మానవ వనరుల ఆధారిత ఆర్థికవ్యవస్థకు యువ జనాభా పునాది వంటిది. విజ్ఞానమే కేంద్రంగా ఇరవై ఒకటో శతాబ్దంలో ప్రపంచ దేశాలు అగ్రగామిగా ఎదగడానికి ముందుకెళ్తున్న తరుణంలో యువత శక్తి సామర్థ్యాలు కీలకం కానున్నాయి. అనేక అభివృద్ధి చెందుతున్న దేశాల్లో యువతీ యువకుల సంఖ్య గణనీయంగా పెరుగుతుందని జనాభా గణాంకాలు చాటుతున్నాయి. వారికి సరైన అవకాశాలు కల్పించి శ్రామికశక్తిలో భాగం కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
ప్రపంచవ్యాప్తంగా యువ జనాభా గళాన్ని వ్యక్తపరచడానికి ఐక్యరాజ్య సమితి 2000 ఆగస్టు 12 నుంచి ఏటా ప్రపంచ యువజన దినోత్సవం నిర్వహిస్తోంది. సామాజిక, ఆర్థిక, రాజకీయ ప్రక్రియల్లో యువత పాత్రను ఈ రోజు గుర్తుచేస్తుంది. నేడు ప్రపంచ దేశాల్లో కొవిడ్ వ్యాప్తి, వాతావరణం మార్పు వంటి సవాళ్లను ఎదుర్కోవడానికి 'ప్రపంచం కోసం యువత నిమగ్నం' అనే నినాదంతో యువజన దినోత్సవానికి ఐరాస శ్రీకారం చుట్టింది. నిరుద్యోగం, పేదరికం, నిరక్షరాస్యత లాంటి సామాజిక సమస్యలు యువతను పట్టిపీడిస్తున్న రోజులివి. సామాజిక మాధ్యమాల విస్తృతి యువత సమయాన్ని వృథా చేస్తూ, పెడదారి పట్టిస్తున్నాయి. మాదకద్రవ్యాలు, మద్యపానం, ధూమపానం లాంటి వ్యసనాల ఉచ్చులో చిక్కుకొని జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. వ్యభిచారం, అక్రమ రవాణా, బాల్య వివాహాలు, లింగ దుర్విచక్షణ యువతుల సామర్థ్యాన్ని దెబ్బతీస్తున్నాయి. తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల పర్యవేక్షణ కొరవడుతుండటంతో నైతిక విలువలు, క్రమశిక్షణ లోపించి హత్యలు, అత్యాచారాలు, మానభంగాల వంటిదుస్సంస్కృతితోపాటు సంఘ విద్రోహచర్యలకూ పాల్పడుతున్నారు.
ప్రపంచ జనాభాలో 15.5శాతం
నేడు 15-24 వయోపరిమితిలోని యువకులు ప్రపంచ జనాభాలో 15.5 శాతం ఉన్నారు. 2030నాటికి యువత 15.1శాతం, 2050నాటికి 13.8శాతానికి తగ్గుతారని; అభివృద్ధి చెందుతున్న ఆఫ్రికా, ఆసియా దేశాల్లో పెరుగుదల అధికంగా ఉంటుందని అంచనా. ఆయా దేశాల అభివృద్ధికి ఊతమిచ్చే విషయమిది. ఈ పరిణామం భారత్ లాంటి దేశానికీ సానుకూలాంశం. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో యువ కార్మికుల్లో 96.8 శాతం అసంఘటిత ఆర్థిక వ్యవస్థలో పనిచేస్తుండటం దిగ్భ్రాంతకరం. ఉపాధి, విద్య లేదా శిక్షణలేని యువకుల నిష్పత్తి 15 ఏళ్లుగా పెరిగిందని, యువత ఉపాధి అవకాశాలను మెరుగుపరచడానికి రాబోయే 15 ఏళ్లలో 60 కోట్ల ఉద్యోగాలు సృష్టించాల్సి ఉంటుందని తాజా అంచనాలు సూచిస్తున్నాయి. ప్రపంచ శ్రామికశక్తిలో యువత వాటా 2000లో 21శాతం. 2018నాటికి అది 15శాతానికి తగ్గిందని, మొత్తం యువత శ్రామికశక్తిలో 60 శాతం పురుషులు, 40శాతం స్త్రీలతో లింగ దుర్విచక్షణ కొనసాగుతోందని అధ్యయనాలు చెబుతున్నాయి. మరోవైపు కొవిడ్ ఆర్థిక ప్రభావంవల్ల ఉద్యోగ విపణిలో యువతకు సవాళ్లు తప్పవని అంతర్జాతీయ కార్మికసంస్థ నివేదిక స్పష్టీకరించింది. ఉన్నత విద్యాభ్యాసం, నైపుణ్యాభివృద్ధి విషయాల్లోనూ కొవిడ్ తీవ్ర ప్రభావం చూపింది. అందువల్ల దేశాభివృద్ధిలో యువతను భాగం చేయడానికి ప్రపంచ దేశాలు దీటైన వ్యూహాలు రచించాల్సిన అవసరం ఉందన్నది సుస్పష్టం.
యువతను నైపుణ్యం గల శ్రామికశక్తిగా మార్చకపోతే వీరు సామాజిక అస్థిరతకు కారణమవుతారు. జాతి భద్రతకు ప్రమాదకరంగా పరిణమిస్తారు. కనుక వారిని సమర్థ మానవ వనరులుగా మార్చడానికి ప్రభుత్వాలు చట్టపరమైన, విధానపరమైన చర్యలతో ముందుకెళ్లాలి. పర్యావరణ పరిరక్షణ చర్యలు, ఆదాయ అసమానతల తగ్గింపు వంటి చర్యలు సమాజంలో గణనీయ మార్పులు తీసుకొస్తాయి. వీటికి చోదకశక్తిగా యువత ముందుండి క్రియాశీలంగా వ్యవహరించాలి. ఇలాంటి వ్యాపారాల విషయంలో వారికి అవగాహన కల్పించి, పెట్టుబడులు పెట్టేలా ప్రోత్సహించాలి. అప్పుడే నిరుద్యోగం, పేదరికం లాంటి సామాజిక సమస్యలు తొలగి పరివర్తన సాకారమవుతుంది. సంపద సృష్టించగల సామర్థ్యాలను అందించడానికి విద్యావ్యవస్థలో సమూల మార్పులకు శ్రీకారం చుట్టాలి. ఇటీవల ప్రకటించిన జాతీయ నూతన విద్యావిధానంలో పాఠశాల స్థాయి నుంచే వృత్తివిద్యపై శిక్షణ అంశం ప్రధానంగా ఉంది. భావిభారత పౌరులు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా ఎదగడానికి ఉపకరించే నిర్ణయమిది. అన్ని వృత్తులతోపాటు వ్యవసాయంలోనూ యువత రాణించేలా ప్రోత్సహించాలి. నైతిక విలువలు, క్రమశిక్షణ, దేశభక్తిపై పాఠశాల స్థాయి నుంచే బోధన ఉంటే బాధ్యతగల భావిపౌరులుగా యువత వన్నెలీనుతారు!
- సంపతి రమేష్ మహరాజ్ (రచయిత- సామాజిక విశ్లేషకులు)
ఇదీ చూడండి: 'ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సైన్యం సిద్ధం'