కరోనా వైరస్ వ్యాప్తితో ప్రపంచంలోని అనేక దేశాల్లో ఆరోగ్య వ్యవస్థలు అతలాకుతలమయ్యాయి. ఆసుపత్రుల్లో కనీస సౌకర్యాలు లేని దయనీయ పరిస్థితులు దాపురించాయి. అభివృద్ధి చెందిన దేశాలు సైతం వసతుల కొరతకు అతీతం కావని తేలింది. జనాభా అధికంగా ఉండే మన దేశంలో వైరస్ ఆర్థిక, సామాజిక, ఆరోగ్య రంగాలను చిన్నాభిన్నం చేస్తుందని, పెద్ద సంఖ్యలో మరణాలు సంభవిస్తాయని అనేక అంతర్జాతీయ సంస్థలు, వైద్య విశ్వవిద్యాలయాలు చేసిన స్వల్పకాలిక పరిశోధనలు ఉటంకించాయి. కానీ భారత్ ఈ సమయంలో ఆరోగ్య రంగంలో స్వయంసమృద్ధి దిశగా కొన్ని అడుగులు వేసింది. పడకల సంఖ్యను పెంచుకోవడం సహా కొవిడ్ కాలంలో అత్యవసర చికిత్సలో ప్రధాన భాగమైన ఆక్సిజన్ అందరికీ అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు జరిగాయి. పూర్తి దేశీయ పరిజ్ఞానంతో వెంటిలేటర్లను తయారు చేసుకోవడమే కాకుండా విదేశాలకు ఎగుమతి చేసే స్థాయికి చేరుకున్నాం. కొవిడ్ చికిత్సలో భాగమైన అనేక మందులను మొదట్లో దిగుమతి చేసుకున్నా, తదనంతర కాలంలో వాటిని పూర్తిగా దేశంలోనే తయారు చేసుకునే సామర్థ్యం సమకూరింది. పాశ్చాత్య దేశాలతోపాటు దేశవాళీ సాంకేతిక పరిజ్ఞానంతో టీకా సమకూర్చుకొని అనేక దేశాలకు ఆదర్శ ప్రాయంగా నిలిచినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం కితాబునిచ్చింది.
ఆక్సిజన్ కొరతను అధిగమించాలి
ఇదంతా బాగానే ఉన్నా... ప్రస్తుతం కొవిడ్ చికిత్సలో అత్యంత ప్రధానమైన ఆక్సిజన్‌కు అనేక రాష్ట్రాల్లో కొరత ఏర్పడటం ఆందోళన కలిగిస్తోంది. నిజానికి అనేక దేశాలు గత ఏడాది ద్వితీయార్థంలోనే ఆక్సిజన్ కొరతతో సతమతమయ్యాయి. ప్రస్తుత సమయంలో ఒకరికొకరు అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకొని, రాబోయే సమస్యలను ముందే ఊహించి జాగ్రత్త పడాల్సిన తరుణమిది. ఆక్సిజన్ కొరత నెలకొన్న రాష్ట్రాలు పకడ్బందీ ప్రణాళికతో దానిని అధిగమించే వ్యూహాల్ని సిద్ధం చేసుకోవాలి.
అత్యంత కీలకం
ప్రకృతిలోని ప్రధాన వాయువుల్లో ఒకటైన ఆక్సిజన్- చుట్టూ ఉన్న గాలిలో కేవలం 21శాతం మాత్రమే ఉంటుంది. వాయు విభజన కేంద్రాల్లో- వాతావరణంలోని గాలిని తీసుకొని పలు దశల్లో ఆక్సిజన్‌తోపాటు ఇతర వాయువులనూ తయారు చేయవచ్చు. అయితే, క్రయోజెనిక్ ప్రక్రియ ద్వారా ఉత్పత్తి చేసే ఆక్సిజన్ సాధారణంగా 99 శాతంకన్నా అధిక స్వచ్ఛతను కలిగి ఉంటుంది. తద్వారా దీనిని వైద్య చికిత్సలకు మాత్రమే కాకుండా అనేక పరిశోధనల్లో ఉపయోగిస్తారు. అందుకే ఆక్సిజన్‌ను వైద్య పరిభాషలో ఒక ఔషధంగా పరిగణిస్తారు. అదనపు శుద్ధీకరణ దశలు లేకుండా వాయు విభజన ద్వారా ఉత్పత్తి అయిన ఆక్సిజన్‌ను కూడా చికిత్స కోసం సులభంగా వాడుకోవచ్చు. ఈ విభజన ప్రక్రియ అనేక కలుషిత పదార్థాలను తొలగిస్తుంది. అందుకని ఆసుపత్రుల్లో వాడుకోవడానికి అనుమతిస్తారు. ఈ ప్రక్రియల్లో తయారైన ఆక్సిజన్‌ను ట్యాంకుల్లో నిల్వ చేసి అవసరార్థం వాడుకోవడానికి అనుగుణంగా ఉందని ఆయా ఆసుపత్రుల్లో పరీక్షలు చేసి నిర్ధారిస్తారు. వైద్యపరంగా ఉపయోగకరమైన ఆక్సిజన్‌ను విక్రయించాలంటే లైసెన్స్ ఉండాల్సిందే. రోగుల ప్రయోజనాల పరిరక్షణ కోసం ఇలాంటి అనేక నిబంధనలు రూపొందించారు. గత రెండు వందల సంవత్సరాలుగా వైద్య చికిత్సలో ఆక్సిజన్ ప్రధాన భూమిక పోషిస్తోంది. ప్రాణాపాయ పరిస్థితుల్లో, ప్రాథమిక చికిత్సలో, సర్జరీ చేసే సమయంలో అనస్థీషియాలోనూ అంతర్భాగంగా ఉపయోగిస్తున్నారు.
