ETV Bharat / opinion

సంక్షోభంలో విద్యారంగం.. ప్రక్షాళన చేయాల్సిందే! - భారత విద్యారంగం!

ప్రపంచ దేశాలు ఆధునిక జీవనావసరాలకు అనువైన విద్యను తమ పౌరులకు అందిస్తుంటే... భారత్​లో మాత్రం చదువుల స్థాయీ ప్రమాణాలు రోజురోజుకూ దిగజారిపోతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో భారత విద్యావ్యవస్థలో గుణాత్మక పరివర్తన తీసుకొచ్చే పథకమొకటి తళుక్కున మెరుస్తోంది. అదే ప్రపంచ బ్యాంకు ఆమోదముద్ర వేసిన 'స్టార్స్​'. కనీసం దీనినైనా సమర్థవంతంగా అమలుచేసి.. భావి పౌరుల భవితను ఉజ్వలంగా తీర్చిదిద్దాల్సిన గురుతర బాధ్యత ప్రభుత్వాలపై ఉంది.

indian education system in crisis
సంక్షోభంలో భారత విద్యారంగం!
author img

By

Published : Jul 3, 2020, 7:56 AM IST

రేపటి పౌరుల్ని జాతి వజ్రాలుగా సానపట్టాల్సిన గురుతర బాధ్యత ఉపాధ్యాయులదే. పాఠశాలల్లో మేలిమి బోధనకు ఒరవడి దిద్దే లక్ష్యంతో విద్యాహక్కు చట్టాన్ని సవరించినా, సిబ్బందికి మెలకువలు మప్పేందుకంటూ 'నిష్ఠ'వంటి బృహత్‌ పథకాలు రూపొందించినా- దేశంలో గుణాత్మక పరివర్తన ఇప్పటికీ ఎండమావే. బడి చదువుల స్థాయీప్రమాణాల ప్రాతిపదికన భారత్‌ యాభై సంవత్సరాలు వెనకబడి ఉందని 'యునెస్కో' అధ్యయనపత్రం నిగ్గుతేల్చిన నాలుగేళ్ల తరవాతా- గురుబ్రహ్మలను తీర్చిదిద్దే యత్నం సరిగ్గా గాడిన పడనేలేదు. ఇంతగా నిరాశ మబ్బులు కమ్మిన విద్యాకాశంలో, ప్రపంచబ్యాంకు ఆమోదముద్ర పొందిన పథకమొకటి ఇప్పుడు తళుక్కుమంటోంది. 'అందరికీ విద్య' నినాదానికి కొత్త ఊపిరులూదుతున్న చందంగా బోధన మెలకువలు అలవరచి రాష్ట్రాల్లో ఇతోధిక ఫలితాల సాధనకు దోహదపడుతుందంటూ- 'స్టార్స్‌' పేరిట నూతన యోజన పట్టాలకు ఎక్కనుంది. 'సమగ్ర శిక్ష' కార్యక్రమంతో ప్రధానంగా హిమాచల్‌ప్రదేశ్‌, కేరళ, మధ్యప్రదేశ్‌, మహారాష్ట్ర, ఒడిశా, రాజస్థాన్లలో పాఠశాల విద్య గతిరీతుల్ని ప్రక్షాళించేందుకు ప్రపంచబ్యాంకు నుంచి సమకూరనున్న సాయం సుమారు రూ.3700కోట్లు. దేశవ్యాప్తంగా ఉన్నవాటిలో 75శాతం సర్కారీ బడులే. మొత్తం విద్యార్థుల్లో 65శాతం ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్నారు. జిల్లాస్థాయి విద్యా శిక్షణ సంస్థలు మొదలు జిల్లా బ్లాక్‌ విద్యా కార్యాలయాలు, పాఠశాలల వరకు పేరుకుపోయిన ఖాళీల భర్తీ అంశాన్ని ఎవరూ పెద్దగా పట్టించుకోవడం లేదు. సత్వరం పూడ్చాల్సిన కంతల్ని అలాగే వదిలేసి ఆరు రాష్ట్రాల్లో బడి చదువుల బాగుసేతకు ఉద్దేశించిన పథకం ద్వారా- 15లక్షల పాఠశాలల్లోని 25కోట్ల విద్యార్థులకు, కోటిమంది వరకు ఉపాధ్యాయులకు ప్రయోజనాలు కలుగుతాయన్న ప్రచారం విస్మయపరుస్తోంది. పరిమిత చొరవ కాదు- జాతీయ స్థాయిలో విస్తృత స్థాయి ద్విముఖ వ్యూహంతోనే, పతనావస్థలోని విద్యారంగాన్ని కుదుటపరచగలిగేది!

