లింగాయత్‌ల తర్వాత కర్ణాటకలో రెండో అతిపెద్ద సామాజిక వర్గం వక్కలిగలు. కర్ణాటక జనాభాలో లింగాయత్‌లు 17 శాతం ఉంటే, వక్కలిగలు 15 శాతం వరకు ఉంటారు. ప్రస్తుతం కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో వక్కలిగలను ఆకర్షించడానికి ప్రధాన పార్టీలన్నీ దృష్టిసారించాయి. కర్ణాటక రాజకీయాల్లో వక్కలిగలది కీలక పాత్ర. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కర్ణాటకను ఏలిన 17 సీఎంలలో ఏడుగురు వక్కలిగ సామాజిక వర్గానికి చెందినవారే. భారత మాజీ ప్రధాని హెచ్డీ దేవెగౌడ కూడా వక్కలిగ వ్యక్తే. వక్కలిగల్లో రాజకీయ అవగాహన ఎక్కువని నిపుణులు అభిప్రాయపడతారు. ముఖ్యంగా పాత మైసూర్ ప్రాంతంలో వక్కలిగ సామాజిక వర్గానికి చెందిన వారు ఎక్కువ సంఖ్యలో ఉంటారు. రామనగర, మండ్య, మైసూర్, చామరాజనగర, కొడగు, కొలార్, తుమకూరు, హసన్ జిల్లాల్లోని 58 నియోజకవర్గాల పరిధిలో రాజకీయ పార్టీల గెలుపోటములను వీరు శాసిస్తారు. కర్ణాటక అసెంబ్లీలో మొత్తం 224 స్థానాలు ఉండగా అందులో నాలుగో వంతు స్థానాలు పాత మైసూర్ ప్రాంతంలోనే ఉన్నాయి. వక్కలిగ సామాజిక వర్గానికి చెందిన హెచ్డీ దేవెగౌడకు చెందిన జనతాదళ్ ఎస్.. ఈ 58 స్థానాల్లో 24 చోట్ల విజయఢంకా మోగించింది. కాంగ్రెస్ 18, భాజపా 15 స్థానాల్లో గెలుపొందింది.
ఇక బెంగళూరు అర్బన్ జిల్లా పరిధిలోని 28 నియోజకవర్గాల్లో కూడా వక్కలిగల ప్రాబల్యం ఎక్కువే. బెంగళూరు గ్రామీణ జిల్లాలోని నాలుగు, చిక్కబళ్లాపురలోని 8 నియోజకవర్గాల్లో కూడా వక్కలిగలు ఎక్కువ సంఖ్యలో ఉంటారు. బెంగళూర్ అర్బన్‌లోని అనెకల్ నియోజకవర్గం మినహా మిగిలిన 27 చోట్ల వక్కలిగల ప్రాబల్యం ఎక్కువగా ఉంటుందని రాజకీయ నిపుణులు చెబుతున్నారు. ఐతే వక్కలిగల ఓట్లన్నీ ఒకే పార్టీకి పడటం అరుదు. వీరంతా సిద్ధాంతాల పరంగా విడిపోయి ఉంటారు.
హెచ్డీ దేవెగౌడకు చెందిన జేడీఎస్ పార్టీకి వక్కలిగలే ప్రధాన ఓటు బ్యాంకు. పాత మైసూరు ప్రాంతంలో ఈ పార్టీదే హవా. ఇక్కడ జేడీఎస్, కాంగ్రెస్ మధ్యే ప్రధాన పోటీ ఉంటుంది. ఇటీవల భాజపా కూడా పాత మైసూర్ ప్రాంతంలో సత్తా చాటుతూ వస్తోంది. ఇటీవల ఓబీసీల్లో ముస్లింలకు ఉన్న 4 శాతం రిజర్వేషన్లు రద్దు చేసిన భాజపా సర్కారు.. రెండు శాతం వక్కలిగలకు, మరో 2 శాతం లింగాయత్‌లకు సమానంగా పంచింది. ఈ పెంపుతో వక్కలిగల రిజర్వేషన్ 4 నుంచి 6 శాతానికి పెరిగింది. ఈ నిర్ణయం వక్కలిగ సామాజిక వర్గానికి చెందిన మఠాధిపతులను మెప్పించింది. ఆదిచుంచనగిరి మఠం పీఠాధిపతి స్వామి నిర్మలానందనాథ భాజపా సర్కారు తీసుకున్న నిర్ణయాన్ని కొనియాడారు. వక్కలిగలను ప్రసన్నం చేసుకునేందుకు భాజపా అనేక చర్యలు తీసుకుంది. ఇందులో భాగంగా 16వ శతాబ్దం నాటి విజయనగర సామ్రాజ్యానికి చెందిన నాద ప్రభు కెంపే గౌడ 108 అడుగుల విగ్రహాన్ని బెంగళూర్ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద భాజపా నిర్మించింది. బెంగళూర్ నగర వ్యవస్థాపకులుగా కెంపే గౌడ పేరుగాంచారు.
అటు ఈ మధ్యకాలంలో అలనాటి మైసూర్ పాలకుడు టిప్పు సుల్తాన్‌పై భాజపా నాయకుడు వివాదాస్పద ప్రకటన చేశారు. తాను టిప్పు సుల్తాన్ కాలంలో పుట్టి ఉంటే ఊరి గౌడ, నంజే గౌడ వలే తిరుగుబాటు చేసేవాడినని భాజపా జాతీయ కార్యదర్శి సి.టి.రవి పేర్కొన్నారు. పాత మైసూర్ ప్రాంతంలోని కొన్ని వర్గాలు, భాజపా నాయకులు ఈ ప్రకటనకు మద్దతుగా నిలిచాయి. టిప్పు సుల్తాన్‌తో వక్కలిగ పాలకులు ఊరి గౌడ, నంజే గౌడ యుద్ధం చేశారని.. దానిలో టిప్పు మరణించినట్లు వీరు నమ్ముతున్నారు. కర్ణాటకలోని బలమైన వక్కలిగ సామాజిక వర్గానికి చెందిన నేతల్లో రవి కూడా ఒకరు. మరోవైపు భాజపా ప్రకటనను ప్రతిపక్ష కాంగ్రెస్, జేడీఎస్, చరిత్రకారులు మాత్రం వ్యతిరేకిస్తున్నారు. ఊరి గౌడ, నంజే గౌడ అనే పాలకులు వాస్తవంగా అసలు లేరని.. కేవలం కల్పిత పాత్రలు మాత్రమే అని చెబుతున్నారు.
మరోవైపు కర్ణాటక ఉద్యానశాఖ మంత్రి మునిరత్న ఈ అంశంపై చిత్రనిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు. ఊరిగౌడ-నంజేగౌడ పేరిట చిత్ర టైటిల్‌ను కూడా రిజిస్టర్ చేశారు. దీంతో వక్కలిగ వర్గానికి ముఖ్యమైన శ్రీ ఆదిచుంచనగిరి మహాసంస్థ మఠం పీఠాధిపతి నిర్మలానంద స్వామిజీ ఈ వ్యవహారంపై స్పందించారు. చారిత్రక సమాచారం, ఆధారాలు, రికార్డులను మఠానికి అందించాలని కోరారు. అంతేకాదు ఆధారాలు లేకుండా ఎటువంటి చిత్రం నిర్మించవద్దని మంత్రి మునిరత్నకు విజ్ఞప్తి చేశారు.