జిన్‌పింగ్ 2013లో చైనా అధ్యక్ష పదవిని స్వీకరించిన వెంటనే తన తొలి విదేశీ పర్యటనకు రష్యాను ఎంచుకున్నారు. రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్‌తో జరిగిన ఒక సమావేశంలో "మన ఇద్దరి వ్యక్తిత్వాలు దాదాపు ఒక్కటే" అని జిన్‌పింగ్ పేర్కొన్నట్లు రష్యన్, చైనీస్ సమాచార సాధనాలు వెల్లడించాయి. 2000 సంవత్సరంలో పుతిన్, 2013లో జిన్‌పింగ్ అధికార పగ్గాలు చేపట్టినప్పుడు రష్యా, చైనా దాదాపు ఒకే తరహా సమస్యలు ఎదుర్కొనేవి. పుతిన్‌కు ముందు గోర్బచెవ్, యెల్త్సిన్ కమ్యూనిజం నుంచి ప్రజాస్వామ్యానికి, పెట్టుబడిదారీ విధానానికి మారారు. ఈ రెండు విధానాలూ తొలి రోజుల్లో అరాచకానికి, తీవ్ర అవినీతికి తావిచ్చాయి. దేశంలో అతికొద్దిమంది అపర కుబేరులుగా అవతరించగా, సామాన్య జనం తీవ్ర కడగండ్లు ఎదుర్కొన్నారు. పుతిన్ దేశాధ్యక్షుడు కాగానే పాత వైరాలు వీడి పాశ్చాత్య దేశాలతో మైత్రిని అభిలషించారు. కానీ, అమెరికా నాయకత్వంలోని పాశ్చాత్య కూటమి రష్యాలో జోక్యం చేసుకుని పాత సోవియట్ రిపబ్లిక్‌లలో వేర్పాటువాదాన్ని ప్రోత్సహించింది. దాంతో పుతిన్ పాశ్చాత్యులతో సంబంధాలున్న రష్యన్ కుబేరులపై, వారి అండదండలున్న రాజకీయ ప్రత్యర్థులపైన అవినీతిపై పోరు పేరిట విరుచుకుపడి సామాన్య ప్రజల హృదయాలను గెలుచుకున్నారు. ఆయన దెబ్బకు చాలామంది రష్యన్ సంపన్నులు పాశ్చాత్య దేశాలకు పరారయ్యారు. పోటీ అధికార కేంద్రాలను బలహీనపరుస్తూ పుతిన్ ఏకచ్ఛత్రాధిపత్యానికి బాటలు వేసుకున్నారు.
పార్టీ విధేయులకే అవకాశం
మొదటి నుంచీ చైనాలో కమ్యూనిస్టు పార్టీపట్ల విధేయులైనవారే వ్యాపారంలో ఎదుగుతున్నారు. జాక్ మా 1980ల నుంచే పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. మిగతా సాంకేతిక దిగ్గజ సంస్థల అధిపతులూ అంతే. కానీ, ఈ కామ్రేడ్ కోటీశ్వరులు బలోపేతమై ప్రభుత్వ రంగానికి సవాలుగా తయారయ్యారని జిన్‌పింగ్ భావిస్తున్నారు. పుతిన్‌లానే తాను కూడా ప్రైవేటు రంగ కుబేరుల పనిపట్టడం మొదలుపెట్టారు. చైనా నియంత్రణ అధికారులు అలీబాబా, టెన్సెంట్ గ్రూపులపై గుత్తస్వామ్య నిరోధక చట్టం కింద భారీ జరిమానాలు విధించారు. జాక్ మాపై జిన్‌పింగ్ కన్నెర్ర చేయడానికి ప్రధాన కారణం- అలీబాబా అనుబంధ సంస్థ అయిన యాంట్ గ్రూపు తన ఫైనాన్స్ సేవలను పెద్దయెత్తున విస్తరించడం. యాంట్ గ్రూపునకు చెందిన చెల్లింపుల యాప్ అలీపేని నెలకు 73 కోట్ల మంది ఉపయోగిస్తారు. అలీపే తన వినియోగదారులకు పెట్టుబడి సాధనాల్లో మదుపు చేయడానికి, బీమా కొనడానికి, రుణాలు తీసుకోవడానికి వెసులుబాటు కలిగిస్తోంది. ఇలా ఫైనాన్స్ సేవలను అందించడం ద్వారా అలీపే ఫైనాన్స్ అగ్ర శక్తిగా ఎదుగుతోంది. దీన్ని నివారించాలని జిన్‌పింగ్ ఆదేశించడం వల్లే మార్కెట్‌లో నిధుల సేకరణ ప్రక్రియను చైనా అధికారులు అడ్డుకున్నారు. చెల్లింపుల ప్రాసెసింగ్‌లో లాభాలు తక్కువ. అదే... ఫైనాన్స్ సేవలు- మహా లాభసాటి వ్యాపారం. ఈ సేవలు ప్రభుత్వ రంగ బ్యాంకులు, ఆర్థిక సంస్థల అధీనంలోనే ఉండాలని జిన్‌పింగ్ తీర్మానించుకున్నారు. అందుకే అలీబాబా గ్రూపుపై గుత్తస్వామ్య నిరోధక చట్టాన్ని ప్రయోగించారు. అదేసమయంలో గుత్తాధిపత్యానికి మారుపేరైన ప్రభుత్వ రంగ సంస్థలు- చైనా మొబైల్, చైనా నేషనల్ పెట్రోలియం కార్పొరేషన్, చైనా పారిశ్రామిక, వాణిజ్య బ్యాంకు వంటి సంస్థల జోలికి పోలేదు. పైగా ప్రభుత్వ రంగ సంస్థల విలీనాన్ని ప్రోత్సహిస్తూ అవి మరింత మహావృక్షాలుగా ఎదిగే వాతావరణాన్ని చైనా కల్పిస్తోంది.
