రేసుగుర్రం సినిమాలో శ్రుతిహాసన్ క్యారెక్టర్ గుర్తుందా...? బాధ, సంతోషం, భయం, దుఃఖం ఏదైనా.. మనసులోనే ఫీలవుతూ ఉంటుంది. మనిషి బయటకు ప్రశాంతంగా ఉన్నా.. స్పందన మాత్రం లోపలే ఉంటుంది. ఇప్పుడు జపాన్‌లోనూ ఈ కాన్సెప్ట్ ఓ ట్రెండ్‌గా మారింది. నమ్మట్లేదా.. అయితే ఇది చదవేయండి.
ప్రపంచవ్యాప్తంగా కరోనా నిబంధనలకు సడలింపులు ఇస్తూ.. ఆర్థిక కార్యకలాపాలను నిర్వహించాలని ఆయా ప్రభుత్వాలు భావిస్తున్నాయి. మునుపటి పరిస్థితులు కరోనా తర్వాత ఉండకపోవచ్చని హెచ్చరిస్తూనే... ప్రజలకు వీలైనంతగా రక్షణను అందించేందుకు చర్యలు తీసుకుంటున్నాయి. రవాణా, విద్య, బిజినెస్, వినోదం వంటి రంగాల్లోనూ కరోనా జాగ్రత్తలు తప్పనిసరి చేశాయి. ప్రజలు పక్కాగా పాటించాల్సిందిగా ఆదేశాలిస్తున్నాయి.
జపాన్‌లోనూ కొవిడ్-19 వ్యాప్తి దృష్ట్యా.. ఫిబ్రవరి నుంచి థీమ్‌పార్క్‌లను మూసివేశారు. అయితే పరిస్థితులు అదుపులో ఉండటం వల్ల జులై నుంచే మళ్లీ వాటిని పునఃప్రారంభించారు. అయితే ఇక్కడే అసలు తిరకాసు ఉంది.
అరవడానికి వీల్లేదు...
థీమ్ పార్క్ యాజమాన్యాలన్నీ కలిసి ఓ సంఘంగా ఏర్పడి.. పర్యటకులు, సిబ్బంది రక్షణ కోసం ప్రత్యేకమైన నిబంధనలు రూపొందించాయి. ఇందులో భౌతిక దూరం, శరీర ఉష్ణోగ్రత పరీక్షించడం, ముఖానికి మాస్కు ధరించడం తప్పని సరి చేశాయి. దాదాపు జపాన్‌లో ఉన్న 30 పెద్ద అమ్యూజ్మెంట్ పార్కుల్లో ఈ నిబంధనలు అమలు చేస్తున్నారు. అంతేకాకుండా కస్టమర్ సర్వీసులను విభిన్నంగా అందిస్తున్నారు. ముఖానికి మాస్కు ధరించడం వల్ల కళ్లు, చేతి సైగలతోనే విజిటర్స్‌కు సూచనలు చేస్తున్నారు. ఇండోర్ మైదానాల్లో గాన కచేరీలపైనా ఆంక్షలు పెట్టారు.
మరీ విచిత్రంగా కొన్ని థీమ్పార్కుల్లో అయితే రోలర్ కోస్టర్ ఎక్కినప్పుడు కూడా అరవడానికి వీల్లేదు. అప్పుడు కూడా కచ్చితంగా మాస్కులు ధరించాల్సిందే. ఎందుకంటే అరవడం వల్ల నోటిలో నుంచి గంటకు 120 కి.మీ వేగంతో వచ్చే తుంపర్లు కరోనా వ్యాప్తికి కారణమవుతాయని యాజమాన్యాలు భావిస్తున్నాయి. అందుకే ఆ నిబంధన పెట్టాయి.
పెద్ద ట్రెండ్‌గా మారింది...
ఎత్తైన జెయింట్ వీల్, రోలర్ కోస్టర్ ఎక్కినప్పుడు అరవకుండా ఉండటం సాధ్యమా? కానీ జపాన్ ప్రజలు సుసాధ్యం చేసి చూపిస్తున్నారు. ఇటీవలె ఫిజు క్యూ హైల్యాండ్‌లోని థీమ్‌పార్క్ ఓ వీడియోను విడుదల చేసింది. అందులో ఫుజియమ రోలర్ కోస్టర్ ఎక్కిన ఎవరూ అరవట్లేదు. అయితే వీడియో ముగిశాక 'మనసులోనే అరుచుకోండి' అనే సందేశం అందర్నీ ఆలోచింపజేసింది. ఫలితంగా ఇది నెట్టింట పెద్ద ట్రెండ్ అయింది. ప్రజలు కూడా అరవకుండా ఉండి ఆ ఛాలెంజ్‌ను స్వీకరించారు. అయితే ఇలాంటి నింబంధలు అన్ని దేశాల్లోనూ పెట్టకపోవచ్చు.
ఓర్లాండో డిస్నీ వరల్డ్పార్క్ జులైలో పునఃప్రారంభమైంది. అక్కడ అరవకూడదనే నిబంధన లేదు. వినోదం, సరదా కోసం వచ్చే ప్రదేశాల్లో ఇలాంటి నిబంధలను అమలు చేయడం అంత సులభం కాదు. జరిమానాలు వేయడం, అరవొద్దని నిబంధనలు విధించడం వల్ల ప్రజలు థీమ్పార్క్లకు రావడం మానేస్తారు.
సామాజిక బాధ్యతగా భావిస్తూ...
ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. జపనీస్ థీమ్ పార్కులలో కూడా నో-స్క్రీమ్(అరవడం నిషేధం) అనే నిబంధనలను ఉల్లంఘిస్తే ఎటువంటి శిక్ష లేదు. అయినప్పటికీ ప్రజలు నియమాలను అనుసరించడానికి ప్రయత్నిస్తున్నారు. వాస్తవానికి ఇదంతా వారి క్రమశిక్షణ, సంస్కృతిలో భాగం చేసుకున్నారు. దగ్గు, జలుబు ఉన్నవాళ్లు తమ ద్వారా సూక్ష్మ క్రిములను ఇతరులకు వ్యాప్తి చెందకూడదని.. సామాజిక బాధ్యతతో స్వచ్ఛందంగా నిబంధనలు పాటిస్తున్నారు. అందుకే ఫేస్ మాస్క్‌లను వారి జీవితాల్లో ఎన్నో ఏళ్లుగా భాగస్వామ్యం చేసుకున్నారు. ఇది తమను తాము రక్షించుకోవడమే కాదు, ఇతరులను రక్షించడానికని వాళ్ల అభిప్రాయం. ఇలాంటి మహమ్మారి విపత్కర పరిస్థితుల్లో సామాజిక బాధ్యత మరింత పెరిగింది. అందుకే రోలర్ కోస్టర్ ఎక్కినప్పుడూ ఎవరూ అరకుండా ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు.
కరోనా తర్వాత వచ్చే ఈ కొత్త ప్రపంచం చాలా భిన్నంగా ఉంటుంది. మన హృదయం లోపలే మనం స్పందించాల్సి ఉంటుంది.
(-- అతాను బిస్వాస్, కోల్‌కతాలోని ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్లో ప్రొఫెసర్)