ప్రపంచ దేశాల్ని కరోనా వైరస్ గడగడలాడిస్తుండగానే, విషధూమంలా మరోపెను విపత్తు కమ్ముకొస్తోంది. అసంఖ్యాకంగా రాకాసి మిడతలు పంట పొలాలపై దండెత్తుతున్నాయి. ఇతర వలస కీటకాలతో పోలిస్తే అత్యంత ప్రమాదకరమైనవని ఐరాస ఆహార, సేద్య సంస్థ ధ్రువీకరించిన మిడతలు పెద్దయెత్తున విరుచుకుపడితే ఎన్నో దేశాల్లో ఆహార సంక్షోభం తథ్యమన్న హెచ్చరికలు పరిస్థితి తీవ్రతను కళ్లకు కడుతున్నాయి. నిరుడు తూర్పు ఆఫ్రికాలో కుంభవృష్టి దరిమిలా భారీగా సంతానోత్పత్తి చేసిన ఎడారి మిడతలు అక్కడినుంచి సౌదీ అరేబియా, ఇరాన్, పాకిస్థాన్లకు చేరాయి. ఇథియోపియా, సోమాలియా ప్రభృత దేశాలను హడలెత్తించి పొరుగున పాకిస్థాన్‌లో అత్యవసర పరిస్థితి ప్రకటించడానికి ఆ రాక్షస మిడతల దండే కారణం.
తెలుగు రాష్ట్రాలకూ పెను ముప్పు..
పాక్‌నుంచి దేశంలోకీ ప్రవేశించిన ఉత్పాతం పశ్చిమ, మధ్య భారతాన కల్లోలం సృష్టిస్తోంది. రాజస్థాన్, గుజరాత్, హరియాణా, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఉత్తర్ ప్రదేశ్‌లను తీవ్రంగా కలవరపరుస్తున్న మిడతల దండు రూపేణా- ఇటు కర్ణాటక, అటు దిల్లీలతోపాటు దక్షిణాదిన తెలుగు రాష్ట్రాలకూ పెను ముప్పు పొంచి ఉంది. దానిమ్మ, ద్రాక్ష తదితరాల కోతలు పూర్తయిన తెలుగు నేలపై ప్రూనింగ్ ప్రక్రియ దరిమిలా వర్షాలు కురిశాక ఆ తోటలు మళ్ళీ చిగురు తొడుగుతాయి. ఆ దశలో మిడతల దాడిని అడ్డుకోలేకపోతే మొలక దశలోని ఖరీఫ్ పంటలతోపాటు- వచ్చే ఏడాది పండ్లతోటల దిగుబడిపైనా ఆశలు వదులుకోవాల్సిందే. చదరపు కిలోమీటరు పరిధిలో కోట్ల సంఖ్యలోని మిడతలతో కూడిన దండు వాలిందంటే- అక్కడి గడ్డి, ఆకులు, పంటలు... మొత్తం పచ్చదనమే స్వల్ప వ్యవధిలో హరించుకుపోతుంది. మిడతల మూకుమ్మడి దాడులు పోనుపోను ముమ్మరిస్తాయన్న నిపుణుల హెచ్చరికల నేపథ్యంలో- జాప్యం చేసేకొద్దీ తీవ్ర నష్టం తప్పదు. ఇది ఏ రాష్ట్రానికా రాష్ట్రం ఎదుర్కోగల ఉత్పాతం కాదు. జాతీయ స్థాయిలో అంతర్జాతీయ తోడ్పాటుతో పటిష్ఠ కార్యాచరణ వ్యూహం చురుగ్గా పట్టాలకు ఎక్కాల్సిన తరుణమిది.
ధీమాకు తూట్లు
విశ్వవ్యాప్తంగా కొవిడ్ మహమ్మారి ఎంతటి ఆర్థిక కల్లోలం సృష్టిస్తున్నా- ఆహార భద్రతకు భరోసా ఇచ్చేలా నమోదవుతున్న వ్యవసాయ దిగుబడులే భారత్‌ను ఇన్నాళ్లూ స్థిమితంగా ఉండనిచ్చాయి. రాజస్థాన్‌లోని 18, మధ్యప్రదేశ్‌లోని 12 జిల్లాల్లో మిగతా చోట్లా మిడతల కారణంగా దాపురించిన పంట నష్టాలు- ఇండియా ధీమాకు తూట్లు పొడుస్తున్నాయి. పొలాలు నాశనమై, పశుగ్రాసానికీ కొరత ఏర్పడుతుండటాన్ని చూసి తట్టుకోలేని స్థానిక రైతాంగం- మిడతల్ని చెదరగొట్టడానికి పెద్దగా శబ్దాలు చేస్తూ, ట్రాక్టర్ల ద్వారా పురుగుమందులు చల్లుతున్నారు. తమ వంతుగా జబల్‌పూర్‌లోని జవహర్‌లాల్ నెహ్రూ కృషి విజ్ఞాన కేంద్రం వంటివి రైతులకు మార్గదర్శకాలు జారీ చేస్తున్నాయి. కెన్యాలాంటి దేశాలు చిన్న చిన్న విమానాలతో పంట పొలాలపై క్రిమి సంహారకాల్ని వెదజల్లుతున్నాయి. చైనా నిపుణులూ ఈ పద్ధతికే ఓటేస్తున్నారు. పాకిస్థాన్ రూ.730 కోట్ల వ్యయంతో జాతీయ సత్వర ప్రణాళికను చేపట్టినా మిడతల ముప్పు కట్టడి కాలేదనడానికి- సరిహద్దులు దాటి విస్తరిస్తున్న మహా విపత్తే నిదర్శనం.
60 దేశాలపై ప్రభావం..
జూన్, జులైల నాటికి మిడతల సంఖ్య 400 రెట్లు పెరిగిపోయి సుమారు 60 దేశాల్ని తీరని కష్టనష్టాలపాలు చేయగలవన్న అంచనాలు- తక్షణ చర్యల ఆవశ్యకతను ఉద్బోధిస్తున్నాయి. లక్షల హెక్టార్లలో చిరు ధాన్యాలు, ఉల్లిపంటను కోల్పోయిన ఇథియోపియా విషాద అనుభవం తక్కిన చోట్లా పునరావృతం కారాదంటే- భారత్ సహా పెను ముప్పు పొంచి ఉన్న దేశాలన్నీ ఏకోన్ముఖంగా స్పందించాలి. మిడతలు రాత్రి సమయంలో చెట్లపైనా పైర్లమీదా వాలి విశ్రమిస్తాయి. వాటి ఉనికిని పసిగట్టిన ప్రతి చోటా ఉసురుతీసే క్రిమి సంహారకాల్ని, కీటకాల్ని అరికట్టే శిలీంధ్రాల్ని విమానాల ద్వారా వెదజల్లే భూరి కసరత్తు ఏకకాలంలో తక్షణం పట్టాలకు ఎక్కాలి. రాకాసి మిడతల ఉత్పాతాన్ని కలిసికట్టుగా అరికట్టాలి!