ETV Bharat / opinion

వైరస్​పై పోరులో న్యాయపాలికే అంకుశం! - courts are involved in corona issues

పద్దెనిమిదేళ్ల పైబడిన వారందరికీ ఈ నెల ఒకటి నుంచే టీకాలు వేయాలన్న ప్రతిపాదనకూ ఆదిలోనే అవాంతరాలు ఎదురయ్యాయి. అదేసమయంలో, జూన్ చివరకు గానీ వైరస్ కుదుట పడదని నివేదికలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో పౌరుల జీవన భద్రతకు రాజ్యాంగమే పూచీ పడుతోందంటూ దిల్లీ హైకోర్టు.. కేజ్రీ సర్కారును బోనెక్కిస్తే, ఆక్సిజన్‌ కోటాల పద్ధతిని సాంతం సంస్కరించాలని సుప్రీంకోర్టు కేంద్రాన్ని ఆదేశించింది. ఇలా.. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజల పక్షాన న్యాయపాలికే అండగా నిలబడుతోంది.

covid, courts
వైరస్​పై పోరులో న్యాయపాలికే అంకుశం!
author img

By

Published : May 8, 2021, 6:57 AM IST

ప్రపంచవ్యాప్తంగా 174 దేశాల్లోని ప్రజలకు దాదాపు 125 కోట్ల టీకాలు వేసి, కొవిడ్‌ మహమ్మారి కట్టడికి మానవాళి మహా యుద్ధమే చేస్తోంది. ప్రతి ఒక్కరూ సురక్షితం కానిదే ఏ ఒక్కరి భద్రతకూ భరోసా లేదని లోగడే స్పష్టీకరించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ- పేద దేశాలతో పోలిస్తే ధనిక రాజ్యాల్లో టీకా కార్యక్రమం పాతిక రెట్ల వేగంతో సాగుతోందని, వ్యాక్సిన్‌ అసమానత ఆత్మహత్యా సదృశమని గట్టిగా హెచ్చరిస్తోంది. పేటెంట్ల బాదరబందీని పక్కన పెట్టి, చౌకధరల్లో అందరికీ సత్వరం టీకాలందించే వెసులుబాటు కోసం నిరుడు అక్టోబరులోనే ఇండియా, దక్షిణాఫ్రికా ఎలుగెత్తాయి. ఆ ప్రతిపాదనకు అగ్రరాజ్యం అమెరికా సైతం నేడు సానుకూలంగా స్పందిస్తున్నా- అందులో ఉన్న ఇబ్బందులన్నింటినీ తర్కించి హేతుబద్ధ విధానం పట్టాలకెక్కాలంటే, మరికొన్ని నెలలు పడుతుంది. జనసంఖ్య రీత్యా ఎన్నో దేశాల పెట్టయిన ఇండియా ప్రపంచవ్యాప్త టీకాల ఉత్పత్తిలో 60శాతం పైగా వాటా కలిగి ఉన్నా- కేవలం ముందుచూపు లేని కారణంగా కొవిడ్‌ వ్యాక్సిన్ల విషయంలో కిందుమీదులవుతోంది.

దీన పరిస్థితులకు దర్పణం..

45 ఏళ్లు పైబడిన వారికి ఉచిత వ్యాక్సిన్ల బాధ్యత కేంద్రం వహిస్తుండగా- నెలరోజుల క్రితంతో పోలిస్తే రోజువారీ టీకాలు సగంకంటే తక్కువకు కోసుకుపోవడం, ఇండియా దైన్య స్థితికి దర్పణం పట్టేదే. పద్దెనిమిదేళ్ల పైబడిన వారందరికీ ఈ నెల ఒకటి నుంచే టీకాలు వేయాలన్న ప్రతిపాదనకూ ఆదిలోనే హంసపాదు పడింది. దేశీయంగా నెలకు 10-11 కోట్ల డోసుల ఉత్పత్తికి మరో రెండు మూడు నెలలు పడుతుందన్న అంచనాలు, లక్షకు పైగా క్రియాశీల కేసులతో 12 రాష్ట్రాల్ని అతలాకుతలం చేస్తున్న కొవిడ్‌ సునామీ జూన్‌ మాసాంతానికి గానీ ఉపశమించదన్న అధ్యయనాలు బెంబేలెత్తిస్తున్నాయి. ఈ దుస్సహ వాతావరణంలో ప్రజల పక్షాన న్యాయపాలిక క్రియాశీలతే ఆశారేఖగా భాసిస్తోంది!