పునాది స్థాయి నుంచి ప్రక్షాళన

'విద్యా ప్రణాళికలకు కాస్తో కూస్తో మార్పులు సూచించడం కాదు; దేశీయ పరిస్థితుల్ని పరిణామాల్ని దృష్టిలో ఉంచుకుని పునాది స్థాయినుంచీ చదువుల్ని ప్రక్షాళించా'లని 1948లోనే ప్రథమ ప్రధాని నెహ్రూ నిర్దేశించారు. అందుకు మన్నన కొరవడి సంక్షోభంలో కూరుకుపోయిన విద్యావ్యవస్థను కుదుటపరచే దారేది? బోధిస్తున్నదెవరు, ఎలా చెబుతున్నారు, ఏమేమి అంశాలు నేర్పుతున్నారన్నవి అత్యంత కీలకాంశాలు. నాణ్యమైన విద్యాబోధన, పనికొచ్చే చదువుల్ని సాకారం చేసేలా పాఠ్యాంశాల కూర్పు- ఏ దేశ పౌరులనైనా సమర్థ మానవ వనరులుగా ఆవిష్కరించగల పటుతర ద్విముఖ వ్యూహం. ఎంత ఉన్నత విద్యకు అంత నిరుద్యోగిత చందంగా పట్టాల పరువు నీరోడుతుండటం చూస్తున్నాం. ఏ కారణంగానైనా విద్యార్జన అర్ధాంతరంగా ఆగిపోతే, అప్పటిదాకా చదివినదానితో అతడికి బతుకుతెరువు ఏర్పడి తీరాలనేవారు గాంధీజీ. ఆ పరిస్థితి నేడుందా? పిల్లల్లో సృజనాత్మకతకు ప్రాథమిక స్థాయిలోనే గట్టిపునాది పడాలి. వారిలో రకరకాల నైపుణ్యాలు, అభిరుచులు పురివిప్పేలా గురువులే ప్రత్యేక శ్రద్ధాసక్తులు కనబరచాలి. రేపటి తరానికి అలా నగిషీలు చెక్కే నేర్పు, జీవితంలో సవాళ్లను ఎదుర్కోగలిగేలా తీర్చిదిద్దే ఒడుపు... పుష్కలంగా కలిగినవారే బోధనలో రాణిస్తారు. దేశంలోని 19వేల ఉపాధ్యాయ శిక్షణ సంస్థల్లో ఎన్ని అటువంటి ప్రతిభావంతుల్ని సిద్ధపరుస్తున్నాయో, చదువులకు చెదలు పట్టడంలో వాటివంతు పాత్ర ఎంతో వేరే చెప్పనక్కర్లేదు. కాలమాన పరిస్థితులకు తగ్గట్లు పాఠ్యాంశాల ఎంపిక, పిల్లల్లో దాగిన సహజ ప్రజ్ఞాపాటవాల్ని వెలికితీయగల విద్యాప్రదాతల నియామకాలకు ప్రభుత్వాల అజెండాలో అగ్రప్రాధాన్యం దక్కాలి. దక్షులైన ఉపాధ్యాయులు ఉంటేనే ఉత్తమ ఇంజినీర్లు, శ్రేష్ఠవైద్యులు, పాదరసం లాంటి న్యాయవాదులు, మేలిమి వృత్తి నిపుణులు రూపొంది జాతికి కరదీపికలవుతారు!

ఇదీ చూడండి: 'వర్క్​ ఫ్రం హోం'తో కొంచెం ఇష్టం.. కొంచెం కష్టం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.