భారత్‌లో కొవిడ్ రెండో దశ కరాళ నృత్యం చేస్తోంది. ఇప్పటికే రోజువారీ కేసుల్లో ప్రపంచ రికార్డు సృష్టించిన ఇండియాలో పరిస్థితి మరెంతగా విషమించనుందో అన్న భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇద్దరు కొవిడ్ రోగులు ఆస్పత్రిలో ఒకే పడకపై యాతన పడటం, స్వయంగా కొనుక్కున్న ఆక్సిజన్ సిలిండర్‌ను అంటిపెట్టుకుని పడక కోసం ఎదురుచూస్తున్న మరో అభాగ్య రోగి- ఇలాంటి ఉదంతాలు మనసును కలచివేస్తున్నాయి. జాతికి సిగ్గుచేటుగా నిలుస్తున్నాయి. ఆస్పత్రుల్లో ఆక్సిజన్ కొరతను తీర్చడమెలాగన్న అంశంపై ప్రధానమంత్రి స్వయంగా సమీక్షా సమావేశాన్ని నిర్వహించవలసి వచ్చిందంటే, పరిస్థితి ఎంతగా దిగజారిందో అర్థం చేసుకోవచ్చు. సాధారణంగా ఆక్సిజన్ గిరాకీ, సరఫరాల గురించి సమీక్షించి, తగిన చర్యలు తీసుకోవలసిన బాధ్యత- దిగువ, మధ్యశ్రేణి ప్రభుత్వ యంత్రాంగాలది. కొవిడ్ మొదటి దశ ప్రారంభమై ఏడాది కావస్తున్నా, ప్రభుత్వ యంత్రాంగం అజాగ్రత్తగా ఉండిపోయిందనడానికి ఇంతకన్నా నిదర్శనం అక్కర్లేదు. ఈ వ్యవస్థాగత లోపాలను ప్రశ్నించకపోతే, సరిదిద్దకపోతే- అలాంటివి పునరావృతమవుతుంటాయి.
వికేంద్రీకరణకు తిలోదకాలు
కొవిడ్ దశలవారీగా విజృంభిస్తుందని, దాన్ని అదుపుచేసే మందులు ఇంతవరకు లేవని తెలిసి కూడా- కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, స్థానిక పాలన యంత్రాంగాలు ముందుగానే ఎందుకు నివారణ, నియంత్రణ చర్యలు తీసుకోలేదన్నది అందర్నీ వేధిస్తున్న ప్రశ్న. కొవిడ్ మన సంస్థాగత, వ్యవస్థాగత లోపాల్ని బయటపెట్టింది. ఇటీవలి కాలంలో పాలన అతిగా కేంద్రీకృతమైంది. ప్రజాస్వామ్యంలో ఇది అత్యంత అవాంఛనీయ ధోరణి. భారత్ వంటి సువిశాల దేశంలో అధికారాలు, కార్యనిర్వహణ భారాలు పూర్తిగా కేంద్ర ప్రభుత్వం గుప్పిట్లో ఉండటం మంచిది కాదని మన రాజ్యాంగ నిర్మాతలు భావించారు. అందుకే రాష్ట్రాలు, స్థానిక సంస్థలకు సైతం అధికారాలు, విధులు, బాధ్యతలు పంచారు. కానీ, ప్రస్తుత తరం నాయకులు అధికార వికేంద్రీకరణ భావనను నిరాకరిస్తున్నారు.
కొవిడ్ సంసిద్ధతలో వ్యవస్థల వైఫల్యం
ప్రజల దగ్గర నుంచి ప్రభుత్వందాకా అన్నిరకాలుగా విఫలం కావడంవల్లే- ప్రస్తుతం కొవిడ్ కేసులు విజృంభించాయి. దేశం ఆర్థికంగా కోలుకోకుండా పెను సవాలు రువ్వుతున్నాయి. భారతీయులకు కరోనా వైరస్ పెద్దగా సోకదనే తప్పుడు ప్రచారం అందర్నీ నిర్లక్ష్యంలోకి నెట్టి, బాధ్యతారహితంగా ప్రవర్తించేలా చేసింది. కొవిడ్ మొదటి దశ ముగిశాక ప్రజలు జాగ్రత్తలు పాటించకుండా ఇష్టారాజ్యంగా తిరగడం, ప్రభుత్వాలు దీన్ని నివారించకుండా ఉదాసీనత పాటించడం మూలంగా పరిస్థితి తీవ్రతరమైంది. అతి ధీమాతో ముందస్తు నియంత్రణ ప్రణాళికను గాలికి వదిలేశారు. నీతి ఆయోగ్ మొదలుకొని వివిధ ప్రభుత్వ విభాగాల వరకు ఇదే అశ్రద్ధ! గతేడాది చేదు అనుభవాల నుంచి అవి ఏమీ నేర్చుకోకపోవడం వల్లనే ముంచుకొస్తున్న ముప్పును ముందే గ్రహించలేక, విపత్తును ఎదుర్కోవడానికి సన్నద్ధం కాలేకపోయాయి. రాజకీయ నాయకులు ఇలా విఫలమయ్యారంటే కొంతవరకు అర్థం చేసుకోవచ్చు. ప్రభుత్వ యంత్రాంగం అన్ని స్థాయుల్లో చతికిలపడటం ఏమాత్రం జీర్ణించుకోలేని అంశం.
