ETV Bharat / opinion

సత్వర న్యాయానికి మేలిమి మార్గం! - సుప్రీంకోర్టు

వివాదమేదైనా కోర్టుల వరకు వెళ్తే ఎంతో ఖర్చు, సుదీర్ఘ సమయం వెచ్చించక తప్పదు. దానిని నివారించాలంటే మధ్యవర్తిత్వమే మేలని సీజేఐ జస్టిస్ జస్టిస్‌ ఎన్‌.వి.రమణ సహా న్యాయ నిపుణుల అభిప్రాయం. కోర్టులో ఒకరు గెలిచి, మరొకరు ఓడిపోతారు. కానీ మధ్యవర్తిత్వం వల్ల ఉభయులూ గెలుస్తారు.

mediation
మధ్యవర్తిత్వం
author img

By

Published : Aug 9, 2021, 5:57 AM IST

బ్రిటిష్‌ వలస పాలకులు దేశం నుంచి నిష్క్రమించినా వారు ఇక్కడ స్థాపించిన ఖరీదైన, జాప్యానికి ఆలవాలమైన న్యాయవ్యవస్థ మాత్రం పెద్దగా మార్పులు లేకుండా కొనసాగుతోంది. ఎటువంటి భేదాలూ లేకుండా పౌరులందరికీ సత్వరం సమన్యాయం జరగాలన్న రాజ్యాంగ మౌలిక సూత్రానికి ఇది పూర్తిగా విరుద్ధం. దేశంలో వివిధ అంచెల న్యాయస్థానాల వద్ద నాలుగు కోట్లకు పైగా కేసులు ఏళ్లతరబడి మగ్గుతున్నాయంటే కారణం- కాలం చెల్లిన వలస కాలపు విధానాలను అనుసరిస్తుండటమే. సంప్రదాయ కోర్టుల వెలుపల వివాదాల పరిష్కారానికి ప్రయత్నిస్తే న్యాయం శీఘ్రంగా, అదీ తక్కువ వ్యయంతో సాకారమవుతుందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ పునరుద్ఘాటించడం విశేష పరిణామం. అసలు ఏ వివాదాన్నైనా విచారణ వరకు రాకముందే విధిగా పరిష్కరించుకోవాలని ఆయన సూచించారు. దీనికోసం ఇప్పటికే అందుబాటులో ఉన్న వ్యవస్థలను ఉపయోగించుకొంటే న్యాయ సాధన వేగం, సామర్థ్యం పుంజుకొంటాయి. సంప్రతింపులు, రాజీ, మధ్యవర్తిత్వం సహాయంతో కోర్టుల వెలుపల వివాదాల పరిష్కారానికి ప్రత్యామ్నాయ వ్యవస్థ (ఏడీఆర్‌), ఆన్‌లైన్‌లో వివాద పరిష్కార వ్యవస్థ (ఓడీఆర్‌) అందుబాటులో ఉన్నాయి. మధ్యవర్తిత్వం ద్వారా వైవాహిక వివాదాల పరిష్కారంలో జస్టిస్‌ ఎన్‌.వి.రమణ, సాటి న్యాయమూర్తులు జస్టిస్‌ ఏఎస్‌ బోపన్న, జస్టిస్‌ సూర్యకాంత్‌లతో కలిసి చేసిన కృషి ఆదర్శప్రాయంగా నిలుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో కలహాల వల్ల 20 ఏళ్లుగా వేరుపడి జీవిస్తున్న దంపతులను మళ్ళీ ఒక్కటి చేయడానికి వారి మధ్యవర్తిత్వం తోడ్పడింది. భావోద్వేగాలు శ్రుతిమించడం వల్ల విడిపోయిన దంపతులను మానసికంగా దగ్గర చేయడానికి మధ్యవర్తిత్వం ఉత్తమ మార్గమని వారు నిరూపించారు.

