నిర్భాగ్య జన సమూహాలకు, దేశాభివృద్ధి లక్ష్యాలకు మృత్యుఘాతం లాంటిది పేదరికం. అటువంటి లేమి రగిలించే ఆకలిమంటల్లో, విద్యాబుద్ధులు నేర్చే అవకాశం కమిలిపోకుండా బడిఈడు పిల్లలకు పౌష్టికాహారం అందించాలన్న సదుద్దేశంతో సుమారు పాతికేళ్లక్రితం దేశంలో ప్రారంభమైంది- సార్వత్రిక మధ్యాహ్న భోజన పథకం.
దేశీయంగా ఒక తరానికి అమ్మలాగా కడుపు నింపిన పథకం, తరవాతి తరం శిశువుల అభ్యున్నతికీ బాటలు పరుస్తోంది. పాఠశాల దశలో మధ్యాహ్న భోజనం ఆరగించినవారి సంతానంలో ఎదుగుదల లోపాలు గణనీయంగా తగ్గుతున్నాయి. వాషింగ్టన్ విశ్వవిద్యాలయ పరిశోధకుడు, అంతర్జాతీయ ఆహార విధాన రీసెర్చి సంస్థకు చెందిన ఆర్థికవేత్తలూ పోషకాహార నిపుణులు కలిసి 23 ఏళ్లపాటు చేసిన అధ్యయన సారాంశమిది.
ఆరోగ్య సర్వేలో..
1999 నాటికి 6-10 ఏళ్ల వయసులోని ఆరుశాతం బాలికలకే మధ్యాహ్న భోజనం సమకూరగా, సుప్రీంకోర్టు నిర్దేశానుసారం 2011కల్లా ఆ పరిధి 46 శాతానికి విస్తరించిందని సుదీర్ఘ సర్వే చాటుతోంది! దేశవ్యాప్తంగా మూడోవంతు పిల్లలు పౌష్టికాహార లోపాలతో కునారిల్లుతున్నారని, 38 శాతం పిల్లలు వయసుకు తగ్గ ఎత్తు ఎదగక గిడసబారిపోతున్నారని ఆమధ్య జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే వెల్లడించింది. రక్తహీనతతో బాధపడే స్త్రీల సంఖ్యా దేశంలో విరివిగా నమోదవుతోంది. వీటికి ఉమ్మడి విరుగుడు ఏమిటో తాజా అధ్యయనం సోదాహరణంగా తెలియజెబుతోంది. ఇంతటి ఉపయుక్త పథకం- కొవిడ్ విజృంభణ వేళ పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలు మూతపడి గాడితప్పడం, కోట్లాది పిల్లల్ని ఈసురోమనిపిస్తోంది. ప్రత్యామ్నాయంగా కొన్నిచోట్ల రేషన్ పంపిణీ చేపడుతున్నా, అందులోని పరిమితుల దృష్ట్యా- సత్వర దిద్దుబాటు చర్యలపై ప్రజాప్రభుత్వాలు చురుగ్గా దృష్టి సారించాల్సి ఉంది.
ఎన్నో ఘటనలూ..
దేశం నలుమూలలా బడి ఈడు పిల్లలకు మధ్యాహ్న భోజనం చట్టబద్ధ హక్కుగా సర్వోన్నత న్యాయస్థానమే లోగడ స్పష్టీకరించింది. దురదృష్టవశాత్తు, పదిహేడు రాష్ట్రాల్లో బాలబాలికలకు అరకొర భోజనమే వడ్డిస్తున్నట్లు పుష్కరం క్రితం కేంద్ర ప్రభుత్వ అధ్యయనం చేదునిజం బయటపెట్టింది. ఆ తరవాతా పర్యవేక్షణ లోపాలు, మొక్కుబడి తనిఖీల పర్యవసానంగా మధ్యాహ్నభోజన పథకం మౌలిక స్ఫూర్తే కొల్లబోతోందని కంప్ట్రోలర్ ఆడిటర్ జనరల్ నివేదికాంశాలు స్పష్టీకరించాయి. లీటరు పాలలో నీళ్లు కలిపి 81 మందికి పంచిన యూపీ బాగోతం, ఎన్నో రాష్ట్రాల్లో విద్యార్థుల సంఖ్యను అధికంగా చూపి ఆహార ధాన్యాలను దారి మళ్ళించిన ఉదంతాలు.. సమున్నతాశయంతో ఆరంభించిన పథకం మాటున అవినీతి, అక్రమాల ఉరవళ్లకు అద్దంపట్టాయి.
అవసరానుగుణంగా సహేతుక కేటాయింపులు కొరవడి బిల్లుల చెల్లింపులు ఎక్కడికక్కడ నిలిచిపోయిన ఘటనలూ ఎన్నో వెలుగు చూశాయి. ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకుని లెక్కిస్తే గత ఏడేళ్లలో మధ్యాహ్న భోజన పథకానికి కేటాయింపులు 32.3 శాతం మేర తెగ్గోసుకుపోయాయన్న ప్రఖ్యాత ఆర్థికవేత్త జీన్ డ్రెజ్ విశ్లేషణ- సంస్కరణ ఎక్కడినుంచి మొదలుకావాలో చెప్పకనే చెబుతోంది.
ఆరోగ్యం ఛిద్రమై..
మధ్యాహ్న భోజన పథకంలో వరి, గోధుమల స్థానే సజ్జలు, కొర్రల వంటి చిరుధాన్యాలతో సిద్ధం చేసిన ఆహారాన్ని అందిస్తే- అది పిల్లల్లో యాభైశాతం అధిక వృద్ధికి దోహదపడుతుందన్న ఇటీవలి పరిశోధనల ఫలితాల్నీ ప్రభుత్వాలు పరిగణనలోకి తీసుకోవాలి. కొవిడ్ కోర సాచక మునుపే ముప్ఫై రాష్ట్రాల్లో నమూనాలు సేకరించి చేపట్టిన విస్తృత కసరత్తు- విటమిన్లు ధాతు లోపాలతో ఆరోగ్యం ఛిద్రమై రేపటి పౌరులు ఎందరో గిడసబారిపోతున్నట్లు ధ్రువీకరించింది.
ఉపాధి అవకాశాలు క్షీణించి, పోషకాహార లోపాలు మరింతగా ముమ్మరించిన ప్రస్తుత తరుణంలో- రాబోయే కొన్ని తరాలను భద్రంగా సంరక్షించుకునేలా ప్రభుత్వాల సంక్షేమ వ్యూహాలు పదును తేలాలి!