కొవిడ్ రెండో ఉద్ధృతి ఏ రాష్ట్రాన్నీ విడిచి పెట్టలేదు. దాని తీవ్రత బారిన పడని రాష్ట్రమే లేదు. కాకపోతే, కొవిడ్ కారణంగా తలెత్తిన ఆర్థిక నష్టం అన్ని చోట్లా ఒకేలా లేదు. గతంలో మాదిరిగా దేశవ్యాప్త లాక్‌డౌన్ కాకుండా స్థానిక పరిస్థితుల ఆధారంగా ఎక్కడికక్కడ ఆంక్షలు విధించడంతో భిన్న పరిస్థితులు నెలకొన్నాయి.
మే నెలలో దారుణ స్థితిగతులు ఎదుర్కొన్న పలు రాష్ట్రాలు జూన్ నాటికి కొంతమేర తేరుకున్నాయి. కేసుల సంఖ్య, మరణాలు తగ్గుముఖం పట్టడం వంటివి ఇందుకు తోడ్పడ్డాయి. తీవ్రస్థాయిలో విపత్తు ప్రభావానికి లోనైన ఉత్తర్‌ప్రదేశ్, గుజరాత్, దక్షిణాదిన కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో ఆర్థిక కార్యకలాపాలు కొద్దికొద్దిగా పుంజుకోవడం మొదలుపెట్టాయి. విద్యుత్ వినియోగం, వాహనాల అమ్మకాలు, రవాణా వంటి అంశాలను ఆర్థిక కార్యకలాపాలు పుంజుకోవడానికి సూచీగా పరిగణిస్తారు. దేశంలో వాహనాల అమ్మకాల్లో జూన్‌లో 14.68 శాతం వృద్ధి నమోదైనట్లు భారత వాహన తయారీదారుల సంఘం (ఎస్‌ఐఏఎం) చెబుతోంది. విద్యుత్ వినియోగం విషయానికొస్తే డిమాండ్ రికార్డు స్థాయికి చేరింది. విద్యుత్ వినియోగానికి సంబంధించి 2019 జూన్ నాటి పరిస్థితులను ప్రామాణికంగా తీసుకుంటున్నారు. 2020 జూన్‌లో పరిస్థితులు అనుకూలంగా లేకపోవడమే దీనికి కారణమని చెప్పాలి. ఇక రవాణా విషయానికొస్తే కొవిడ్ ముందున్న పరిస్థితితో పోలిస్తే, జూన్ నెలాఖరు నాటికి 80శాతానికి పైగా కోలుకుంది. ఒడిశాలోని అనేక ప్రాంతాలతోపాటు, ఈశాన్య రాష్ట్రాల్లో రవాణాపై నియంత్రణలు ఇంకా కొనసాగుతున్నాయి.
తగ్గిన ఆదాయాలు
దేశ ఆదాయంలో 50శాతానికి పైగా అందించే మహారాష్ట్ర, తమిళనాడు, ఉత్తర్‌ప్రదేశ్, గుజరాత్, కర్ణాటక, పశ్చిమ్‌బంగ తదితర రాష్ట్రాల్లో పరిస్థితులు కొంతమేర మెరుగుపడి ఆర్థిక కార్యకలాపాలు నెమ్మదిగా పుంజుకుంటున్నాయి. దీన్ని మంచి పరిణామంగా నిపుణులు చెబుతున్నారు. కొవిడ్ రెండో ఉద్ధృతి ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపగా, ఆదాయాలనూ గట్టిగా దెబ్బతీసింది. గడిచిన ఏడాది కాలంగా లక్షల సంఖ్యలో ఉపాధి కోల్పోయినట్లు అంచనా. ప్రతి ఇంటి ఆదాయంలో సగటున 12శాతం దాకా కోసుకుపోయింది. పేదలు బాగా దెబ్బతిన్నారు. కొవిడ్ అనంతరం దేశంలో పేదల సంఖ్య పెరిగింది.
