వ్యవసాయ రంగం తరవాత దేశంలో ఎక్కువ మందికి సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమ(ఎంఎస్‌ఎంఈ)లే ఉపాధి కల్పిస్తున్నాయి. దేశం మొత్తం ఉత్పత్తిలో ఇవి కీలక వాటాను సమకూరుస్తూ, ఆర్థిక వృద్ధిలో గణనీయ పాత్ర పోషిస్తున్నాయి. నగరాల్లో ఆర్థిక సమ్మిళితత్వాన్ని పెంపొందించడంలో ఈ రంగానిదే ప్రధాన భూమిక. సంతులిత గ్రామీణ అభివృద్ధికి, జీవనోపాధి కల్పనకు, స్థానిక ఉత్పత్తులను ప్రోత్సహించే కార్యక్రమానికి చిన్న పరిశ్రమలు తోడ్పడతాయి. వేగంగా మారుతున్న వినియోగదారుల కొనుగోలు శైలి, ఈ-కామర్స్‌కు ఆదరణ పెరుగుతున్న నేపథ్యంలో ఎంఎస్‌ఎంఈలు వ్యాపార అవకాశాలను విస్తృతం చేసుకోవాలంటే డిజిటల్ వేదికలను మరింత బాగా వినియోగించుకోవాలి. ఈ-కామర్స్‌ను అందిపుచ్చుకొంటే మన ఎంఎస్‌ఎంఈలు ప్రపంచ దేశాలకు చేరువవుతాయి. విపణిలో పోటీపడాలంటే ఉత్పత్తిలో సాంకేతిక వినియోగాన్ని, యాంత్రీకరణను ప్రవేశపెట్టాలి.
వేధిస్తున్న సమస్యలు..
ఇప్పటికీ అధికశాతం ఎంఎస్‌ఎంఈల నిర్వాహకులు మూలధన నిధులకు బ్యాంకింగేతర మార్గాలపైనే ఆధారపడాల్సి వస్తోంది. మార్కెట్ అనుసంధానత తక్కువగా ఉండటం, ప్రభుత్వ రంగ సంస్థలకు తమ ఉత్పత్తులను అమ్మలేకపోవడం, నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోలేకపోవడం వంటి సమస్యలు ఎంఎస్‌ఎంఈలను వేధిస్తున్నాయి. ఆన్‌లైన్ వేదికల ద్వారా అమ్మకాలు చేపట్టలేకపోవడం, ఆన్‌లైన్ పరపతి వసతులను ఉపయోగించుకొనకపోవడం వంటి సమస్యలూ ఉన్నాయి. సగానికి పైగా ఎంఎస్‌ఎంఈలు గ్రామీణ ప్రాంతాల్లోనే కొనసాగుతున్నాయి. వాటిలో డిజిటలీకరణను ప్రోత్సహిస్తే అంతర్జాతీయ వాణిజ్యానికి మార్గం సుగమమవుతుంది. అదనపు ఆదాయంతో పాటు ఆర్థిక స్వావలంబన ఏర్పడి సంతులిత వృద్ధికి దారి తీస్తుంది. ఆన్‌లైన్ వ్యాపారంతో వినియోగదారులకు మరింత చేరువ కావచ్చు. కొవిడ్ లాక్‌డౌన్ ప్రభావం నుంచి వేగంగా తేరుకోవడానికీ ఆన్‌లైన్ వ్యాపారం ఉపయోగపడుతుంది. అయితే, ఎంఎస్‌ఎంఈల సాంకేతిక మౌలిక సౌకర్యాల ఏర్పాటు అధిక వ్యయంతో కూడుకొని ఉంటుంది.
ప్రోత్సాహక చర్యలు..