ప్రభుత్వరంగ బలోపేతం
చైనీయ సోషలిజానికి ప్రభుత్వ రంగ సంస్థలే పట్టుగొమ్మలని, వాటిని మరింత బలోపేతం చేయడమే తన ధ్యేయమని జిన్‌పింగ్ గతేడాది స్పష్టంగా ప్రకటించారు. ప్రైవేటు సంస్థలు చైనా ఆర్థిక వ్యవస్థను శాసిస్తే కమ్యూనిస్టు పార్టీ బలం తరిగిపోతుందని ఆయన భావిస్తున్నారు. కానీ, ప్రైవేటు గుత్తస్వామ్యాన్ని దెబ్బతీసి ప్రభుత్వ రంగ గుత్తాధిపత్యానికి అగ్రాసనం వేస్తే, అది దీర్ఘకాలంలో చైనాకే దెబ్బ. చైనా కంపెనీలను, ముఖ్యంగా ప్రభుత్వ భాగస్వామ్యం ఉన్న కంపెనీలను భారత్‌తో సహా అత్యధిక ప్రజాస్వామ్య దేశాలు ఇప్పటికే అనుమాన దృష్టితో చూస్తున్నాయి. హువావే, జడ్‌టీఈ వంటి టెలికాం సంస్థలపై ఆంక్షలు విధిస్తున్నాయి. తమ కీలక ఆర్థిక సమాచారాన్ని చైనా సంస్థలు చోరీ చేసి తమ ప్రభుత్వానికి అందిస్తున్నాయని అమెరికా ఆగ్రహిస్తున్న సంగతి తెలిసిందే. భారత్ సైతం అనేక చైనా యాప్‌లను నిషేధించింది.
భారత్, అమెరికా, ఐరోపా సమాఖ్య వంటి ప్రజాస్వామ్య దేశాల్లోనూ గుత్తస్వామ్య నిరోధక చట్టాలు ఉన్నప్పటికీ అవి పనిగట్టుకుని ప్రైవేటు కంపెనీలపై విరుచుకుపడవు. విపణిలో అందరికీ సమానావకాశాలు ఉండాలని ఈ దేశాల అభిమతం. ప్రజాస్వామ్య దేశాలు న్యాయపాలనకు, నియమబద్ధ వ్యవస్థలకు పట్టం కడతాయి తప్ప పార్టీనో, ప్రభుత్వమో ఆర్థిక నిరంకుశత్వం చలాయించడాన్ని అనుమతించవు. చైనా తీసుకుంటున్న చర్యలు చివరకు ఆ దేశ ఆర్థిక శ్రేయస్సునే దెబ్బతీయవచ్చు.
కామ్రేడ్- కార్పొరేట్ రాజ్యం
చైనా గడచిన 35 ఏళ్లలో ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చి విదేశీ పెట్టుబడులకు ద్వారాలు తెరచి జన జీవితాలను మెరుగుపరచగలిగింది. అదేసమయంలో చైనాలో ఆర్థిక అంతరాలు పెచ్చరిల్లాయి. కమ్యూనిస్టు పార్టీ నాయకులు, వ్యాపారులు, ప్రభుత్వాధికారులు కుమ్మక్కవడం వల్ల అవినీతి విజృంభించింది. కమ్యూనిస్టు నేతలు, ప్రభుత్వాధికారులు తమ కుటుంబ సభ్యుల పేర్ల మీదనో, డొల్ల కంపెనీల ద్వారానో బడా కార్పొరేట్ సంస్థల్లో వాటాలు తీసుకుంటారు. ఉదాహరణకు హెచ్‌ఎన్‌ఏ గ్రూపు సంస్థల్లో ఉన్నత స్థాయి పార్టీ నాయకుల సంపద దాగి ఉంది. ఆ గ్రూపు అధ్యక్షుడు 2018లో ఫ్రాన్స్‌లో గోడ మీద నుంచి పడి మరణించాడట! 25 మంది పొలిట్ బ్యూరో సభ్యుల కుటుంబాలకు రాష్ట్ర, స్థానిక ప్రభుత్వాలు తమ భూములను మార్కెట్ రేటులో సగంకన్నా తక్కువ ధరకే అమ్ముతాయని ఒక అధ్యయనంలో తేలింది. పొలిట్ బ్యూరోలో అత్యున్నతమైన స్థాయీ సంఘ సభ్యులకైతే 75 శాతం తగ్గింపు ధరకు భూములు విక్రయిస్తారు. నాయకులకు గొప్ప తగ్గింపు ధరలకు భూములు విక్రయించిన అధికారులకు పదోన్నతులు లభిస్తాయి. వారు ఆ తరవాత దిగువ శ్రేణి సిబ్బంది నుంచి, వ్యాపారుల నుంచి లంచాలు పిండుకుంటారు. ఈ కామ్రేడ్-కార్పొరేట్ రాజ్యం మీద జిన్‌పింగ్ పోరు ప్రారంభించారు. న్యూయార్క్‌లో ప్రతిష్ఠాత్మక వాల్ డార్ఫ్ ఎస్టోరియా హోటల్‌ను కొనుగోలు చేసిన కోటీశ్వరుడు వు షియావోహుయిని 18 నెలలపాటు జైలుకు పంపించారు. తాజాగా అలీబాబా గ్రూపు మాజీ చైర్మన్ జాక్ మా అతీగతీ అక్టోబరు నుంచి తెలియడం లేదు. జాక్ కమ్యూనిస్టు ప్రభుత్వ బ్యాంకింగ్, ఫైనాన్స్ విధానాలను విమర్శించి చిక్కుల్లో పడ్డారు.
- ఆర్య