దేశభక్తిని ఉద్దీపిస్తూ, 1962నాటి వైఫల్యాన్ని జ్ఞప్తికి తెస్తూ రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ వాస్తవాధీన రేఖ (ఎల్‌ఏసీ)పై భారత సేనల పోరాట సన్నద్ధత గురించి పార్లమెంటులో చేసిన ప్రకటనకు ఎంతో ప్రాముఖ్యం ఉంది. లద్దాఖ్ పర్వతాల్లో గడ్డిపరక కూడా మొలవకపోయినా, ఆ ప్రాంతం భారత ప్రాదేశిక సమగ్రతకు అత్యంత కీలకమని రాజ్‌నాథ్ ఉద్ఘాటించారు. 1960లలో జవహర్‌లాల్ నెహ్రూ లద్దాఖ్‌లో గడ్డిపరకైనా మొలవదంటూ చేసిన ప్రకటనతో పోల్చి చూస్తే, రాజ్‌నాథ్ విస్పష్ట వ్యాఖ్య విలువేమిటో అర్థమవుతుంది. లద్దాఖ్‌లో వాస్తవాధీన రేఖ వెంబడి చైనా సేనలకు ఎదురొడ్డి నిలిచిన భారత జవాన్ల పరాక్రమాన్ని రక్షణమంత్రి ప్రస్తుతించారు. ఎల్‌ఏసీపై రాజీపడే ప్రసక్తే లేదని, మన భూభాగంలో ఒక్క అంగుళాన్నైనా వదిలేది లేదని స్పష్టీకరించారు. 1960నాటి నెహ్రూ వ్యాఖ్యను ఉద్దేశించి, సాటి కాంగ్రెస్ నాయకుడు మహావీర్ త్యాగి లద్దాఖ్‌లో గడ్డిపరకైనా మొలవదు కాబట్టి ఆ ప్రాంతాన్ని వదులుకుందామా, పరాయివాళ్లకు అప్పనంగా ఇచ్చేద్దామా అని వ్యంగ్యంగా ప్రశ్నించారు. నెహ్రూ రాజకీయ ప్రతిష్ఠకు ఆ ప్రశ్న తీరని నష్టం కలిగించింది.
ఆ ప్రధానికి భిన్నంగా..
నెహ్రూకు భిన్నంగా ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీ ఎల్‌ఏసీపై ఉద్రిక్తతలు ముదరగానే స్వయంగా లదాఖ్‌ను సందర్శించి జవాన్లలో స్థైర్యాన్ని నింపారని రాజ్‌నాథ్ గుర్తుచేశారు. మైనస్ 40 డిగ్రీల ఉష్ణోగ్రత ఉండే లదాఖ్ అతిశీతల వాతావరణాన్ని తట్టుకోవడానికి కావలసిన సాధన సంపత్తిని సైనికులకు అందించామన్నారు. అక్కడి ప్రతికూల వాతావరణాన్ని అధిగమించే సత్తాను ప్రభుత్వం భారత జవాన్లకు సమకూర్చింది. అరుణాచల్ ప్రదేశ్‌లో 90,000 చదరపు కిలోమీటర్ల భూభాగం తనదేనని చైనా చెప్పుకోవడం, లదాఖ్‌లో 5,180 చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని చైనాకు పాక్ అందజేయడాన్ని రాజ్‌నాథ్ ప్రస్తావించారు. ఈ భూభాగాలు భారత్‌కు చెందినవని చైనాకు గుర్తుచేయడం ఆయన ఉద్దేశం. ఇకనైనా ఎల్‌ఏసీపై యథాతథ స్థితిని కాపాడాల్సిన ఆవశ్యకతను నొక్కిచెప్పారు. కానీ, చైనా మంచి మాటలు వినే రకం కాదు.
