ETV Bharat / opinion

'స్వచ్ఛంద' సేవలకు ఆటంకాలా? - స్వచ్ఛంద’ సేవలకు ఆటంకాలా?

పేదరిక నిర్మూలన, విద్య, వైద్యం, ఉపాధి, మహిళా సాధికారత వంటి ఎన్నో అంశాలకు సంబంధించి దేశంలోని స్వచ్ఛంద సంస్థలు తమవంతు సేవలు అందిస్తున్నాయి. అధికారిక లెక్కల ప్రకారం దేశంలో 32 లక్షలకుపైగా స్వచ్ఛంద సంస్థలు ఉన్నాయి. అయితే ఇటీవల కేంద్రం తీసుకొచ్చిన విదేశీ విరాళాల నియంత్రణ చట్టం (ఎఫ్‌సీఆర్‌ఏ) వల్ల వాటి సేవలు, కార్యక్రమాలకు ఆటంకం ఏర్పడిందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ngo latest news
స్వచ్ఛంద’ సేవలకు ఆటంకాలా?
author img

By

Published : Nov 10, 2020, 5:00 AM IST

స్వచ్ఛంద సంస్థలకు బయటి దేశాలనుంచి అందే నిధులపై పర్యవేక్షణ లక్ష్యంగా- 'విదేశీ విరాళాల నియంత్రణ చట్టం (ఎఫ్‌సీఆర్‌ఏ)'లో ప్రభుత్వం ఇటీవల చేపట్టిన సవరణలు వాటి భవిష్యత్తుపై చర్చలకు తెరతీశాయి. అధికారిక లెక్కల ప్రకారం దేశంలో 32లక్షలకుపైగా స్వచ్ఛంద సంస్థలు నమోదయ్యాయి. వాటిలో ప్రస్తుతం పనిచేస్తున్నవెన్ని అనేదానిపై గణాంకాలు కచ్చితంగా లేకున్నా, వాటి సంఖ్య లక్షల్లో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సంస్థలన్నీ నిధుల కోసం ప్రధానంగా విదేశీ దాతృత్వ సంస్థలపైనే ఆధారపడుతున్నాయి. మరికొన్ని కార్పొరేట్‌ సామాజిక బాధ్యతలో భాగంగా కంపెనీల నిధులతో వాటి కార్యక్రమాల అమలును చేపడుతున్నాయి.

నిరుపేదలకు అండ

దేశంలో భారీ సంఖ్యలో ఉన్న స్వచ్ఛంద సంస్థలు మారుమూల ప్రాంతాల్లో, ప్రభుత్వాలు కూడా విస్మరించిన ఎన్నో రంగాల్లో సేవలందిస్తూ నిరుపేద వర్గాలకు చేరువయ్యాయనేది వాస్తవం. మారుమూల గిరిజన ప్రాంతాల్లో విద్య, వైద్య సేవలు అందించడం; హెచ్‌ఐవీ వంటి వ్యాధుల నియంత్రణ, దళితులు, ఆదివాసుల హక్కుల పరిరక్షణ, పర్యావరణ సంరక్షణ వంటి ఎన్నో రంగాల్లో దేశం సాధించిన పురోగతిలో స్వచ్ఛంద సంస్థల పాత్ర విస్మరించలేనిది. అయితే అనేక సంస్థల్లో జవాబుదారీతనం, పారదర్శకత లోపించాయనే ఆరోపణలున్నాయి.

రిజిస్టర్‌ చేసుకున్న సంస్థల్లో కనీసం పది శాతం కూడా ఆడిట్‌ చేసిన లెక్కలను ప్రభుత్వానికి సమర్పించడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 2014నాటి ఇంటెలిజెన్స్‌ బ్యూరో నివేదిక- దేశంలో పెద్దయెత్తున కార్యక్రమాలు చేపట్టిన గ్రీన్‌పీస్‌, ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్‌, యాక్షన్‌ ఎయిడ్‌ వంటి ప్రముఖ సేవాసంస్థలపై తీవ్ర విమర్శలు చేసింది. ఈ సంస్థలు దేశంలో కొన్ని అభివృద్ధి వ్యతిరేక కార్యకలాపాలకు నిధులు సమకూర్చాయని, ఫలితంగా దేశ జీడీపీకి రెండు నుంచి మూడు శాతం నష్టం వాటిల్లిందని నివేదిక స్పష్టంచేసింది. అప్పట్నుంచి స్వచ్ఛంద సంస్థల వ్యవహారాల్లో ప్రభుత్వ జోక్యం పెరిగింది.

