CJI Justice NV Ramana: జస్టిస్ నూతలపాటి వెంకట రమణ... ఇటీవలి కాలంలో అందరి నోటా వినిపిస్తున్న పేరు ఇది. భారత ప్రధాన న్యాయమూర్తిగా ఏడాది క్రితం బాధ్యతలు చేపట్టిన ఆయన ఈ పన్నెండు నెలల కాలంలో కరోనా మహమ్మారి విసిరిన సవాళ్లను ఎదుర్కొంటూనే న్యాయవ్యవస్థను సమర్థంగా ముందుకు నడిపిస్తూ ప్రజల్లో దానిపై అపార నమ్మకాన్ని పెంపొందించారు. గత ఏడాది ఏప్రిల్ 24న ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన తరవాత అంచనాలకు అందని విధంగా ఆయన పనిచేసుకుంటూ పోతున్నారు. సీబీఐ డైరెక్టర్ నియామకంపై ప్రధానమంత్రి ఆధ్వర్యంలో జరిగిన కమిటీ సమావేశంలో ప్రకాశ్ సింగ్ కేసులో తీర్పును ప్రస్తావించడం ద్వారా చట్టబద్ధ పాలనకు తానిచ్చే ప్రాధాన్యం ఏమిటో చెప్పకనే చెప్పారు. ఏడాది కాలంగా దాదాపు విచారణలన్నీ వీడియో కాన్ఫరెన్సుల ద్వారానే సాగినప్పటికీ ఆ లోటును జస్టిస్ ఎన్.వి.రమణ కనిపించనీయలేదు. కేసుల విచారణలను పరుగులు పెట్టించిన ఆయన, న్యాయమూర్తుల నియామకాల్లోనూ చాలా చురుగ్గా వ్యవహరించారు.
మహిళా సాధికారతకు పెద్దపీట.. సీజేఐగా బాధ్యతలు చేపట్టిన అనతికాలంలోనే సుప్రీంకోర్టుకు ఒకేసారి తొమ్మిది మంది న్యాయమూర్తులు నియమితులయ్యేలా జస్టిస్ రమణ కృషి చేశారు. అందులో ముగ్గురు మహిళలు. భవిష్యత్తులో తొలిసారి ఒక మహిళ ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టేందుకు బాటలు వేశారు. హైకోర్టు న్యాయమూర్తులుగా 192 పేర్లను సిఫార్సు చేసి, అందులో 126 మంది నియామకాలు పూర్తయ్యేలా చర్యలు తీసుకున్నారు. న్యాయమూర్తుల నియామకంలాంటి విషయాల్లో ఏకాభిప్రాయ సాధన ద్వారా తనలోని నాయకత్వ పటిమనూ చాటుకున్నారు. తానేమీ తెందూల్కర్‌ను కాదని, అంతా టీమ్ వర్క్ అంటూ ఆ గౌరవాన్ని సహచరులందరికీ పంచే ప్రయత్నం చేశారు. ఎన్నాళ్లుగానో పెండింగులో ఉన్న తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తుల సంఖ్యను దాదాపు రెట్టింపు చేశారు. వీలుచిక్కినప్పుడల్లా సభలు, సమావేశాలు, స్మారకోపన్యాసాల్లో పాల్గొంటూ న్యాయవ్యవస్థలో రావాల్సిన మార్పుల గురించి నిర్మొహమాటంగా అభిప్రాయాలు వ్యక్తం చేశారు. న్యాయ వ్యవస్థలో మహిళలకు 50 శాతం ప్రాతినిధ్యం ఉండాలని చెప్పడం సహా తన హయాములో జరిగిన హైకోర్టు న్యాయమూర్తుల నియామకాల్లో 20 శాతం మహిళలకు అవకాశం కల్పించారు. కోర్టుల్లో మౌలిక వసతులు కొరవడి మహిళా న్యాయవాదులు పడుతున్న ఇబ్బందుల గురించి అవకాశం వచ్చినప్పుడల్లా ప్రస్తావిస్తూ, సమస్యల పరిష్కారంలో ప్రభుత్వాలు చూపాల్సిన చొరవను గుర్తుచేశారు. సామాన్యులకు వేగంగా న్యాయం దక్కడంలో న్యాయమూర్తుల కొరత, మౌలికవసతుల లేమి ప్రధాన అడ్డంకులుగా మారాయని గ్రహించిన జస్టిస్ రమణ- తన హయాములో ఆ రెండింటికీ అధిక ప్రాధాన్యం ఇచ్చారు. మౌలిక వసతుల కల్పనకోసం నేషనల్ జ్యుడీషియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అథారిటీ పేరుతో స్వయం ప్రతిపత్తి సంస్థను ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి ముసాయిదాను అందించారు.
