ప్రపంచవ్యాప్తంగా కొవిడ్ మహమ్మారి మృత్యుఘాతాలకు నిస్సహాయంగా బలైపోయిన వారి సంఖ్య పది లక్షలు దాటింది. ప్రపంచ దేశాలు ఉమ్మడి కార్యాచరణకు ఉద్యుక్తం కాకపోతే కరోనా మరణాలు ఇరవై లక్షలు దాటిపోతాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తోంది. 'ఆ ఉత్పాతాన్ని నివారించే సంఘటిత కృషికి మనమంతా సన్నద్ధంగా ఉన్నామా?' అన్నది సూటి ప్రశ్న. ప్రతి ఒక్కరూ సురక్షితం కానిదే ఏ ఒక్కరూ ధీమాగా ఉండే వీల్లేదు (నోబడీ ఈజ్ సేఫ్ అంటిల్ ఎవ్విరిబడీ ఈజ్ సేఫ్) అన్న ప్రాప్తకాలజ్ఞత కొరవడిన కొన్ని దేశాల ఒంటెత్తు ధోరణుల్ని డబ్ల్యూహెచ్‌ఓ తప్పుపడుతోంది. కొవిడ్ జన్మస్థలి జన చైనాలో ఆ మహమ్మారికి బలైపోయిన వారి సంఖ్య 4,650 లోపు. రెండు లక్షలు దాటిపోయిన మరణాలతో అగ్రరాజ్యం అమెరికా బావురుమంటుంటే, మరో వారంలో లక్షకు చేరనున్న మృతుల సంఖ్య ఇండియాను దుఃఖ విచలితం చేస్తోంది. కరోనా సోకి కోలుకొన్నవారి సంఖ్య పెరగడం, మరణాల రేటు తగ్గడం ఆశావహ పరిణామమైనా- రోజువారీ కేసుల జోరు కొత్త సవాళ్లు రువ్వుతోంది. ప్రాణాంతక కొవిడ్ బాధితులకు సరైన వైద్యసేవలందించడం ప్రభుత్వాల విహిత కర్తవ్యం కాగా, అసలు ఆ మహమ్మారి విస్తృతిని అరికట్టడం జాగృత ప్రజానీకం తీసుకొనే జాగ్రత్తలతోనే సాధ్యపడుతుంది. మాస్కుల వాడకం ప్రాణావసరం అన్న అవగాహన దేశవ్యాప్తంగా 90శాతం జనావళిలో ఉన్నా, 44 శాతమే వినియోగిస్తున్న వైనం ఆందోళన కలిగిస్తోంది. ఊపిరి ఆడటం లేదని, ఇబ్బందిగా ఉందని, భౌతికదూరం పాటించేటప్పుడు అసలు మాస్కు అవసరం లేదనే కారణాలతో కొవిడ్‌కు పలికే ఆహ్వానం- సామాజికారోగ్యాన్నే కదలబారుస్తోంది!
కొవిడ్ పీడ ఎప్పుడు విరగడ అవుతుందన్నదే నేడు మానవాళిని వేధిస్తున్న ప్రశ్న. ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సిన్ తయారీదారుగా ఉన్న ఇండియా- కొవిడ్ ఔషధ ఉత్పత్తి, సరఫరా సామర్థ్యాలతో అన్ని దేశాలకూ అక్కరకు రానుందన్న ప్రధాని మోదీ, ఆయా దేశాల్లో శీతల గిడ్డంగుల సామర్థ్యం పెంపుదలకూ భారత్ తోడ్పాటునందిస్తుందని తాజాగా భరోసా ఇచ్చారు. 'ఇండియావ్యాప్తంగా ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్‌ను కొని అందుబాటులోకి తీసుకురావాలంటే, వచ్చే ఏడాదికాలంలో కేంద్ర ఆరోగ్యమంత్రిత్వ శాఖ రూ.80వేల కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుందని, అంత మొత్తం ప్రభుత్వం చెంత సిద్ధంగా ఉందా?' అని సీరమ్ ఇన్‌స్టిట్యూట్ సీఈఓ అదర్ పూనావాలా ప్రశ్నిస్తున్నారు. భారత్ బయోటెక్, జైడస్ క్యాడిలా, సీరమ్ ఇన్‌స్టిట్యూట్‌లు అభివృద్ధి చేస్తున్న వ్యాక్సిన్లు మానవ ప్రయోగాల దశలో ఉన్న తరుణంలో- దేశీయంగా 130 కోట్ల జనావళి ఆరోగ్య పరిరక్షణ వ్యూహాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు శాస్త్రీయంగా పట్టాలకెక్కించాలిప్పుడు! 1978నుంచి అమలులో ఉన్న సార్వత్రిక రోగ నిరోధక టీకాల కార్యక్రమాన్ని వినియోగించుకొని దశలవారీగా అన్ని జిల్లాలకూ వ్యాక్సిన్ అందించే పథకాన్ని కేంద్రం పరిశీలిస్తోందని వార్తాకథనాలు చాటుతున్నాయి. కాలంతో పోటీపడి ప్రాణాధార వ్యాక్సిన్ ఉత్పత్తి సాగించడం ద్వారా ప్రపంచ దేశాల అవసరాలనూ తీర్చగలమన్న ధీమా దేశీయ దిగ్గజ సంస్థల్లో ఉట్టిపడుతోంది. పరిశోధనల్లో ఏ వ్యాక్సిన్ కరోనా నిరోధ సామర్థ్యాన్ని, భద్రతా ప్రమాణాల్ని సాధిస్తుందో నిర్ధారణ కాకపోయినా అమెరికా, ఐరోపా, బ్రిటన్, జపాన్ దేశాలు ఎకాయెకి 130 కోట్ల డోసుల కొనుగోళ్లకు ముందస్తు ఒప్పందాలు చేసేసుకొన్నాయి. గతంలో మాదిరిగా ధనిక దేశాలే ప్రాణాధార ఔషధాలన్నింటినీ ఎగరేసుకుపోయే వీల్లేకుండా ప్రపంచ ఆరోగ్య సంస్థ వ్యాక్సిన్ అలయెన్స్‌తో కలిసి పేద మధ్యాదాయ దేశాలకు 200 కోట్ల డోసులను అందించే ప్రణాళికల్ని సిద్ధం చేసింది. సరైన వ్యాక్సిన్ వచ్చేలోగా కొవిడ్ కట్టడికోసం- 'అందరికోసం ఒక్కరు, ఒక్కరికోసం అందరు' అన్న స్పృహతో ముందస్తు జాగ్రత్తలు పాటించడం తప్పనిసరి!