ETV Bharat / opinion

స్వావలంబనే స్ఫూర్తి మంత్రం.. అదే నవభారత నినాదం - భారతదేశంలో కరోనా వైరస్

స్థానిక శక్తిసామర్థ్యాలను, మార్కెట్లను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలి. అప్పుడే అంతర్జాతీయ విపణికి మేలైన వస్తువులను అందించే స్థాయికి భారత్​ ఎదుగుతుందని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఉద్ఘాటించారు. దేశంలో నిబిడీకృతమైన ప్రగతి సాధక శక్తులను, సృజనాత్మక ప్రయోగాలను ప్రోత్సహిస్తూ 'లోకల్‌ ఇండియా'ను 'గ్లోకల్‌ ఇండియా'గా తీర్చిదిద్దడానికి జాతి అంకితం కావాలని ఆకాంక్షించారు.

eenadu main feature
స్వావలంబన
author img

By

Published : Jun 8, 2020, 9:14 AM IST

కరోనా కల్లోలం ఇటీవలి చరిత్రలో కనీవినీ ఎరుగని ఉపద్రవం. అది ప్రజారోగ్యానికి పెనుముప్పుగా పరిణమించి జనజీవన విధానాలను, జీవనాధారాలను సమూలంగా మార్చేస్తోంది. ఈ మహమ్మారిని అధిగమించడానికి ఏ దేశానికాదేశం సొంత వ్యూహాలను రచించుకొంటోంది. ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పిస్తూనే ఆర్థిక కార్యకలాపాలను పునఃప్రారంభించడమెలా- అన్నది నేటి సవాలు. భారతదేశం ఈ సంక్లిష్ట కార్యాన్ని ఎంతో దక్షత, చతురత, పట్టుదల, భావుకతలతో నెరవేర్చడానికి కృషిచేస్తోంది.

కొవిడ్‌ సవాలు మన దేశంలో ఐక్యత, సంఘీభావాలను మరింత పటిష్ఠం చేసింది. భరత జాతి అనూహ్యంగా వచ్చిపడిన కష్టనష్టాల నుంచి ఎంత త్వరగా తేరుకోగలదో మరొక్కమారు నిగ్గుతేలింది. నాలుగు దశల లాక్‌డౌన్‌ పూర్తిచేసుకున్న తరవాత మూతపడిన ఆర్థిక ద్వారాలనే కాక కొత్త అవకాశాల తలుపులూ తెరవడానికి భారతదేశం నడుం కట్టింది. మన సహజ వనరులను సమర్థంగా, మానవ వనరులను పూర్తిస్థాయిలో ఉపయోగించుకునే వ్యూహాలకు పదును పెడుతోంది.

స్వావలంబన సాధనకు చేపట్టిన ఆత్మనిర్భర్‌ అభియాన్‌ పథకం మన ఆర్థిక వ్యవస్థలోని వివిధ రంగాలను పునరుత్తేజితం చేయబోతున్నది. వ్యవస్థాపకత, నవీకరణలను ప్రోత్సహిస్తూ, గ్రామీణ-పట్టణ పరస్పరాశ్రిత అభివృద్ధిని సాధించడం ఈ పథకం ముఖ్యోద్దేశం. ఈ ఏడాది జూన్‌ ఒకటో తేదీన కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు వ్యవసాయ, వ్యవసాయేతర రంగాలపై విస్తృత ప్రభావం చూపుతాయి. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల పురోభివృద్ధికి ఊతమిస్తాయి. కొవిడ్‌, ఆర్థిక మందగమనం విసురుతున్న సవాళ్లను గొప్ప అవకాశాలుగా మలచుకోవడానికి కేంద్ర నిర్ణయాలు దోహదం చేస్తాయి.

వనరుల వినియోగం కీలకం

భారత్‌ వంటి అధిక జనాభా దేశాలు ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా- కరోనా వైరస్‌ సృష్టించే బీభత్సం అంతాఇంతా కాదు. వైరస్‌ మన దేశంలో అడుగుపెట్టేనాటికి మాస్క్‌లు, వెంటిలేటర్లు, వ్యక్తిగత రక్షణ సాధనాలు (పీపీఈ) వంటి అత్యవసర పరికరాలు ఇక్కడి అవసరాలకు తగినంత లేవు. దాంతో ఉన్నపళాన ఈ అత్యవసర సాధనాలకోసం బృహత్తర యజ్ఞమే చేపట్టి, ఉత్పత్తిని అమాంతం పెంచుకున్నాం.

కొవిడ్‌ చికిత్సకు ఉపకరించే హైడ్రాక్సీ క్లోరోక్విన్‌కు ప్రపంచమంతటా పెరిగిన గిరాకీని భారతదేశం సంతోషంగా తీర్చింది. కోరిన దేశాలకు కాదనకుండా ఆ మందును పంపింది. ఉరుములేని పిడుగులా వచ్చిపడిన కరోనా వైరస్‌ జాతీయ, అంతర్జాతీయ వాణిజ్యాన్ని తీవ్రంగా దెబ్బతీసింది. విదేశీ సరఫరా గొలుసులపై ఆధారపడితే స్వదేశీ ఆర్థిక వ్యవస్థకు తీరని నష్టం సంభవిస్తుందని కనువిప్పు కలిగించింది. అందుకే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వావలంబన సాధనకు పిలుపిచ్చారు.