పరపతి వసతి కల్పించే నిమిత్తం '59 మినిట్ లోన్' పోర్టల్‌ను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువచ్చింది. జీఎస్‌టీ చెల్లింపునకు నమోదు చేసుకున్న ఎంఎస్‌ఎంఈలకు రెండు శాతం వడ్డీతో రుణ సదుపాయం కల్పించడం, వర్తక బిల్లులకు ఈ-డిస్కౌంటింగ్ వసతి, బ్యాంకుల ద్వారా రుణ సదుపాయం ఏర్పాటు వంటివి ప్రభుత్వం చేపట్టిన ప్రోత్సాహక చర్యలు. ముఖ్యంగా ఎంఎస్‌ఎంఈల వస్తూత్పత్తుల విక్రయానికి ఆన్‌లైన్ వేదికలను ఏర్పాటు చేయడం, ప్రభుత్వ రంగ సంస్థలు తప్పనిసరిగా 25శాతం ఎంఎస్‌ఎంఈల ఉత్పత్తులనే కొనుగోలు చేసేలా నిబంధన విధించడం, ప్రభుత్వ 'ఈ-మార్కెట్ ప్లేస్' ద్వారా ప్రత్యక్షంగా ముడిసరకులను అందుబాటులోకి తీసుకురావడం హర్షణీయం. సాంకేతిక పరిజ్ఞానం అందించే లక్ష్యంతో దేశవ్యాప్తంగా ఇరవై చోట్ల ప్రత్యేక హబ్‌లను ఏర్పాటు చేశారు.
నాణ్యత ధ్రువీకరణ ప్రక్రియకు ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తోంది. ఈ-గవర్నెన్స్‌కు సంబంధించి భారత చిన్నతరహా పరిశ్రమల అభివృద్ధి బ్యాంకు ద్వారా పోర్టల్‌ను ప్రారంభించి ఆన్‌లైన్ రుణ సదుపాయం కల్పించడం ప్రభుత్వం చేపట్టిన ఉపయుక్తకరమైన చర్య. ఏకగవాక్ష విధానాన్ని సమర్థంగా అమలు జరిపితే ఆశించిన స్థాయిలో ఎంఎస్‌ఎంఈల విస్తరణ జరుగుతుంది. మూడు లక్షలకోట్ల రూపాయల దాకా పూచీకత్తు అవసరం లేని పరపతి సౌకర్యం కల్పించడం ప్రభుత్వం చేపడుతున్న ఆర్థిక ఉద్దీపన చర్యలకు ఓ ఉదాహరణ.
ఇదేతరహాలో ప్రభుత్వం మరింత అండగా నిలిస్తే ఎంఎస్‌ఎంఈలు ఆర్థిక వ్యవస్థకు ఊతం అందిస్తాయి. ఇందుకోసం- ఎంఎస్‌ఎంఈలలో నైపుణ్యాలను పెంపొందించే కార్యక్రమాలు చేపట్టాలి. ప్రత్యేక ఆర్థిక మండళ్ల మాదిరిగానే ఈ-కామర్స్ ఎగుమతి మండళ్లను నెలకొల్పాలి. అంతర్జాతీయ వాణిజ్యంలో ఈ-కామర్స్‌ను ప్రోత్సహించే విధానాలు రూపొందించాలి. గూగుల్, అమెజాన్ వంటి సంస్థలు తమ పెట్టుబడుల ద్వారా ఎంఎస్‌ఎంఈలను ప్రోత్సహించేలా చర్యలు తీసుకోవాలి. చిన్నపాటి తయారీ కేంద్రాలు, కుటీర పరిశ్రమలతో కూడిన ఎంఎస్‌ఎంఈ రంగం భారత దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తోంది. ఇలాంటి చిన్న తరహా వ్యాపారాలను డిజిటలీకరణ బాటన నడిపిస్తే ఆర్థిక వ్యవస్థలో భారీ మార్పులు సంభవిస్తాయి.
- డాక్టర్ ఎం.బుచ్చయ్య
ఇదీ చదవండి:అందరికీ టీకా అందేదెప్పుడు?