మయన్మార్‌లో ప్రజాస్వామ్య ప్రస్థానానికి అకస్మాత్తుగా ఆటంకం ఏర్పడటం నిరాశాజనకమే. మయన్మార్ సైనిక బలగాలు తిరుగుబాటు చేసి ప్రభుత్వ పగ్గాల్ని చేజిక్కించుకున్నాయి. దేశంలో 2010లో ప్రారంభమైన పాక్షిక ప్రజాస్వామ్య ప్రభుత్వం తిరిగి నిరంకుశత్వం వైపు మళ్లింది. కౌన్సెలర్ ఆంగ్ సాన్ సూకి, అధ్యక్షులు ఉ విన్ మింట్‌తోపాటు, అధికార 'జాతీయ ప్రజాస్వామ్య లీగ్ (ఎన్‌ఎల్‌డీ)'కి చెందిన పలువురు సీనియర్ నేతలను బంధించారు. 2020 నవంబర్‌లో జరిగిన ఎన్నికల్లో సూకి నేతృత్వంలోని ఎన్‌ఎల్‌డీ అద్భుత విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో తాజా పరిణామాలు చోటుచేసుకున్నాయి. కొద్ది వారాలుగా, మయన్మార్ సైనిక నాయకత్వం- ఎన్నికల ప్రక్రియపై అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. కేంద్ర ఎన్నికల సంఘం మోసాలతో కూడిన ఓటర్ల జాబితాలను రూపొందించిందని, అది అధికార ఎన్‌ఎల్‌డీకి సానుకూలంగా పరిణమించిందని ఆరోపించింది. పలువురు దేశీయ, అంతర్జాతీయ పరిశీలకులు మాత్రం ఇటీవలి ఎన్నికలు స్వేచ్ఛాయుత వాతావరణంలో న్యాయబద్ధంగా జరిగినట్లు కితాబిచ్చారు. ప్రముఖ పౌరసమాజ సంస్థలు, మీడియా సంస్థలు సైతం ఎన్నికల ప్రక్రియలో భారీస్థాయిలో మోసాలు జరిగినట్లు ఆరోపణలు చేయలేదు. ఎన్నికలకు సంబంధించి సైన్యం గత చరిత్రను పరిశీలిస్తే, ఎన్నికల్లో అవకతవకలపై ఆరోపణలను మరీ పెద్దవి చేసి చూస్తున్నట్లు అర్థమవుతోంది.
తిరుగుబాటు ఎందుకు?
సైన్యాన్ని తిరుగుబాటు వైపు ఏ అంశం ప్రేరేపించిందనేది స్పష్టంగా తెలియడం లేదు. సైన్యం కోసం 25శాతం స్థానాలను కేటాయించాలనే రాజ్యాంగ నిబంధనను సవరించాలంటూ సూకీ దూకుడుగా ప్రచారం చేపట్టడం కారణం కావచ్చనే అనుమానాలున్నాయి. అయితే, ఇటీవలి ఎన్నికల్లో ఆమె భారీ విజయాన్ని సాధించినా, అవసరమైన రాజ్యాంగ సవరణల్ని ఆమోదించాలంటే మూడింట రెండొంతుల ఆధిక్యాన్ని సాధించేందుకు ఇతర పార్టీలతో పాటు, కొంతమంది సైనిక సభ్యుల మద్దతూ అవసరం. దేశంలో విభిన్న ప్రాంతాల్లో చాలాకాలంగా జాతిపరమైన సంఘర్షణలు సాగుతున్నా... ఇప్పటికిప్పుడు దేశ భద్రతకు వచ్చిన ముప్పేమీ లేదు. మరోవైపు, సూకీ నాయకత్వంలోనూ సరైన సమాఖ్య దిశగా ఎలాంటి పురోగతి లేదనే అసంతృప్తి వివిధ జాతుల సంస్థల్లో ఉన్నా, ప్రజాస్వామ్యానికి పూర్తిస్థాయిలో తిలోదకాలు వదలాలనే ఆలోచన వారికి లేదు. సైనిక నాయకత్వానికి, అధికార ఎన్‌ఎల్‌డీకి మధ్య మరీ తీవ్రస్థాయి విభేదాలు కూడా లేవు. సూకి సైతం గతంలో పలు అంతర్జాతీయ వేదికలపై సైనిక నేతల హత్యాకాండ ఆరోపణలను ఖండిస్తూ వెనకేసుకొచ్చారు. సూకి అరెస్టుకు