కేంద్ర ప్రభుత్వం 2015లో పది వేలకుపైగా స్వచ్ఛంద సంస్థల ఎఫ్‌సీఆర్‌ఏ రిజిస్ట్రేషన్లను రద్దు చేసింది. 2017లో మరో అయిదువేల దాకా సంస్థల రిజిస్ట్రేషన్లు రద్దయ్యాయి. చాలా సంస్థలకు రెండు, మూడు ఎఫ్‌సీఆర్‌ఏ సంఖ్యలు ఉండటంతో వాటిని రద్దు చేసేందుకు ఇలాంటి ప్రక్రియను చేపట్టినా, అవకతవకలవల్లే రద్దు జరిగిందనే భావన నెలకొంది. దీనితోపాటు అనేక రకాల కార్యక్రమాలకు విదేశీ నిధులు పొందడాన్ని నిషేధించడం, కఠినమైన నియమ నిబంధనలు రూపొందించడంతో కొన్నేళ్లుగా దేశంలో సేవారంగానికి వచ్చే విదేశీ నిధులు గణనీయంగా తగ్గాయి.

తాజాగా సెప్టెంబర్‌లో ఎఫ్‌సీఆర్‌ఏ చట్టానికి చేపట్టిన సవరణలు స్వచ్ఛంద సంస్థలకు నిధుల అందుబాటు, వాటి పనితీరుపై తీవ్ర ప్రభావం చూపనున్నాయని, అనేక సంస్థలు, వాటిలో పని చేస్తున్న సిబ్బంది, వారి సేవలు పొందుతున్నవారి భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారనున్నదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

ఎఫ్‌సీఆర్‌ఏ నిబంధనలు ఉల్లఘించిందనే ఆరోపణతో ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్‌ సంస్థ బ్యాంకు లావాదేవీలను ప్రభుత్వం నిలిపివేసింది. దానితో దేశంలో తమ సంస్థ కార్యక్రమాలు స్తంభింపజేస్తున్నట్లు సంస్థ ప్రకటించింది. ఎఫ్‌సీఆర్‌ఏ చట్టానికి తాజాగా చేసిన సవరణల్లో- విదేశీ నిధులను ఇతర సంస్థలకు బదిలీ చేయడాన్ని నిషేధించడం ఇబ్బందికరంగా మారిందనే అభిప్రాయాలున్నాయి.

విదేశీ జోక్యానికి కళ్లెం!

విదేశాల నుంచి స్వచ్ఛంద సంస్థలకు నిధులను 'విదేశీ విరాళాల నియంత్రణ చట్టం-1976' కింద నియంత్రించేవారు. విదేశీ నిధులు ప్రజోపయోగ కార్యక్రమాలకు కాకుండా కొంత రాజకీయ కార్యకలాపాలకూ వినియోగిస్తున్నారని, దేశ రాజకీయాల్లో విదేశీ జోక్యం పెరిగే అవకాశం ఉందనే ఉద్దేశంతో 2010లో నాటి ప్రభుత్వం ఈ చట్టంలో భారీ సవరణలు చేసింది.

దేశ రాజకీయ వ్యవహారాలతో సంబంధం ఉండే ఏ సంస్థకూ విదేశీ నిధులు పొందే అవకాశం లేకుండా సవరణలు జరిగాయి. ఆ చట్టం ప్రకారం విదేశీ నిధులు పొందాలనుకునే స్వచ్ఛంద సంస్థ కేంద్ర హోంశాఖ వద్ద రిజిస్ట్రేషన్‌ చేయించుకోవాలి. ప్రతి అయిదేళ్లకోసారి రెన్యువల్‌ కూడా చేయించుకోవాలి. దేశంలో ఎఫ్‌సీఆర్‌ఏ చట్టం కింద నమోదై విదేశీ నిధుల సేకరణకు అనుమతులు పొందిన సంస్థలు ప్రతి మూడు నెలలకోసారి నిధుల వివరాలు నమోదు చేయడంతోపాటు సంస్థ సమాచారంలో మార్పులుంటే పదిహేను రోజుల ముందే సంబంధిత శాఖకు తెలియజేయాలి.