వ్యాపార కార్యకలాపాల విషయానికొస్తే- 58శాతం వ్యాపారాలపై తీవ్రంగా, 38శాతంపై పరిమితంగా ప్రభావం ఉందని తమ అధ్యయనంలో గుర్తించినట్లు 'ఫిక్కీ' తెలిపింది. ప్రజల్లో కొనుగోలు శక్తి దెబ్బతినడంతో గ్రామీణ ప్రాంతాల్లో అమ్మకాలు 71శాతం మేర పడిపోయాయి. గ్రామాల్లో వ్యవసాయ, వ్యవసాయేతర పనుల్లో నిమగ్నమయ్యే కూలీలు దారుణ ప్రభావాన్ని చవిచూశారు. కొవిడ్ మొదటి దశలో దెబ్బతిన్న వలస కూలీలు భయం కొద్దీ పట్టణ ప్రాంతాల్లో పనిచేయడానికి ఆసక్తి చూపలేదు. ఈ క్రమంలో ప్రభుత్వం నిరక్షరాస్యులు, తక్కువ విద్యార్హతలున్న వారిని దృష్టిలో ఉంచుకుని ఉపాధి హామీ పథకాన్ని విస్తరించాలని, మహిళల ఉపాధికి పట్టణ ప్రాంతాల్లో ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలని నిపుణులు సూచిస్తున్నారు. ఈ ఏడాది చివరి వరకూ ఉచిత రేషన్ సదుపాయాన్ని పొడిగించాలనీ కోరుతున్నారు.
కొత్తగా కొలువులు..
జూన్‌లో కొత్తగా 78 లక్షల మంది ఉద్యోగుల జాబితాలో చేరారు. మే నెలలో ఉద్యోగాలు కోల్పోయిన 1.5 కోట్ల మందిని పరిగణనలోకి తీసుకుంటే ఇదేమంత పెద్ద మెరుగుదల కాదని నిపుణులు చెబుతున్నారు. ఉపాధి రంగం వచ్చే ఏడాది చివరి వరకూ కోలుకునే పరిస్థితి లేదని ఆర్థిక సహకార సంస్థ (ఓఈసీడీ) సంస్థ తన అధ్యయనంలో వెల్లడించింది. అభివృద్థి చెందిన దేశాల్లో విపత్తు కారణంగా దెబ్బతిన్న కార్మిక మార్కెట్ సగం మాత్రమే కోలుకుందని పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా 2.2 కోట్ల మంది ఉద్యోగ మార్కెట్‌కు దూరమైనట్లు తేల్చింది. ఆతిథ్య, సేవా రంగాల్లో నిరుద్యోగం బాగా ప్రబలిందని- ఫైనాన్స్, బీమా రంగాల్లో అవకాశాలు మెరుగు పడినట్లు వెల్లడించింది. ఇంటి దగ్గర నుంచి పని చేయగల ఉద్యోగాలకు పెద్దగా నష్టం వాటిల్లలేదని తెలుస్తోంది. ఆదాయ వ్యయాల మధ్య అంతరం పెరగడం, నైపుణ్యాలను పెంచే ఉద్యోగాలకు గిరాకీ అధికం కావడం, సాంకేతిక రంగాల్లో అవకాశాల మెరుగుదల వంటి అంశాలను ఓఈసీడీ అధ్యయనం ప్రస్తావించింది.
కొవిడ్ పాఠాలు
ఏడాదిగా కొవిడ్ కారణంగా ప్రజల జీవనశైలిలో గణనీయమైన మార్పులు వచ్చాయి. విలాసాలకు దూరంగా, పరిమిత వనరులతో జీవించడాన్ని కొవిడ్ పరిస్థితులు నేర్పాయి. ఇకపైనా ఇదే తరహా అలవాట్లను కొనసాగించడం శ్రేయస్కరం. ఆదాయ, వ్యయాల మధ్య అంతరం పెరిగే కొద్దీ జీవిక భారమవుతుందనే సత్యాన్ని పేదలతోపాటు, మధ్యతరగతి ప్రజలూ గ్రహించి, జీవితంలో భాగంగా మార్చుకోవాలి. భవిష్యత్తులో ఉద్యోగ మార్కెట్ విభిన్నంగా ఉండవచ్చని ప్రస్తుత పరిస్థితుల ద్వారా తెలుస్తోంది. నైపుణ్యాలు పెంచుకోవడానికి ఉద్యోగులు అధిక ప్రాధాన్యం ఇవ్వాలి. అధ్యయనంపై దృష్టి పెట్టి, మారుతున్న అవసరాలకు అనుగుణంగా తమను తాము తీర్చిదిద్దుకోవాలి.
- పార్థసారథి చిరువోలు