సమయం, ధనం ఆదా

ఇద్దరు కక్షిదారులు పరిష్కారం కోసం కోర్టుకు ఎక్కితే- ఎవరికి వారే ఎదుటి వ్యక్తి ఓడిపోయి తానే గెలవాలనే కాంక్షతో రాజీ ప్రసక్తే లేకుండా హోరాహోరీ న్యాయపోరాటం సాగిస్తారు. అదే ఒక మధ్యవర్తి సాయంతో ప్రయత్నిస్తే ఉభయతారక పరిష్కారం సాధించగలుగుతారు. కోర్టులో ఒకరు గెలిచి, మరొకరు ఓడిపోతారు. మధ్యవర్తిత్వం వల్ల ఉభయులూ గెలుస్తారు. పైగా ఇది తక్కువ ఖర్చుతో, వేగంగా సమర్థంగా జరిగిపోయే పరిష్కార ప్రక్రియ. కక్షిదారులకు, కుటుంబాలకు కోర్టు ఫీజులు, వకీలు ఖర్చులు తగ్గుతాయి. సమయం ఆదా అవుతుంది. ఉభయ కక్షిదారుల మధ్య సామరస్యం నెలకొనే అవకాశాలు మెండుగా ఉంటాయి. దీనివల్ల విడిపోయిన దంపతులు మళ్ళీ కలవడానికి అనువైన వాతావరణం నెలకొంటుంది. రెండు కుటుంబాలు ఆర్థికంగా నష్టపోకుండా ఉంటాయి. వ్యాపార వివాదాలనూ మధ్యవర్తిత్వంతో పరిష్కరించుకుంటే కంపెనీలు, వ్యాపార వర్గాలతోపాటు దేశానికీ ఆర్థిక ప్రయోజనం చేకూరుతుంది. గ్రామీణ భారతంలో ప్రాచీన కాలం నుంచి స్థానిక పంచాయతీలు కుటుంబ, ఆస్తి తగాదాల్లో, ఇతర వివాదాల్లో మధ్యవర్తిత్వం నెరపేవి. స్థానిక వివాదాలను స్థానికంగానే పరిష్కరించుకునేవారు. బ్రిటిష్‌ వలస పాలకులు ఈ స్థానిక తీర్పరి వ్యవస్థను నిర్వీర్యం చేసి తమ సొంత న్యాయస్మృతులను భారత్‌పై రుద్దారు. స్వాతంత్య్రం వచ్చిన తరవాత మళ్లీ మధ్యవర్తిత్వానికి గుర్తింపు లభించసాగింది. 1987లో పార్లమెంటు ఆమోదించిన లీగల్‌ సర్వీస్‌ అథారిటీ చట్టం న్యాయమూర్తుల మధ్యవర్తిత్వంతో వివాద పరిష్కారానికి వీలు కల్పించింది. ఇలా పరిష్కారమైన కేసులకు కోర్టు ఫీజు మినహాయించింది. సదరు పరిష్కారానికి సాధికార న్యాయసమ్మతి కల్పించింది. మోటారు వాహనాల చట్టం, బీమా చట్టం కింద క్లెయిముల కేసులను, సివిల్‌ కేసులను లోక్‌ అదాలత్‌ల పరిధిలో పరిష్కరించుకోవడానికి అనుమతిస్తున్నారు. ఇలాంటి కేసుల్లో కోర్టు ఫీజును వాపసు చేస్తున్నారు. 2019లో జాతీయ, రాష్ట్ర స్థాయుల్లో లోక్‌ అదాలత్‌లు మొత్తం 59,17,932 వివాదాలను పరిష్కరించాయి. వీటిలో 46.6శాతం కేసులను విచారణకు రాకుండానే చక్కబెట్టారు.