దేశవ్యాప్తంగా పద్దెనిమిదేళ్లు నిండిన 80 కోట్ల మందికి కనీసం ఒక్కడోసు టీకా అందించడానికి ప్రస్తుత పద్ధతిలో ఎనిమిది నెలలు పడుతుందంటున్నారు. కేంద్రం ప్రకటించిన వ్యాక్సిన్‌ విధానం నిరుపేదల జీవన హక్కును హరించేదిగా ఉందంటూ ఇప్పటికే స్పష్టం చేసిన సుప్రీంకోర్టు- సమగ్ర టీకా విధానాన్ని రూపొందించాలని ఆదేశించిందిప్పుడు. యథాపూర్వం ఉచిత టీకాల బాధ్యతను కేంద్రం భరిస్తే- రాష్ట్రాలు తమ చెంతనున్న వనరులతో ఆసుపత్రులు, ఇతర మౌలిక సదుపాయాల మెరుగుదలపై దృష్టి సారించగలవన్న ఆర్‌బీఐ మాజీ గవర్నర్‌ సి.రంగరాజన్‌ సూచన శిరోధార్యం. సగటున 50శాతం పరీక్షలతో తక్కిన దేశాలు కొవిడ్‌ బాధితుల్ని జల్లెడ పడుతుంటే, పట్టుమని 20శాతం పరీక్షలకే పరిమితమైన ఇండియాలో వ్యవస్థాగత వైఫల్యం కరోనాకు కొత్త కోరలు తొడిగింది.

ప్రాణవాయువు కోసం కోర్టులకు..

సకాలంలో ఆక్సిజన్‌, వెంటిలేటర్లు అందుబాటులో లేక వందలమంది అభాగ్యులు కడతేరిపోయిన వాస్తవం గుండెల్ని మెలిపెడుతోంది. ప్రాణవాయువు సరఫరా కోసం కేంద్రాన్ని అర్థించి అలిసిపోయిన రాష్ట్రాలు కోర్టులకెక్కి న్యాయ పోరాటం చేయాల్సిన దుస్థితి, న్యాయపాలిక మొట్టికాయలు వేస్తేగాని అధికారగణం దారికిరాని దయనీయ స్థితి నేడు కళ్లకు కడుతున్నాయి. ఆసుపత్రుల్లో ఐసీయూ సాధారణ పడకల నిష్పత్తి ప్రకారమే ఆయా రాష్ట్రాలకు ఆక్సిజన్‌ కోటాలు నిర్దేశిస్తున్నామన్న కేంద్రం వాదనలోని డొల్లతనాన్ని సుప్రీం న్యాయపాలికే వేలెత్తి చూపింది. పౌరుల జీవన భద్రతకు రాజ్యాంగమే పూచీ పడుతోందంటూ దిల్లీ హైకోర్టు కేజ్రీ సర్కారును బోనెక్కిస్తే, ఆక్సిజన్‌ కోటాల పద్ధతిని సాంతం సంస్కరించాలని సుప్రీంకోర్టు కేంద్రాన్ని ఆదేశించింది. కొవిడ్‌ మరో దఫా విజృంభణలో పిల్లలూ బాధితులవుతారన్న విశ్లేషణల్ని ప్రస్తావించి- ముందస్తు జాగ్రత్తలతో ఇప్పటి నుంచే సిద్ధం కావాలని సుప్రీం న్యాయపాలిక కేంద్రాన్ని హెచ్చరిస్తోంది. ఆక్సిజన్‌ ఉత్పత్తి ఉపకరణాలపై జీఎస్‌టీ తగ్గించేది లేదని భీష్మించిన కేంద్రం- కోర్టులు గట్టిగా అదిలిస్తే గానీ ఏ విషయంలోనూ మానవీయంగా స్పందించకపోవడమే దుర్విధి!

ఇదీ చూడండి: కర్ణాటకలో సంపూర్ణ లాక్​డౌన్​: యడియూరప్ప

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.