ప్రత్యేక హోదాపై 'గుప్కార్' వెనక్కి తగ్గినట్లేనా? - Dr Farooq Abdullah
జమ్ము కశ్మీర్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అక్కడి రాజకీయ పార్టీలతో చర్చలు జరిపేందుకు కేంద్రం సిద్ధమైన వేళ.. ప్రధానితో భేటీలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనే విషయంపై ఆసక్తి నెలకొంది. ఆర్టికల్ 370 పునరుద్ధరణ లక్ష్యంతో గుప్కార్ కూటమి ఏర్పాటు చేసిన నేతలు.. తమ డిమాండ్‌పై వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. మరి సమావేశంలో చర్చించే అంశాలేంటి? భేటీలో తీసుకునే నిర్ణయాల పర్యవసనాలు ఎలా ఉంటాయి? భాజపాకు ఇది రాజకీయంగా కలిసొస్తుందా?
జమ్ముకశ్మీర్‌లో రాజకీయ సుస్థిరత నెలకొల్పే దిశగా అడుగులు పడుతున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి, కశ్మీరీ నేతలకు మధ్య జూన్ 24న కీలక సమావేశం జరగనుంది. ఆర్టికల్ 370 రద్దు తర్వాత అక్కడి రాజకీయాల్లో జరుగుతున్న కీలక మార్పులివి.
ఇప్పటికే రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పక్షాలన్నీ 'కశ్మీర్‌కు ప్రత్యేక హోదా పునరుద్ధరణ' లక్ష్యంతో గుప్కార్ కూటమిగా ఏర్పడగా... ఆర్టికల్ 370 రద్దుపై వెనక్కి తగ్గేది లేదని కేంద్రం తేల్చి చెబుతోంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో ప్రధానమంత్రి నేతృత్వంలో జరిగే సమావేశంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోనున్నారు? కశ్మీర్ రాజకీయ పార్టీలు తమ 'డిమాండ్' విషయంలో వెనక్కి తగ్గుతాయా? తదనంతర పరిణామాలు ఎలా ఉండనున్నాయి? ఓసారి పరిశీలిద్దాం.
కశ్మీరీ నేతల్లో మార్పు?
2019 ఆగస్టు 5న జమ్ము కశ్మీర్ ప్రత్యేక హోదాను రద్దు చేసింది కేంద్రం. అనంతరం రాష్ట్రాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించింది. కీలక నేతల నిర్బంధం తర్వాత అక్కడి రాజకీయాలు స్తబ్దుగా సాగిపోయాయి. క్రమంగా కశ్మీర్ ప్రయోజనాల కోసం అంటూ.. రాష్ట్రంలోని ముఖ్య నేతలంతా ఒకే గొడుగు కిందకు చేరారు. పీపుల్స్ అలయన్స్ ఫర్ గుప్కార్ డిక్లరేషన్(పీఏడీజీ) పేరుతో కూటమిగా ఏర్పడ్డారు. ఆర్టికల్ 370 రద్దుకు ముందున్న పరిస్థితులను పునరుద్ధరించడం, ప్రత్యేక హోదా రద్దును వెనక్కి తీసుకోవడం అనేవి ఈ కూటమి ప్రధాన డిమాండ్లు.
అయితే, చర్చలపై కేంద్రం ప్రకటన చేసిన తర్వాత ఇక్కడి పార్టీ నేతల్లో మార్పు వచ్చింది. 'కశ్మీర్లో ఎన్నికల ప్రక్రియను పునరుద్ధరిస్తే చాలు' అనుకునే పరిస్థితిలో నేతలు ఉన్నారని తెలుస్తోంది.
ప్రధానితో చర్చలకు కశ్మీర్‌లోని చిన్నా, పెద్దా పార్టీలను కేంద్రం ఆహ్వానించింది. నేషనల్ కాన్ఫరెన్స్, పీపుల్స్ కాన్ఫరెన్స్, పీపుల్ డెమొక్రటిక్ పార్టీ, సీపీఎం, అప్నీ పార్టీలకు ఆహ్వానాలు పంపింది. పీపుల్స్ కాన్ఫరెన్స్ ఛైర్మన్ సజాద్ లోనే, పీడీపీ-భాజపా ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన అప్నీ పార్టీ నేత అల్తాఫ్ బుఖారీ.. కమలదళానికి పరోక్షంగా మద్దతు పలుకుతారనే భావన అక్కడి నేతల్లో ఉంది.
