Karnataka Election 2023 : బీజేపీ, కాంగ్రెస్, జేడీఎస్ త్రిముఖ పోటీతో రసవత్తరంగా సాగుతున్న కర్ణాటక పోరులోకి వివాదాస్పద మైనింగ్ వ్యాపారి గాలి జనార్దనరెడ్డి కొత్త పార్టీతో ఎంట్రీ ఇచ్చారు. రాష్ట్రంలో బలమైన నేతగా ఉన్న గాలి జనార్దనరెడ్డి.. భారతీయ జనతా పార్టీని వీడి కల్యాణ రాజ్య ప్రగతి అనే కొత్త పార్టీని పెట్టారు. దీంతో రాజకీయాలు మరింత రసవత్తరంగా మారిపోయాయి.
కర్ణాటకలో బళ్లారి ప్రాంతానికి ప్రత్యేక స్థానం ఉంది. ఉత్తరాది పార్టీగా పేరున్న భారతీయ జనతా పార్టీ దక్షిణాదిలో తొలిసారిగా గెలిచింది ఇక్కడే. కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ సహా బీజేపీ సీనియర్ నేత దివంగత సుష్మ స్వరాజ్ లాంటి నాయకులు ఇక్కడి నుంచి పోటీ చేసి దేశ ప్రజల దృష్టిని ఆకర్షించారు. 2008లో బీజేపీ అధికారంలోకి తీసుకురావడంలో ఈ జిల్లాకు చెందిన జనార్దన రెడ్డి సోదరులు ఎంతో కృషి చేశారు. ఇప్పుడు అదే కుటుంబంలోని ఇద్దరు సభ్యులు ఒకరిపై ఒకరు పోటీ చేస్తుండడం వల్ల బళ్లారి మరోసారి వార్తల్లో నిలిచింది.
Kalyana Rajya Pragati Party : కల్యాణ రాజ్య ప్రగతి పార్టీ పోటీతో బళ్లారిలో రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. ఈ పార్టీ తరఫున మాజీ మంత్రి, పార్టీ వ్యవస్థాపకుడు గాలి జనార్దనరెడ్డి భార్య లక్ష్మీ అరుణ పోటీ చేస్తున్నారు. బీజేపీ తరఫున సిట్టింగ్ ఎమ్మెల్యే, జనార్దనరెడ్డి సోదరుడు గాలి సోమశేఖరరెడ్డి బరిలో నిలిచారు. మరోవైపు కాంగ్రెస్ నుంచి భరత్ రెడ్డి పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ నుంచి టికెట్ ఆశించి భంగపడ్డ మాజీ ఎమ్మెల్యే అనిల్ లాడ్ జేడీఎస్ నుంచి బరిలోకి దిగారు. ఆప్ సహా ఇతర పార్టీలు స్వతంత్ర అభ్యర్థులు కలిపి మొత్తం 24 మంది ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు.
ప్రస్తుతం ఎమ్మెల్యేగా కొనసాగుతున్న సోమశేఖర రెడ్డికే మరోసారి అవకాశం ఇచ్చింది బీజేపీ. సోమశేఖర రెడ్డి 2008లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. కాంగ్రెస్ అభ్యర్థి అనిల్ లాడ్‌పై 1,022 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. ఆ తర్వాత జరిగిన 2013 అసెంబ్లీ ఎన్నికలకు సోమశేఖర రెడ్డి దూరంగా ఉన్నారు. ఫలితంగా ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి అనిల్ లాడ్ గెలిచారు. 2018 ఎన్నికల బరిలో మరోసారి నిలిచిన సోమశేఖర రెడ్డి రెండోసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. త్రిముఖ పోటీ ఉన్న నియోజకవర్గంలోకి నారా భరత్ రెడ్డి ఎంట్రీతో రాజకీయ ముఖచిత్రం మారిపోయింది. ఎమ్మెల్యేగా గెలిచిన అనిల్‌ను పక్కనపెట్టి భరత్ రెడ్డికి టికెట్ కేటాయించింది కాంగ్రెస్. దీంతో అనిల్ జేడీఎస్‌లో చేరి టికెట్ పొందారు.
