ETV Bharat / opinion

అఫ్గాన్‌లో ఆగని హింస.. తాలిబన్ల ద్వంద్వ ప్రమాణాలు!

తాలిబన్ల దాడులతో అఫ్గానిస్థాన్​ దద్దరిల్లుతోంది. శాంతి స్థాపన కోసం ఒకపక్క చర్చల ప్రక్రియ కొనసాగుతుండగానే, మరోపక్క హింస పెచ్చరిల్లడం ఇక్కడి వైచిత్రి. ప్రభుత్వ వర్గాలతో శాంతిచర్చలు సాగిస్తున్న తాలిబన్లు మరోవైపు తమ పని తాము కానిచ్చేస్తూ ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తున్నారు.

Taliban in Afganistan
అఫ్గాన్‌లో ఆగని హింస
author img

By

Published : Dec 2, 2020, 10:42 AM IST

అఫ్గానిస్థాన్‌ మరోసారి బాంబు దాడులతో దద్దరిల్లింది. తాజాగా వేర్వేరు ఘటనల్లో 34మంది దాకా మరణించారు. శాంతి స్థాపన కోసం ఒకపక్క దోహాలో చర్చల ప్రక్రియ కొనసాగుతుండగానే, మరోపక్క హింస పెచ్చరిల్లడం ఇక్కడి వైచిత్రి. ప్రభుత్వ వర్గాలతో శాంతిచర్చలు సాగిస్తున్న తాలిబన్లు మరోవైపు తమ పని తాము కానిచ్చేస్తున్నారు. గత ఏడాదితో పోలిస్తే, ఈ సంవత్సరం జులై ఒకటి నుంచి సెప్టెంబర్‌ 30 వరకు హింసాత్మక దాడులు 50 శాతందాకా పెరిగాయి. ఇంతేస్థాయిలో హింసాత్మక ఘటనలు కొనసాగితే, అమెరికా-తాలిబన్‌ శాంతి ఒప్పందానికి విలువే లేకుండా పోతుందని అఫ్గాన్‌ రక్షణ విభాగం స్పష్టం చేసింది. అఫ్గాన్‌ ప్రభుత్వాన్ని వేధిస్తూ, అమెరికా ఉపసంహరణ తరవాత తమకు అనుకూల పరిస్థితులు ఉండేలా చేసుకోవాలనేది ఈ దాడుల వెనక తాలిబన్ల మతలబు అని వెల్లడించింది.

శాంతి మంత్రం ఫలిస్తుందా?

ఎంతోకాలంగా వేచిచూసిన శాంతి ఒప్పందంపై ఈ ఏడాది ఫిబ్రవరిలో దోహాలో అమెరికా, అఫ్గానిస్థాన్‌ సంతకం చేశాయి. అఫ్గాన్‌లో కనీసం రెండు తరాలు హింస నీడలోనే పుట్టి పెరిగిన క్రమంలో శాంతిపవనాలు వీస్తాయనే ఆశాభావం వ్యక్తమైంది. అమెరికా తన దళాలను తగ్గించుకోవాలన్న, తాలిబన్లు హింసకు చరమగీతం పాడాలన్న రెండు ప్రధాన అంశాల పునాదిగా శాంతి ఒప్పందం కుదిరింది. అల్‌ఖైదా, ఐఎస్‌ఐఎస్‌ వంటి సంస్థలు అమెరికాకు వ్యతిరేకంగా అఫ్గాన్‌ గడ్డను ఉపయోగించరాదన్న హామీలు ఉన్నాయి. అమెరికా, అంతర్జాతీయ దళాలపై దాడికి దూరంగా ఉంటామని తాలిబన్లు హామీ ఇచ్చేలా ఒప్పందంలో ఉన్నా- అఫ్గాన్‌ భద్రతా దళాలతో కాల్పుల విరమణకు సంబంధించిన అంగీకారం లేకపోవడం గమనార్హం. అమెరికా, తాలిబన్‌ శాంతి ఒప్పందంలోని ఇలాంటి లోపాన్ని తాలిబన్లు పూర్తిగా ఉపయోగించుకుంటూ- అఫ్గాన్‌ ప్రభుత్వ దళాలు, పౌరులపై దాడులకు తెగబడుతున్నాయి. పౌరులతోపాటు, ఉదారవాదులైన పాత్రికేయులు, హక్కుల ఉద్యమకారులు, కళాకారులు, మితవాద మతనేతలు, ప్రముఖ మహిళలు, షియాలు, సిక్కులు వంటి మైనారిటీలను లక్ష్యంగా చేసుకొని హతమారుస్తున్నారు. తాలిబన్‌ అగ్రనేతలతో విభేదాలున్న హక్కానీ నెట్‌వర్క్‌ సైతం దాడులకు తెగబడుతోంది. తాలిబన్లలో వర్గపోరు కూడా కొంతమేర హింసకు తావిస్తోంది.

