జీవితంలో ఒకసారైనా ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించాలని పర్వతారోహకులు కలలు కంటారు. కానీ ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించి తమ స్వప్నాలను సాకారం చేసుకునేవారు మాత్రం అందులో చాలా తక్కువమందే. ఎవరెస్టు శిఖరంపై మనిషి జయకేతనం ఎగురవేసి నేటికి 68 ఏళ్లు గడిచాయి. నేపాల్‌కు చెందిన టెన్జింగ్ నార్గే, న్యూజిలాండ్ దేశస్థుడు ఎడ్మండ్ హిల్లరీ సంయుక్తంగా 1953 మే 29వ తేదీన ఎవరెస్టు అధిరోహించారు. అందుకనే మే 29వ తేదీని అంతర్జాతీయ ఎవరెస్టు దినోత్సవంగా ప్రకటించారు. ఈ జంట కన్నా ముందు దశాబ్దాల తరబడి ఎందరో సాహసికులు ఎవరెస్టు అధిరోహించేందుకు ప్రయత్నం చేశారు. కానీ ఫలితం సాధించలేకపోయారు. నార్గే, హిల్లరీ ద్వయం ఎన్నో కష్టనష్టాలకోర్చి ఎవరెస్టు పర్వతం పైకి చేరుకున్నారు. భావితరాలకు మార్గదర్శకులుగా నిలిచారు.
చైనా కుతంత్రం
నేపాల్, టిబెట్, చైనా దేశాల భూభాగంలో విస్తరించిన ఎవరెస్టు శిఖరం సముద్ర మట్టానికి 8,848 మీటర్ల (29,031 అడుగుల) ఎత్తులో ఉంది. దాదాపు ఏడు దశాబ్దాలుగా నేపాల్ దక్షిణం దిశగా 'కుంబూ ఐస్ ఫాల్' మీదుగా శిఖరారోహణ చేస్తున్నారు. ఇది ఒక్కటే రాజమార్గం. అయితే పుష్కర కాలం నుంచి చైనా ఎవరెస్టు పేరిట వ్యాపారం మొదలు పెట్టింది. తాను ఆక్రమించుకున్న టిబెట్ ద్వారా ఎవరెస్టు పర్వతారోహణకు డ్రాగన్ తెర తీసింది. నేపాల్‌కు లభిస్తున్న పేరు, ప్రఖ్యాతులు; ఆదాయాన్ని దెబ్బ తీసేందుకు ఈ కుతంత్రం పన్నింది. పర్వతారోహకులను అయోమయంలో పడేసింది. నేపాల్ వైపు నుంచి వెళ్లే వారికి ఆ దేశ పర్యాటక శాఖ, పర్వతారోహణ సంస్థ సంయుక్తంగా గుర్తింపునిస్తాయి. చైనా నుంచి వెళ్ళే పర్వతారోహకులకు అక్కడి సంస్థ ఎలాంటి గుర్తింపూ ఇవ్వదు. వివరాలు వెల్లడించదు. కొన్నిసార్లు చైనీస్ మౌంటెనీరింగ్ అసోసియేషన్, చైనీస్ టిబెట్ పర్వతారోహణ సంస్థ పేరు మీద సర్టిఫికెట్ ఇస్తుంది. అయితే అది చైనీస్ భాషలో మాత్రమే ఉంటుంది. దానిపై ఎలాంటి చిరునామా ఉండదు. చైనా వైపు నుంచి పర్వతారోహణ వివరాలు బయట ప్రపంచానికి తెలియకుండా జాగ్రత్త పడుతున్నారు. అసలు చైనా వైపు నుంచి పర్వతారోహకులు అధిరోహిస్తున్నది ఎవరెస్టు శిఖరమేనా అనే విషయంలోనూ భిన్న వాదనలున్నాయి. ఇందులో నిజానిజాలపై ప్రపంచ దేశాలు, పర్వతారోహణ సంస్థలే నిగ్గుతేల్చాలి.