ఆ నేతల విడుదల వెనక వ్యూహమదే!
అధికారికంగా చర్చలు ప్రారంభించే ముందే.. కొందరు మధ్యవర్తుల ద్వారా స్థానిక నేతలతో తెరవెనుక మంతనాలు జరుపుతూ వచ్చింది కేంద్రం. కొందరు కీలక నేతలు నిర్బంధంలో నుంచి విడుదల కావడం ఈ చర్చల ఫలితమేనని తెలుస్తోంది. ప్రత్యేక హోదా రద్దును పునరుద్ధరించాలని మంకుపట్టు పట్టినవారిని బుజ్జగించగలిగే రాజకీయ నాయకులను కేంద్రం విడుదల చేసింది.
మెహబూబా ముఫ్తీ మామ సర్తాజ్ మదినీ విడుదల కావడం ఇందులో చెప్పుకోవాల్సిన విషయం. ముఫ్తీ నిర్ణయాలు తీసుకోవడంలో మదినీది కీలక పాత్ర. పీడీపీ వ్యవస్థాపకుడు, మాజీ సీఎం ముఫ్తీ మహమ్మద్ సయీద్ జీవించి ఉన్నప్పుడు కూడా ఆయన తీసుకునే నిర్ణయాల్లో మదినీ భాగమవుతూ వచ్చారు.
మరొకరు.. సజాద్ లోనే. భాజపాతో లోనేకు ఉన్న సన్నిహిత సంబంధాల గురించి తెలిసిందే. ముఖ్యంగా మెహబూబా మంత్రివర్గంలో పనిచేసినప్పుడు కేంద్రంతో సజాద్ మెలిగిన తీరు భాజపాకు ప్రస్తుతం అనుకూలించేదే. దిల్లీలోని నేతలు కూడా లోనే పట్ల ప్రత్యేక మక్కువ చూపిస్తున్నట్లు సమాచారం. చర్చల్లో లోనే పాల్గొనడం వల్ల గుప్కార్ కూటమి కన్నా.. కేంద్రానికే ఎక్కువ ప్రయోజనం.
ఒమర్ అబ్దుల్లా.. 4జీపైనే దృష్టి!
మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా సైతం కశ్మీర్ ప్రత్యేక హోదాపై మెత్తబడ్డట్లు తెలుస్తోంది. నిర్బంధం నుంచి విడుదలైన తర్వాత ఆర్టికల్ 370 కన్నా 4జీ ఇంటర్నెట్ను పునరుద్ధరించాలనే విషయంపైనే ఆయన ఎక్కువగా మాట్లాడారు. మరోవైపు, పార్టీ వ్యవహారాలు, క్షేత్రస్థాయి పరిస్థితిపై సమీక్ష కంటే.. ట్విట్టర్లోనే ఎక్కువగా సమయం గడుపుతున్నారని ఆయనపై విమర్శలు ఉన్నాయి. అయితే, ఒమర్ తండ్రి.. డాక్టర్ ఫరూక్ అబ్దుల్లా మాత్రం మోదీ సర్కారుకు కొద్దిగా తలనొప్పిగా మారే అవకాశం ఉంది. తమ డిమాండ్లను నెరవేర్చకుండా ఇతర పరిష్కారాలను ఫరూక్ అబ్దుల్లాకు ప్రతిపాదించడం కేంద్రానికి కత్తిమీద సామే.
ఈ ఏడాది ఫిబ్రవరిలో నిర్వహించిన సమావేశానికి ఫరూక్ అబ్దుల్లా సహా కశ్మీర్ ఎంపీలందరూ గైర్హాజరయ్యారు. అయితే.. జూన్ 24న నిర్వహించే సమావేశానికి కశ్మీర్ నేతలు హాజరుకారనే అనుమానాలు ఉంటే కేంద్రం ఈ భేటీకి వారిని ఆహ్వానించే సాహసం చేసి ఉండదు. తెరవెనుక చర్చల ఫలితమో కానీ మరేదైనా గానీ.. మెహబూబా మినహా మిగిలిన వారందరూ భేటీకి హాజరయ్యేందుకు సానుకూలంగా స్పందిస్తున్నారు. మెహబూబా మాత్రం సమావేశం అజెండాను ముందుగా ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు.
