అసలు ఏదో నకిలీ ఏదో ఎవరూ పోల్చుకోలేని విధంగా వస్తూత్పత్తుల్ని తయారుచేసి జనం మీదకు వదలడంలో మనవాళ్లు మహా దిట్టలు. విత్తనాలు మొదలు ఔషధాల దాకా వేటినీ వదలకుండా మార్కెట్లను ముంచెత్తడంలో ఆరితేరిపోయారు నకిలీ సృష్టికర్తలు! ఆ సృజన పౌరుషం అంతటితో ఆగిపోతే భారతావని పరువేం గాను! తాడిని తన్నేవాడి తలదన్నే వాడుంటాడన్నట్లుగా నకిలీ మందుల తయారీలో తలమునకలయ్యే ప్రబుద్ధులు కొందరైతే- 'డాక్టర్' అన్న మాటను పేరు ముందు, నాజూకైన డిగ్రీల్ని పేరు చివర తగిలించేసుకొని... బడా వైద్యులుగా చలామణీ అయిపోతున్న నకిలీ ధన్వంతరుల సంఖ్యా తక్కువేమీ కాదు. ఎంబీబీఎస్ చదివి డాక్టర్ పట్టా చేతపట్టి, ప్రైవేటు ఆసుపత్రి కట్టాలన్న కోరిక తీరకుండానే తమ్ముడు తనువు చాలిస్తే- ఆ లక్ష్యం తాను సాధించాలన్న తపనతో హైదరాబాద్ నగరంలో 30 పడకల ఆసుపత్రి కట్టి, 'బీకామ్' చదువు మధ్యలో ఆపేసినా- హాస్పిటల్‌ఛైర్మన్‌గా, అంతకు మించి వైద్యుడిగా అవతారం ఎత్తిన ఓ అన్న బాగోతం తాజాగా వెలుగు చూసింది. తీగ లాగితే కదిలిన డొంకలు- ఇండియాలో జనారోగ్యం అధికంగా నకిలీ డాక్లర్ల హస్తవాసి పైనే ఆధారపడి ఉందన్న నిష్ఠుర సత్యాన్ని నిలువుటద్దంలో చూపిస్తున్నాయి. అదేమిటో చిత్తగించండి!
నల్లులు రక్తం పీల్చినంత చులాగ్గా నల్లబజారు వర్తకులూ హస్తలాఘవం ప్రదర్శిస్తుంటారు. కొవిడ్ రోగులకు వాడే రెమ్‌డెసివర్ ఇంజక్షన్లను నల్లబజారుకు తరలిస్తున్న ముఠా పోలీసులకు చిక్కగా, వారిలో ఒకడు సమీర్ ఆసుపత్రిలో ఫార్మసిస్టు! ఆ అక్రమ దందాలో ఆసుపత్రి నిర్వాహకులకూ ప్రమేయం ఉందా అని ఆరా తీయబోతే- హాస్పిటల్‌ఛైర్మన్, ఎండీలుగా చక్రం తిప్పుతున్న ఇద్దరు నకిలీ వైద్యుల గుట్టు రట్టయింది. పదో తరగతి వరకే చదివిన ముజీబ్ అనే వ్యక్తి డాక్టర్ మహ్మద్ అబ్దుల్ పేరుతో ఆధార్‌కార్డు సంపాదించాడు. దాని ఆధారంగా 2017లో డీఎం & హెచ్‌ఓకు దరఖాస్తు చేశానని, ఎలాంటి ధ్రువపత్రాలూ చూపాల్సిన అవసరం లేకుండానే ఆసుపత్రికి అనుమతులు వచ్చేశాయని అతగాడు చెబుతున్నాడు. తన పేరు చివర 'ఎండీ' అని రాసుకొనే డాక్టర్ ముజీబ్- తాను మెడిసిన్ చెయ్యలేదని, కేవలం ఆసుపత్రికే 'ఎండీ'ననీ ఎవరైనా గుచ్చి గుచ్చి అడిగితే చెప్పేవాడు. వివిధ ఆసుపత్రుల్లో సుదీర్ఘకాలం 'పని చేసిన' తనను అంతా 'డాక్టర్' అని పిలిచేవారట. ఆధార్‌కార్డులో పేరూ అలానే వచ్చిందట. ఆసుపత్రి అనుమతులకూ నకిలీ ధ్రువపత్రాల అవసరం లేకుండానే పని అయిపోయిందట! ఇంత అనాయాసంగా వైద్యుడైపోవడం- ప్రపంచంలో మరేదేశంలోనైనా సాధ్యమా అన్న సందేహాలు పక్కన పెట్టి, దేశీయంగా నకిలీ డాక్టర్ల ఉరవడిని జనారోగ్య పరిరక్షణలో వాళ్ల ఒరవడినీ గుర్తించాలి!