ఆసుపత్రుల్లో ఉపయోగించే ఆక్సిజన్ సిలిండర్లు గత కొన్నేళ్లలో గణనీయమైన మార్పులతో సులభతరంగా ఉపయోగించేలా మార్పులు చెందాయి. వీటిని, క్షేత్రస్థాయిలోని వైద్య సిబ్బందితోపాటు, అంబులెన్సు డ్రైవర్లు సైతం సులభంగా ఉపయోగించే అవకాశం ఉంది. ప్రస్తుత కొవిడ్ కల్లోలంలో ఆసుపత్రుల్లో పడకలు సైతం అందుబాటులో లేని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో కూర్చున్న చోటే ఆక్సిజన్ అందించేలా సిలిండర్‌ల ద్వారా సరఫరా చేయవచ్చు. ఇలాంటి ప్రక్రియలో సిబ్బందికి మరింతగా శిక్షణ ఇవ్వడం ద్వారా కొవిడ్ రోగులకు వేగంగా ఆక్సిజన్ సౌకర్యం కలిగించవచ్చు. వైద్యపరమైన ఆక్సిజన్ తయారీకి వీలుకల్పించే జనరేటర్లు సైతం అందుబాటులోకి వచ్చాయి. ప్రపంచవ్యాప్తంగా వీటి ప్రాముఖ్యం, కొవిడ్ కాలంలో వీటి వినిమయం కూడా పెరిగింది.
లోటుపాట్లు సవరించుకోవాలి
కొవిడ్‌తో అత్యధికంగా ప్రభావితమైన 12 రాష్ట్రాల్లో ఎంపిక చేసిన వంద ఆసుపత్రుల్లో ఆక్సిజన్ ప్లాంట్లను నెలకొల్పడానికి ప్రభుత్వం పీఎంకేర్స్ నిధులను విడుదల చేసింది. అంతేకాకుండా 50వేల మెట్రిక్ టన్నుల ఆక్సిజన్‌ను విదేశాల నుంచి దిగుమతి చేసుకోవడానికీ ప్రణాళికలు సిద్ధం చేసింది. వీలైతే ఆక్సిజన్ ట్యాంకులను రైలుమార్గంలో సరఫరా చేయాలని సంకల్పించింది. ఆసుపత్రుల్లో సమయానికి ఆక్సిజన్ అందక చిన్న పిల్లలు మరణించిన హృదయ విదారక సంఘటనలు ఇంకా కళ్లముందు కదులుతున్నాయి. ఆయా దుర్ఘటనల నుంచి గుణపాఠాలు నేర్వకపోతే భవిష్యత్తులో భారీ మూల్యాన్ని చెల్లించాల్సి వస్తుంది. దేశంలో కనీస సౌకర్యాలకు నోచుకోని అనేక ఆసుపత్రులు ఎన్నో ఉన్నాయి. సత్వర చికిత్స అందిస్తే అనేక మరణాలను నివారించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో వ్యూహాత్మకంగా రాబోయే అవసరాలను ముందే గుర్తెరిగి ఆసుపత్రుల్లో సరైన సౌకర్యాలు కల్పించాలి. వైద్య వ్యవస్థలోని లోటుపాట్లను సత్వరమే సవరించుకోవాల్సిన సమయమిది.
కష్టంగా సరఫరా
ఆసుపత్రులు సాధారణంగా ద్రవరూపంలో ఉండే ఆక్సిజన్‌ను క్రయోజెనిక్ ట్యాంకుల్లో కొనుగోలు చేసి, నిల్వ చేసి తరవాత వాయు రూపంలోకి మార్చి గొట్టాల ద్వారా వార్డుల్లోని రోగులకు సరఫరా చేస్తాయి. ఇది అత్యంత ప్రాచుర్యం పొందిన మార్గం. ఈ గొట్టాల్లో వాడే పదార్థం చాలా వ్యయంతో కూడినది. కొవిడ్ కాలంలో వీటి ధర మరింత పెరిగింది. అయినప్పటికీ అనేక కంపెనీలు సరఫరా చేసే పరిస్థితిలో లేవు. పలు ఆసుపత్రుల్లో గత ఏడాది కాలంలో ఈ గొట్టాలను పునరుద్ధరించారు. అనేకచోట్ల కొత్తగా గొట్టాలను అమర్చారు. రీఫిల్ చేసుకొనే సౌకర్యంతో సిలిండర్‌ల ద్వారా కూడా సరఫరా చేయవచ్చు. కానీ సిలిండర్‌ల తయారీ కూడా కష్టమవడం వల్ల అనేక కంపెనీలు తక్కువ వ్యవధిలో అన్ని ఆసుపత్రులకు సరిపడా ఆక్సిజన్‌ను సరఫరా చేయలేకపోతున్నాయి.
-డాక్టర్ శ్రీభూషణ్ రాజు, హైదరాబాద్ నిమ్స్‌లో నెఫ్రాలజీ విభాగాధిపతి.
ఇదీ చూడండి: కరోనాతో మానసిక కల్లోలం- ఇదిగో పరిష్కారం