ETV Bharat / opinion

బొగ్గు గనుల్లో ప్రైవేటు రంగంతో సంస్కరణల బాటలో! - Coal India

దేశవ్యాప్తంగా కొవిడ్​ సంక్షోభంపై యుద్ధం చేస్తోన్న తరుణంలో గత నెల.. ప్రధాని నరేంద్ర మోదీ బొగ్గు గనుల వేలంపాటలను ప్రారంభించి.. ఈ రంగంలో కొత్త సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. అయిదు దశాబ్దాల తర్వాత బొగ్గు గనుల్లో ప్రైవేటు రంగానికి తలుపులు తట్టగా.. బొగ్గు కార్మికులు దీనికి వ్యతిరేకంగా దేశవ్యాప్త సమ్మె చేపట్టారు. ఈ పరిస్థితులు బొగ్గు కంపెనీలకు మరింత సవాలు​గా మారాయి. ఈ నేపథ్యంలో ప్రపంచంలోనే అతిపెద్ద బొగ్గు ఎగుమతి దారుగా భారత్​ అవతరించాలన్న మోదీ కల నెరవేరేందుకు ఇంకొంత కాలం పట్టనుంది. ఈ నేపథ్యంలో బొగ్గు ఉత్పత్తి పెంచాలన్న చర్యలు చేపట్టడం చర్చలకు దారితీస్తున్నాయి.

NEW REFORMS FOR COAL
నల్లబంగారానికి సంస్కరణల పుటం
author img

By

Published : Jul 13, 2020, 8:21 AM IST

కొవిడ్‌ సంక్షోభంతో దేశమంతా యుద్ధం చేస్తున్న తరుణంలోనే గత నెల 17న ప్రధాని మోదీ బొగ్గు గనుల వేలంపాటలను ప్రారంభించి ఈ రంగంలో కొత్త సంస్కరణలకు నూతనరాగాన్ని ఆలపించారు. భారతదేశంలో అర్ధశతాబ్దం తరవాత మళ్లీ బొగ్గు గనుల్లో ప్రైవేటు రంగానికి తలుపులు తెరిచారు. దీన్ని వ్యతిరేకిస్తూ ఈనెల మొదటివారంలో దేశవ్యాప్తంగా బొగ్గు కార్మికులు సమ్మె చేశారు. అసలే కొవిడ్‌ సంక్షోభంతో డిమాండు, ఉత్పత్తి పడిపోయి విలవిల్లాడుతున్న ప్రభుత్వ బొగ్గు కంపెనీలకు తాజా సంస్కరణలు, కార్మికుల సమ్మెలు మరింత సవాలుగా మారాయి. ఈ సంస్కరణలతో ప్రపంచంలోనే అతి పెద్ద బొగ్గు ఎగుమతిదారుగా భారతదేశం అవతరించాలనేదే సంకల్పమన్న ప్రధాని మాటలు ఎంతమేరకు నిజమవుతాయో తేలేందుకు కొంతకాలం పడుతుంది. అభివృద్ధి చెందిన దేశాలు పర్యావరణాన్ని పరిరక్షించాలని బొగ్గు ఉత్పత్తి, వినియోగం తగ్గించడానికి చర్యలు తీసుకుంటున్న తరుణంలో మనదేశంలో ఉత్పత్తి పెంచాలనే చర్యలు చేపట్టడం చర్చనీయాంశమే.

నిల్వలకు తగ్గ ఆదాయమేదీ?

ప్రపంచంలోనే అత్యధిక బొగ్గు నిల్వలున్న దేశాల్లో భారత్‌ది నాలుగో స్థానం. గతేడాది చైనా తరవాత అత్యధికంగా 72.90 కోట్ల టన్నులు తవ్వి తీసి ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఉత్పత్తిదేశంగా నిలిచింది. అయినా బొగ్గు దిగుమతుల్లో రెండో స్థానంలో ఉండటం వల్ల మనసొమ్ము భారీగా విదేశాలకు వెళుతోంది. గతేడాది(2019-20) విదేశాల నుంచి మొత్తం 23.50 కోట్ల టన్నుల బొగ్గు దిగుమతికి రూ.1.58 లక్షల కోట్లను వెచ్చించారు. భారతదేశంలో తొలుత 1774లో దామోదర్‌ నదీ పరీవాహక ప్రాంతంలో బొగ్గు తవ్వకాన్ని అప్పటి బ్రిటిష్‌ ఈస్టిండియా కంపెనీ ప్రారంభించింది. వందేళ్ల క్రితం 1920లో మనదేశంలో కోటీ 80 లక్షల టన్నులే తవ్వగా, ఈ ఏడాది 75 కోట్ల టన్నులకు చేరుతుందని అంచనా. దేశీయ ఇంధన అవసరాల్లో 55 శాతాన్ని బొగ్గు తీరుస్తోంది. పెట్రోలియం, సహజ వాయువు నిక్షేపాలతో పోలిస్తే బొగ్గు నిల్వలు ఎక్కువగా ఉన్నందువల్ల- ఇదే ఇప్పటికీ దేశీయ ఇంధన అవసరాలకు ప్రధాన వనరు. 2018 నాటికి 1200 మీటర్ల లోతు వరకు తవ్వి జరిపిన అన్వేషణలో 319.02 బిలియన్‌ టన్నుల బొగ్గు నిల్వలున్నట్లు తేలింది.