అందుకే ఎల్‌ఏసీపై భారత్ అప్రమత్తతను సడలించడం లేదు. రెండు దేశాల సేనలు భారీ మోహరింపును కొనసాగిస్తున్నాయి. జూన్ 15న గల్వాన్ లోయలో చైనా సేనల దొంగదాడిలో 20మంది భారతీయ జవాన్లు మరణించినప్పటి నుంచి సరిహద్దు వెంబడి ఉద్రిక్తంగా ఉంది. ఎల్‌ఏసీ వద్ద యథాతథ స్థితికి భంగం కలిగించే పనులేవీ చేపట్టకూడదని జూన్ ఆరున రెండు దేశాలూ అంగీకరించినా, పది రోజులు తిరక్కుండానే చైనా మాట తప్పి అతిక్రమణకు తెగబడింది.
1962లో...
ఇక్కడ ఒక విషయం గుర్తుతెచ్చుకోవాలి. 1962కి ముందు భారత సైనిక సన్నద్ధత తీసికట్టుగా ఏమీ లేదు. నిజానికి వ్యూహపరంగా కీలకమైన పర్వత శిఖరాలు అప్పట్లో భారత్ అధీనంలోనే ఉండేవి. మెక్ మహాన్ రేఖ వద్ద కూడా కీలకమైన గుట్టలు భారత్ చేతుల్లోనే ఉండేవి. ఆ శిఖరాల పైనుంచి టిబెట్‌లోని పలు ప్రాంతాలపై నిఘా పెట్టవచ్ఛు శత్రువు చొరబడతాడనే అనుమానం ఉన్నచోట్లలో నెహ్రూ సేనలను మోహరించారు కూడా. 1959 నుంచి 1962లో యుద్ధం ముప్పు విరుచుకుపడేవరకు ఇదే అప్రమత్తత పాటించారు. సైనికంగా ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నా రాజకీయంగా, దౌత్యపరంగా అదే అప్రమత్తత పాటించకపోవడం ఓటమికి ప్రధాన కారణమైంది. నెహ్రూ ప్రభుత్వం చేసిన ఆ పొరపాటును మోదీ ప్రభుత్వం చేయడం లేదు. నెహ్రూ కాలంలో పార్లమెంటు లోపల, వెలుపల ప్రభుత్వం చేసిన ప్రకటనలు అనుభవరాహిత్యానికి ప్రతీకలు. సరిహద్దులో సైనిక దళాల మధ్య సమాచార సంబంధాలూ సరిగ్గా లేవు. ఉదాహరణకు చైనా సరిహద్దులో గస్తీ తిరిగే అస్సాం రైఫిల్స్‌కు భారత సైన్యంతో సమాచార బంధం లేదు. సైనిక కార్యకలాపాల గురించి ఎలాంటి అవగాహన లేని పౌర ప్రభుత్వ అజమాయిషీలో అస్సాం రైఫిల్స్ ఉంటుంది. చైనా దురాక్రమణను అంతర్జాతీయంగా ఎండగట్టి ప్రపంచ దేశాల మద్దతు సాధించడంలో నెహ్రూ ప్రభుత్వం విఫలమైందనే చెప్పాలి. నిజానికి అప్పట్లో చైనా తానే బాధితురాలినన్నట్లు చెప్పుకొంది. ఇప్పుడు దాని పాచికలేవీ పారడం లేదు. నరేంద్ర మోదీ సర్కారు చైనా ఆగడాలకు వ్యతిరేకంగా ప్రపంచ దేశాలను కూడగట్టగలిగింది.
ఇటీవల చైనా ఎత్తుకు పైఎత్తు వేసి కీలక శిఖరాలను అదుపులోకి తీసుకున్న స్పెషల్ ఫ్రాంటియర్ ఫోర్స్‌ను సృష్టించాలన్న ఆలోచన నెహ్రూదే. దాన్ని సమర్థంగా రంగంలోకి దించి ఫలితాలు సాధించింది మాత్రం మోదీ ప్రభుత్వమే. దేశ రక్షణకు నెహ్రూ తీసుకున్న చర్యలను విస్మరించకూడదు. రాజకీయంగా ప్రత్యర్థిని ఎదుర్కోవడంలో మాత్రం ఆయన సఫలం కాలేకపోయారు!
- బిలాల్ భట్,(కశ్మీరీ వ్యవహారాల నిపుణులు)