అఫ్గాన్‌లోని అష్రఫ్‌ ఘనీ సర్కారు దేశవ్యాప్తంగా పెరుగుతున్న హింసాత్మక ఘటనల్ని ఎదుర్కోలేక సతమతమవుతోంది. తాలిబన్లతో పాటు ఐఎస్‌ఐఎస్‌, అల్‌ఖైదా వంటి మతవాద సంస్థలూ దాడులకు తెగబడుతుండటంతో దీనికి అంతం పలకడం క్లిష్టతరంగానే కనిపిస్తోంది. అఫ్గాన్‌ సైన్యం వీరిని ఎదుర్కోలేకపోతోంది. చాలామంది సైనికులు దాడుల్లో హతమయ్యారు. అఫ్గాన్‌ సైనికులు ఎక్కువగా అమెరికా వైమానికశక్తినే నమ్ముకున్నారు. అమెరికా సైనికుల్ని దశలవారీగా ఉపసంహరించడంతో, తాలిబన్‌పై పోరాడేందుకు ఇప్పుడున్న శక్తి సరిపోతుందా అనేది ప్రశ్నార్థకమే. ఎందుకంటే, ట్రంప్‌ తన ఎన్నికల వాగ్దానం మేరకు వచ్చే ఏడాది జనవరి 15నాటికి భారీగా ఉపసంహరణ జరిగి, తదుపరి దశలో కేవలం 2500మంది అమెరికా సైనికులే మిగిలితే పరిస్థితి ఏమిటనే ఆందోళన నెలకొంది. అఫ్గాన్‌ నేల నుంచి అమెరికా ఉపసంహరించుకోవడమంటూ జరిగితే, ఆ దేశాన్ని అప్పనంగా పాకిస్థాన్‌కు అప్పజెప్పినట్లేననేది దౌత్య నిపుణుల అభిప్రాయం.

భారత్‌... ఆచితూచి

ఇక- భారత్‌ విషయానికొస్తే, అఫ్గాన్‌తో మంచి సంబంధాలు ఉన్నాయి. అఫ్గాన్‌లో అస్థిరత, పాక్‌ పొంచి ఉండటం భారత్‌కు ఆందోళన కలిగిస్తున్న సమస్య. అఫ్గాన్‌ వ్యవహారాల్లో భారత్‌ తలదూర్చడం పాక్‌కు ఏమాత్రం ఇష్టంలేదు. అమెరికా ఆధ్వర్యంలో సాగుతున్న చర్చలను సమర్థిస్తున్న పాకిస్థాన్‌- కొత్తగా ఏర్పడబోయే రాజకీయ ఏర్పాటులో తాలిబన్‌కు అధిక వాటా దక్కుతుందని ఆశిస్తోంది. దీంతో భారత్‌కు అఫ్గాన్‌లో చోటులేకుండా చేయాలనేది తన లక్ష్యం. బలూచిస్థాన్‌లో ఉగ్ర కార్యకలాపాల వెనక భారత్‌ ఉందంటూ అమెరికా కొత్త అధ్యక్షుడు బైడెన్‌ ప్రభుత్వానికి సమర్పించేందుకు పాక్‌ ఇప్పటికే ఓ 'డోసియర్‌'ను సిద్ధం చేసింది. అఫ్గాన్‌లోని హెరాత్‌, జలాలాబాద్‌, కాందహార్‌, మజర్‌-ఎ-షరీఫ్‌లలో ఉన్న భారత కాన్సులేట్లను మూసివేయించాలనేది తన ఎత్తుగడ. ఈ క్రమంలో పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ ఇటీవల అఫ్గాన్‌లో తొలిసారిగా పర్యటించి, శాంతి పరిరక్షణకు కృషిచేస్తున్నట్లు ఆ దేశాధ్యక్షుడికి హామీ ఇచ్చారు. అఫ్గాన్‌నుంచి అమెరికా, 'నాటో' దళాలను హడావిడిగా ఉపసంహరించుకోవడాన్ని భారత్‌ వ్యతిరేకిస్తోంది. ఉగ్రవాద నెట్‌వర్క్‌ తిరిగి జీవం పోసుకుంటే, భారత్‌ను లక్ష్యంగా చేసుకుంటాయనేది మన ఆందోళన. ఐరాస భద్రతా మండలిలో సైతం భారత్‌ ఇదే అంశాన్ని ఎలుగెత్తింది. అఫ్గాన్‌, పాకిస్థాన్‌ల నుంచి పనిచేసే ఉగ్ర నెట్‌వర్క్‌లు కేంద్రపాలిత ప్రాంతమైన జమ్ముకశ్మీర్‌లో అస్థిరతను సృష్టిస్తాయనే ఆందోళన లేకపోలేదు. గతంలో తాలిబన్‌ ప్రభుత్వం ఒసామాబిన్‌ లాడెన్‌కు ఆశ్రయం కల్పించిన నేపథ్యంలో భవిష్యత్తులో తాలిబన్ల ఆధిపత్యంలో ఏర్పడే అఫ్గాన్‌ సర్కారు సైతం ఇస్లామిక్‌ ఉగ్రవాదులకు చేరదీయొచ్చనే అనుమానాలున్నాయి. ఇలాంటి ఆందోళనలకు శాంతి చర్చల్లో పరిష్కారం దొరుకుతుందేమో చూడాలి.

- శ్రీనివాస్‌ దరెగోని

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.