నేటి పోటీ ప్రపంచంలో విద్యార్జన బంగరు భవితకు నారుమడి లాంటిది. చదువులు, ఆపై ఉద్యోగావకాశాల్లో ఇతరులకన్నా ముందు నిలబెట్టే అంశాలేమిటి? ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తాజాగా చెప్పినట్లు- ఉన్నత విద్యలో సబ్జెక్టుల మధ్య కచ్చితమైన విభజనరేఖ ఉండే శకం ముగిసిపోయింది. ఏమేమి మెలకువలు తెలుసు, ఎంత సృజనాత్మకంగా యోచించగలరన్న ప్రాతిపదికపై ఆకర్షణీయ వేతనాలతో కొలువులు ప్రతిభావంతుల్ని కోరి వరిస్తున్నాయి. ఈ తరుణంలో, శాస్త్ర సాంకేతిక విద్యాసంస్థలు మానవ విజ్ఞాన శాస్త్రాలకూ సమప్రాధాన్యం ఇవ్వాలన్న ఉపరాష్ట్రపతి సూచన శిరోధార్యమైనది. సైన్స్‌లోనే కాకుండా భాషలు, సామాజిక శాస్త్రాలు, వాణిజ్యం, ఆర్థిక రంగాల్లోనూ ప్రపంచస్థాయి పరిశోధకుల్ని తీర్చిదిద్దాలన్న ఉద్బోధ స్వాగతించదగింది. స్టెమ్ (సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మేథమాటిక్స్) సబ్జెక్టులతో ఆర్ట్స్ అంశాలను సమ్మిళితం చేస్తే రెండింటా విద్యార్థుల పరిజ్ఞానాన్ని ఇనుమడింపజేయగల వీలుందని ఇప్పటికే పలు పరిశోధనల్లో నిగ్గుతేలింది. ఈ మేళవింపునకు ప్రాథమిక దశలోనే శ్రీకారం చుట్టాలి. దేశదేశాల్లో ఎక్కడ ఏ ప్రాంతంలో ఎవరితోనైనా పోటీపడి మన పిల్లలు నెగ్గుకు రావాలంటే, బడిలోనే గట్టి పునాది పడాలి. వాస్తవానికిది, 1948లోనే ప్రథమ ప్రధాని నెహ్రూ చేసిన నిర్దేశం. 'విద్యా ప్రణాళికలకు ఏవో కొన్ని మార్పులు సూచించడం కాదు.. దేశీయ స్థితిగతుల్ని పరిగణనలోకి తీసుకుని పునాది స్థాయినుంచీ చదువుల్ని ప్రక్షాళించాల'ని ఆయన అప్పట్లోనే పిలుపిచ్చినా- ముందడుగు పడలేదు. అనంతర కాలంలో జాతీయ విజ్ఞాన సంఘం- పిరమిడ్ తరహాలో దేశీయ విద్యారంగం సువ్యవస్థితం కావాలని, దిగువన అందరికీ చదువుల భాగ్యం కలిగిస్తూ పై అంచెలకు చేరేకొద్దీ ప్రగతి చోదకశక్తుల నిర్మాణంలో విశ్వవిద్యాలయాలు కీలక భూమిక పోషించాలని గిరిగీసింది. ప్రాథమికం నుంచి స్నాతకోత్తరం వరకు సమస్యలూ సంక్షోభాల చెరలో బందీ అయిన భారత విద్యావ్యవస్థకు ఇప్పటికీ అదే ముక్తిదాయని!
దేశ స్వాతంత్య్ర ప్రకటనకు పదేళ్లముందే నిర్వహించిన జాతీయ విద్యా సదస్సులో 'నయీ తాలిమ్' (నూతన అభ్యసన) విధానం పేరిట- వృత్తిపరమైన ఒడుపులను అలవరచే చదువుల ఆవశ్యకతను మహాత్మాగాంధీ తెలియజెప్పారు. ఆ సిఫార్సుకు సరైన మన్నన దక్కని పర్యవసానంగానే- చదువుకు, బతుకు తెరువుకు మధ్య లంకె తెగిపోయి నిరుద్యోగితకు కోరలు మొలుచుకొచ్చాయి! ప్రపంచంలో మరెక్కడా లేనివిధంగా దేశంలో 5-24 ఏళ్ల వయస్కులు సుమారు 50 కోట్ల మంది ఉన్నారు. అంతటి అపార యువజనాభా దన్నుగా మేలిమి మానవ వనరుల నిర్మాణంలో ధీమాగా పురోగమించాల్సిన భారత్- ఏళ్లతరబడి హ్రస్వదృష్టి విధానాల మూలాన పెద్దయెత్తున నిరుద్యోగులకు నెలవుగా కునారిల్లుతోంది. డిగ్రీ పట్టాలు, పీజీ విద్యార్హతలు ఎన్ని ఉండీ... ఉపాధి వేటలో నెగ్గలేకపోతే ప్రయోజనం ఏముంది? దేశం నలుమూలలా ఉద్యోగార్థులను అక్కున చేర్చుకునేలా, రేపటి పౌరుల్ని సొంతకాళ్లపై నిలబెట్టేలా భిన్నఅంచెల్లో విద్యాబోధన, నైపుణ్యాల శిక్షణ కార్యక్రమాలు చురుగ్గా పట్టాలకు ఎక్కాలి. పోనుపోను కృత్రిమ మేధ, బ్లాక్‌చెయిన్, డేటా ఎనలిటిక్స్ తదితర విభాగాల్లో ఉపాధి అవకాశాలు ఇంతలంతలు కానున్నాయంటున్నారు. రాబోయే కాలంలో ఏమేమి రంగాల్లో ఎంతమంది నిపుణులు అవసరమో శాస్త్రీయంగా మదింపు వేసి, విద్యార్థుల ఆసక్తిని బట్టి అవకాశాలు కల్పించేలా సమగ్ర కార్యాచరణ ప్రణాళికను అమలుపరచాలి. పాఠశాల స్థాయినుంచీ విద్యార్థుల్ని నిపుణులుగా సానపట్టే ఇజ్రాయెల్, యూకే, జర్మనీ ప్రభృత దేశాల అనుభవాలనుంచి ప్రభుత్వాలు విలువైన పాఠాలు నేర్వాలి. ప్రతి పౌరుణ్నీ సమర్థ మానవ వనరుగా రాటుతేల్చేలా పాఠ్యాంశాల కూర్పు, దశలవారీ శిక్షణ, నాణ్యమైన బోధన సిబ్బంది తయారీ, పరిశ్రమలతో విద్యాసంస్థల అనుసంధానం సాకారమైననాడు... దేశ ముఖచిత్రమే మారిపోతుంది!
ఇదీ చూడండి:- వినియోగదారుల హక్కులకేదీ భరోసా?