కొవిడ్ మహా సంక్షోభం భిన్న రంగాలను, వివిధ దేశార్థికాలనే కాదు- మహిళల జీవన స్థితిగతుల్నీ దారుణంగా కుంగదీసింది. ముఖ్యంగా భారత్‌లో స్త్రీ పురుష సమానత్వ గణనాంశాలు భారీ కుదుపులకు లోనయ్యాయి. ప్రపంచ ఆర్థిక వేదిక(డబ్ల్యూఈఎఫ్) క్రోడీకరించిన విశ్లేషణాత్మక అధ్యయనం ధ్రువీకరిస్తున్న యథార్థమిది!
గత సంవత్సరం 153 దేశాల లింగ వ్యత్యాస సూచీలో ఇండియా 112వ స్థానానికి పరిమితమైంది. సరికొత్తగా వెలుగు చూసిన 156 దేశాల జాబితాలో భారత్ ఇంకో 28 స్థానాలు దిగజారి, నూట నలభయ్యో ర్యాంకు దక్కించుకొంది. దక్షిణాసియా దేశాల్లో పాకిస్థాన్(153), అఫ్గానిస్థాన్(156) అట్టడుగు వరసకు చేరగా- మనకన్నా బంగ్లాదేశ్(65), నేపాల్(106), శ్రీలంక(116), భూటాన్(130) మెరుగనిపించుకున్నాయి.
అంతర్జాతీయంగా పురుషుల సంపాదనతో పోలిస్తే మహిళల రాబడి కేవలం అయిదో వంతేనని నిగ్గు తేలింది. ఆ విభాగంలో చిట్టచివరి పది దేశాల్లో భారత్ ఒకటి! దేశీయంగా విద్యార్జనలో బాలురు, బాలికల మధ్య అంతరం తగ్గుతున్నా- నిరక్షరాస్యత పరంగా పురుషుల(17.6శాతం)తో పోలిస్తే మహిళా రాశి(34.2) అధికంగానే ఉండటం వారి జీవన గమనాన్ని విశేషంగా ప్రభావితం చేస్తోంది. ఏడాది వ్యవధిలో భారత ర్యాంకు ఎందుకింతగా తెగ్గోసుకుపోయిందంటే- ఆర్థిక కార్యకలాపాల్లో, రాజకీయ సాధికారతలో, ఉపాధి అవకాశాల్లో మహిళలకు సమధిక ప్రాతినిధ్యం దక్కకపోవడమే ప్రబల హేతువుగా ప్రస్ఫుటమవుతోంది. స్త్రీ పురుష సమానత్వ సాధనలో అగ్ర పథాన నిలిచిన ఐస్‌లాండ్, ఫిన్లాండ్, నార్వే, న్యూజిలాండ్, స్వీడన్ ప్రభృత దేశాల ప్రస్థాన గతి, పథక రచనల నుంచి- భారత్ సహా ర్యాంకుల్లో వెనకబడిన దేశాలన్నీ నేర్వాల్సిన గుణపాఠాలెన్నో ఉన్నాయి.
దేశ ప్రథమ ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ- స్త్రీల జీవన ప్రమాణాలే జాతి అభ్యున్నతిని నిర్ధారించే గీటురాళ్లుగా నిలుస్తాయని ఏనాడో ఉద్బోధించారు. భారత రాజ్యాంగ నిర్మాతలూ స్త్రీ పురుష సమానత్వ భావనకు ఎత్తుపీట వేశారు. లింగపరమైన దుర్విచక్షణకు భరత వాక్యం పలకాలన్న నాటి నేతాగణం నిర్దేశాలకు అనుగుణంగా పటుతర కార్యాచరణ పట్టాలకు ఎక్కి ఉంటే- భ్రష్ట రికార్డుతో దేశం అంతర్జాతీయంగా నేడిలా పరువు మాసేదేనా? సైనిక విమానాల్లో మహిళా పైలట్లు, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ విభాగంలో ఆర్మీ ఏవియేషన్ విధుల్లో శాస్త్ర సాంకేతిక రంగాల్లో వనితల విజయగాథలు... అరుదైన ఉదాహరణలుగానే మిగిలిపోతున్నాయి.
కార్మిక శక్తిలో స్త్రీల భాగస్వామ్యం 22శాతానికి పడిపోవడం, అత్యున్నత స్థాయి మేనేజర్లలో వారు 8.9శాతంగానే లెక్క తేలడం నుంచి క్షేత్ర స్థాయిలో దిమ్మెరపరచే యథార్థాల వరకు ఎన్నో కంతలు- తక్షణ దిద్దుబాటు చర్యల ఆవశ్యకతను చాటుతున్నాయి. 'బేటీ బచావో- బేటీ పఢావో' నినాదాల మాటున... రెండు పదులైనా నిండకుండానే బిడ్డలకు జన్మనిస్తున్న చిట్టితల్లుల ఉదంతాలు, పెచ్చరిల్లుతున్న పోషకాహార లోపాలు ప్రసవ మరణాలు నిశ్చేష్టపరుస్తున్నాయి. ఆడపిల్లల విద్య, ఆరోగ్యం, ఉపాధి, భద్రతలకు తగినన్ని నిధుల కేటాయింపుల్లో ప్రభుత్వాల వైఫల్యం, ఉదాసీనత- సమానత్వ భావనను ఖర్చు రాసేస్తున్నాయి. దేశ జనాభాలో సుమారు 48శాతంగా ఉన్న మహిళల్ని సమర్థ మానవ వనరులుగా తీర్చిదిద్దుకోలేక, సామాజిక సమన్యాయ భావనకు పట్టం కట్టలేకపోవడం వల్లే వర్ధమాన దేశమన్న చట్రంనుంచి ఇండియా వెలికి రాలేకపోతోంది. కీలక రాజకీయాధికార స్థానాల్ని అందిపుచ్చుకొనేలా మహిళాశక్తిని ఎదగనివ్వని పురుషాధిక్య భావజాలమే- సామాజికాభివృద్ధి సూచీల్లో భారత్‌కింతటి మందభాగ్యాన్ని శాశ్వతీకరిస్తోంది!
ఇదీ చదవండి: లింగ సమానత్వంలో భారత్ ర్యాంక్ 140!