆహార భద్రత కల్పించే రైతుల ప్రైవేటు వినియోగం కోసం నీటిని ఉచితంగా అందిస్తున్నారు. కానీ, వ్యవసాయ దిగుబడుల విలువతో పోలిస్తే నీటి పారుదల ప్రాజెక్టుల నిర్మాణం, పొలాలకు నీటి సరఫరా, కాలువల నిర్వహణలకు అయ్యే ఖర్చు చాలా ఎక్కువ. మంచి వర్షాలు కురిసినప్పుడు పంటలు విరగపండి, వాటిని సేకరించడానికి ప్రభుత్వాలు మరింత ఎక్కువ ఖర్చు చేయాల్సి వస్తుంది. అంటే, రైతులకు నీటిని ఉచితంగా అందించడానికి, వారు పండించిన పంటలను కొనుగోలు చేయడానికి పన్ను చెల్లింపుదారులపై అధిక భారం పడుతోంది. నీటిని వ్యాపార సరకుగా పరిగణించి ధరలు నిర్ణయిస్తే, బహుశా ఆ వనరును మరింత సమర్థంగా ఉపయోగించుకొనే అలవాటు బలపడవచ్చు. అందుకే కొన్ని దేశాల్లో నీటి వాడకానికి పర్మిట్లు ఇస్తున్నారు. ఆ పర్మిట్లను ఇతరులకు విక్రయించుకోవచ్చు.

భారత్‌లో లాభసాటిగా...

ఇప్పటికే భారతదేశ పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు తాగునీటిని కొనుక్కునే అలవాటు బాగా వ్యాపించింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దినసరి తాగునీటి మార్కెట్‌ విలువ రూ.10కోట్లని అంచనా. ఈ లెక్కన ఏడాదికి నీటి మార్కెట్‌ విలువ రూ.3,600కోట్లకు పైనే. దీనికి తోడు గృహావసరాలకు నీటిని సరఫరా చేయడానికి ప్రభుత్వం చేసే వ్యయం ఉండనే ఉంది. క్యాలిఫోర్నియాతో పోలిస్తే మన దేశంలో నీటి ధర ఎక్కువో తక్కువో తెలుసుకోవాలంటే గ్రేటర్‌ హైదరాబాద్‌ నగర పాలిక (జీహెచ్‌ఎంసీ) ధరవరలను పరిశీలించాలి. నేడు నగర పౌరులు 5,000 లీటర్ల తాగు నీటి ట్యాంకర్‌ను బుక్‌ చేసుకోవడానికి రూ.500 నుంచి రూ.1,000 వరకు వెచ్చిస్తున్నారు. ఈ లెక్కన 12,33,500 లీటర్ల నీటిని బుక్‌ చేసుకోవాలంటే రూ.1,25,000 నుంచి రూ.2,50,000 వరకు చెల్లించాలి. ఈ ధర క్యాలిఫోర్నియా నీటి స్టాక్‌ ధర 489 డాలర్ల (రూ.36,000) కన్నా మూడున్నర నుంచి ఏడు రెట్లు హెచ్చు. కాబట్టి అమెరికాలోకన్నా భారతదేశంలో నీటి వ్యాపారమే అత్యంత లాభసాటి.

క్యాలిఫోర్నియా కన్నా ఎక్కువ..

హైదరాబాద్‌ మెట్రో వాటర్‌ సంస్థ పైపుల ద్వారా సరఫరా చేసే నీటి ధర క్యాలిఫోర్నియా స్టాక్‌ ధర కన్నా చాలా ఎక్కువ. ఈ సంస్థ 1,000 లీటర్ల నీటిని శుద్ధి చేసి పైపుల ద్వారా సరఫరా చేయడానికి 2002లో రూ.14.40 వెచ్చిస్తే, 2014కల్లా ఆ ఖర్చు రూ.43.50కి పెరిగింది. 12 ఏళ్లలో ఈ ఖర్చు మూడింతలు పెరిగిందన్నమాట. 2020లో 1,000 లీటర్ల నీటి ధర రూ.80కి చేరి ఉండాలి. క్యాలిఫోర్నియా నీటి స్టాక్‌ ధరకన్నా మన ప్రభుత్వం కొళాయిల ద్వారా సరఫరా చేసే నీటి ధర చాలా హెచ్చు. మొత్తం మీద మన ప్రజలు సీసాల్లో నీటిని, పైపుల ద్వారా వచ్చే నీటిని ఇప్పటికే కొనుగోలు చేస్తున్నారు. నీటి శుద్ధి, రవాణా తదితరాలకు అయ్యే ఖర్చును ప్రజలు భరిస్తున్నా నీటికి మాత్రం వెల కట్టలేదు. నీటికి ధర నిర్ణయిస్తే ఆ వనరును మరింత సమర్థంగా, ఉత్పాదకంగా వినియోగించుకోవడం పెరుగుతుంది.

ఆర్థిక వ్యవస్థకూ ఊతం

ఇవాళ అందుబాటులో ఉన్న టెక్నాలజీతో నీటి వినియోగం 30శాతం తగ్గినా 25శాతం ఎక్కువ దిగుబడి సాధించవచ్చు. కానీ, ప్రభుత్వాలు వేలకోట్ల రూపాయల వ్యయంతో భారీ నీటిపారుదల ప్రాజెక్టులు నిర్మిస్తూనే ఉన్నాయి. ఆ ఖర్చుకు తగ్గ ప్రతిఫలం లభిస్తుందనే హామీ లేదు. భారతదేశం ఇకనైనా ఎన్ని ఎకరాలకు నీరు ఇచ్చామనేదానికన్నా ఒక ఘనపు మీటరు నీటికి ఎంత దిగుబడి సాధించామనేదానికి ప్రాధాన్యమివ్వాలి. తాగునీటి సరఫరాలోనూ దుబారాను అరికట్టాలి. నీటి పునర్వినియోగంపై శ్రద్ధ పెట్టాలి. ఉచిత నీటి సరఫరాకన్నా వినియోగదారుల నుంచి నీటి వాస్తవ ఖర్చు రాబట్టడంపై ఎక్కువ దృష్టిపెట్టాలి. నీటి సరఫరాపై కన్నా నీటి గిరాకీని సమర్థంగా తీర్చడానికి ప్రాధాన్యమివ్వాలి. నీటి కాలుష్యాన్ని తక్షణమే అరికట్టాలి. లేకుంటే యావత్‌ ఆర్థిక వ్యవస్థపైనా భారం పెరుగుతుంది. ప్రజారోగ్య రక్షణకూ అధికంగా ఖర్చుపెట్టాల్సి వస్తుంది. అమెరికాలో నీరు కూడా వ్యాపార సరకైందని గగ్గోలు పెట్టేకన్నా మన ఉచిత నీరు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన సరకని గ్రహించాలి. ఇకనైనా నీటికి సరసమైన ధర నిర్ణయించి దుబారా అరికట్టాలి. తక్కువ నీటితో ఎక్కువ ఫలితం సాధించి ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయాలి.

- డాక్టర్‌ భిక్షం గుజ్జా (నీటి నిర్వహణ నిపుణుడు)

ఇదీ చూడండి : కాలుష్యం కాటుకు నీరే గరళం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.