'ఆ విమర్శల్లో నిజముంది'

దశాబ్దాలుగా ప్రభుత్వసంస్థలైన కోల్‌ ఇండియా, సింగరేణి సంస్థలే బొగ్గు తవ్వుతున్నందువల్ల ప్రపంచస్థాయి అభివృద్ధి అందుకోలేకపోతున్నామనే విమర్శలో నిజముంది. పలు చట్టాలు, నియంత్రణల వల్ల బొగ్గు ఉత్పత్తి సగటు వ్యయం మనదేశంలో ఎక్కువ. ప్రజల నుంచి ఓట్లు దండుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకునే రాజకీయ నిర్ణయాల ప్రభావమూ బొగ్గురంగంపై తీవ్రంగా పడుతోంది. కరెంటు ఛార్జీలు పెంచడానికి చాలా రాష్ట్రాల ప్రభుత్వాలు ఏళ్ల తరబడి ఒప్పుకోనందువల్ల విద్యుత్‌ పంపిణీ సంస్థలు నష్టాల్లో కునారిల్లుతున్నాయి. విద్యుదుత్పత్తి చేయాలంటే బొగ్గు కొనాలి. బొగ్గు ధర పెంచితే విద్యుత్‌ సంస్థలకు మరిన్ని నష్టాలొస్తాయి. వీటికి లాభాలు రావాలంటే కరెంటు ఛార్జీలు పెంచాలి. ఈ ఛార్జీలను పెంచాలంటే రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఓ పట్టాన ఒప్పుకోరు. బొగ్గు రంగం రాజకీయ నిర్ణయాల వలయంలో చిక్కుకున్నందువల్లే దశాబ్దాలుగా పెద్దగా అభివృద్ధి చెందలేదు. ప్రభుత్వాలు, కార్మిక సంఘాల పెత్తనమూ అధికం. బొగ్గు అక్రమ రవాణా, కాంట్రాక్టుల్లో అవినీతి మామూలే. సింగరేణిలో టన్ను బొగ్గు తవ్వడానికి సగటున రూ.2400 ఖర్చవుతోంది.

అధునాతన పరిజ్ఞానంతోనే..

కోల్‌ ఇండియాలో అదే టన్ను తవ్వడానికి వెయ్యి రూపాయల్లోపే అవుతోంది. ఈ రెండుసంస్థల్లో అయిదు లక్షల మందికి పైగా పనిచేస్తున్నారు. ఇవి గతేడాది తవ్విన 73 కోట్ల బొగ్గును- ఇందులో సగానికన్నా తక్కువ మానవ వనరులతోనే అధునాతన పరిజ్ఞానంతో ప్రైవేటు సంస్థలు తవ్వగలవని అంచనా. పలుదేశాల్లో మనకన్నా సగంమంది ఉద్యోగులతోనే ఎక్కువ బొగ్గు తవ్వుతున్నారు. అక్కడున్న అత్యాధునిక పరిజ్ఞానం, పటిష్ఠమైన నిర్వహణావ్యవస్థలే ఇందుకు ప్రధాన కారణం. సింగరేణి సంస్థకు భూగర్భ బొగ్గు గనులు గుదిబండల్లా తయారై ఏటా రెండువేల కోట్లరూపాయలదాకా నష్టాలను మిగుల్చుతున్నాయి. ఉపరితల గనుల్లో వచ్చే లాభాలతో వాటిని పూడ్చుకుని ఆ సంస్థ నెట్టుకొస్తోంది! నాణ్యమైన బొగ్గు రావడం రాలేదని థర్మల్‌ విద్యుత్కేంద్రాలు మొత్తుకుంటున్నాయి. బూడిదశాతం ఎక్కువగా ఉండే బొగ్గును థర్మల్‌ కేంద్రాలకు ఇవ్వడం వల్ల దాన్ని మండించినప్పుడు కాలుష్యం ఎక్కువగా వెలువడి పర్యావరణం నాశనమై ప్రజారోగ్యంపై ప్రభావం పడుతోంది. బొగ్గు గనులు 1970 వరకు ప్రైవేటు రంగం చేతిలోనే ఉండేవి. ఇందిరాగాంధీ ప్రభుత్వం 1971-73లో వాటిని జాతీయం చేయడంతో ప్రైవేటు పెట్టుబడులు ఆగిపోయాయి. మోదీ ప్రభుత్వం ప్రభుత్వ ఏకచ్ఛత్రాధిపత్యానికి ముగింపు పలికింది. బొగ్గు నిల్వలు అపారంగా ఉన్నా, ఈ రంగం నిర్వహణ సరిగ్గా లేక- డిమాండుకు అనుగుణంగా ఉత్పత్తి కొరవడుతోంది.