ప్రజలకు న్యాయ సేవలు త్వరితంగా అందాలన్న ఆకాంక్ష సీజేఐ ఎన్.వి.రమణలో బలంగా కనిపిస్తుంటుంది. అందుకే మధ్యవర్తిత్వాన్ని ప్రోత్సహిస్తూ వస్తున్నారు. ప్రధాన న్యాయమూర్తిగా ప్రభుత్వాలను ప్రశ్నించడంలో ఆయన ఎప్పుడూ ఓ అడుగు ముందే ఉంటున్నారు. ప్రజలపై నిఘాకు పెగాసస్ సాఫ్ట్‌వేర్ వాడారా, లేదా అని కేంద్రాన్ని ప్రశ్నించడం సహా సుప్రీం మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఆర్.వి.రవీంద్రన్ నేతృత్వంలో స్వతంత్ర విచారణకు ఆదేశించారు. లఖింపుర్ ఖేరీ ఘటనలో నిందితుడు, కేంద్రమంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రాకు హైకోర్టు ఇచ్చిన బెయిలును రద్దుచేశారు. అసలు ఈ సంఘటనను సుప్రీంకోర్టు తీవ్రంగా పరిగణించడంవల్లే నిందితుడి అరెస్టుకు దిగువ స్థాయి యంత్రాంగం చర్యలు చేపట్టాల్సి వచ్చింది. ఈ కేసులో సిట్ విచారణను పర్యవేక్షించడానికి ఒక హైకోర్టు మాజీ న్యాయమూర్తినీ సుప్రీం నియమించింది. ఖైదీలకు కోర్టులు బెయిళ్లు మంజూరు చేసినా, ఆ ఆదేశాలు అందలేదన్న పేరుతో రోజుల తరబడి వారిని కటకటాల మధ్యనే ఉంచుతున్నారు. పత్రికల్లో ఈ విషయం చూసి స్పందించిన జస్టిస్ రమణ శీఘ్రతర వ్యవస్థకు శ్రీకారం చుట్టారు. ఝార్ఖండ్‌లోని ధన్‌బాద్ జిల్లా జడ్జి ఉత్తమ్ ఆనంద్ ఉదయం నడకకు వెళ్ళినప్పుడు ఆయనను ఆటోతో ఢీకొట్టి హత్య చేయడాన్ని సుప్రీం తీవ్రంగా పరిగణించింది. దాంతో రాష్ట్ర ప్రభుత్వం ఆ కేసును సీబీఐ విచారణకు సిఫార్సు చేయాల్సివచ్చింది. ఈ విషయంలో వేగంగా, తగిన స్థాయిలో స్పందించడం ద్వారా న్యాయవ్యవస్థలో పనిచేసేవారికి జస్టిస్ రమణ అండగా నిలిచారు. వలసపాలకుల నాటి పరిస్థితులకు అనుగుణంగా ఏర్పడిన న్యాయవ్యవస్థ ప్రస్తుత అవసరాలకు ఏమాత్రం సరిపోవడం లేదని, అందువల్ల దాన్ని భారతీయీకరించాల్సిన అవసరం ఉందని ఆయన ఎన్నోసార్లు ఉద్ఘాటించారు. పార్లమెంటు పనితీరుపైనా నిశిత అభిప్రాయాలు చెప్పడానికి జస్టిస్ రమణ ఎన్నడూ వెనకాడలేదు. సరైన చర్చలు లేకుండానే చట్టసభల్లో బిల్లులకు ఆమోదం లభిస్తోందని, దానివల్లే అధిక సమస్యలు తలెత్తుతున్నాయని స్వాతంత్య్ర దినోత్సవం సాక్షిగా ఆవేదన వ్యక్తపరిచారు.
మూలాలను మరవకుండా... జస్టిస్ కోకా సుబ్బారావు తరవాత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన తెలుగు వ్యక్తిగా జస్టిస్ ఎన్.వి.రమణ గుర్తింపు పొందారు. మధ్యతరగతి వ్యవసాయ కుటుంబంలో పుట్టి తెలుగు మాధ్యమంలో చదువుకొని అత్యున్నత స్థాయికి ఎదిగిన ఆయన- ఎప్పుడూ తన మూలాలను దాచుకొనే ప్రయత్నం చేయలేదు. మన ఆలోచనాశైలిపై మాతృభాషలు చూపే ప్రభావం గురించి విశ్లేషిస్తూ, సాంస్కృతిక వారసత్వాన్ని విస్మరించవద్దని అందరికీ గుర్తుచేయడం అలవాటుగా చేసుకున్నారు. ధర్మాసనం పైనుంచి తెలుగులోనే మాట్లాడి చాలా ఏళ్ల క్రితం విడిపోయిన గుంటూరు జిల్లాకు చెందిన ఓ తెలుగు జంట మధ్య సయోధ్య కుదిర్చారు. అత్యున్నత పౌర పురస్కారాలైన పద్మ అవార్డులను అందుకున్న తెలుగువారిని సత్కరించి మాతృమూలాలపట్ల తన అభిమానాన్ని చాటుకున్నారు. ప్రధాన న్యాయమూర్తి హోదాలో తన పుట్టిన ఊరు వెళ్ళి ఆత్మీయులను ఆప్యాయంగా పలకరించి పాత జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. హైదరాబాద్‌లో అంతర్జాతీయ మధ్యవర్తిత్వ కేంద్రానికి పునాదిరాయి వేసి తెలుగునేలను అంతర్జాతీయ వివాద పరిష్కార కేంద్రంగా మార్చేందుకు బీజం వేశారు. జస్టిస్ ఎన్.వి.రమణ కేవలం సమస్యలను గుర్తించడమే కాదు వాటి పరిష్కారానికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. వ్యవస్థను సామాన్యుడి చెంతకు తీసుకెళ్ళి వారిలో ప్రబలమైన నమ్మకాన్ని కల్పించడానికి కృషి చేస్తున్నారు.