ఇండియాలాంటి దేశంలో వైద్య వృత్తిలోకి ప్రవేశించడమన్నది- ఆషామాషీ వ్యవహారం కాదు. విద్యార్థులకు కేవలం ఆసక్తి ఉంటే సరిపోదు. నిద్రాహారాలు మాని తపోదీక్షలా పోటీ పరీక్షలకు సిద్ధమైనా- అత్యున్నత ర్యాంకులు ఒడిసిపడితే తప్ఫ.. సర్కారీ కళాశాలల్లో సీట్లు దక్కవు. ఎంబీబీఎస్ చేశాక పీజీ చెయ్యడం ఇంకో మహా క్రతువు. ఆ కష్టం ఏ మాత్రం పడకుండా రాత్రికి రాత్రి పుట్టుకొచ్చే నకిలీ డాక్టర్ల దందా సామాన్యమైనది కాదు. ఇండియా వ్యాప్తంగా అల్లోపతి డాక్టర్లుగా చలామణీ అవుతున్న వారిలో 31.4శాతం ప్రాథమికోన్నత విద్య వరకే అభ్యసించారని నాలుగేళ్లనాడు ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదించింది. వైద్యపరమైన అర్హతలు లేకుండా 57.3శాతం డాక్టర్లుగా చక్రం తిప్పుతున్నారనీ ప్రకటించింది. ఆ వివరంపై కేంద్రప్రభుత్వం నొచ్చుకోవడమే కాదు, ఆ సమాచారం అంతా తప్పుల తడక అనీ తీర్మానించింది. పట్టణాల్లో 58.4శాతం, పల్లెల్లో 18.8శాతం అల్లోపతి డాక్టర్లకే వైద్య విద్యార్హతలున్నాయన్న డబ్ల్యుహెచ్‌ఓ నివేదికపై మొదట్లో భగ్గుమన్నా- ఆ తరవాత వాస్తవాన్ని ప్రభుత్వాలూ గుర్తించాయి. మూడొంతుల గ్రామాల్లో ఆరోగ్య సేవలందించే వ్యక్తి ఒక్కరైనా ఉన్నారని, అందులో 86శాతం ప్రైవేటు డాక్టర్లని, 68శాతానికి వైద్యపరమైన శిక్షణ ఏదీ లేదని సెంటర్ ఫర్‌పాలసీ రీసెర్చ్ అధ్యయనమూ ఇటీవల చాటింది. డాక్టర్ల కొరత జనారోగ్యాన్ని ఇంతగా చెండుకు తింటున్నప్పుడు- నాడి పట్టడానికి నకిలీ వైద్యులు ధాటిగా దూసుకురావడంలో వింతేముంది? అలాంటివాళ్లను ఏరివేసే యంత్రాంగాల మాటేమిటి అన్న ప్రశ్నకు నిరుడు ఫిబ్రవరిలో మహారాష్ట్ర పెద్దలు ఏ సమాధానం సెలవిచ్చారో విని తరించాలి.
ముంబయిలోని కాలేజ్ ఆఫ్ ఫిజీషియన్స్ అండ్ సర్జన్స్ (సీపీఎస్) మాజీ విద్యార్థి డాక్టర్ స్నేహాల్ విద్యార్థుల నుంచి తలో అయిదు లక్షల రూపాయల దాకా వసూలు చేసేవాడని, పరీక్షలో తప్పినా డిగ్రీకి ఢోకా లేకుండా చూసేవాడని పోలీసు విచారణలో తేలింది. అలా అతగాడి నుంచి డిగ్రీలు కొనుగోలు చేసినవాళ్లు ఈ నకిలీ ధ్రువపత్రాల ఆధారంగానే మహారాష్ట్ర మెడికల్ కౌన్సిల్ అనుమతులు పొంది మహారాష్ట్రలో వైద్యసేవలు అందించసాగారు. జల్‌గావ్‌లో ఓ ‘వైద్యుడి’ అర్హతపై అనుమానం వచ్చిన పోలీసులు సీపీఎస్‌ను ఆశ్రయించి పట్టా సరైనదేనా అని వాకబు చేయడంతో గూడుపుఠాణీ బయటపడింది. పోలీసులు ఇచ్చిన సమాచారం మేరకు సమగ్ర పరిశీలన చేపట్టిన మెడికల్ కౌన్సిల్ 2014-15 మధ్య 78మంది సమర్పించిన దరఖాస్తులు నకిలీవేనని తేల్చింది. 57మంది ప్రాక్టీసు మీదా వేటు వేసింది. డిగ్రీలు అసలువా, నకిలీవా అని విచారించే 'నైపుణ్యం' తనకు లేదన్నది మెడికల్ కౌన్సిల్ ఉవాచ. అసలు ఆధార్ కార్డు చూసే అనుమతులిచ్చేసే అవ్యవస్థ నిక్షేపంగా వర్ధిల్లుతుంటే - ప్రజల ప్రాణాలకు పూచీ ఉంటుందా?
తొండ ముదిరి ఊసరవెల్లి కావడం అంటే ఏమిటో, కొన్నేళ్లు కాంపౌండర్‌గా చేసిన వ్యక్తి డాక్టరుగా కొత్త వేషం కట్టడం చూస్తే అవగతమవుతుంది. ఎందుకు ఇంజినీరింగ్ చేశాడో తెలియని నాగేంద్ర ప్రసాద్ అనే వ్యక్తి తాను డాక్టర్ అవతారం ఎత్తడం మాత్రమే కాదు- ఇంటర్ చదివిన భార్యను, బావమరిదినీ స్పెషలిస్టు వైద్యులుగా తీర్చిదిద్ది కర్నూలు ఆదోని పరిధిలో రెండు సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు ఏర్పాటు చేశాడు. తిరువణ్నామలైకి చెందిన నకిలీ వైద్య దంపతులు పదేళ్లలో నాలుగు వేలమందికి గర్భస్రావం చేశారు. ఇలాంటి నకిలీ వైద్యుల పాలబడి ప్రజల ప్రాణాలు గాలిలో దీపాలు అవుతున్నా- ఖర్మకాలి పట్టుపడితే తప్ప వాళ్ల దందాకు అడ్డూఆపూ ఉందా? నకిలీ వైద్యుల్ని ఏరివేయకుండా జాతి ఆరోగ్యం కుదుటపడుతుందా?
- పర్వతం మూర్తి