NEW REFORMS FOR COAL
దేశంలో బొగ్గు దిగుమతుల విధానం

రాష్ట్రాల సహకారం కీలకం

సంస్కరణలతో ప్రైవేటు పెట్టుబడులు పెరిగితే బొగ్గు ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించాలనేది లక్ష్యం. దిగుమతులు ఆగితే వాటికి వెచ్చించే సొమ్ము మిగులుతుంది. ఎగుమతులు మొదలైతే మరింత ఆదాయం వచ్చి అభివృద్ధి, ఉపాధికి ఉపయోగపడుతుందని కేంద్రం అంచనా. తొలిదశలో వేలం వేసిన 41 గనుల నుంచి ఏటా 22.50 కోట్ల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయాలని, 2025-26 నాటికి దేశీయ అవసరాల్లో 15 శాతం అవి తీరుస్తాయనేది ప్రణాళిక. రానున్న ఏడేళ్లలో రూ.33 వేల కోట్ల పెట్టుబడులు వస్తాయంటున్నా క్షేత్రస్థాయిలో రాష్ట్రాలు సహకరిస్తేనే అది సాధ్యం. గనుల వేలంతో 2.80 లక్షల వరకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఏర్పడి ఏటా రాష్ట్ర ప్రభుత్వాలకు రూ.20 వేల కోట్ల ఆదాయం వస్తుందని కేంద్రం చెబుతోంది. కోల్‌ ఇండియా, సింగరేణి సంస్థలకన్నా తక్కువకు అమ్మగలిగితేనే ప్రెవేటు సంస్థలు వ్యాపారాన్ని పెంచుకోగలుగుతాయి. గనులు తవ్వాలంటే భారీ యంత్రాలతో కూడిన అధునాతన పరిజ్ఞానం, మానవ వనరులు చాలా అవసరం.

కేంద్రం ఏం చెబుతోందంటే..

బొగ్గు నిల్వలున్న రాష్ట్రాలకు ప్రైవేటు పెట్టుబడులతో ఆదాయం పెరుగుతుంది. ప్రభుత్వ గనుల్లోని కార్మికులుండే సంక్షేమ కార్యక్రమాలే ప్రైవేటు గనుల్లోనూ కల్పించేలా చూస్తామని కేంద్రం చెబుతోంది. కోల్‌ఇండియా, సింగరేణి సంస్థలకు గత రెండు దశాబ్దాలుగా ప్రభుత్వాలు పెద్దగా ఆర్థిక సాయం చేయలేదు. అధునాతన పరిజ్ఞానం తెచ్చేలా వాటికి ఆర్థికపరిపుష్టి కల్పిస్తే డిమాండు తీర్చేలా బొగ్గు తవ్వుతాయనే వాదనలో కొంత నిజముంది. అవి కంపెనీల చట్టం కింద ఏర్పాటైన స్వతంత్ర కంపెనీలు. కానీ ప్రభుత్వ సంస్థలనే సాకుతో వాణిజ్య దృక్పథంతో కంపెనీల మాదిరిగా పనిచేయకుండా ఓట్ల రాజకీయంతో ప్రభుత్వాలు వాటిని శాసించడం ఇకనైనా ఆగాలి. రాజకీయ ప్రయోజనాలతో కూడిన ప్రభుత్వ నిర్ణయాల గుప్పిట్లో నుంచి బయటపడితేనే అవి నిజమైన కంపెనీల్లా పనిచేస్తాయి. వాటికి ప్రభుత్వ నిధులిచ్చి అభివృద్ధి చేయడం సాధ్యంకాదని ప్రైవేటు రంగానికి తలుపులు తీశారు. ఇప్పుడున్న పోటీప్రపంచంలో సంస్కరణలు అనివార్యం. ప్రభుత్వాలికనైనా దీటుగా స్పందిస్తే ప్రభుత్వ బొగ్గుసంస్థలు వృత్తినైపుణ్యంతో పనిచేసి ఎదుగుతాయి. ప్రైవేటురంగంతో పోటీపడుతూ మనుగడ కోసం ప్రభుత్వ సంస్థలు పోరాడక తప్పదు.

- మంగమూరి శ్రీనివాస్‌, రచయిత

ఇదీ చదవండి: నేడు అనంత పద్మనాభ స్వామి ఆలయ తీర్పు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.