కేంద్రీకృత వ్యవస్థ అవసరం

సుప్రీంకోర్టు మొదటి నుంచీ మధ్యవర్తిత్వానికి ప్రాధాన్యమిస్తోంది. 2005లో సేలం అడ్వొకేట్స్‌ బార్‌ అసోసియేషన్‌ వర్సెస్‌ యూనియన్‌ ఆఫ్‌ ఇండియా కేసులో ఈ అంశం ప్రస్ఫుటమైంది. మధ్యవర్తిత్వ నిబంధనలను రూపొందించి, కోర్టు అనుబంధ మధ్యవర్తి కేంద్రాలను ఏర్పాటు చేయాలని ఆ కేసులో సుప్రీంకోర్టు ఆదేశించింది. మధ్యవర్తిత్వం, రాజీ ప్రాజెక్టు కమిటీని ఏర్పాటు చేసి, కోర్టుల సాయంతో మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కారానికి వీలు కల్పించింది. అయితే, అవగాహనలోపం వల్ల దిగువ స్థాయి కోర్టులు ఈ మేరకు చొరవ తీసుకోలేదు. కోర్టు అనుబంధ మధ్యవర్తి కేంద్రాల్లో నియమించడానికి తగు శిక్షణ పొందినవారూ అందుబాటులో లేరు. ఏతావతా మధ్యవర్తిత్వ సాధనకు ప్రభుత్వం, కోర్టులు మొగ్గు చూపినా, అందుకు సమగ్ర ప్రాతిపదికను ఏర్పరచుకోకపోవడం పెద్ద లోపం. అందుకే తాత్కాలిక చర్యలకు బదులు మధ్యవర్తిత్వంపై పార్లమెంటు తక్షణం ప్రత్యేక చట్టం చేయాలని 2019నాటి ఎం.ఆర్‌.కృష్ణమూర్తి వర్సెస్‌ న్యూ ఇండియా ఎస్యూరెన్స్‌ కంపెనీ లిమిటెడ్‌ కేసులో సుప్రీంకోర్టు సూచించింది. దీనికి తోడు మధ్యవర్తిత్వ ప్రమాణాలు రూపొందించి, ధ్రువీకరణ పత్రాల జారీ ద్వారా మధ్యవర్తులను నియమించాలి. ఇందుకు ఓ కేంద్రీకృత సంస్థను ఏర్పరచాలి. దిగువ కోర్టుల న్యాయమూర్తుల్లో, కక్షిదారులు మధ్యవర్తిత్వం ఆవశ్యకతపై అవగాహన, చైతన్యం పెంచాలి. ప్రైవేటు మధ్యవర్తిత్వం ద్వారా కుదిరిన పరిష్కారానికి చట్టబద్ధత కల్పించాలి. డిగ్రీ, పీజీ స్థాయుల్లో మధ్యవర్తిత్వాన్ని పాఠ్యాంశంగా చేర్చాలి. మధ్యవర్తిత్వ ప్రక్రియ సాఫీగా సాగడానికి అవసరమైన మౌలిక వసతులు కల్పించాలి. ఇందుకు ప్రభుత్వం, న్యాయవ్యవస్థ పాలనాపరంగా చేతులు కలపాలి. ఆర్థికంగా నిధులు అందించాలి. ఈ చర్యలను యుద్ధ ప్రాతిపదికపై తీసుకుని మధ్యవర్తిత్వ ప్రక్రియను శీఘ్రమే పట్టాలకెక్కించాలి.

కోర్టులపై తగ్గిన భారం

అమెరికా, ఐరోపా సమాఖ్య (ఈయూ) దేశాలు మధ్యవర్తిత్వానికి ఎప్పటినుంచో ప్రాధాన్యమిస్తున్నాయి. కుటుంబ, వాణిజ్య, కార్మిక, వినియోగ, సివిల్‌ వివాదాలపై కోర్టుకు ఎక్కేముందు తప్పనిసరిగా మధ్యవర్తిత్వంతో సమస్య పరిష్కారానికి ప్రయత్నించాలని నిబంధన విధించాయి. భారత్‌లో సైతం ఇలాంటి నిబంధన రావాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ అభిలషిస్తున్నారు. సంపన్న దేశాల్లో 75 నుంచి 80శాతం కేసులు మధ్యవర్తిత్వం ద్వారానే పరిష్కారం కావడంవల్ల కోర్టులపై భారం తగ్గింది. యావత్‌ న్యాయపాలన వ్యవస్థ పటిష్ఠమయింది. అందుకే ఇటలీలో వివిధ వివాదాలను మొదట ప్రభుత్వ మధ్యవర్తి లేదా ప్రైవేటు మధ్యవర్తి ద్వారా పరిష్కరించుకోవడానికి ప్రయత్నించాలని, అది కుదరనప్పుడు మాత్రమే కోర్టుకు రావాలనే నిబంధనను అమలు చేస్తున్నారు. ఫలితంగా కోర్టులపై 70శాతం పని ఒత్తిడి తగ్గింది.

- డాక్టర్‌ చెన్నుపాటి దివాకర్‌ బాబు

(ప్రిన్సిపల్‌, శ్రీమతి వి.డి.సిద్ధార్థ న్యాయ కళాశాల, విజయవాడ)

ఇదీ చూడండి: 'మధ్యవర్తిత్వమే ఉత్తమం- సంధి కుదరకపోతే వినాశనం!'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.