క్రియాశీల చొరవ.. సామాజిక అంశాలపట్ల జస్టిస్ ఎన్.వి.రమణ వేగంగా స్పందించిన తీరు సామాన్య ప్రజల్లో న్యాయ వ్యవస్థపట్ల నమ్మకాన్ని పెంచింది. కరోనా సమయంలో సుప్రీంకోర్టు క్రియాశీలకంగా వ్యవహరించడంవల్లే కేంద్రం తన నిర్ణయాన్ని మార్చుకొని 18ఏళ్లు పైబడిన వారందరికీ ఉచిత టీకా కార్యక్రమం తీసుకొచ్చింది. రంగారెడ్డి జిల్లాకు చెందిన ఎనిమిదో తరగతి అమ్మాయి వైష్ణవి తమ ఊరికి బస్సు వచ్చేలా చూడాలని కోరుతూ జస్టిస్ రమణకు రాసిన లేఖను అధికారులకు పంపి సమస్యను పరిష్కరించారు. రాజకీయనేతలపై ఉన్న క్రిమినల్ కేసుల విచారణను వేగవంతం చేయాలని శరపరంపరగా ఉత్తర్వులిచ్చారు. దానికోసం ప్రత్యేక కోర్టులను కొలువుతీర్చాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు స్పష్టమైన ఆదేశాలు జారీచేశారు. నేతలపై దాఖలైన కేసులను హైకోర్టుల అనుమతి లేకుండా రాష్ట్ర ప్రభుత్వాలు ఏకపక్షంగా ఎత్తివేయడం కుదరదని చెబుతూ ప్రభుత్వాల ఒంటెత్తు పోకడలకు అడ్డుకట్ట వేశారు. సీబీఐ వ్యవహారశైలిపైనా ఆయన సునిశిత వ్యాఖ్యలు చేశారు. ఛత్తీస్‌గఢ్‌కు చెందిన గుర్విందర్‌పాల్ సింగ్ కేసులో బ్యూరోక్రాట్లు, పోలీసులు రాజకీయ నాయకుల సేవకులుగా మారిపోయారని వ్యాఖ్యానిస్తూ వారి తీరును గర్హించారు. కోర్టుల్లో అనుకూల తీర్పులు రాకపోతే న్యాయవ్యవస్థపై దాడిచేస్తున్న ప్రభుత్వ వర్గాల ఇటీవలి పెడ ధోరణులను తీవ్రంగా తప్పుపట్టారు.
న్యాయవ్యవస్థ స్వతంత్రతకు కృషి.. ప్రధాన న్యాయమూర్తిగా ఏడాది కాలంలో న్యాయవ్యవస్థ స్వతంత్రతను నిలబెట్టడానికి జస్టిస్ ఎన్.వి.రమణ ఇతోధికంగా కృషిచేశారు. సుప్రీంకోర్టు ఈ-మెయిల్‌లో ప్రభుత్వ ప్రచార ప్రకటన ఉందని తెలిసిన వెంటనే దాన్ని తొలగింపజేశారు. ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్యానికి స్వతంత్ర పత్రికా వ్యవస్థతోపాటు, భావప్రకటనా స్వేచ్ఛ చాలా అవసరమని ఉద్ఘాటించారు. ఒకవైపు హక్కులకు రక్షణ కల్పిస్తూనే, ప్రస్తుతం ప్రసార మధ్యమాల్లో జరుగుతున్న చర్చలే అన్నింటికన్నా ఎక్కువ కాలుష్యానికి కారణమవుతున్నాయని వ్యాఖ్యానించడం ద్వారా మీడియా బాధ్యతను గుర్తుచేసే ప్రయత్నం చేశారు. తబ్లిగి జమాత్ కేసులో వార్తలకు మతం రంగు పులమడంపట్ల ప్రసారసాధనాలను హెచ్చరించారు. కార్పొరేట్ కేసులు అత్యధిక కోర్టు సమయాన్ని తీసుకుంటున్న తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు.
- చల్లా విజయభాస్కర్
ఇదీ చూడండి : మరో ప్రచ్ఛన్న యుద్ధం! అమెరికా ఆధిపత్యానికి తెర?