కొత్త ఇబ్బందులివీ..

చిన్న సంస్థలకు విదేశీ దాతృత్వ సంస్థల నుంచి నిధులు సేకరించుకునేంత వెసులుబాటు, నైపుణ్యాలు ఉండవు. ఇవి భారీ స్థాయిలో కార్యక్రమాలు నిర్వహించే సంస్థలకు అనుబంధంగా పని చేస్తుంటాయి. నిధులనూ వాటి నుంచి పొందుతుంటాయి. సరికొత్త చట్టసవరణతో నిధుల బదిలీకి అవకాశం లేకపోవడం వల్ల అనేక చిన్న స్థాయి సంస్థలు, వాటి సిబ్బంది భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారనుంది.

పరిపాలన ఖర్చుల పరిమితిని యాభై నుంచి ఇరవై శాతానికి తగ్గించడాన్ని స్వచ్ఛంద సంస్థలు వ్యతిరేకిస్తున్నాయి. పరిశోధన, 'అడ్వొకసీ', మానవ హక్కులు, మానవ అక్రమ రవాణా, బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన వంటి రంగాల్లో పనిచేసే సంస్థలకు ప్రధానంగా పరిపాలన ఖర్చులే అధికంగా ఉంటాయని, పరిమితులవల్ల స్వచ్ఛంద సంస్థల పనితీరుకు ఆటంకం కలుగుతుందనేది స్వచ్ఛంద సంస్థల ఆక్షేపణ. ప్రతి సంస్థకు తప్పనిసరిగా దిల్లీలోని నిర్దేశిత ఎస్‌బీఐ శాఖలోనే ఖాతా ఉండాలనే నిబంధనపైనా తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. అన్ని ఎఫ్‌సీఆర్‌ఏ ఖాతాలు ఒకే బ్యాంకులో ఉండటం వల్ల దేశంలోకి వచ్చే విదేశీ విరాళాలపై పర్యవేక్షణ సులువవుతుందనేది ప్రభుత్వ వాదన. దీనివల్ల ఇతర ప్రాంతాల్లో పనిచేసే సంస్థల ప్రతినిధులు దిల్లీ చుట్టూ తిరగాల్సి వస్తుందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

చిన్నపాటి సంస్థలకు ఉన్న మరొక ఆదాయ వనరు దేశంలోని కార్పొరేట్‌ సంస్థల విరాళాలు. ఈ ఏడాది కార్పొరేట్‌ సంస్థల నిధులన్నీ ప్రధానంగా 'పీఎం కేర్స్‌' ఖాతాకు వెళ్లడం వల్ల స్వచ్ఛంద సంస్థలకు తగ్గాయి. ఈ పరిణామాలతో దేశీయ నిధుల లభ్యత తగ్గి, విదేశీ విరాళాలు అందుబాటులో లేకుండా పోతే చిన్నస్థాయి స్వచ్ఛంద సంస్థలు కార్యకలాపాలను సాగించేదెలా అనేది సమాధానం లేని ప్రశ్నగా మారింది.

స్వచ్ఛంద సంస్థల విదేశీ విరాళాల్లో జవాబుదారీతనం, పారదర్శకత అవసరమనే ప్రభుత్వ భావన సరైన ఉద్దేశమే అయినా దానికోసం చేసిన సవరణలు సంస్థల మనుగడనే ప్రమాదంలో పడేస్తున్నాయనేది నిపుణుల మాట. ప్రభుత్వ లక్ష్యాల సాధనలో, పేదరిక నిర్మూలనలో కీలకపాత్ర పోషిస్తున్న స్వచ్ఛంద సేవారంగం సహకారం ప్రభుత్వానికి ఎంతో అవసరం. స్వచ్ఛంద సేవా రంగంలో జవాబుదారీతనం, పారదర్శకత పెరిగేందుకు అన్ని వర్గాల సూచనలతో చట్ట సవరణలు రూపొందిస్తే అభివృద్ధి లక్ష్యాల సాధనలో మరింత పురోగతి సాధ్యమవుతుంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.