సంబంధించి సైనిక శ్రేణులు ఎలా స్పందిస్తాయనేది తెలియడం లేదు. ఎన్‌ఎల్‌డీ ఆర్థిక విధానాలు ప్రముఖ సైనిక కుటుంబాల వ్యాపార ప్రయోజనాలకు భంగకరంగా మారుతుండటం కొంత ప్రభావం చూపింది. సూకి చైనాకు సన్నిహితంగా మెలగుతున్న క్రమంలో సైనిక నేతలు విదేశీ విధానంలో సమతౌల్యాన్ని పునరుద్ధరించేందుకే ఇలాంటి చర్యకు పాల్పడ్డారనే వాదన కూడా వినిపిస్తోంది. మయన్మార్ సైన్యం తన మనుగడ కోసం చైనాపై ఆధారపడుతుందనే సంకేతాలు స్పష్టమవుతున్నాయి. ప్రజాస్వామ్యం వైపు సాగుతున్న మయన్మార్ ప్రస్థానంపై తిరుగుబాటు ప్రత్యక్ష దాడి అని అమెరికా కొత్త అధ్యక్షుడు బైడెన్ వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్య పునరుద్ధరణకు కృషి చేస్తామన్నారు.
ఆసియాన్ దేశాల అసంతృప్తి
మరోవైపు, బలహీన సరిహద్దులు, ఇరువైపులా సాయుధ బృందాలు ఉన్న దృష్ట్యా భారత్ చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంది. మయన్మార్ పరిణామాలపై భారత ప్రభుత్వం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. కొన్ని ఆసియాన్ దేశాలు సైతం తమ అసంతృప్తిని వ్యక్తపరచాయి. మయన్మార్ సీనియర్ నేతలను నిర్బంధించడాన్ని ఐరాస సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరెజ్ ఖండించారు. గతంలో తిరుగుబాట్లు జరిగినప్పుడు ఏడాదిలో ఎన్నికలు జరుపుతామంటూ సైనిక నేతలు హామీ ఇచ్చారు. అయినా, సైన్యం కనీసం రెండు దశాబ్దాలపాటు పాలన సాగించింది. ఈసారి కూడా ఎన్నికలపై అలాంటి హామీనే ఇవ్వడం గమనార్హం. సైనిక తిరుగుబాటు సూకీపై సానుభూతి పవనాలు వీచేలా చేయడంతో భవిష్యత్తులో స్వేచ్ఛగా, న్యాయబద్ధంగా ఎన్నికలు జరిగితే ఆమె మరింత భారీ ఆధిక్యంతో అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది. అందుకని, మరో విడత ఎన్నికలపై అంతగా ఆసక్తి కనబరచని సైనిక నేతలు సాధ్యమైనంత వరకు అధికారాన్ని అట్టిపెట్టుకోవడానికే మొగ్గు చూపుతున్నారు. సైనిక తిరుగుబాటుపై ప్రజల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. ప్రజలు యాంగాంగ్‌లో నిరసనలు చేపట్టగా, పలువురు వైద్యులు శాసనోల్లంఘన నిరసనకు సిద్ధమయ్యారు. బలహీన సరిహద్దులు, భారీస్థాయిలో సాయుధ బృందాలు ఉండటం, భౌగోళిక రాజకీయాలు, సామాజిక మాధ్యమాల వ్యాప్తి వంటి పరిస్థితుల నేపథ్యంలో ప్రస్తుత సైనిక తిరుగుబాటు ఎంతోకాలం నిలిచే అవకాశం తక్కువేననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
--సంజయ్ పులిపాక, 'దిల్లీ పాలసీ గ్రూప్'లో సీనియర్ ఫెలో
ఇదీ చదవండి : మయన్మార్‌లో సైనిక తిరుగుబాటు- ఖండించిన ప్రపంచ దేశాలు