ప్రధానితో జరిగే సమావేశం అజెండాను అధికారికంగా ప్రకటించకపోయినప్పటికీ.. ఆ ప్రాంతంలో రాజకీయ కార్యకలాపాలను పునరుద్ధరించడంపైనే చర్చ జరిగే అవకాశం ఉంది. ప్రభుత్వ యంత్రాంగాన్ని సాధారణ స్థితికి తీసుకురావడంపై సమాలోచనలు జరిగే వీలుంది.
ఇదీ చదవండి: మోదీతో భేటీపై కశ్మీర్ నేతల్లో తర్జన భర్జన!
అంతా సానుకూలం!
ప్రస్తుతం కశ్మీర్ విషయంలో అన్ని రకాల సానుకూల పరిణామాలు కనిపిస్తున్నాయి. వేర్పాటువాద నాయకులైన అష్రఫ్ సెహ్రాయి, మస్రత్ ఆలంల సమస్య తొలగిపోయినట్లే తెలుస్తోంది. అష్రఫ్.. నిర్బంధంలో మరణించగా.. మస్రత్ జైలు జీవితం గడుపుతున్నారు. గుప్కార్ కూటమిలో ఉన్న నేతలు సైతం వేర్పాటువాదులకు దూరమవుతున్నారు. సరిహద్దులో కాల్పుల విరమణ ఒప్పందం అమలవుతోంది. ఇది కశ్మీరీలకు ఊరటనిచ్చే పరిణామమే.
మరోవైపు, ఇక్కడి భౌగోళిక పరిస్థితులు, జనాభా వంటి వివరాలను సేకరించే పనిలో పడ్డాయి స్థానిక యంత్రాంగాలు. నియోజకవర్గాల విభజన జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. లోక్‌సభ సరిహద్దులను పునర్విభజించే డీలిమిటేషన్ కమిటీకి నివేదికలు సమర్పించాలని కేంద్ర పాలిత ప్రాంతానికి ఇదివరకే ఆదేశాలు జారీ అయ్యాయి.
కశ్మీర్ నేతలు ఐక్యంగా కనిపిస్తున్నా.
కాబట్టి కశ్మీర్ విషయంలో ఏ విధంగా ముందుకెళ్తారనేది దిల్లీ సంధానకర్తలపై ఆధారపడి ఉంది. కశ్మీరీ నేతలు ఐక్యంగా కనిపిస్తున్నా.. తమ పార్టీ ప్రయోజనాల విషయంలో రాజీ పడకపోవచ్చు. ఈ విషయంలో కూటమిలో విభేదాలు వచ్చే అవకాశం ఉంది. జిల్లా అభివృద్ధి మండళ్లకు జరిగిన ఎన్నికల్లో ఇది స్పష్టంగా తెలిసిపోయింది. సీట్ల పంపకంపై పార్టీల మధ్య అభిప్రాయభేదాలు బయటపడ్డాయి.
రాజకీయంగానూ భాజపాకు లాభమే!
రాజకీయ ప్రక్రియను పునరుద్ధరించడం.. ప్రపంచ వేదికపై భారత్ ప్రతిష్ఠ మరింత పెరిగేందుకు దోహదం చేస్తుంది. ఆర్టికల్ 370 రద్దు తర్వాత కశ్మీర్‌పై అంతర్జాతీయంగా జరిగిన చర్చకు పూర్తిగా చెక్ పెట్టినట్లు అవుతుంది. ప్రత్యేక హోదా లేకుండా కశ్మీర్లో సాధారణ పరిస్థితులు వచ్చేలా చర్చల్లో నిర్ణయాలు తీసుకుంటే.. ఈ ప్రాంతం భారత్‌లో అంతర్భాగమనే సందేశం అన్ని దేశాలకూ వెళ్తుంది. ఉత్తర్‌ప్రదేశ్ సహా 2022లో జరగనున్న పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఈ అంశం భాజపా గెలుపునకు దోహదం చేస్తుంది.
(బిలాల్ భట్- ఈటీవీ భారత్ న్యూస్ ఎడిటర్)
ఇదీ చదవండి: PM Modi: జమ్ముకశ్మీర్ రాజకీయ పార్టీలతో ప్రధాని భేటీ!