దీని అర్థం మిగతా ప్రపంచంతో సంబంధం లేకుండా ఏకాకిగా జీవించాలని, స్వీయ వాణిజ్య రక్షణ ధోరణులను పాటించాలని కాదు. భారత్‌ తన స్వతస్సిద్ధ బలాలను గ్రహించి, వాటిని పూర్తిగా వినియోగించుకొంటూ ఆచరణాత్మక పంథాలో సాగుతూ స్థిరంగా అభివృద్ధి సాధించాలన్నది ప్రధాని మోదీ ఉద్దేశం. అది సాకారం కావాలంటే మన విధాన చట్రంలో సంస్కరణలు రావాలి. కొత్త జవజీవాలు సంతరించుకుంటూ కొవిడ్‌ అనంతర అనిశ్చిత ప్రపంచంలో ఆర్థికంగా దూసుకెళ్లడానికి మార్గాన్ని సుగమం చేసుకోవాలి. రేపు మార్పుచేర్పులకు లోనుకానున్న అంతర్జాతీయ సరఫరా గొలుసులను తమవైపు ఆకర్షించుకోవడానికి దేశాల మధ్య పోటీ ఉద్ధృతమవుతుంది.

అన్ని రంగాల్లో సామర్థ్యం పెంచుకుంటూ నాణ్యతకు పట్టంకడుతూ, స్వావలంబన సాధించినప్పుడు అంతర్జాతీయ సరఫరా గొలుసులలో భారత్‌ కీలక పాత్ర నిర్వహించగలుగుతుంది. అందుకే ప్రధాని మోదీ మౌలిక వసతులను పటిష్ఠం చేసి, ఆధునిక సాంకేతికతలను ఉపయోగిస్తూ, మానవ వనరులకు నైపుణ్యాలు సంతరింపజేస్తూ, స్వదేశీ సరఫరా గొలుసులను పరిపుష్టం చేస్తూ భారతదేశానికి ఆర్థికంగా కొత్త ఊపు తీసుకురావాలని లక్షిస్తున్నారు. స్వావలంబన సాధన పరమార్థమిదే. ఈ మహా యజ్ఞాన్ని ‘ఆత్మనిర్భర్‌ భారత్‌ అభియాన్‌’గా వ్యవహరిస్తున్నాం.

ఆర్థిక వ్యవస్థలోని అన్ని రంగాల్లో పురోభివృద్ధి శక్తులను పునరుత్తేజితం చేయాలని ఈ పథకం ఉద్దేశిస్తోంది. ఈ లక్ష్యసాధనకు ప్రాకృతిక, మానవ, సాంకేతిక వనరులను శక్తిమంతంగా ఉపయోగించాలి. మనలో నిద్రాణంగా ఉన్న అభివృద్ధి సాధక శక్తిని వెలుగులోకి తీసుకురావాలి.

శక్తియుక్తులకు కొదవలేదు...

భారతదేశంలో అపార సహజ వనరులు ఉన్నాయి. జనాభాలో మూడింట రెండొంతులమంది 35 ఏళ్లలోపువారే. మన రైతాంగం ఎండనక వాననక చెమటోడుస్తూ- దేశ ప్రజలకు ఆహార భద్రతను సమకూరుస్తోంది. భారత పారిశ్రామికాధిపతులు ప్రపంచంలో మేటి సంస్థలకు దీటైన పరిశ్రమలను సృష్టించి నిర్వహిస్తున్నారు. గొప్ప ఆశయాలు కలిగిన యువ వ్యవస్థాపకులు అగ్రశ్రేణి అంకురాలను స్థాపించి నవయుగ వైతాళికులవుతున్నారు.

ఈ పాయలన్నీ కలిసి బలీయ భారత ఝరిగా రూపాంతరం చెందుతాయి. అవి స్వదేశంలో వస్తుసేవలకు గిరాకీ తీరుస్తూనే ప్రపంచంలో విశిష్ట భారతీయ బ్రాండ్లను సృష్టిస్తాయనడంలో సందేహం లేదు. స్వావలంబన భారత్‌ సాధనకు కావలసిన వనరులన్నీ మనకున్నాయి. పలు రంగాల్లో అంతర్జాతీయ బ్రాండ్లను సృష్టించిన ఉద్దండులు మనకున్నారు.

భారతీయ కంపెనీల హవా..