ఆరోగ్య అత్యయిక పరిస్థితి
దేశవ్యాప్తంగా రోజువారీ కొవిడ్ కేసుల సంఖ్య గణనీయంగా పెరిగిపోవడం, వ్యాధిగ్రస్తులకు సరైన చికిత్సనందించే సదుపాయాలు లేకపోవడంపై- అత్యున్నత న్యాయస్థానం స్వయంగా స్పందించడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ప్రస్తుతం దేశం అత్యయిక తరహా పరిస్థితులను ఎదుర్కొంటోందని ఆవేదన వ్యక్తం చేస్తూ- కొవిడ్‌ను కట్టడి చేయడంలో జాతీయ ప్రణాళిక అవసరమని సుప్రీంకోర్టు విస్పష్టంగా ఆదేశించింది. ఈ మేరకు కేంద్రానికి తాజాగా నోటీసులు జారీ చేసింది. ఆరోగ్యపరమైన అత్యయిక పరిస్థితులను ఎదుర్కోవడానికి ముందస్తుగా ఆక్సిజన్‌ను నిల్వ చేసుకోకపోవడం, రెమ్ డెసివిర్ వంటి ముఖ్యమైన మందులను కావలసిన పరిమాణంలో ఉత్పత్తి చేయకపోవడం, ఆస్పత్రి పడకలను తగినంతగా పెంచకపోవడం, కొవిడ్ వ్యాపించకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోకపోవడం వంటి వైఫల్యాలు ప్రభుత్వ యంత్రాంగ పరంగా జరిగినవే. 2020 మే నెల నుంచి ఈ ఏడాది జనవరి చివరి వరకు కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలకు 38,867 వెంటిలేటర్లను సరఫరా చేసిందని కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి ఫిబ్రవరిలో ప్రకటించారు. అంటే ప్రభుత్వం 138 కోట్ల మంది భారతీయులకు రోజుకు కేవలం 144 వెంటిలేటర్లను సరఫరా చేయగలిగిందన్నమాట!
ప్రైవేటు సంస్థలే గతి
అన్ని అవసరాలనూ మార్కెట్టే తీరుస్తుందని, ప్రభుత్వం కేవలం ప్రోత్సాహక పాత్ర పోషించాలన్న తప్పుడు అవగాహన ప్రస్తుత దురవస్థకు మూలకారణం. ప్రైవేటు సంస్థలు తమ వ్యాపార వృద్ధి కోసమే తపిస్తాయి తప్ప ప్రజాసంక్షేమం కోసం పాటుపడవు. అయినా, ప్రభుత్వం వ్యాక్సినేషన్ల బాధ్యతను ప్రైవేటు రంగానికే వదిలేసింది. జనాభాలో కనీసం 80 కోట్ల మందికి టీకాలు వేస్తే కానీ, సామూహిక రోగనిరోధక శక్తి ఏర్పడదు. ఒక్కో వ్యక్తికి రెండు డోసులు వేయాలి కాబట్టి, కనీసం 160 కోట్ల డోసులు అవసరం. ఇంతటి బృహత్తర భారాన్ని ప్రైవేటు రంగానికి వదిలేయడం సమంజసం కాదు. ప్రైవేటు విపణికి పట్టం కట్టే అమెరికా సైతం ఇలాంటి తప్పు చేయలేదు. అక్కడ పూర్వ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ తమ జనాభా కోసం టీకాల ఉత్పత్తికి భారీగా వ్యయీకరించారు. ఎగుమతులు చేయకూడదని నియంత్రణ విధించారు. పూర్తిగా మార్కెట్‌కే వదిలేయకుండా ప్రభుత్వం సారథిలా వ్యవహరించాలనే అవగాహన వారిలో కనబడింది. మనవద్ద ప్రభుత్వం ఇలాంటి జాగరూకత ప్రదర్శించలేదు. ప్రతిదీ మార్కెట్‌కు వదిలేయకుండా భారత్ ఇమ్యూనోలాజికల్స్ వంటి ప్రభుత్వ వ్యాక్సిన్ ఉత్పత్తిదారులకు నిధులు కేటాయించాల్సింది. ప్రభుత్వ సంస్థలు సరసమైన ధరలకు భారీయెత్తున టీకాలు ఉత్పత్తి చేయగలిగేవి. ప్రైవేటీకరణే తారక మంత్రమంటున్న ప్రభుత్వం ఈ వాస్తవాన్ని పట్టించుకోలేదు.
మార్గాంతరం ఏమిటి?
కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ఇకనైనా సమష్టిగా సంక్షోభాన్ని అధిగమించాలి. దేశంలో ఒక్కసారిగా ఏర్పడిన గిరాకీకి తగినట్లుగా ఆక్సిజన్ తయారీ లేకపోవడం సమస్యగా పరిణమించింది. సాధారణంగా రూ.500కు దొరికే సిలిండర్ ధర ఇప్పుడు రూ.15,000కు పెరిగిపోయింది. ఆస్పత్రుల్లో ఆక్సిజన్ కొరత ఏర్పడి కొవిడ్ బాధితులు ప్రాణాలు కోల్పోతుండటం బాధాకరం. మరోవైపు, ప్రభుత్వం వచ్చే నాలుగైదు నెలల్లో వ్యాక్సిన్ ఉత్పత్తిని పదిరెట్లు పెంచాలి. రాజకీయ భేషజాలకు తావు ఇవ్వకుండా పాలన యంత్రాంగాన్ని ప్రజా సమస్యల పరిష్కారానికి పరుగులు తీయించాలి.
-డాక్టర్ ఎస్.అనంత్
(రచయిత- ఆర్థిక, సామాజిక రంగ నిపుణులు)
ఇదీ చూడండి: ప్రజారోగ్యానికి పెను సవాలు