భారత్‌లో మొదట పర్వతారోహణ శిక్షణ సంస్థ 'హిమాలయన్ మౌంటెనీరింగ్ ఇన్‌స్టిట్యూట్' డార్జిలింగ్‌లో ఏర్పాటైంది. తరవాత ఎన్నో సంస్థలు వెలశాయి. ఈ సంస్థలు బేసిక్, అడ్వాన్స్ కోర్సులను 28 రోజులపాటు నిర్వహిస్తాయి. శిక్షణలో భాగంగా ఉదయం నాలుగు గంటల నుంచి రాత్రి తొమ్మిది వరకు విరామం లేకుండా తర్ఫీదు ఉంటుంది. ఇలా శిక్షణ పూర్తి చేసిన వారు మన దేశంలో మంచు పర్వతాలను అధిరోహించడానికి భారతీయ పర్వతారోహణ సంస్థ అనుమతిస్తుంది. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్ని ఖర్చులను భరించి కొందరు విద్యార్థులను ఎవరెస్టు శిఖరారోహణకు పంపింది. వాళ్లు తిరిగి వచ్చిన తరవాత రాష్ట్రం విడిపోయి తెలంగాణ ఆవిర్భవించింది. తెలంగాణ సీఎం కేసీఆర్ పర్వతారోహకులకు రూ.25 లక్షల నగదు, మూడు ఎకరాల భూమి, ఇల్లు బహుమానంగా ఇచ్చి ప్రోత్సహించారు. అనంతరం తెలంగాణ రాష్ట్రంలో చాలామంది పర్వతారోహణకు ఆసక్తి చూపారు.
పర్వతారోహణకు ప్రత్యేక గుర్తింపు అవసరం
దేశవ్యాప్తంగా పర్వతారోహకుల్లో ఉన్న ఆసక్తిని ఆసరాగా తీసుకుని- సొమ్ము చేసుకునే దళారీ వ్యవస్థలు పుట్టుకొచ్చాయి. శారీరక దారుఢ్యం, అనుభవం వంటి వాటిని పరిగణనలోకి తీసుకోకుండా, ఆరోగ్య సమస్యలు ఉన్నవారినీ పర్వతారోహణకు తీసుకువెళుతున్నాయి. దీనివల్ల కొందరు ఔత్సాహిక యువకుల ప్రాణాలకే ప్రమాదం పొంచి ఉంది. ఇలాంటి సాహస యాత్రలు రాష్ట్ర స్థాయి పర్వతారోహణ సంస్థ, యువజన సర్వీసుల శాఖల ద్వారా నిర్వహిస్తే ఔత్సాహికులకు న్యాయం జరుగుతుంది. ఎవరెస్టు లేదా ఇతర పర్వతాలు అధిరోహించే వారికి నిర్దిష్టమైన మార్గదర్శకాలు లేకపోవడం వల్ల వారిలో గందరగోళం నెలకొంటోంది. 2019లో తెలంగాణ నుంచి ఇరువురు యువకులు నేపాల్ మీదుగా విజయవంతంగా ఎవరెస్టు శిఖరారోహణ చేశారు. వారికి ప్రభుత్వ శాఖల నుంచి ఎలాంటి సహకారం లభించలేదు. దాతల సహకారంతోనే వారు పర్వతారోహణ సాగించారు. నిజమైన పర్వతారోహకులను ప్రభుత్వం ఆదుకొని ప్రోత్సహించాలి. దురదృష్టవశాత్తు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పర్వతారోహణకు ప్రత్యేక గుర్తింపు ఇవ్వడం లేదు. గుర్తింపునిస్తే మాత్రం ఎందరో యువకులు ఎవరెస్టు అధిరోహణకు ముందుకు వచ్చి భారత కీర్తి పతాకను సగర్వంగా ఎగరేసే అవకాశం ఉంది.
- కె.రంగారావు (అడ్వెంచర్ క్లబ్ ఆఫ్ తెలంగాణ వ్యవస్థాపకులు)
ఇదీ చదవండి: 'ఏకపక్ష చర్యను ఎట్టి పరిస్థితుల్లో సహించం'