20 ఏళ్ల క్రితం రిలయన్స్‌ కేవలం 36 నెలల్లోనే ప్రపంచంలో అతిపెద్ద చమురుశుద్ధి కర్మాగారాన్ని స్థాపించింది. బజాజ్‌ ఆటో ప్రపంచంలో నాలుగో పెద్ద ద్విచక్ర, త్రిచక్ర వాహన ఉత్పత్తిదారుగా పేరుగాంచింది. అజీంప్రేమ్‌జీ భారతదేశంలో అగ్రగామి టెక్నాలజీ కంపెనీల్లో ఒకటైన విప్రోను స్థాపించడమే కాదు- ఆసియాలో అత్యంత వితరణశీలుడిగానూ ఖ్యాతికెక్కారు. హిందుస్థాన్‌ యూనీలీవర్‌, లార్సెన్‌ అండ్‌ టూబ్రో, సన్‌ ఫార్మా, భారతీ ఎయిర్‌టెల్‌, మారుతి కంపెనీలు ప్రపంచంలో 100 అగ్రగామి నవీకరణ సంస్థలుగా 2018 ఫోర్బ్స్‌ పత్రిక గౌరవానికి పాత్రమయ్యాయి.

2019లో ఆ పత్రిక ప్రపంచంలో అత్యంత గౌరవప్రద కంపెనీల జాబితాను ప్రచురించగా- అందులో 125 అగ్రశ్రేణి కంపెనీల సరసన టాటా మోటార్స్‌, టాటా స్టీల్‌, మహీంద్రా అండ్‌ మహీంద్రా సగర్వంగా నిలిచాయి. ఆహార శుద్ధి పరిశ్రమల్లో ప్రియా ఫుడ్స్‌, హల్దీరామ్స్‌ జగద్విఖ్యాతి గాంచాయి. ఎఫ్‌ఎంసీజీ రంగంలో పతంజలి ఆయుర్వేద్‌, ఐటీసీ మకుటంలేని మారాజుల్లా వెలుగొందుతున్నాయి.

స్థానిక ఉత్పత్తులను ఆదరించాలి

నూతన ఆత్మ నిర్భర్‌ భారత్‌ పథకం ముడి చమురు నుంచి భారీయంత్రాల వరకు, వంట నూనెల నుంచి పప్పుగింజల వరకు, వినియోగ వస్తువుల నుంచి హైటెక్‌ వైద్య పరికరాల వరకు దిగుమతులపై ఆధారపడాల్సిన అగత్యాన్ని నివారించాలని ఉద్దేశిస్తోంది. మన యువతకు వృత్తివిద్య, ఉన్నత సాంకేతిక శిక్షణ అందించినట్లయితే వారు మేటి మానవ వనరులుగా అవతరిస్తారు. వ్యాపారాలను సులువుగా ప్రారంభించి నడిపే సౌలభ్యం కల్పించాలి. శీఘ్ర అభివృద్ధికి ఆటంకాలుగా నిలుస్తున్న అంశాలను గుర్తించి తొలగించాలి. పరిశోధన, నవకల్పనలను ప్రోత్సహించాలి.

ఇవన్నీ చేసినప్పుడు ‘స్వావలంబన భారతం’ సాకారమవుతుంది. ఏ పథకమైనా విజయవంతం కావాలంటే అది ప్రజా కేంద్రితంగా ఉండాలి. ప్రజలు స్థానిక ఉత్పత్తులను ఆదరించి ప్రోత్సహించాలి. ఇలా గిరాకీ పెరిగినప్పుడు దాన్ని తీర్చడానికి కొత్త పరిశ్రమలు వస్తాయి, కొత్త వ్యాపారాలు, ఉపాధి అవకాశాలు ఉవ్వెత్తున అందివస్తాయి. పోనుపోను స్థానిక ఉత్పత్తులు నాణ్యతలో అంతర్జాతీయ వస్తువులతో పోటీపడి ప్రపంచ బ్రాండ్లుగా రాణిస్తాయి.

స్థానిక వస్తుసేవలను ఆదరించాలంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ‘వోకల్‌ ఫర్‌ లోకల్‌’ అని నినదించారు. ఇది స్వావలంబన భారత్‌కు తొలిమెట్టు అవుతుంది. క్రమంగా అంతర్జాతీయ మార్కెట్లలో భారతీయ బ్రాండ్లకు ప్రాశస్త్యం తెచ్చిపెడుతుంది. ఉత్తరోత్తరా లోకల్‌ ఇండియా ‘గ్లోకల్‌ ఇండియా’గా రూపాంతరం చెందుతుంది. అంటే స్థానిక శక్తిసామర్థ్యాలను, మార్కెట్లను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవడం ద్వారా రేపు అంతర్జాతీయ విపణికి మేలైన వస్తువులను అందించే స్థాయికి ఎదుగుతాం. మన దేశంలో నిబిడీకృతమైన ప్రగతి సాధక శక్తులను, సృజనాత్మక ప్రయోగాలను ప్రోత్సహిస్తూ ‘లోకల్‌ ఇండియా’ను ‘గ్లోకల్‌ ఇండియా’గా తీర్చిదిద్దడానికి జాతి అంకితం కావాలి.

(రచయిత- ముప్పవరపు వెంకయ్యనాయుడు, ఉపరాష్ట్రపతి)

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.