జోరుగా ప్రచారం చేస్తున్న ప్రధాన పార్టీలు
ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, జేడీఎస్, బీజేపీ, కల్యాణ రాజ్య ప్రగతి అభ్యర్థులు ప్రచారంలో దూసుకుపోతున్నారు. కాంగ్రెస్, జేడీఎస్ అభ్యర్థులను పక్కన పెడితే.. ఒకే కుటుంబానికి చెందిన లక్ష్మీ అరుణ, సోమశేఖర రెడ్డి పోటీలో ఉండడం వల్ల ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. లక్ష్మీ అరుణ ఇంటింటికీ తిరుగుతూ జోరుగా ప్రచారం చేస్తున్నారు. మరోవైపు సిట్టింగ్ ఎమ్మెల్యే సోమశేఖరరెడ్డి సైతం గట్టిగానే ప్రచారం చేస్తున్నారు. వదిన, మరిది మధ్య జరుగుతున్న పోటీలో ఎవరు గెలుస్తారని ప్రజలు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.
Ballari Election 2023 : బళ్లారి నియోజకవర్గంలో ఎస్సీ, ఎస్టీ, లింగాయత్, మైనార్టీ ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. కాంగ్రెస్‌కు ఓటు బ్యాంకుగా ఉన్న మైనార్టీలు.. ఈసారి జేడీఎస్, కల్యాణ రాజ్య ప్రగతి పార్టీ వైపు మొగ్గు చూపే అవకాశం కనిపిస్తోంది. బళ్లారి సిటీ నియోజకవర్గంలో మొత్తం 2,59,184 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 1,26,067 మంది పురుషులు, 1,33,087 మంది మహిళలు, 30 ట్రాన్స్‌జెండర్ ఓటర్లు ఉన్నారు. మొత్తం ఓటర్లలో 8,432 యువకులు ఉండగా.. 4,691 మంది 80 ఏళ్లకు పైబడిన వారు, 1,383 దివ్యాంగులు ఉన్నారు.
సోదరులు బీజేపీలోనే
రెండు దశాబ్దాలుగా బీజేపీతో ఉన్న అనుబంధాన్ని తెంచుకుంటూ గతేడాది డిసెంబర్లో కొత్త పార్టీపై ప్రకటన చేశారు గాలి జనార్దన రెడ్డి. బీజేపీ తనను సరిగా ఉపయోగించుకోలేదని, అగ్రనాయకత్వం తన పట్ల అనుచితంగా వ్యవహరించిందని అప్పుడు వ్యాఖ్యానించారు.
అక్రమ మైనింగ్ కేసులో నిందితుడిగా ఉన్న గాలి.. 2015 నుంచి బెయిల్‌పై ఉన్నారు. బళ్లారికి వెళ్లకుండా ఆయనపై సుప్రీంకోర్టు నిషేధం విధించింది. ఈ నేపథ్యంలోనే సొంత జిల్లా నుంచి తన భార్యను పోటీకి దించారు. గాలి జనార్దన రెడ్డి సోదరులైన కరుణాకర రెడ్డి, సోమశేఖర రెడ్డి ఇప్పటికీ బీజేపీలోనే కొనసాగుతున్నారు. వీరిద్దరితో పాటు గాలి సన్నిహితుడైన కర్ణాటక మంత్రి శ్రీరాములు సైతం బీజేపీని వీడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.
Karnataka Election Date : కర్ణాటక అసెంబ్లీకి మే 10న ఎన్నికలు జరగనున్నాయి. మే 13న ఓట్ల లెక్కింపు చేపడతారు. ఆ రాష్ట్రంలో మొత్తం 224 సీట్లు ఉన్నాయి. ప్రస్తుతం 114 సీట్లతో బీజేపీ అధికారంలో ఉంది. కాంగ్రెస్‌కు 76, జేడీఎస్‌కు 26 సీట్లు ఉండగా.. 8 సీట్లు ఖాళీగా ఉన్నాయి.
ఇవీ చదవండి : 'ఫ్రీ' హామీలతో ఓట్ల వేట.. ఆ పార్టీ గెలిస్తే ఒకేసారి రూ.2లక్షలు!
కర్ణాటకలో 'బ్రదర్స్ పాలిటిక్స్'.. గాలి భార్య X తమ్ముడు.. జార్కిహోలి అన్నదమ్ములు ఢీ!